ప్రధాన మంత్రి కార్యాలయం
జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం
Posted On:
23 NOV 2025 2:38PM by PIB Hyderabad
జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంగా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు గౌరవనీయ శ్రీ సిరిల్ రామఫోసాను కలిశారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి హృదయపూర్వకంగా ఆతిథ్యం ఇచ్చినందుకు... సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు రామఫోసాకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. న్యూఢిల్లీ జీ20 శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడానికి, వాటి ఆధారంగా మరింత పురోగతి సాధనకు దక్షిణాఫ్రికా జీ20 చేసిన ప్రయత్నాలనూ ఆయన అభినందించారు.
భారత్-దక్షిణాఫ్రికా సంబంధాలకు ఆధారమైన చారిత్రక సంబంధాలను గుర్తుచేసుకుంటూ ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. వాణిజ్యం, పెట్టుబడి, ఆహార భద్రత, నైపుణ్యాభివృద్ధి, మైనింగ్, ఇరు దేశాల యువత కలిసి పనిచేయడం, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు వంటి వివిధ సహకార రంగాల్లో సాధించిన పురోగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐ, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, కీలక ఖనిజాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలను వారు చర్చించారు. దక్షిణాఫ్రికాలో భారతీయ సంస్థల పెరుగుతున్న ఉనికిని ఇరు దేశాల నేతలు స్వాగతించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ఆవిష్కరణ, మైనింగ్, అంకురసంస్థల రంగాల్లో పరస్పర పెట్టుబడులను సులభతరం చేయడానికి వారు అంగీకరించారు. దక్షిణాఫ్రికా చిరుతలను భారత్‌కు తరలించినందుకు అధ్యక్షుడు రామఫోసాకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్‌లో చేరాలని ప్రధానమంత్రి ఆయనను ఆహ్వానించారు.
గ్లోబల్ సౌత్ గళాన్ని విస్తృతంగా వినిపించడం కోసం కలిసి పనిచేయడానికి ఇరువురు నేతలు అంగీకరించారు. ఈ సందర్భంలో ఐబీఎస్ఏ దేశాల నేతల సమావేశం నిర్వహించడంలో దక్షిణాఫ్రికా చొరవను ప్రధానమంత్రి ప్రశంసించారు. 2026లో బ్రిక్స్ అధ్యక్ష పదవి విషయంలో భారత్‌కు దక్షిణాఫ్రికా నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని అధ్యక్షుడు రామఫోసా హామీ ఇచ్చారు.
***
(Release ID: 2193221)
Visitor Counter : 2
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada