భారత్ పురోగమిస్తోంది.. ప్రపంచమంతా చూస్తోంది: చరిత్రాత్మక గ్రాండ్ పరేడ్‌తో ప్రారంభం కానున్న ఇఫీ - 2025
వీక్షకులను కట్టిపడేసే అద్భుతమైన ఓపెనింగ్ పెరేడ్‌తో 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. వేడుకను ప్రారంభించడంలో ఓ కొత్త ఒరవడిని ఇది పరిచయం చేయబోతోంది. ఇఫీ తొలిసారిగా ఓ ఉత్తేజకరమైన వేడుకతో ప్రేక్షకులకు స్వాగతం పలకనుంది. ఇక్కడ కథలు రూపుకడతాయి. సంగీతమే శ్వాసగా ఉంటుంది. పాత్రలు తెర దాటి ఎదుట నిలుస్తాయి. లయ, వర్ణం, అద్భుత భావుకతల ద్వారా భారత్ తనను తాను ఆవిష్కరించుకుంటుంది. నవంబరు 20న మధ్యాహ్నం 3.30 గంటలకు గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ కార్యాలయం నుంచి కళా అకాడమీ వరకు ఈ కవాతును నిర్వహించనున్నారు. ఈ అపురూపమైన కవాతు వేళ గోవా వీధులన్నీ భారతీయ సినీ, సాంస్కృతిక వైభవానికి సజీవ చిత్రశాలలుగా మారనున్నాయి.
అస్తిత్వాన్ని, భావుకతను చాటేలా వర్ణశోభితమైన కళాత్మకతతో అద్భుతంగా ముస్తాబైన- ఆంధ్రప్రదేశ్, హర్యానా, గోవా రాష్ట్రాల శకటాలు ఈ కవాతుకు నేతృత్వం వహిస్తాయి. విశాఖపట్నం సువర్ణ తీరాల సౌందర్యాన్ని, అరకు లోయల మార్మికతను, టాలీవుడ్ ఉత్తేజాన్ని ఆంధ్రప్రదేశ్ నిలపనుంది. జానపదం, నాటకం, సంస్కృతి, సినీ వైభవాల వర్ణశోభిత సమ్మేళనాన్ని హర్యానా ప్రదర్శించనుంది. చాలా కాలంగా ఈ ఉత్సవానికి ఆతిథ్య వేదికగా ఉన్న గోవా.. ఈ ఊరేగింపులో ప్రధాన కేంద్రంగా నిలవనుంది. విశ్వజనీనమైన గోవా ఆత్మీయతను, అంతర్జాతీయ సినిమాతో దానికున్న చెరగని అనుబంధాన్ని చాటేలా కార్యక్రమాన్ని రూపొందించారు.
రాష్ట్రాల కవాతులతోపాటు దేశంలోని అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల అద్భుత సినీ శకటాలు కూడా పాల్గొంటాయి. అవి కథనౌన్నత్యాన్ని చాటే కదిలే ప్రపంచాన్ని తలపిస్తాయి. అఖండ 2 పౌరాణిక శక్తి, రామ్ చరణ్ పెద్ది భావోద్వేగ గాఢత, మైత్రి మూవీ మేకర్స్ సృజనాత్మక శక్తి, జీ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మక పరంపర, హోంబాలే ఫిల్మ్స్ అంతర్జాతీయ దృక్పథం, బిందుసాగర్ ఒడియా వారసత్వం, గురుదత్‌కు అల్ట్రా మీడియా శతాబ్ది నివాళి, వేవ్స్ ఓటీటీ ఉత్తేజకరమైన కథన వేదిక... అన్నీ ఒక్కచోట చేరి భారతీయ సినిమా అద్భుత వైవిధ్యాన్ని చాటబోతున్నాయి. అయిదు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా చిత్రనిర్మాతలను ప్రోత్సహిస్తూ, సినీ ఆవిష్కరణలను ముందుకు నడుపుతున్న ఎన్ఎఫ్‌డీసీ 50 ఏళ్ల శకటం చారిత్రక ప్రాధాన్యాన్ని చాటుతుంది.
