రికార్డు స్థాయి అంతర్జాతీయ భాగస్వామ్యం, వ్యూహాత్మక ఒప్పందాలు, రూ. 1050 కోట్లకు పైగా వ్యాపార అవకాశాలతో ముగిసిన వేవ్స్ ఫిల్మ్ బజార్-2025
చలనచిత్ర నిర్మాణం, సహకారం, మార్కెట్ విస్తరణకు ప్రపంచ కేంద్రంగా మెరుగవుతున్న భారత్ స్థానాన్ని పునరుద్ఘాటిస్తూ 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంతో పాటు నిర్వహించిన వేవ్స్ ఫిల్మ్ బజార్-2025 ఘనంగా ముగిసింది. ఈ సంవత్సరం ఎడిషన్ అసాధారణ అంతర్జాతీయ భాగస్వామ్యం, కీలక భాగస్వామ్యాలతో పాటు... కంటెంట్ సృష్టికర్తలు, పంపిణీదారులు, పరిశ్రమ నిపుణులకు అపారమైన అవకాశాలను అందించింది.
అపూర్వ ప్రపంచ భాగస్వామ్యం
ఈ సంవత్సరం 40కి పైగా దేశాల నుంచి 2,500 మందికి పైగా ప్రతినిధులు ఈ ఐదు రోజుల మార్కెట్లో పాల్గొన్నారు. ఇది దక్షిణాసియా చలనచిత్ర మార్కెట్‌లో అతిపెద్ద అంతర్జాతీయ సమావేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వ్యూయింగ్ రూమ్, సహ-నిర్మాణ మార్కెట్, స్క్రీన్ రైటర్స్ ల్యాబ్, మార్కెట్ స్క్రీనింగ్ విభాగాల్లో మొత్తం 320 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇవి 15కి పైగా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ భారత కంటెంట్ వ్యవస్థపై బలమైన ప్రపంచ ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి.
బలమైన వ్యాపార కార్యకలాపాలు, మార్కెట్ ప్రభావం
వేవ్స్ ఫిల్మ్ బజార్-2025 నెట్వర్కింగ్, సహకారాలు ఒప్పందాల కోసం ఒక డైనమిక్ వాతావరణాన్ని సులభతరం చేసింది:
· ప్రపంచవ్యాప్తంగా 220కి పైగా కొనుగోలుదారులతో 1200లకు పైగా వ్యక్తిగత సమావేశాలు
· వివిధ మార్కెట్ విభాగాల వ్యాప్తంగా వందలాది ఓపెన్-ఎండ్ సమావేశాలు
· ప్రపంచ భాగస్వామ్యాలను ప్రారంభించడంలో పెరుగుతున్న వేదిక ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ, రూ. 1050 కోట్ల విలువైన గణనీయ వ్యాపార చర్చలు, సంప్రదింపులు
o 750 కోట్లకు పైగా విలువ కలిగిన 320 కి పైగా క్లోజ్డ్ డోర్ ప్రాజెక్ట్ చర్చలు
o ప్రతినిధుల బహిరంగ సమావేశాల్లో రూ.200 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులపై చర్చలు
o ఈ కార్యక్రమం సందర్భంగా రూ. 100 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
ఒక కీలక అభివృద్ధిలో భాగంగా ఆస్ట్రేలియాలోని మీడియా-ఎంటర్‌టైన్‌మెంట్‌తో నాలుగు కీలక అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడానికి వేవ్స్ ఫిల్మ్ బజార్-2025 దోహదం చేసింది. ఇది విద్య, పంపిణీ, నైపణ్యాభివృద్ధి, పరస్పర చిత్రోత్సవ సహకారం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బాగా మెరుగుపరిచింది. ఇందులో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఎన్ఎఫ్డీసీ, మెల్బోర్న్ భారత చలన చిత్రోత్సవం మధ్య అవగాహన ఒప్పందం, డీకిన్ విశ్వవిద్యాలయం, భారత ఫిల్మ్ - టెలివిజన్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్టీఐఐ, పూణే), భారత క్రియేటివ్ టెక్నాలజీస్ ఇనిస్టిట్యూట్ (ఐఐసీటీ, ముంబయి) మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
-
వేవ్స్ ఫిల్మ్ బజార్-2025 లోతైన అంతర్జాతీయ సహకారానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, ఫిన్లాండ్, రష్యా, యూకే, న్యూజిలాండ్ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు ఉన్నత స్థాయి జీ2జీ, కమిషన్-టు-కమిషన్ సమావేశాలను నిర్వహించింది.
