సినీ పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న తలైవర్.. 56వ ఇఫి వేడుకలో సత్కారం
100 జన్మలెత్తినా మళ్లీ రజినీకాంత్‌గానే పుట్టాలని కోరుకుంటాను: రజినీకాంత్
భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక ఘట్టాన్ని పురస్కరించుకుని లెజెండరీ నటుడు శ్రీ రజినీకాంత్ సినీ పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత‌్సవంలో ఆయన్ని ఘనంగా సత్కరించారు. అభిమానులు తలైవర్ అని పిలుచుకునే రజినీకాంత్, అద్భుతమైన ప్రదర్శన, ప్రత్యేక శైలి, తనదైన నటనతో తరతరాల ప్రేక్షకులను అలరించారు.
ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తమిళ చిత్రాల్లోనే కాక హిందీ, తెలుగు, కన్నడ సినిమాల్లో నటించిన ఆయన, భారతీయ సినీ పరిశ్రమకు చేసిన అపారమైన కృకి గుర్తింపుగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 170కి పైగా చిత్రాల్లో నటించిన సూపర్ స్టార్.. ప్రజాదరణ పొందిన కళా సంస్కృతిపై చెరగని ముద్ర వేశారు. ఇందుకు గౌరవార్థంగా పద్మ భూషణ్ (2000), పద్మ విభూషణ్ (2016), దాదాసాహెబ్ ఫాల్క్ అవార్డు (2020)లను అందుకున్నారు.
శ్రీ రజినీకాంత్‌కు గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్, శాలువా కప్పి, మెమెంటోను అందచేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, నటుడు శ్రీ రణ్‌వీర్ సింగ్ పాల్గొన్నారు.
ఈ గౌరవాన్ని స్వీకరించిన రజినీకాంత్, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గతంలోకి చూస్తే 50 వసంతాలు, కేవలం 10, 15 ఏళ్లలాగా అనిపిస్తున్నాయని.. ఎందుకంటే సినిమా, నటన అంటే తనకు అమితమైన ఇష్టమన్నారు. "నేను వంద జన్మలెత్తినా, రజినీకాంత్‌గానే పుట్టాలని కోరుకుంటాను" అని సూపర్ స్టార్ వెల్లడించారు.
సంస్కృతికి ప్రతీకగా నిలిచిన రజనీకాంత్ ను ఇఫి-2025 గౌరవించింది. భాష, భౌగోళిక సరిహద్దులను దాటి సినీ రూపకర్తలను, ప్రేక్షకులను ఆయన కళ ప్రభావితం చేసింది. ఈ స్వర్ణోత్సవం శ్రీ రజినీకాంత్‌కు వ్యక్తిగత ప్రస్థానంగా మాత్రమే కాక, ప్రజాదరణ పొందిన కళా సంస్కృతిని తీర్చిదిద్దటంలో భారతీయ సినిమా పరిశ్రమకున్న పరివర్తనాత్మక శక్తికి కూడా నిదర్శనంగా నిలుస్తుంది.
ఐఎఫ్ఎఫ్ఐ గురించి
దక్షిణాసియాలో అత్యంత పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలిచిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) 1952లో ప్రారంభమైంది. దీన్ని భారత ప్రభుత్వ జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ), సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా రాష్ట్ర ప్రభుత్వ గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ఈఎస్జీ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సినిమా రంగంలో గొప్ప శక్తికేంద్రంగా ఎదిగిన ఈ ఉత్సవంలో పునరుద్ధరించిన క్లాసిక్ చిత్రాలు.. సాహసోపేతమైన ప్రయోగ చిత్రాలు ఒకే వేదికపై నిలుస్తాయి. పౌరాణిక సినీ దిగ్గజాలు, తొలిసారి దర్శక రంగంలోకి అడుగుపెట్టిన వారు కలిసే వేదిక ఇది. ఐఎఫ్ఎఫ్ఐకి ఇంత ఆదరణ పెరగటానికి కారణం దానిలోని ఉద్వేగభరిమైన సమ్మేళనం. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్ తరగతులు, కీర్తిప్రశంసలు, అత్యంత శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ లో ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలు ప్రారంభమై, వృద్ధిలోకి వస్తాయి. గోవాలోని తీర ప్రాంతంలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగే 56వ చలనచిత్ర ఉత్సవం.. అనేక భాషలు, తరాలు, ఆవిష్కరణలు, సంగీత ప్రదర్శనల ద్వారా భారతదేశ సృజనాత్మక ప్రతిభను ప్రపంచస్థాయిలో చాటిచెబుతుంది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
ఐఎఫ్ఎఫ్ఐ వైబ్‌సైట్: https://www.iffigoa.org/
ఐఎఫ్ఎఫ్ఐ పీఐబీ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
పీఐబీ ఐఎఫ్ఎఫ్ఐవుడ్ ప్రసార ఛానెల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
ఎక్స్ హ్యాండిల్స్: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
रिलीज़ आईडी:
2196705
| Visitor Counter:
3