ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవంబరు 29-30 తేదీల్లో రాయ్‌పూర్‌లో పోలీసు డైరెక్టర్ జనరల్స్/ ఇన్‌స్పెక్టర్ జనరల్స్ అఖిల భారత సదస్సులో పాల్గొననున్న ప్రధాని


సదస్సు ఇతివృత్తం: ‘వికసిత భారత్: భద్రతా కోణాలు’

కీలక పోలీసింగ్ సవాళ్ల పరిష్కారంలో పురోగతిపై సమీక్ష, ‘సురక్షిత భారత్’ నిర్మాణం కోసం ముందుచూపుతో కూడిన ప్రణాళికను రూపొందించడం సదస్సు లక్ష్యం

వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, విపత్తు నిర్వహణ, మహిళా భద్రత, పోలీసింగులో ఏఐ, ఫోరెన్సిక్ సైన్సుల వినియోగం సహా కీలక అంశాలపై చర్చ

విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి పోలీసు పతకాలను అందించనున్న ప్రధాని

Posted On: 27 NOV 2025 12:01PM by PIB Hyderabad

ఛత్తిస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్‌లో 2025 నవంబరు 29 – 30 తేదీల్లో నిర్వహించనున్న పోలీసు డైరెక్టర్ జనరళ్లు/ ఇన్‌స్పెక్టర్ జనరళ్ల 60వ అఖిల భారత సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు.

నవంబరు 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించనున్నారు. పోలీసు శాఖకు సంబంధించి కీలక సవాళ్ళ పరిష్కారంలో ఇంతవరకు సాధించిన పురోగతిని సమీక్షించడం, ‘వికసిత్ భారత్’ జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ‘సురక్షిత భారత్’ నిర్మాణం కోసం ముందుచూపుతో కూడిన ప్రణాళికను రూపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

‘వికసిత భారత్: భద్రతా కోణాలు’ అన్న విస్తృత ఇతివృత్తంతో నిర్వహించనున్న ఈ సదస్సు.. వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, విపత్తు నిర్వహణ, మహిళల భద్రత, పోలీసింగులో ఫోరెన్సిక్ సైన్స్, కృత్రిమ మేధ వినియోగం వంటి కీలక భద్రతాపరమైన అంశాలపై వివరణాత్మక చర్చలకు వేదిక కాబోతోంది. విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి పోలీసు పతకాలను కూడా ప్రధానమంత్రి అందిస్తారు.

విస్తృత శ్రేణి జాతీయ భద్రతా అంశాలపై సార్వత్రిక, అర్థవంతమైన చర్చల్లో భాగస్వాములయ్యేందుకు.. దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ పోలీసు ప్రముఖులు, భద్రతా నిర్వాహకులకు ఈ సదస్సు ఓ ముఖ్య చర్చా వేదికగా నిలవనుంది. నేరాల పరిష్కారం, శాంతిభద్రతల నిర్వహణ, అంతర్గత భద్రతా ముప్పులను ఎదుర్కోవడంలో వృత్తిపరమైన ప్రణాళికలను రూపొందించడంపంచుకోవడంతోపాటు.. పోలీసు బలగాలు ఎదుర్కొంటున్న కార్యాచరణ, మౌలిక సదుపాయ, సంక్షేమ సంబంధిత సవాళ్లపైనా ఇందులో చర్చించనున్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ వార్షిక సదస్సుపై ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. నిష్పాక్షికమైన చర్చలను ప్రోత్సహిస్తూ.. పోలీసింగ్ విధానాలపై కొత్త ఆలోచనలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వృత్తిపరమైన సదస్సులు, బృందాలవారీ చర్చలు, వింధు సమయంలో నిర్దిష్ట అంశాలపై చర్చలు... కీలకమైన అంతర్గత భద్రతవిధానపరమైన అంశాలపై తమ అభిప్రాయలను నేరుగా ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం ఈ సమావేశంలో పాల్గొనేవారికి లభిస్తుంది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం సహా.. ప్రధానమంత్రి మార్గనిర్దేశంలో 2014 నుంచి ఈ సదస్సు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటోంది. గువాహటి (అస్సాం), రాన్ ఆఫ్ కచ్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), టేకన్పూర్ (గ్వాలియర్, మధ్యప్రదేశ్), సమతా మూర్తి (కెవాడియా, గుజరాత్), పూణే (మహారాష్ట్ర), లక్నో (ఉత్తరప్రదేశ్), న్యూఢిల్లీ, జైపూర్ (రాజస్థాన్), భువనేశ్వర్ (ఒడిశా)లలో ఈ సదస్సును నిర్వహించారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఈ ఏడాది 60వ సదస్సును ఛత్తిస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో నిర్వహిస్తున్నారు.

కేంద్ర హోంమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, హోం శాఖ సహాయ మంత్రులు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, కేంద్ర పోలీసు సంస్థల అధిపతులు ఈ సదస్సుకు హాజరవుతారు. సరికొత్త, వినూత్న ఆలోచనలను పంచుకునేందుకు రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల హోం శాఖాధిపతులతోపాటు డీఐజీ, ఎస్పీ వంటి కీలక హోదాల్లో ఉన్న కొందరు ఎంపిక చేసిన పోలీసు అధికారులు కూడా ఈ ఏడాది సదస్సులో ప్రత్యక్షంగా పాల్గొంటారు.

***


(Release ID: 2195640) Visitor Counter : 3