కొత్త ఏఐ సినిమాపై మాస్టర్‌క్లాస్-జనరేటివ్ ఏఐ, ఎల్ఎల్ఎంలతో సినిమా నిర్మాణ భవిష్యత్తుపై విశ్లేషణ
సినిమా భవిష్యత్తుపై దూరదృష్టితో సాగిన చర్చకు నాయకత్వం వహించిన శేఖర్ కపూర్
గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) ఆరో రోజు “కొత్త ఏఐ సినిమా: జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) పై చర్చ” పేరుతో విలక్షణమైన శిక్షణ తరగతిని నిర్వహించారు. ఇది సాంకేతికత, సినిమా రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను ఒక వేదికపై చేర్చి కృత్రిమ మేధ ఆధారిత సినిమా నిర్మాణంలో వేగంగా మారిపోతున్న ధోరణులను లోతుగా పరిశీలించింది.

ప్రముఖ టెక్నాలజిస్ట్ శ్రీ శంకర్ రామకృష్ణన్, ఏఐ నిపుణుడు శ్రీ వి. మురళీధరన్, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన సినిమా దర్శకుడు శ్రీ శేఖర్ కపూర్ లతో కూడిన ప్యానల్ చర్చను నిర్వహించింది.

భారతీయ సినిమాకు శ్రీ శేఖర్ కపూర్ చేసిన మార్గదర్శక కృషిని ప్రశంసిస్తూ, శ్రీ రవి కొట్టార్కర సమావేశాన్ని ప్రారంభించారు. కథ చెప్పడంలోనూ, చిత్ర నిర్మాణంలోనూ కపూర్ శైలిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా "మిస్టర్ ఇండియా" సినిమా గురించి చెబుతూ, సాంకేతిక ఆవిష్కరణ పరంగా, సాంస్కృతికపరంగా ఈ చిత్రం నేటికీ గొప్పగా నిలిలిచిందని అన్నారు.
చిత్ర నిర్మాణంలో అత్యంత ప్రజాస్వామ్య మాధ్యమంగా కృత్రిమ మేధ
శ్రీ శేఖర్ కపూర్ చర్చను ప్రారంభిస్తూ, కృత్రిమ మేధ రాకతో ప్రపంచం తీవ్రమైన మార్పునకు లోనైందని పేర్కొన్నారు. కృత్రిమ మేధను "చిత్ర నిర్మాణానికి అత్యంత ప్రజాస్వామ్య మాధ్యమం"గా అభివర్ణించారు. ఇది పరిశ్రమలోని సంప్రదాయ అడ్డంకులను నియంత్రణలను తొలగించిందని స్పష్టం చేశారు.
తన వంట మనిషి చాట్ జీపీటీని ఉపయోగించి మిస్టర్ ఇండియా 2 కోసం ఒక స్క్రిప్ట్ తయారు చేశాడని శ్రీ శేఖర్ కపూర్ తెలిపారు. ఏఐ సాధారణ వ్యక్తులకు కూడా ఎలా అనుబాటులో ఉంటున్నదీ, శక్తిమంతమైన అవకాశాలను అందిస్తుందన్నది ఈ ఉదాహరణ ద్వారా ఆయన వివరించారు.
అపూర్వమైన సృజనాత్మక స్వేచ్ఛను అందిస్తూ ప్రపంచ సినిమాను పునర్నిర్వచించడానికి ఏఐ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్ ప్రత్యేకతను ప్రస్తావిస్తూ, ఈ యువ జనాభా బలం భవిష్యత్ ఫిల్మ్ టెక్నాలజీలలో భారత్ నాయకత్వాన్ని వేగవంతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

