‘దాస్తాన్-ఎ-గురుదత్’: దిగ్గజ దర్శకుడి పయనాన్ని కళ్లకు కట్టిన సంగీతావలోకనం
· ‘ఇఫి’లో సంగీతం.. సంస్మరణతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన కార్యక్రమం
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-2025 (ఇఫి)లో ఇవాళ 5వ రోజున దిగ్గజ దర్శకుడు గురుదత్ జ్ఞాపకార్థం గోవాలోని కళా అకాడమీలో ‘దాస్తాన్-ఎ-గురుదత్’ (గురుదత్ జీవనగాథ) పేరిట నిర్వహించిన ప్రత్యేక సంగీతావలోకనం ఆయన జీవనయానాన్ని కళ్లకు కట్టింది. గురుదత్ జీవితం, ఆయన సృజనాత్మక వారసత్వంపై ఈ కార్యక్రమంలో ఫౌజియా, ఆమె బృందం వినిపించిన గాథ ప్రేక్షకులను మైమరపించింది.
భారతీయ సినిమాకు గురుదత్ సేవలను గుర్తుచేస్తూ ప్రముఖ దర్శకనిర్మాత రాహుల్ రవైల్ తన ఆలోచనలను పంచుకోవడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ఫౌజియా తన బృందంతో కలసి ఆకర్షణీయ కథాగానంతో ప్రేక్షకులను గురుదత్ జ్ఞాపకాల్లోకి నడిపించారు. గాయని లతికా జైన్ ఆలాపనకు వాద్య కళాకారులు సుదీప్, రిషబ్, అంకిత్ తబలా, హార్మోనియం, గిటార్ వాదనం తోడుకావడంతో కార్యక్రమం ఆద్యంతం రసరంజితంగా సాగింది. గురుదత్ సినిమారంగ పయనంపై ఆశా బాత్రా పరిశోధన సహకారంతో వికాస్ జలాన్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.
గురుదత్ తొలినాళ్ల ప్రయాణంపై పరిశీలన
కోల్‌కతాలో గురుదత్ బాల్యం నుంచి ఫౌజియా తన కథగానానికి శ్రీకారం చుట్టారు. తల్లి కుటుంబం నుంచి మార్గదర్శకత్వం, వారి సృజనాత్మక ప్రతిభ గురుదత్‌ను ప్రభావితం చేసిన విధానాన్ని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. కేవలం 16 ఏళ్ల చిరుప్రాయంలోనే అల్మోరాలోని ఉదయ్ శంకర్ కల్చరల్ సెంటర్‌లో ఆయన వ్యక్తిత్వ వికాసాన్ని గుర్తుచేశారు. ఆయన 16 సంవత్సరాల వయస్సులో అల్మోరాలోని ఉదయ్ శంకర్ కల్చరల్ సెంటర్‌లో చేరారు. ఆయనలో కళాత్మక సామర్థ్యంతో పాటు ప్రదర్శనాత్మక కళలపై అభిరుచిని ప్రోది చేయడంలో అక్కడి శిక్షణ కీలక పాత్ర పోషించింది.
దేవానంద్‌తో బంధం
గురుదత్‌కు పుణేలోని ప్రభాత్ స్టూడియోలో మరో దిగ్గజ కళాకారుడు దేవానంద్‌తో మొదలైన పరిచయం స్నేహంగా చిగురించింది. అనంతరం కాలంలో వారిద్దరి బంధంగా మరింత పెనవేసుకుంది. అటుపైన చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినపుడు సర్వదా సహకరించుకోవాలని మిత్రులిద్దరూ పరస్పరం వాగ్దానం చేసుకున్నారు. ఇలా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్న మాట భారతీయ సినిమా రంగంలోనే అత్యంత సృజనాత్మక భాగస్వామ్యాలలో ఒకదానికి నాంది పలికింది.
ముంబయి ప్రస్థానం...దర్శకుడుగా ఉత్థానం
దేవానంద్ ‘నవకేతన్ ఫిల్మ్ కంపెనీ’ స్థాపించాక ముంబయి నగరంలో గురుదత్ ప్రస్థానాన్ని ఫౌజియా తన కథాగానంలో వివరించారు. ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ తన సంస్థ నిర్మించే తొలి చిత్రం ‘బాజీ’ దర్శకత్వ బాధ్యతలను అనుంగు మిత్రుడు గురుదత్‌కు అప్పగించారు. గురుదత్ అద్భుత భవిష్యత్ పురోగమనానికి ఈ చిత్రం బాటలు పరచింది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సమయంలోనే నటుడు బద్రుద్దీన్ జమాలుద్దీన్ కాజీ పేరు గురుదత్ ‘వెండితెర నామకరణం’తో ‘జానీ వాకర్’గా మారింది. ఆ పేరుతోనే ఆయన తిరుగులేని హాస్యనటుడుగా ఎదిగారు.