కేంద్ర సమాచార సంస్థ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్) వారి ‘భారతం ఒకే స్వరం’ ప్రదర్శనతో ఉత్తేజకరంగా పరేడ్ మొదలవుతుంది. 16 రాష్ట్రాలకు చెందిన వంద మందికి పైగా కళాకారులు వీక్షకులను మంత్రముగ్ధులను చేసే జానపద సంగీత ప్రదర్శన ఇది. భాంగ్రా - గర్భా ఒకచోట కలుస్తాయి. ఘూమర్తో కలిసి లావనీ ప్రవహిస్తుంది. ఛౌ, నాటీల పక్కనే బిహూ జీవం పోసుకుంటుంది. దేశ సాంస్కృతిక ఏకత్వాన్ని చాటేలా మువ్వన్నెల ప్రదర్శనతో కార్యక్రమం ముగుస్తుంది.
దేశంలో అభిమాన యానిమేషన్ పాత్రలైన చోటా భీమ్, చుట్కీ, మోటు పట్లు, బిట్టు బహనేబాజ్ తెర నుంచి అడుగు బయటపెట్టి.. నవ్వుతూ, ఆత్మీయంగా, ఉత్సాహంగా ప్రేక్షకులకు స్వాగతం పలుకుతాయి. ఇది కార్యక్రమానికి మరింత శోభనివ్వడంతోపాటు ఆపాత మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి.
ఇఫీ 2025 ఓపెనింగ్ పరేడ్ ఓ ప్రారంభ వేడుక మాత్రమే కాదు.. ఈ సినీ వేడుకకు గొప్ప నాందిగా, సాంస్కృతిక ఆశగా నిలుస్తుంది. వేడుకను అద్భుతంగా ప్రారంభించేందుకు గోవా సిద్ధమవుతోంది... భారత్‌ను కథలకు నిలయంగా మాత్రమే కాకుండా- అద్భుత లయతో ముందుకు సాగుతున్న దేశంగా.. ఇఫీ భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.
అందుకే భారత పురోగమనాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది!
ఇఫీ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) దక్షిణాసియాలోనే అతి ఎక్కువ చరిత్ర కలిగిన, అతిపెద్ద సినీ వేడుక. జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీసీ), కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గోవా ఎంటర్టయిన్మెంట్ సొసైటీ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ఉత్సవం అంతర్జాతీయ సినిమా కేంద్రంగా నిలిచింది. ఇందులో ఆపాత మధురాలకు అద్భుత ప్రయోగాలను జోడిస్తారు. దిగ్గజాలైన నిపుణులు, కొత్తగా సినీ రంగంలో అడుగిడుతున్నవారు నిర్భయంగా వేదికను పంచుకుంటారు. అనేక కార్యక్రమాల ఉత్తేజకరమైన సమ్మేళనం ఇఫీకి ప్రత్యేక శోభనిస్తుంది. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్ క్లాసులు, ప్రముఖులకు నివాళి, భావాలు – ఒప్పందాల మధ్య సహకారం కుదిరే ఉత్తేజకరమైన వేవ్స్ ఫిల్మ్ బజార్.. ఇవన్నీ ఇఫీలో భాగంగా ఉంటాయి. నవంబర్ 20–28 మధ్య అద్భుతమైన గోవా తీరప్రాంతంలో నిర్వహించే 56వ ఎడిషన్.. భాషలు, శైలులు, ఆవిష్కరణలు, కొత్త గళాల అద్భుత సమాహారంగా నిలవనుంది. భారత సృజనాత్మక ఔన్నత్యాన్ని అంతర్జాతీయ వేదికపై వీక్షకులను కట్టిపడేసేలా చాటే అద్భుత వేడుక ఇది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2190381
ఇఫీ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
పీఐబీ ఇఫీ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
పీఐబీ ఇఫీవుడ్ ప్రసార చానల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
* * *
रिलीज़ आईडी:
2192098
| Visitor Counter:
28