ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి బాబా జన్మ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 19 NOV 2025 2:30PM by PIB Hyderabad

సాయి రామ్!

ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు..

ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, కేంద్రంలో నా సహచరులు శ్రీ రామ్మోహన్ నాయుడు, శ్రీ జీ షన్ రెడ్డి, శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ, శ్రీ సచిన్ టెండూల్కర్ , ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, రాష్ట్రమంత్రి శ్రీ నారా లోకేష్‌, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్‌ జే రత్నాకర్, వైస్ ఛాన్సలర్ శ్రీ కే చక్రవర్తి, శ్రీ ఐశ్వర్య, ఇతర ప్రముఖులు, సోదరీసోదరులు.. సాయి రామ్!

మిత్రులారా,

పవిత్రమైన పుట్టపర్తి నేలపై నేడు మీ అందరి మధ్య ఉండటం నాకు ఒక భావోద్వేగంతో కూడిన ఆధ్యాత్మిక అనుభూతి. కొద్దిసేపటి క్రితం బాబా సమాధి వద్ద నివాళులు అర్పించే అవకాశం నాకు లభించింది. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందడం ఎల్లప్పుడూ నా హృదయాన్ని భావోద్వేగంతో నింపే అనుభవం.

మిత్రులారా,

శ్రీ సత్యసాయి బాబా ఈ శత జన్మదినోత్సవ ఏడాది మన తరానికి ఒక వేడుక మాత్రమే కాదు, ఒక దైవికమైన వరం. భౌతిక రూపంలో ఆయన మనతో లేనప్పటికీ, ఆయన బోధనలు, ప్రేమ, సేవాస్ఫూర్తి ఇప్పటికీ లక్షలాది మందికి మార్గనిర్దేశం చేస్తున్నాయి. 140 కి పైగా దేశాల్లో లక్షలాది మంది జీవితాలు కొత్త వెలుగు, కొత్త దిశ , కొత్త సంకల్పంతో ముందుకు సాగుతున్నాయి.

మిత్రులారా,

శ్రీ సత్యసాయి బాబా జీవితం ‘‘వసుధైవ కుటుంబం’’ అనే భావనకి సజీవ స్వరూపం. అందుకే ఈ సంవత్సరం ఆయన జన్మ శతాబ్ది మనందరికీ ప్రేమ, శాంతి, సేవకు ప్రతీకగా ఓ మహోన్నత ఉత్సవంగా మారింది. ఈ సందర్భంగా 100 రూపాయల స్మారక నాణెం, తపాలా బిళ్ళను కూడా విడుదల చేయడం మా ప్రభుత్వ అదృష్టం. ఈ నాణెం, తపాలా బిళ్ళ ఆయన సేవా కార్యక్రమాలను ప్రతిబింబిస్తాయి. ఈ శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా భక్తులు, సేవకులు, అనుచరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

భారతీయ సంస్కృతికి కేంద్ర బిందువు సేవ. మన ఆధ్యాత్మిక, తాత్విక సంప్రదాయాలన్నీ ఎంత వైవిధ్యమైనవి అయినా.. చివరికి అన్నీ ఒక మహోన్నత ఆదర్శానికే దారితీస్తాయి. ఒకరు భక్తి, జ్ఞానం, కర్మ మార్గంలో నడిచినా, ప్రతి మార్గం సేవతోనే అనుసంధానమై ఉంటుంది. సమస్త జీవుల్లో దైవత్వానికి సేవ చేయని భక్తి ఏమిటి? ఇతరులపై కరుణను కలిగించని జ్ఞానం ఉండి ఏం ప్రయోజనం? సమాజ సేవగా పనిని అర్పించని కర్మకు అర్థమేమిటి? ‘సేవా పరమో ధర్మః’ అనే భావజాలమే శతాబ్దాలుగా దేశాన్ని ఎన్నో మార్పులు, సవాళ్లు దాటించి నిలబెట్టింది. ఇది మన నాగరికతకు  అంతర్గత బలాన్ని ఇచ్చింది. మన గొప్ప సాధువులు, సంస్కర్తలు శాశ్వత సందేశాన్ని తమ తమ కాలానికి తగిన విధంగా ముందుకు తీసుకువచ్చారు. శ్రీ సత్యసాయి బాబా సేవాతత్వాన్ని మానవుల హృదయాల వద్ద నిలిపారు. ఆయన తరచుగా ‘‘అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయు’’ అని చెప్పేవారు. ఆయన దృష్టిలో సేవ అంటే ప్రేమకు కార్యరూపం.  విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి వంటి ఎన్నో రంగాల్లో ఆయన స్థాపించిన సంస్థలన్నీ తత్వశాస్త్రానికి సజీవ నిదర్శనంగా నిలలిచాయి. ఆధ్యాత్మికత, సేవ వేరువేరు కాదని, ఒకే సత్యానికి వేర్వేరు రూపాలని ఇవి నిరూపిస్తాయి.