ఈ ఫలితాలు దక్షిణాసియాలో అత్యంత ప్రభావవంతమైన చలనచిత్ర మార్కెట్లలో ఒకటిగా వేవ్స్ ఫిల్మ్ బజార్ ఆవిర్భావాన్ని స్పష్టం చేశాయి. భారతీయ, అంతర్జాతీయ కథకులు, నిర్మాతలు, పంపిణీదారులు, పెట్టుబడిదారులకు అపార అవకాశాలను అందిస్తున్నాయి.
ఇండో-ఆస్ట్రేలియా సహకారం బలోపేతం: నాలుగు ప్రధాన అవగాహన ఒప్పందాలపై సంతకాలు
ఈ కీలక అభివృద్ధిలో, ఆస్ట్రేలియాలోని మీడియా-ఎంటర్‌టైన్‌మెంట్‌తో మూడు కీలక అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడానికి వేవ్స్ ఫిల్మ్ బజార్-2025 దోహదపడింది. విద్య, పంపిణీ, నైపుణ్యాభివృద్ధి, పరస్పర చిత్రోత్సవ సహకార రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మెరుగుపరిచింది:
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం, ఎన్ఎఫ్డీసీ, మెల్బోర్న్ భారతీయ చలన చిత్రోత్సవం మధ్య అవగాహన ఒప్పందం. పరస్పర చిత్రోత్సవ సహకారం, ప్రొడ్యూసర్ ల్యాబ్‌లు, కొత్త వేవ్స్ బజార్-ఐఎఫ్ఎఫ్ఎమ్ కో-డిస్ట్రిబ్యూషన్ ఫండ్ ద్వారా ఇండో-ఆస్ట్రేలియన్ స్క్రీన్ సంబంధాలను బలోపేతం చేయడానికి మూడు సంవత్సరాల వ్యూహాత్మక భాగస్వామ్యం. ఈ సహకారం రెండు దేశాల్లో సమష్టిగా క్యూరేటెడ్ స్క్రీనింగ్‌లు, ప్రీమియర్లు, శిక్షణ కార్యక్రమాలు, సృజనాత్మక ప్రాజెక్టుల ప్రోత్సాహాన్ని మెరుగుపరుస్తుంది.
1. డీకిన్ విశ్వవిద్యాలయం, భారత ఫిల్మ్ - టెలివిజన్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్టీఐఐ, పూణే), భారత క్రియేటివ్ టెక్నాలజీస్ ఇనిస్టిట్యూట్ (ఐఐసీటీ, ముంబయి) మధ్య అవగాహన ఒప్పందం
పాఠ్యాంశాల భాగస్వామ్యాలు, పరస్పర విద్యార్థి-అధ్యాపకుల సహకారం, ప్రత్యేక కార్యశాలలు, సహకార అభ్యసన మార్గాల ద్వారా చలనచిత్ర విద్యను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారించిన ఒక విద్యా కూటమి - తదుపరి తరం చిత్రనిర్మాతలు, యానిమేటర్లను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
-
పీవీఆర్ ఐనాక్స్ - మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్స్, ఆస్ట్రేలియా మధ్య అవగాహన ఒప్పందం
దేశంలోని అతిపెద్ద సినిమా చెయిన్ ద్వారా భారతదేశంలో ఆస్ట్రేలియన్ చిత్రాలు దేశవ్యాప్తంగా థియేటర్ విడుదలలకు వీలు కల్పించే పంపిణీ-కేంద్రిత భాగస్వామ్యం. ఈ ఒప్పందం ఏటా 5 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం లభిస్తుందనీ, ఇరు దేశాల్లోని కథకులకు విస్తృత మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అంచనా.