తొలి చిత్రం ‘బాజీ’ దర్శకుడుగా ఘన విజయం అందుకున్న గురుదత్, అటుపైన ప్రపంచ సినిమాలో కీలక మలుపుగా పరిగణనలోకి వచ్చిన ‘ప్యాసా’ సహా చిరస్మరణీయ చిత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు.
వ్యక్తిగత జీవితావలోకనం
ఫౌజియా కథాగానం గురుదత్ వ్యక్తిగత జీవితాన్ని కూడా స్పృశిస్తూ సాగింది. ముఖ్యంగా ‘కాగజ్ కే ఫూల్’ చిత్ర వైఫల్యం ఆయనలో రేగిన భావోద్వేగ సంఘర్షణను మరింతగా ప్రతిబింబించింది. మరణానికి ముందు ముప్పిరిగొన్న నిరాశ, నిస్సృహలు గురుదత్‌ను కొన్నేళ్లపాటు ఏకాకిని చేశాయి.
ప్రేక్షకుల తాదాత్మ్య స్పందన
ఈ సంగీత పునరావలోకనానికి ప్రేక్షకుల నుంచి తాదాత్మ్య స్పందన లభించింది. హృదయపు లోతులను తడిమిన లతికా జైన్ విరామ సమయ ఆలాపన ఈ కార్యక్రమానికి మరిన్ని వన్నెలద్ది, కథాశ్రవణ అనుభవాన్ని సుసంపన్నం చేసింది.
దేశంలోనే అత్యంత ప్రసిద్ధ దర్శక దిగ్గజాలలో ఒకరైన గురుదత్ వారసత్వ పరిరక్షణలో భాగంగా ఆ వైభవాన్ని చాటడంలో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన ‘దాస్తాన్-ఎ-గురుదత్’ బృందాన్ని కార్యక్రమానంతరం నిర్మాత రవి కొట్టార్కర సముచిత రీతిలో సత్కరించారు.
భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ నేపథ్యం
దక్షిణాసియా సినిమా రంగానికి సంబంధించి 1952లో మొదలైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫెఫ్‌ఐ-ఇఫి) అత్యంత ప్రాచీనమైనదేగాక ఘనమైన వేడుకగా ప్రపంచ గుర్తింపు పొందింది. జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ), కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా రాష్ట్ర ‘గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ’ (ఈఎస్‌జీ) ఈ ఉత్సవాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సినిమా రంగంలో ఒక శక్తిగా ఎదిగిన ఈ వేడుకలలో పాత సినిమాలకు కొత్త హంగులతో చేసిన సాహస ప్రయోగాలు, తొలిసారి రంగంలో ప్రవేశించిన ప్రతిభావంతులతో పరిశ్రమ దిగ్గజాల అరమరికలు లేని ముచ్చట్లు అందర్నీ అలరిస్తాయి. వాస్తవంగా ఈ చలనచిత్రోత్సవానికి వన్నెలద్దేది దాని ఉజ్వల సమ్మేళనమే. ఇందులో అంతర్జాతీయ పోటీ, సాంస్కృతిక ప్రదర్శనలు, దిగ్గజాల ప్రసంగాలు (మాస్టర్ క్లాసులు), ప్రశంసలు సహా ఆలోచనలు, ఒప్పందాలు, సహకారం తదితరాలకు ఉత్తేజమిచ్చే శక్తిమంతమైన ‘వేవ్స్ ఫిల్మ్ బజార్’ ప్రత్యేక ఆకర్షణలు. అద్భుత తీర ప్రాంతమైన గోవా నేపథ్యానికి మరింత వెలుగును జోడిస్తూ ఈ నెల 20 నుంచి 28 వరకు 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభకు అద్దంపట్టే అద్భుత వేడుక. భాష, శైలి, ఆవిష్కరణ, గళాల అద్భుత సమ్మేళనం ఈ ఉత్సవాల్లో ప్రేక్షకులకు కనువిందు చేస్తుందనడంలో సందేహం లేదు.
మరింత సమాచారం కోసం దిగువ లింకులపై క్లిక్ చేయండి:
‘ఎక్స్’ హ్యాండిళ్లు: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
रिलीज़ आईडी:
2194050
| Visitor Counter:
25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Konkani
,
Manipuri
,
Gujarati
,
Marathi
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Tamil
,
Kannada
,
Malayalam