భౌతికంగా ఉన్నప్పుడు ప్రజలను ప్రేరేపించడం సాధారణ విషయం. కానీ బాబా మన మధ్య లేని సమయంలో కూడా ఆయన సంస్థలు చేస్తున్న సేవా కార్యకలాపాలు తగ్గకుండా, రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇది గొప్ప వ్యక్తుల ప్రభావం కాలంతో తగ్గదని, మరింత పెరుగుతుందని తెలుపుతుంది.

మిత్రులారా,

శ్రీ సత్య సాయి బాబా సందేశం పుస్తకాలు, ఉపన్యాసాలు, ఆశ్రమాలకే పరిమితం కాలేదు. ఆయన బోధనల ప్రభావం ప్రజల జీవితాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. నేడు నగరాల నుంచి అతి చిన్న గ్రామాల వరకు.. పాఠశాలల నుంచి గిరిజన గూడేల వరకు.. దేశమంతా విద్య, వైద్యం, సంస్కృతి ఒక అద్భుతమైన ప్రవాహంలా విస్తరిస్తున్నాయి. లక్షలాది బాబా భక్తులు ఈ సేవా కార్యక్రమాల్లో నిస్వార్థంగా నిమగ్నమై ఉన్నారు. “మానవ సేవే మాధవ సేవ” ఇదే బాబా అనుచరులకు గొప్ప ఆదర్శం. కరుణ, కర్తవ్యం, క్రమశిక్షణ, జీవిత తత్వాల సారాన్ని వ్యక్తపరచే ఎన్నో ఆలోచనలను ఆయన మనకు అందించారు. “ఎప్పుడూ సహాయం చేయి, ఎవరినీ బాధపెట్టకు, తక్కువ మాట్లాడు, ఎక్కువ పని చేయి.” అని బాబా చెప్పేవారు. ఈ జీవన సూత్రాలు ఇప్పటికీ మనలో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి.

మిత్రులారా,

సమాజం, ప్రజల సంక్షేమం కోసం సాయి బాబా ఆధ్యాత్మికతను వినియోగించారు. ఆయన దానిని నిస్వార్థ సేవ, వ్యక్తిత్వ వికాసం, విలువలతో కూడిన విద్యతో అనుసంధానించారు. ఆయన తన శక్తిని ఏ అభిప్రాయం లేదా సిద్ధాంతంపై ఆధారపరచలేదు. పేదలకు సాయం చేశారు, వారి బాధలను తీర్చడానికి కృషి చేశారు. గుజరాత్ భూకంపం తర్వాత బాబా సేవాదళం, సేవావృత్తి  బాధితులకు సహాయం చేయడంలో ముందు నిలబడ్డాయి. వారి సేవాభావం ఎన్నో రోజులు ఆగకుండా కొనసాగింది. ఇది నాకు చాలా గుర్తుంది. ప్రభావిత కుటుంబాలకు అవసరమైన వస్తువులు, సహాయక సేవలు, మానసిక సాంత్వన అందించడంలో వారు గొప్ప పాత్ర పోషించారు.

మిత్రులారా,

ఒక్కసారి కలిసిన వెంటనే ఎవరి హృదయం కరిగిపోతుందో, ఎవరి జీవిత దిశ మారుతుందో… అది ఆ వ్యక్తి గొప్పతనాన్ని చూపిస్తుంది. సత్య సాయిబాబా సందేశాల వల్ల లోతుగా ప్రభావితమైన వారు, మొత్తం జీవితం మారిపోయిన వారు నేడు మనలో చాలా మంది ఉన్నారు.

