రాబోయే తొమ్మిది రోజులు పాటు 'ఐఎఫ్‌ఎఫ్‌ఐ' మయం కానున్న గోవా
చారిత్రాత్మక భారీ పరేడ్‌తో ప్రారంభంకానున్న ఐఎఫ్ఎఫ్ఐ- 2025.
రేపటి యువ సృజనాత్మకతను ప్రోత్సహించటం నుంచి మొదలుకొని ఏఐ ఆధారిత ఆవిష్కరలు, ఇఫిఎస్టా వరకు చలనచిత్ర, కళా ప్రేమికులకు సరైన గమ్యస్థానం కానున్న ఐఎఫ్ఎఫ్‌ఐ-2025
అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) 56వ విడత సంరంభానికి ఒక్క రోజు ముందే గోవా వ్యాప్తంగా అత్యంత ఉత్సాహభరిత సినిమా వాతావరణం కనిపిస్తోంది. నవంబర్ 20 నుంచి 28 వరకు రాష్టంలో ఐఎఫ్ఎఫ్ఐ-2025 జరగనుంది. గత సంవత్సరాల్లో నెలకొల్పిన ప్రత్యేకతతో పాటు సమ్మిళితత్వాల ప్రమాణాలను అధిగమించాలనే లక్ష్యంతో ఐఎఫ్ఎఫ్ఐ-2025ను ఒక చిరస్మరణీయమైన సినిమా వేడుకగా అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దారు. నేటి ఆధునిక ప్రపంచంలో ఉన్న అత్యద్భుతమైన వినోదపరమైన అనుభవాలను ఈ సంవత్సరం కార్యక్రమం అందిస్తుంది. భారతీయ, ప్రపంచ సినిమాను నిర్వచించే సమకాలీన నైపుణ్యం, సాంస్కృతిక వైభవం, కథన స్ఫూర్తి అన్నీ కలగలిపిన ఈ కార్యక్రమాలు కళాత్మకతకు అద్దం పట్టనున్నాయి.

వీక్షకులను మంత్రముగ్ధులను చేసే పరేడ్‌తో రేపు ఐఎఫ్ఎఫ్ఐ ప్రారంభంకానుంది. భారత సినిమా ఆత్మను ప్రతిబింబించే ఒక జీవన కళాచిత్రంగా గోవా వీధులను ఈ పరేడ్ మారుస్తుంది. ఆంధ్రప్రదేశ్, హర్యానా, గోవా రాష్ట్రాలకు చెందిన భారీ శకటాలు పరేడ్‌కు ముందు నడుస్తాయి. వీటి వెనుక దేశంలోని ప్రసిద్ధ స్టూడియోల నుంచి వచ్చిన ఉత్తేజపరిచే కళాఖండాలు, ఎన్‌ఎఫ్‌డీసీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇతివృత్తంతో కూడిన కళాఖండం ఉంటాయి. ‘భారత్ ఏక్ సూర్" అనే ప్రదర్శనలో దేశ నలుమూలల నుంచి వచ్చిన వందలాది జానపద కళాకారులు ఒకే లయలో నృత్య ప్రదర్శన చేయనున్నాను. వీటితో పాటు ఛోటా భీమ్, చుట్కీ, మోటు పట్లు, బిట్టు బహనేబాజ్ వంటి పాత్రలు పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ప్రేక్షకులకు ఆకర్షణగా నిలవనున్నాయి. రంగులు, సృజనాత్మకతకు సంబంధించిన చలన కావ్యంగా ఐఎఫ్ఎఫ్ఐ రేపు ప్రారంభం కానుంది.
గోవా వీధుల్లో కొనసాగే ఈ పరేడ్ ఒక ఉత్సవం ప్రారంభాన్ని మాత్రమే కాకుండా ఒక కళాత్మక చైతన్యానికి సంబంధించిన క్షణాన్ని సూచిస్తుంది. ప్రతి శకటం సంబంధింత ప్రాంత నాడిని తెలియజేస్తుంది. ప్రతి ప్రదర్శన ప్రజల గుండె చప్పుడును వినిపిస్తుంది. సృజనాత్మకతకు సంబంధించిన ప్రతి ఫ్రేమ్ కథను చెప్పడంలో భారతదేశానికి ఉన్న కళను తెలియజేస్తుంది. సముద్రపు గాలి లాంటి సంగీతం, ఇంధ్ర దనస్సు లాంటి రంగులతో నిండి ఉండే ఈ పరేడ్.. గతంలో కంటే మరింత ప్రకాశవంతంగా భారత సృజనాత్మకత ప్రదర్శించే ఐఎఫ్ఎఫ్ఐకి సూచికగా నిలుస్తుంది.
