హోం మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ “క్రిస్టల్ ఫోర్ట్రెస్” కింద అంతర్జాతీయ భారీ మెథాంఫెటమిన్ డ్రగ్ ముఠా గుట్టును ఛేదించినందుకు ఎన్‌సీబీ, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందాన్ని అభినందించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశిస్తున్న ‘మాదకద్రవ్య రహిత భారత్‘ సాధన దిశగా వివిధ ఏజెన్సీల మధ్య నిరంతర సమన్వయానికి ఈ ఆపరేషన్ గొప్ప ఉదాహరణ
మాదకద్రవ్యాల ముఠాలను వెంటాడుతున్నాం
మాదకద్రవ్యాల దర్యాప్తులో టాప్-టు-బాటమ్, బాటమ్-టు-టాప్ విధానాన్ని కఠినంగా అనుసరించడం ద్వారా, న్యూఢిల్లీలో 328 కిలోల మెధాంఫెటమిన్ (విలువ రూ.262 కోట్లు) స్వాధీనం, ఇద్దరి అరెస్టుతో గణనీయ పురోగతి
ఢిల్లీలో పట్టుబడిన మెథాంఫెటమిన్ భారీ మొత్తాల్లో ఇది ఒకటి
సింథటిక్ డ్రగ్ ముఠాలు, వాటి అంతర్జాతీయ సంబంధాలను ఛేదించడంలో ఎన్‌సిబి తిరుగులేని నిబద్ధతను చాటుతున్న ఆపరేషన్ “క్రిస్టల్ ఫోర్ట్రెస్”
Posted On:
23 NOV 2025 5:34PM by PIB Hyderabad
ఆపరేషన్ “క్రిస్టల్ ఫోర్ట్రెస్” కింద మెగా అంతర్జాతీయ మెథాంఫెటమిన్ ముఠాను ఛేదించినందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందాన్ని కేంద్ర హోం,సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అభినందించారు.
సామాజిక మాధ్యమ ‘ఎక్స్‘ వేదికపై చేసిన పోస్టులో “మా ప్రభుత్వం మాదకద్రవ్యాల ముఠాలను అసాధారణ వేగంతో ఛేదిస్తోంది. మాదకద్రవ్యాల విచారణలో 'పై నుంచి క్రిందికి, కింద నుంచి పైకి' అనే విధానాన్ని కఠినంగా అనుసరిస్తూ, న్యూఢిల్లీలో రూ. 262 కోట్ల విలువైన 328 కిలోల మెథాంఫెటమిన్‌ను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేయడం ద్వారా గణనీయమైన పురోగతి సాధ్యమైంది. ప్రధానమంత్రి శ్రీ మోదీ ఆశిస్తున్న “మాదక ద్రవ్య రహిత భారత్” ను సాధించడంలో వివిధ ఏజెన్సీల మధ్య నిరంతర సమన్వయానికి ఈ ఆపరేషన్ ఒక గొప్ప ఉదాహరణ. ఎన్సీబీ, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందానికి అభినందనలు" అని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
పేరు మోసిన సింథటిక్ డ్రగ్ అక్రమ రవాణా ముఠాలను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ “క్రిస్టల్ ఫోర్ట్రెస్” కింద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఓపీఎస్ విభాగం), స్పెషల్ సెల్, (సీఐ) ఢిల్లీ పోలీసుల సమన్వయంతో, 20.11.2025న ఢిల్లీ ఛతర్‌పూర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో దాదాపు 328 కిలోగ్రాముల అధిక నాణ్యత గల మెథాంఫెటమిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిఘా, సాంకేతిక పరిజ్ఞానంతో సమాచార సేకరణ ద్వారా గత కొన్ని నెలలుగా కొనసాగిన నిరంతర పరిశోధనల పర్యవసానంగా ఈ నిర్ణయాత్మక చర్య సాధ్యమయింది. ఇది వ్యవస్థీకృతమైన అక్రమ రవాణా వ్యవస్థను ఛేదించింది.
నాగాలాండ్ పోలీసుల సహకారంతో, భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న ఇంట్లో నాగాలాండ్‌కు చెందిన ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇతర కార్యకలాపాల్లో పాల్గొన్నవారిని కూడా గుర్తించారు. ఇందులో విదేశాల నుంచి పనిచేస్తున్న కీలక సూత్రధారి కూడా ఉన్నాడు. గత సంవత్సరం ఢిల్లీలో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్న 82.5 కిలోగ్రాముల ఉన్నత శ్రేణి కొకైన్ కేసులో కూడా ఇతని కోసం గాలిస్తున్నారు. చట్టపరమైన విచారణలను ఎదుర్కోవడానికి అతడిని భారతదేశానికి అప్పగించేందుకు అంతర్జాతీయ చట్టాల అమలు భాగస్వాములతో సమన్వయ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఢిల్లీలో పట్టుబడిన మెథాంఫెటమిన్ భారీ మొత్తాల్లో ఇది ఒకటి. ఈ ముఠా బహుళ కొరియర్లు, సురక్షిత గృహాలు, అనేక మంది అంచెలవారీ నిర్వాహకుల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోందని, భారతదేశంలోనూ, విదేశీ మార్కెట్లకు రవాణా చేయడానికి ఢిల్లీని ఒక ముఖ్య కేంద్రంగా చేసుకున్నారని ప్రాథమిక విచారణ లో తేలింది.
సింథటిక్ డ్రగ్ ముఠాలు, వాటి అంతర్జాతీయ మూలాలను ఛేదించడంలో ఎన్సీబీ తిరుగులేని సంకల్పానికి- ఆపరేషన్ “క్రిస్టల్ ఫోర్ట్రెస్” ఒక ప్రతీక. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోరాడటానికి ఎన్సీబీ ప్రజల మద్దతును కోరుతోంది. ఎవరైనా మాదకద్రవ్యాల విక్రయానికి సంబంధించిన సమాచారాన్ని అందించడానికి మనస్-నేషనల్ నార్కోటిక్స్ హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1933కు కాల్ చేయవచ్చు.
***
(Release ID: 2193343)
Visitor Counter : 2