మిత్రులారా,

శ్రీ సత్య సాయిబాబా చైతన్యంతో సాయి సెంట్రల్ ట్రస్టు, దీనికి అనుబంధ సంస్థలు సేవా కార్యక్రమాలను వ్యవస్థీకృత, సంస్థాగత, దీర్ఘకాలిక విధానంలో ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు ఎంతో సంతృప్తిగా ఉంది. ఇవి మన ముందుకు ఒక ఆచరణాత్మక నమూనాగా నిలుస్తున్నాయి. నీరు, గృహాలు, ఆరోగ్యం, పోషకాహారం, విపత్తు సహాయం, స్వచ్ఛమైన శక్తి వంటి రంగాల్లో మీరు అందరూ అద్భుతమైన సేవలు అందిస్తున్నారు.

నేను కొన్ని సేవా పనులను ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నాను. ఉదాహరణకు రాయలసీమలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ట్రస్టు 3 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవుగా పైప్‌లైన్‌ను వేసింది. ఒడిశాలో వరదల వల్ల ప్రభావితమైన కుటుంబాల కోసం 1000 ఇళ్లను నిర్మించింది. శ్రీ సత్య సాయి ఆసుపత్రులను సందర్శించే పేద కుటుంబాలు అక్కడ బిల్లు కౌంటర్ లేకపోవడం చూసి ఆశ్చర్యపోతారు. చికిత్స పూర్తిగా ఉచితం అయినప్పటికీ, రోగులు, వారి కుటుంబాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించడం అక్కడి ప్రత్యేకత.

మిత్రులారా,

ఈ ఒక్క రోజే 20,000కి పైగా బాలికల పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరిచారు. దీంతో ఆ బాలికల విద్య, భవిష్యత్తు భద్రత మరింత ధృడపడుతుంది.

మిత్రులారా,

మన దేశంలోని బాలికల విద్య, భవిష్యత్తు కోసం సుమారు 10 సంవత్సరాల క్రితం మన ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించింది. దేశంలో అత్యధిక వడ్డీ రేటు (8.2 శాతం) అందించే పథకాల్లో ఇది ఒకటి. ఇప్పటి వరకు 4 కోట్లకుపైగా బాలికల పేర్లపై ఈ పథకం కింద ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాల్లో ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ. 3.25 లక్షల కోట్లుకుపైగా జమ అయ్యాయి. శ్రీ సత్య సాయి కుటుంబం ఇక్కడ 20 వేల సుకన్య సమృద్ధి ఖాతాలను తెరవడం నిజంగా ఎంతో గొప్ప విషయం. ఇప్పుడు నేను కాశీ నుంచి ఎంపీగా ఉన్నందున అక్కడి నుంచి ఒక ఉదాహరణ చెప్తాను. గత సంవత్సరం ఫిబ్రవరిలో మేం అక్కడ 27 వేల మంది బాలికల పేర్లపై సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిచాం. ప్రతి బాలిక ఖాతాలో రూ. 300 చొప్పున జమ చేయడం జరిగింది. ఈ పథకం బాలికల విద్య, వారి మెరుగైన భవిష్యత్తు కోసం ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది.

మిత్రులారా,

గత 11 ఏళ్లలో దేశంలో అనేక పథకాలు ప్రారంభించాం. ఇవన్నీ ప్రజల సామాజిక భద్రతను గణనీయంగా పెంచాయి. దేశంలోని పేదలు, వెనుకబడిన వారు నిరంతరం సామాజిక భద్రతా వ్యవస్థలోకి వస్తున్నారు. 2014లో దేశంలో కేవలం 25 కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత లభించింది. కానీ ఈ రోజు బాబా సన్నిధిలో కూర్చొని నేను సంతోషంగా చెబుతున్నాను. ఈ సంఖ్య దాదాపు 100 కోట్లకు చేరింది. భారత సంక్షేమ పథకాల గురించి, సామాజిక భద్రతా కార్యక్రమాల గురించి విదేశాల్లో, అన్ని అంతర్జాతీయ వేదికల్లో చర్చ జరుగుతోంది.

మిత్రులారా,

ఈ రోజు ఇక్కడ గోదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ట్రస్టు ద్వారా పేద రైతు కుటుంబాలకు 100 ఆవులను అందిస్తున్నారు. మన సంప్రదాయంలో గోవును జీవం, శ్రేయస్సు, కరుణకు ప్రతీకగా భావిస్తారు. ఈ ఆవులు ఆ కుటుంబాల ఆర్థిక, పోషక, సామాజిక స్థిరత్వానికి ఎంతో మేలు చేస్తాయి.

