ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో తులసీ పీఠ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
27 OCT 2023 7:48PM by PIB Hyderabad
నమో రాఘవాయ!
నమో రాఘవాయ!
పూజ్య జగద్గురు శ్రీ రాంభద్రాచార్య గారు మనల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆధ్యాత్మిక గురువులు, మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్, ముఖ్యమంత్రి భాయ్ శివరాజ్ గారు, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా!
చిత్రకూట్ పవిత్ర భూమికి నేను మరోసారి నమస్కరిస్తున్నాను. ఈ రోజు వివిధ దేవాలయాల్లో శ్రీరాముని దర్శనం చేసుకునే అవకాశం లభించడం నా అదృష్టం. ఎందరో ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులూ నాకు లభించాయి. జగద్గురు రామభద్రాచార్య గారి నుంచి నాకు లభించే ఆప్యాయతతో నా మనస్సు ఉప్పొంగుతుంది. పూజ్య గురువులారా, ఈ రోజు ఈ పవిత్ర స్థలంలో జగద్గురు గారి పుస్తకాలను విడుదల చేసే అవకాశం నాకు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. అష్టాధ్యాయి భాష్యం, రామానందచార్య చరితం, 'భగవాన్ శ్రీ కృష్ణ కీ రాష్ట్రలీల' - ఈ గ్రంథాలన్నీ భారత గొప్ప జ్ఞాన సాంప్రదాయాన్ని మరింత సుసంపన్నం చేస్తాయి. ఈ పుస్తకాలను జగద్గురు గారి ఆశీర్వాదాలకు మరో రూపంగా నేను భావిస్తున్నాను. ఈ పుస్తకాల విడుదల సందర్భంగా మీ అందరికీ నా అభినందనలు.
నా కుటుంబ సభ్యులారా,
అష్టాధ్యాయి వేల సంవత్సరాల నాటి భారత భాషాశాస్త్రం. ఇది భారత మేధస్సును, మన పరిశోధనా సంస్కృతిని వివరించే గ్రంథం. వివిధ సూత్రాలు విస్తారమైన వ్యాకరణ అంశాన్ని ఎలా సంగ్రహించగలవు... భాషను 'సంస్కృత శాస్త్రం'గా ఎలా మార్చవచ్చు... మహర్షి పాణిని వేల సంవత్సరాల నాటి ఈ కూర్పు దీనికి రుజువు. ఈ వేల సంవత్సరాల్లో ప్రపంచంలో అనేక భాషలు అంతరించిపోయాయి. పాత భాషల స్థానంలో కొత్త భాషలెన్నో వచ్చి చేరాయి. నేటికీ మన సంస్కృతం మాత్రం చెక్కుచెదరకుండా, స్థిరంగా ఉంది. సంస్కృతం కాలక్రమేణా శుద్ధి అవుతోంది... అయినా దాని వాస్తవికతను కోల్పోలేదు. దీనికి కారణం సంస్కృతంలోని పరిణతి చెందిన వ్యాకరణ శాస్త్రం. కేవలం 14 మహేశ్వర సూత్రాలపై ఆధారపడిన ఈ భాష వేల సంవత్సరాలుగా శస్త్ర (ఆయుధాలు), శాస్త్రాలు (గ్రంథాలు) రెండింటికీ తల్లిగా ఉంది. వేదాల్లోని శ్లోకాలను సంస్కృత భాషలోనే మహర్షులు అందించారు. యోగ శాస్త్రాన్ని పతంజలి ఈ భాషలోనే అందించారు. ఈ భాషలోనే ధన్వంతరి, చరకుడు వంటి వారు ఆయుర్వేద సారాన్ని రాశారు. ఈ భాషలోనే కృషి పరాశర్ వంటి గ్రంథాలు వ్యవసాయాన్ని శ్రమతో పాటు పరిశోధనతో అనుసంధానించాయి. ఈ భాషలోనే మనకు భరతముని నుంచి నాటకం, సంగీత శాస్త్రం అనే బహుమతులు లభించాయి. ఈ భాషలోనే కాళిదాసు వంటి మహా పండితులు సాహిత్య శక్తితో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అంతరిక్ష శాస్త్రం, విలువిద్య, యుద్ధ కళలపై గ్రంథాలు ఈ భాషలోనే రాశారు. నేను కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇచ్చాను. ఈ జాబితా చాలా పొడవుగా ఉంటుంది. మీరు భారత్ ఒక దేశంగా అభివృద్ధి చెందడానికి ఏ అంశాన్ని చూసినా... దానిలో సంస్కృతం సహకారాన్ని చూస్తారు. నేటికీ ప్రపంచంలోని ప్రధాన విశ్వవిద్యాలయాల్లో సంస్కృతంపై పరిశోధన జరుగుతోంది. ఇటీవల లిథువేనియా రాయబారి భారత్‌ను గురించి తెలుసుకోవడానికి సంస్కృత భాషను నేర్చుకోవడం మనం చూశాం. అంటే ప్రపంచవ్యాప్తంగా సంస్కృతానికి ఆదరణ పెరుగుతోంది.