ఈ చలన చిత్రోత్సవంతో అంతర్జాతీయ పోటీ, తొలిసారి దర్శకత్వం వహించే వారి మొదటి చిత్రం, ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ మెడల్… భయం కలిగించే చిత్రాలు (మాకాబ్రే డ్రీమ్స్), డాక్యుమెంటరీ కూర్పు (డాక్యూ-మాంటేజ్), ప్రయోగాత్మక చలనచిత్రాలు, యూనిసెఫ్, పునరుద్ధరించబడిన క్లాసిక్ చిత్రాలు వంటి ప్రత్యేక విభాగాలతో సహా మొత్తం 15 పోటీ, క్యూరేటెడ్ విభాగాలు ఉన్నాయి.
* రేపటి సృజనాత్మక వ్యక్తులు (సీఎంఓటీ-క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ): గోవాలో జరిగే ‘56వ ఐఎఫ్ఎఫ్‌ఐ’లో భాగంగా నిర్వహించిన రేపటి సృజనాత్మక వ్యక్తుల పోటీలో 799 ప్రవేశాలు వచ్చాయి. ఇందులో నుంచి మొత్తం 124 మంది యువ సృజనకర్తలు ఎంపికయ్యారు. ఇందులో 13 ఫిల్మ్‌మేకింగ్ విభాగాలకు చెందినవారు ఉన్నారు. వేవ్స్- 2025లోని సీఐసీ ఛాలెంజ్ ద్వారా ఎంపికైన 24 వైల్డ్ కార్డ్ విజేతలు కూడా ఇందులో ఉన్నారు.
* వేవ్స్ ఫిల్మ్ బజార్ (19వ విడత): భారతదేశంలోని ఈ ప్రముఖ చలన చిత్ర మార్కెట్ ఈ క్రింది అంశాలతో తిరిగి వచ్చింది:
§ స్క్రీన్ రైటర్స్ ల్యాబ్, మార్కెట్ ప్రదర్శనలు, వ్యూయింగ్ రూమ్, సహ-నిర్మాణ మార్కెట్‌లలో కలిపి 300 కంటే ఎక్కువ చలన చిత్ర ప్రాజెక్టులు.
§ సహ-నిర్మాణ మార్కెట్‌లో 22 పూర్తి నిడివి చిత్రాలు, 5 డాక్యుమెంటరీలు.
§ మొత్తం 20,000 డాలర్ల నగదు గ్రాంట్లు.
§ వేవ్స్ ఫిల్మ్ బజార్ రికమెండ్స్ (డబ్ల్యూఎఫ్‌బీఆర్): పలు ఫార్మాట్‌లలో 22 ఎంపిక చేసిన చలనచిత్రాలు.
§ 7 కంటే ఎక్కువ దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు, ప్రభుత్వ ప్రోత్సహకాలు పొందిన 10 కంటే ఎక్కువ రాష్ట్రాలకు చెందిన చలనచిత్రాలు.
§ అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్, సీజీఐ, యానిమేషన్, డిజిటల్ ప్రొడక్షన్ సాంకేతికలను ప్రదర్శించే ఒక ప్రత్యేక సాంకేతికత పెవిలియన్.
* సినిమాఐ హ్యాకథాన్: ఎల్‌టీఐమైండ్‌ట్రీ, వేవ్స్ ఫిల్మ్ బజార్ సహకారంతో సినిమాఐ హ్యాకథాన్‌ను ఐఎఫ్ఎఫ్ఐ-2025 లో ఒక కొత్త కార్యక్రమంగా నిర్వహించనున్నారు. ఇది చలనచిత్ర నిర్మాణంలో ఏఐ-ఆధారిత ఆవిష్కరణలపై దృష్టి సారిస్తుంది. దీని ద్వారా సినిమాటిక్ సాంకేతికతను అభివృద్ధి చేయడం, ధ్రువీకరణ ప్రక్రియలను సులభతరం చేయడం, పైరసీ వ్యతిరేక ఫ్రేమ్‌వర్క్‌లను బలోపేతం చేయడంలో ఐఎఫ్ఎఫ్ఐ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.