మిత్రులారా,

 గోమాత రక్షణ ద్వారా శ్రేయస్సు అనే సందేశం దేశం నలుమూలలా, విదేశాల్లో కూడా కనిపిస్తుంది. కొన్నేళ్ల క్రితం వారణాసిలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా 480కి పైగా గిర్ ఆవులను పంపిణీ చేశాం. పంపిణీ చేసిన ఆవుకు పుట్టిన మొదటి ఆడ దూడను తిరిగి తీసుకుని మరొక కుటుంబానికి ఇవ్వాలని అప్పుడు నేను ఒక నియమం పెట్టాను. ఈ రోజు వారణాసిలో గిర్ ఆవులు, వాటి దూడల సంఖ్య 1700కి చేరింది. అక్కడ మరో మంచి సంప్రదాయం కూడా మొదలైంది. పంపిణీ చేసిన ఆవుల నుంచి పుట్టే ఆడ దూడలను ఇతర ప్రాంతాల్లోని రైతులకు ఉచితంగా ఇస్తున్నారు. దీంతో ఈ ఆవుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. 7, 8 సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని రువాండా దేశంలో పర్యటించాను. అక్కడి ఒక గ్రామానికి మన దేశం నుంచి 200 గిర్ ఆవులను బహుమతిగా ఇవ్వడం నాకు గుర్తుంది. అక్కడ కూడా ఇలాంటి ఒక మంచి సంప్రదాయం ఉంది. దాన్ని ‘గిరింకా’ అంటారు. దీని అర్థం “నీకు ఒక ఆవు ఉండాలి ”. ఆ సంప్రదాయంలో ఆవుకు జన్మించి మొదటి ఆడ దూడను పొరుగువారికి దానం చేస్తారు. ఈ ఆచారం అక్కడ పోషణ, పాలు ఉత్పత్తి, ఆదాయం, సామాజిక ఐక్యతను పెంచింది.

మిత్రులారా,

బ్రెజిల్ కూడా భారతదేశంలోని గిర్, కాంక్రేజ్ జాతులను దత్తత తీసుకుంది. ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ నిర్వహణతో వాటిని పెంచింది. నేడు అవి మెరుగైన పాల పని తీరుకు ఆదర్శంగా మారాయి. సంప్రదాయం, దయ, శాస్త్రీయ ఆలోచన కలిసినప్పుడు ఆవు విశ్వాసానికి ప్రతీకగా మాత్రమే కాకుండా సాధికారత, పోషక భద్రత, ఆర్థిక పురోగతికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఈ ఉదాహరణలు చెబుతున్నాయి. ఈ మంచి సంకల్పంతో మీరు ఇక్కడ ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది.

మిత్రులారా,

నేడు దేశం ఒక బాధ్యతతో అభివృద్ధి చెందిన భారత్‌ వైపు వేగంగా సాగుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి పౌరుల భాగస్వామ్యం చాలా ముఖ్యం. సత్య సాయిబాబా జన్మ శతాబ్ది సంవత్సరం మనందరికీ గొప్ప స్పూర్తి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ‘లోకల్‌కు వోకల్’ అనే మంత్రాన్ని మరింత బలోపేతం చేయడానికి సంకల్పించుకోవాలని నేను కోరుతున్నాను. అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించాలంటే మన స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలి. మనం స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేస్తే ఒక కుటుంబాన్ని, ఒక చిన్న వ్యాపారాన్ని, స్థానిక సరఫరా వ్యవస్థను నేరుగా బలోపేతం చేస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇదే స్వావలంబన భారత్‌కు మార్గం సుగుమం చేస్తుంది.

మిత్రులారా,

శ్రీ సత్య సాయిబాబా స్పూర్తితో మీరందరూ దేశ అభివృద్ధికి సేవ చేస్తూ ఉన్నారు. ఈ పవిత్ర భూమిలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. ప్రతి సందర్శకుడి మాటల్లో కరుణ, ఆలోచనల్లో శాంతి, చర్యల్లో సేవాస్ఫూర్తి కనిపిస్తుంది. ఎక్కడ వంచన, బాధ ఉన్నాయో అక్కడ కూడా మీరు ఇలాగే ఆశాకిరణాలా నిలుస్తారనే నమ్మకం నాకు ఉంది. ఈ స్పూర్తితో ప్రేమ, శాంతి, సేవ అనే ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తున్న సత్య సాయి కుటుంబానికి, సంస్థలకు, సేవా బృందాలకు, దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు. సాయి రామ్!

 

***


(Release ID: 2191919) Visitor Counter : 17