మిత్రులారా,
వెయ్యి సంవత్సరాల వలస పాలనలో భారతదేశాన్ని నాశనం చేసేందుకు వివిధ ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాల్లో ఒకటి సంస్కృత భాషను పూర్తిగా నాశనం చేయడం. మనం స్వతంత్రులమైనా... బానిసత్వ మనస్తత్వాన్ని వదులుకోని కొందరు సంస్కృతం పట్ల ద్వేషాన్ని కొనసాగించారు. అలాంటి వ్యక్తులు వేరే చోట దొరికిన అంతరించిన భాషల్లోని శాసనాలను కీర్తిస్తారు. వేల సంవత్సరాలుగా మన దేశంలో ఉన్న సంస్కృతాన్ని మాత్రం వారు గౌరవించరు. తమ మాతృభాషలో పాండిత్యం కలిగిన ఇతర దేశాల ప్రజలను వీరు అభినందిస్తారు... సంస్కృత భాషను తెలుసుకోవడం వెనకబాటుతనానికి చిహ్నంగా భావిస్తారు. ఈ రకమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులు గత వెయ్యి సంవత్సరాలుగా ఓడిపోతూనే ఉన్నారు. భవిష్యత్తులోనూ వీరు విజయం సాధించలేరు. సంస్కృతం సాంప్రదాయాల భాష మాత్రమే కాదు... అది మన పురోగతి, గుర్తింపుల భాష కూడా. గత 9 సంవత్సరాల్లో సంస్కృతాన్ని ప్రోత్సహించడానికి మేం విస్తృతమైన ప్రయత్నాలు చేశాం. ఆధునిక సందర్భంలో అష్టాధ్యాయి భాష్యం వంటి గ్రంథాలు ఈ ప్రయత్నాలను విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
నా కుటుంబ సభ్యులారా,
రామభద్రాచార్య గారు మన దేశానికి చెందిన ఎంతో గొప్ప జ్ఞాని. ఆయన జ్ఞానం ఆధారంగానే ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు తమ అధ్యయనాలు, పరిశోధనలు నిర్వహించగలుగుతున్నాయి. బాల్యం నుంచే కంటి చూపు లేకపోయినా మీ జ్ఞాన నేత్రాలు ఎంతగా అభివృద్ధి చెందాయంటే... మీరు అన్ని వేదాలను కంఠస్థం చేసుకున్నారు. మీరు వందలాది పుస్తకాలు రాశారు. భారతీయ జ్ఞానం, తత్వశాస్త్రంపై మీరు రచించిన 'ప్రస్థానత్రయి' గ్రంథాన్ని గొప్ప పండితులూ కఠిమైనదిగా పరిగణిస్తారు. జగద్గురు గారు ఆధునిక భాషలో కూడా తన వ్యాఖ్యానాన్ని రాశారు. ఈ జ్ఞానం స్థాయి, ఈ తెలివితేటల స్థాయి వ్యక్తిగత స్థాయికి పరిమితం కాదు. ఈ తెలివితేటలు యావత్ దేశపు వారసత్వం. అందుకే మన ప్రభుత్వం 2015లో స్వామిజీని పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
మిత్రులారా,
స్వామీజీ మతం, ఆధ్యాత్మికత రంగంలో ఎంత చురుగ్గా ఉన్నారో... సమాజం, దేశం విషయంలోనూ అంతే చురుగ్గా ఉంటారు. స్వచ్ఛ భారత్ అభియాన్ 9 రత్నాల్లో ఒకరిగా నేను మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు... మీరు కూడా అంతే భక్తితో ఆ బాధ్యతను స్వీకరించారు. స్వామీజీ దేశ గర్వం కోసం చేసిన తీర్మానాలు ఇప్పుడు నెరవేరుతున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. మన భారత్ ఇప్పుడు పరిశుభ్రంగా, ఆరోగ్యంగా మారుతోంది. గంగామాత నది కూడా పరిశుభ్రంగా మారుతోంది. దేశంలోని ప్రతి వ్యక్తి కలనూ నెరవేర్చడంలో జగద్గురు రాంభద్రాచార్య ప్రధాన పాత్ర పోషించారు. కోర్టు నుంచి ఇతర అంశాల వరకు మీ ఎనలేని కృషి కారణంగానే రామాలయం సిద్ధమైంది. రెండు రోజుల కిందటే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి నాకు ఆహ్వానం అందింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.
గౌరవనీయ ఆధ్యాత్మిక గురువులారా, దేశం 75వ స్వాతంత్య్ర సంవత్సరం నుంచి 100వ స్వాతంత్య్ర సంవత్సరం వరకు అత్యంత ముఖ్యమైన కాలం కోసం ఎదురు చూస్తోంది. అంటే ఈ 25 సంవత్సరాలు 'అమృత కాలం'. ఈ 'అమృత కాలం'లో దేశం అభివృద్ధి, వారసత్వాలతో ఏకకాలంలో ముందుకు సాగుతోంది. మన పుణ్యక్షేత్రాల అభివృద్ధికీ మేం ప్రాధాన్యత ఇస్తున్నాం. చిత్రకూట్ ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ప్రకృతి సౌందర్యం గల ప్రదేశం. రూ. 45 వేల కోట్ల విలువైన కెన్-బెట్వా లింక్ ప్రాజెక్ట్ అయినా... బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే అయినా... డిఫెన్స్ కారిడార్ అయినా... ఇలాంటి ప్రయత్నాలు ఈ ప్రాంతంలో కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. చిత్రకూట్ అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకోవాలని నా కోరిక. ఆ దిశగా మేం ప్రయత్నాలు ముమ్మరం చేశాం. మరోసారి గౌరవనీయ జగద్గురు శ్రీ రాంభద్రాచార్య గారికి నేను గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఆయన ఆశీస్సులు మనందరికీ స్ఫూర్తినిస్తాయి. మనకు బలాన్ని ఇస్తాయి. ఆయన జ్ఞానం మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
జై సియా రామ్.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.
****
(रिलीज़ आईडी: 2194043)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil