సమానత్వం, గుర్తింపు, సృజనాత్మక స్వేచ్ఛకు పిలుపునిచ్చిన ఇండిపెండెంట్ సినిమాలోని మహిళలు
మహిళా సినీ రూపకల్పనలో సహానుభూతి ముఖ్యమైన అంశంగా గుర్తించిన ప్యానెల్
మహిళా సృష్టికర్తలకు సహాయపడే వాతావరణాన్ని కల్పించేందుకు మరింత సహకారాన్ని పెంచాలని కోరిన ప్యానెల్
'ఏ గ్లోబల్ ఇండియా త్రూ ఇండిపెండెంట్ సినిమా: మహిళా ప్యానెల్' అనే శీర్షికతో నలుగురు ప్రభావవంతమైన వ్యక్తులు చర్చలు జరిపారు. నటి, సినీ రూపకర్త రజనీ బసుమతరీ, సినిమాటోగ్రాఫర్ ఫౌజియా ఫాతిమా, నటి, సినీ రూపకర్త రేచల్ గ్రిఫిత్స్, నటి మీనాక్షి జయన్ ఈ చర్చలో పాల్గొన్నారు. మహిళల సృజనాత్మకత, వ్యక్తిగత ప్రయాణాలు ఇండిపెండెంట్ సినిమా భవిష్యత్తును ఏ విధంగా మారుస్తున్నాయో చర్చించారు.
మహిళా సినీ రూపకల్పనలో కీలకమైన అంశంగా సహానుభూతి ఉంటుందన్న ఆలోచనతో చర్చ ప్రారంభమైంది. ఒక ఆలోచన పుట్టినప్పటి నుంచి చివరి ఫ్రేమ్ వరకు సృజనాత్మక ప్రక్రియ భావోద్వేగంతో ముడిపడి ఉంటుందని ఫౌజియా తెలిపారు. స్థానిక కథనాలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించే కథలుగా మార్చటానికి ఇది సినీ రూపకర్తలకు వీలు కల్పిస్తుందన్నారు. ‘జీవితంలో చిన్న చిన్న విషయాలను కూడా మహిళలు నిశితంగా గమనిస్తారు. వారి సూక్ష్మ దృష్టి కారణంగానే బయట ప్రపంచానికి తెలియని అనేక కథలు సినిమాల రూపంలో వెలుగులోకి వస్తాయ’ని రజనీ అన్నారు.
ప్రాతినిథ్యంపై చర్చిస్తూ ఇవాళ పరిశ్రమలో మహిళలకు గుర్తింపు లభిస్తుందా అనే విషయాన్ని ప్యానెల్ చర్చించింది. దీనికి రెచల్ స్పందిస్తూ తమ పరిశ్రమలో మహిళా సినిమాటోగ్రాఫర్లు, నిర్మాతల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. ఇండియన్ ఉమెన్ సినిమాటోగ్రాఫర్స్ కలెక్టివ్ ఆవిర్భావం గురించి ఫౌజియా వివరించారు. 2017లో కొద్దిమంది సభ్యులతో మొదలైన ఈ సంస్థలో ప్రస్తుతం జూనియర్ల నుంచి సీనియర్ల వరకు దాదాపు రెండు వందల మంది ఉన్నారని తెలిపారు. మహిళలకు మార్గదర్శకత్వం, సహకారం, ఈ రంగంలో సహయక వాతావరణాన్ని కల్పించేందుకు ఈ సమూహం పనిచేసే తీరుని ఆమె వివరించారు. ఇఫిలో మహిళా సినిమాటోగ్రాఫర్ల ప్రాతినిధ్యాన్ని ఆమె అభినందించారు. 'విముక్తి' చిత్రంలో షెల్లీ శర్మ, 'షేప్ ఆఫ్ మోమో' చిత్రంలో అర్చన ఘంగ్రేకర్ వంటి సినిమాటోగ్రాఫర్ల నైపుణ్యాన్ని ప్రశంసించారు.
రెండేళ్ల కిందట తన సినిమా కోసం ఈ సమూహం నుంచి ఒక సినిమాటోగ్రాఫర్ ని సిఫారసు చేశారని రజనీ గుర్తు చేసుకున్నారు. ఇలాంటి వ్యవస్థ వల్ల ఎంత ఉపయోగం ఉందో ఈ విషయం నిరూపిస్తుందన్నారు. మహిళలు రూపొందించే సినిమాలకు నిధులు సమకూర్చే పథకాన్ని కేరళ ప్రభుత్వం అందిస్తోందని మీనాక్షి తెలిపారు. ఆమె సినిమా 'విక్టోరియా' ఆ సాయం వల్లే రూపుదిద్దుకుందని వెల్లడించారు. కేరళ ప్రభుత్వ పథకం మొదటి ఎంపిక ప్యానెల్ లో పనిచేసిన ఫౌజియా ఒక ఆందోళనను లేవనెత్తారు. ఆడవాళ్ల పేరుమీద మగవాళ్లు ప్రాజెక్టులను సమర్పిస్తున్నారని, ఇలాంటి మోసాలు జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
సినిమా రూపకల్పన, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవటంలో ఎదురయ్యే సవాళ్ల గురించి ప్యానెల్ సభ్యులు చర్చించారు. ముగ్గురు పిల్లలను పెంచుతూ పరిశ్రమలో తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నారో రెచల్ తెలిపారు. మహిళలకు మద్దతు తెలిపేలా.. ఒక వారం పని చేసి, మరో వారం విశ్రాంతి తీసుకునే పద్ధతులు అవసరమని సూచించారు. తల్లి అయిన తర్వాత తిరిగి పనిలోకి రావటం ఎంత కష్టమో ఫౌజియా తెలిపారు. రాబోయే తన కమర్షియల్ సినిమా, విజయ్ సేతుపతి నటించిన 'ట్రైన్' చిత్రంతో తన వృత్తిని కొనసాగించగలిగినందుకు కృతజ్ఞత వ్యక్తపరిచారు.
సెట్ లో నటీనటులు కథలను ఏ విధంగా ప్రభావితం చేయగలరనే ప్రశ్నకు సమాధానమిచ్చిన మీనాక్షి.. కొత్తగా వచ్చే నటీనటులకు తమ సహచరులను ఎంచుకునే స్వేచ్ఛ చాలా తక్కువన్నారు. వృత్తిపరంగా ముందుకు వెళ్తున్న కొద్దీ మహిళా దర్శకులతో పనిచేయాలని ఎక్కువ మంది ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. మహిళా పాత్రల పరిధిని ఓటీటీ వేదికలు పెంచాయని, ఆ పాత్రలకు మరింత బలం, ప్రాధాన్యత లభించిందని రజనీ అభిప్రాయపడ్డారు. చాలామంది నటీమణులు ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారని, ఇది సృజనాత్మక నిర్ణయాలు తీసుకునే వారి సంఖ్యను పెంచుతుందని ఫౌజియా తెలిపారు. భవిష్యత్ లో తాను సినీ నిర్మాతగా మారాలనుకుంటున్నట్లు మీనాక్షి తెలిపారు. హాలీవుడ్ లో ఎప్పటినుంచో మహిళా నిర్మాతలున్నా, వారు ఇప్పటికీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు రేచల్ చెప్పారు. వేతన సమానత్వం గురించి కూడా ఆమె ప్రస్తావించారు. మహిళలకు న్యాయం జరగాలంటే, పురుషులు ఈ అసమానతలను గుర్తించి, ప్రయత్నాలకు మద్దతివ్వటం ద్వారా మార్పు సాధ్యమవుతుందన్నారు.
రచన, సినిమా నిర్మాణ ప్రక్రియపై చర్చల సమయంలో.. తన కథలను స్థానిక వాస్తవాలు, తరతరాలుగా అనుభవించిన సమస్యల నేపథ్యంలో రూపొందించిన తీరుని రజనీ వివరించారు. స్త్రీ, పురుష సమానత్వంపై ఆమె తీసిన తాజా చిత్రంలో నటులంతా మహిళలే. 'విక్టోరియా' సినిమాలో కూడా నటులంతా మహిళలే అని మీనాక్షి వెల్లడించారు. సాధారణ పద్ధతికి భిన్నంగా ఈ నిర్ణయం ఉండటం వల్ల తరచుగా ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.
సినిమాలు తీయటం, వాటిని కొనసాగించటం వంటి వాస్తవాల గురించి చర్చించినపుడు రేచల్ ఒక విషయాన్ని వ్యక్తపరిచారు. ప్రేక్షకులను ఆకర్షించేలా సినీ రూపకర్తలు తమ కథలను రాసుకోవాలి. సరైన కథనం, చేరాల్సిన ప్రేక్షకులకు తప్పకుండా చేరుతుందని నమ్మాలని చెప్పారు. ఈ విషయంపై రజనీ మాట్లాడుతూ.. తక్కువ బడ్జెట్, మహిళా నిర్మాతలతో రూపొందించిన తన సినిమాలు ఎప్పుడూ నష్టాలను ఎదుర్కోకుండా జాగ్రత్త పడినట్లు తెలిపారు.
చర్చల ముగింపులో తప్పక చూడాల్సిన సినిమాలను ప్యానల్ సభ్యులు సూచించారు. బాలికల కీర్తికి సంబంధించిన 'దంగల్' ను రేచల్, 'ది పవర్ ఆఫ్ ది డాగ్' ను ఫౌజియా సిఫార్సు చేశారు. 'ఆర్టికల్ 15’, 'ఐ ఇన్ ది స్కై'ని రజనీ, మానసిక ఆందోళనపై చిత్రీకరించిన 'శివా బేబీ'ని మీనాక్షి సూచించారు. తన సొంత చిత్రం 'విక్టోరియా'ను కూడా సిఫార్సు చేస్తానని మీనాక్షి నవ్వుతూ చెప్పారు.
ఆత్మీయత, ఆశాజనక క్షణాలతో సమావేశం ముగిసింది. ఆస్ట్రేలియన్ చలన చిత్ర పరిశ్రమ ప్రగతిని మీనాక్షి ప్రశంసించారు. అడిలైడ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తాను చూసిన ఒక సినిమాలో నటించాలని అనిపించిందని వెల్లడించారు. దీనికి స్వేహపూర్వకంగా స్పందించిన రేచల్.. ఆ నలుగురు మహిళలూ ఏదో ఒకరోజు కలిసి పనిచేయవచ్చన్నారు. మహిళలు నూతన భవిష్యత్తును ఊహించుకుంటున్నారని, ఇండిపెండెంట్ సినిమా ఆ కలలకు భవిష్యత్తు వేదిక అవుతుందని అన్నారు.
***
रिलीज़ आईडी:
2193853
| Visitor Counter:
4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Khasi
,
English
,
Urdu
,
हिन्दी
,
Konkani
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Bengali-TR
,
Gujarati
,
Odia
,
Kannada