3. పీటీసీ పంజాబీ, ఆస్ట్రేలియాకు చెందిన టెంపుల్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ మధ్య అవగాహన ఒప్పందం.
ఆస్ట్రేలియా-భారత్ మధ్య సహ-నిర్మాణ ఒప్పందం కింద మూడు పంజాబీ భాషా చలనచిత్రాల సహ-ప్రదర్శనకు ఆస్ట్రేలియన్ నిర్మాణ సంస్థ టెంపుల్‌తో పీటీసీ పంజాబీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుల అంచనా విలువ 7 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ.
ఇతర అంతర్జాతీయ ఉత్సవాలతో బలమైన సహకారం
ప్రధాన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలతో భారత్ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి వేవ్స్ ఫిల్మ్ బజార్-2025 ఒక ముఖ్యమైన వేదికగా ఆవిర్భవించింది. గణనీయ అభివృద్ధిలో భాగంగా, రెయిన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (యూకే), ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లిస్బోవా, బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (దక్షిణ కొరియా) తమ రాబోయే ఎడిషన్లలో భారతదేశాన్ని 'ఫోకస్ కంట్రీ'గా హోస్ట్ చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి.
ఐఎఫ్ఎఫ్ఐ-2025లో 14 క్రియేటివ్-టెక్ ఇన్నోవేటర్లను ప్రదర్శించిన వేవ్‌ఎక్స్ స్టార్టప్ పెవిలియన్
సృజనాత్మక, మీడియా, వినోద-సాంకేతిక రంగాల్లో 14 వర్ధమాన అంకురసంస్థలను ప్రదర్శించడం ద్వారా వేవ్స్ ఫిల్మ్ బజార్‌లో వేవ్‌ఎక్స్ స్టార్టప్ పెవిలియన్ ఒక ముఖ్యమైన ఘనతను సాధించింది.
ఈ భాగస్వామ్యం వేవ్ఎక్స్ అంకుర సంస్థల కోసం వీటిని చేయగలిగింది:
· వారి ఉత్పత్తులను, ఐపీలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందించడం
· బీ2బీ నెట్వర్కింగ్, వ్యూహాత్మక కార్పొరేట్ సమావేశాల్లో భాగస్వామ్యం
· ఓటీటీలు, నిర్మాణ సంస్థలు, పంపిణీదారులతో భాగస్వామ్యాలను అన్వేషించడం
· సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయ గుర్తింపు పొందడం
ఐఎఫ్ఎఫ్ఐ గురించి:
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్... భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... గోవా రాష్ట్ర ప్రభుత్వం... గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ప్రపంచ సినిమాకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ అలనాటి అపురూప చిత్రాలు, సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు, లెజెండరీ మాస్ట్రోలు, నిర్భయంగా రూపొందించిన తొలి సినిమాలు ఒకే చోట కలిసి ఈ వేడుకలకు హాజరైన ప్రేక్షకులను అలరిస్తాయి. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, ఘన నివాళులతోపాటు... ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలకు అపార అవకాశాలను అందించే శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ వంటి కార్యక్రమాలు ఐఎఫ్ఎఫ్ఐని మరింత అద్భుత వేదికగా మార్చుతున్నాయి. నవంబర్ 20–28 వరకు అందమైన గోవా తీరప్రాంతంలో ప్రదర్శితమయ్యే 56వ ఎడిషన్.... ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించే ఒక అద్భుతమైన వేడుకగా... భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సంగమంగా నిలుస్తుంది.
మరింత సమాచారం కోసం, క్లిక్ చేయండి:
IFFI Website: https://www.iffigoa.org/
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Post Link: https://x.com/PIB_Panaji/status/1991438887512850647?s=20
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
* * *
Release ID:
2195630
| Visitor Counter:
5