* ఇఫ్ఫిస్టా - సాంస్కృతిక ప్రదర్శన: ఇఫ్ఫిస్టా అనేది సంగీతం, ప్రదర్శన, సృజనాత్మక కళలకు సంబంధించిన నాలుగు రోజుల వేడుక. ఇది నవంబర్ 21 నుంచి 24 వరకు సాయంత్రం 6–8 గంటల మధ్య శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో జరగనుంది. ప్రత్యక్ష సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా కళాకారులు, ప్రేక్షకులను ఒకచోట చేర్చే ఈ కార్యక్రమం.. భారత్‌లోని ఉత్తేజకరమైన సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా తెలియజేయనుంది.
గురుదత్, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్, పీ. భానుమతి, భూపేన్ హజారికా, సలీల్ చౌదరి వంటి దిగ్గజ చలనచిత్ర రూపకర్తలు, కళాకారుల శత జయంతి సందర్భంగా వారికి ఐఎఫ్ఎఫ్ఐ నివాళులు అర్పించనుంది. సలీల్ చౌదరి దర్శకత్వం వహించిన 'ముసాఫిర్' ,రిత్విక్ ఘటక్ దర్శకత్వం వహించిన 'సుబర్ణరేఖ' చలనచిత్రాలను ఐఎఫ్ఎప్ఐ-2025లో ప్రదర్శించనున్నారు. సినిమాలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దిగ్గజ నటుడు రజనీకాంత్‌కు ఈ కార్యక్రమ ముగింపు వేడుకలో సన్మానం చేయనున్నారు.

అన్ని కార్యక్రమాలు ప్రణాళికల ప్రకారం జరిగేలా, అన్ని వేళలా విభాగాలన్ని సమన్వయంతో పనిచేసేలా చూసుకునేందుకు మంత్రిత్వ శాఖలో ఇతర అధికారులతో కలిసి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజన్ జాబు ఈ రోజు గోవాలో కార్యక్రమ వేదికను సందర్శించారు. ఈ సందర్భంగా తుది సమీక్షా సమావేశం నిర్వహించారు.
"రాబోయే తొమ్మిది రోజులు గోవా మళ్లీ 'ఐఎఫ్‌ఎఫ్‌ఐ' మయం కావడానికి సిద్ధంగా ఉంది" అని ఈ సందర్భంగా చెప్పడం సమంజసం.
ఏఎఫ్ఎప్ఐ గురించి:
1952లో ప్రారంభమైన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) దక్షిణాసియాలో అత్యంత ఎక్కువ చరిత్ర కలిగిన అతిపెద్ద సినిమా వేడుకగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వంలోని సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ (నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్- ఎన్ఎఫ్‌డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్‌జీ) సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. పునరుద్ధరించబడిన క్లాసిక్ సినిమాలు సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు ఒక వేదికపై నిలుస్తాయి. ప్రసిద్ధ దర్శక నిర్మాతలు, నిర్భయులైన తొలి దర్శకులతో వేదికను పంచుకుంటారు. ఇలా ఒక ప్రపంచ సినిమా కేంద్రంగా ఈ ఉత్సవం ఎదిగింది. ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు వేగాన్ని పొందే ఉత్తేజభరిత వేవ్స్ ఫిల్మ్ బజార్, మాస్టర్‌క్లాసులు, సమర్పణ చిత్రాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, అంతర్జాతీయ పోటీలు లాంటి సమ్మేళనంతో ఐఎఫ్ఎప్ఐ ప్రత్యేకంగా మారుతోంది. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలోని అద్భుతమైన తీరప్రాంతంలో నిర్వహించే ఐఎఫ్ఎప్ఐ.. భాషలు, విభాగాలు, ఆవిష్కరణలు, శ్రవణాల అద్భుతమైన కలయికను వీక్షకులకు అందించనుంది. ఇది ప్రపంచ వేదికపై భారతదేశ సృజనాత్మక ప్రతిభను తెలియజేసే ఒక ప్రత్యేక వేదికగా ఉంది.
మరింత సమాచారం కోసం, ఈ క్రింది లింక్‌లను సందర్శించండి:
* ఐఎఫ్ఎప్ఐ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
* పీఐబీకి సంబంధించి ఐఎఫ్ఎఫ్ఐ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
* పీఐబీ ఐఎఫ్ఎఫ్ఐవుడ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
* X హ్యాండిల్స్: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
Release ID:
2191918
| Visitor Counter:
3