వీఎఫ్ఎక్స్, ఏఐ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా శ్రీ కపూర్ వివరించారు. వీఎఫ్ఎక్స్ అనేది చిత్రాలను డిజిటల్‌గా సృష్టించడం లేదా మార్చడం కాగా, ఏఐ మెషీన్-లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి చిత్ర నిర్మాణ ప్రక్రియలోని అంశాలను ఆటోమేట్ చేయడానికి, మెరుగుపరచడానికి లేదా కొత్తగా రూపొందించడానికి ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.
చిత్రనిర్మాణంలో ఆచరణాత్మక ఏఐ సాధనాలను ప్రదర్శించిన సాంకేతిక నిపుణులు
చిత్రనిర్మాతలకు స్క్రిప్టింగ్, స్టోరీబోర్డింగ్ లైటింగ్, కెమెరా అవసరాలతో సహా షాట్ వివరణలను రూపొందించడంలో సహాయపడే చాట్‌జీపీటీ, గూగుల్ జెమిని తదితర ఏఐ గురించి సాంకేతిక నిపుణులు శ్రీ శంకర్ రామకృష్ణన్, శ్రీ వి.మురళీధరన్ వివరించారు.
ఏఐ సహాయంతో తీసిన “ది టర్బన్ అండ్ ది రాక్”ను వారు ప్రదర్శించారు. రాజారావు రచనను సినిమాగా తీయడంలో వివిధ ఏఐ వేదికలు, నమూనాలను ఎలా ఏకం చేసిందీ వారు వివరించారు.
ప్రేక్షకులతో ముఖాముఖీ-ఏఐతో తీసిన చిత్రాల ప్రదర్శన
ప్రేక్షకులతో ప్రశ్నోత్తరాల సెషన్ సందర్భంగా, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణం, ఆర్కైవల్ పునరుద్ధరణ, ఫిల్మ్ ఎడ్యుకేషన్‌కు ఏఐ మద్దతు గురించి ప్యానలిస్టులు వివరించారు. సృజనాత్మక సాంకేతికతల సామర్థ్యాలను తెలిపే ఏఐ ద్వారా రూపొందించిన “ది లాస్ట్ లెజెండ్స్” లఘు డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు.
సినిమాకు ప్రజల భావోద్వేగమే కీలకం
ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, సినిమాకు చూసే వారి భావోద్వేగమే ప్రధానమని శ్రీ శేఖర్ కపూర్ ఉద్ఘాటించారు. ఏఐ కేవలం సహాయకారిగా, పనులను వేగవంతం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, కానీ తెరపై నిజమైన భావాలను, లోతును పండించడానికి కళాకారులు ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.

ధర్మేంద్రకు నివాళి
భారతీయ సినిమాకు విశేష సేవలందించిన ప్రముఖ నటుడు ధర్మేంద్రకు ప్రగాఢ నివాళులర్పిస్తూ కార్యక్రమం ముగిసింది.
ఇఫీ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ), దక్షిణ ఆసియాలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద సినిమా ఉత్సవంగా పేరు గాంచింది. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్జీ) సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. పునరుద్ధరించిన పాత సినీ కళాఖండాలు, ఆధునిక ప్రయోగ చిత్రాల ప్రదర్శనతో దిగ్గజ దర్శకులు, మొదటిసారి చిత్రాలు తీసిన కొత్త, సాహసోపేత దర్శకులు ఒకే వేదికను పంచుకునే ఈ ఉత్సవం, అంతర్జాతీయ సినీశక్తి కేంద్రంగా ఎదిగింది. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, నివాళులు ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు, అత్యంత ఉత్సాహభరితమైన 'వేవ్స్ ఫిల్మ్ బజార్' వంటి వైవిధ్యభరిత అంశాల కలయిక ఇఫీని ప్రకాశవంతంగా మార్చాయి. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవా సుందర తీరప్రాంత నేపథ్యంలో జరిగే 56వ ఎడిషన్ భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుతమైన వైవిధ్యాన్ని హామీ ఇస్తోంది. ఇది ప్రపంచ వేదికపై భారతదేశ సృజనాత్మక ప్రతిభను సమగ్రంగా ప్రదర్శించే వేడుక.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2191742
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2190381
IFFI Website: https://www.iffigoa.org/PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56new/
***
Release ID:
2194394
| Visitor Counter:
3