రానున్న 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ నేపథ్యంలో...
మీడియా కోసం ఫిల్మ్ ఎప్రిసియేషన్ పై కోర్సును నిర్వహించిన పీఐబీ మహారాష్ట్ర, గోవా
త్వరలో జరగనున్న 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ముందస్తుగా భారత చలనచిత్ర, టెలివిజన్ సంస్థ (ఎఫ్టీఐఐ) సహకారంతో పీఐబీ మహారాష్ట్ర, గోవాలు.. మీడియా కోసం ఫిల్మ్ ఎప్రిసియేషన్ పై కోర్సును నిర్వహించాయి. గోవాలో జరిగిన ఈ కార్యక్రమానికి గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. చలన చిత్రోత్సవం ప్రారంభానికి ముందు నిర్వహించిన ఈ కార్యక్రమం పాత్రికేయులకు సినిమాకి సంబంధించిన అవగాహనను కల్పించింది. వారు మరింత సమాచారంతో, విశ్లేషణతో కూడిన వివరాలతో చలన చిత్రోత్సవ కవరేజీని అందించేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుంది.

ఈ కోర్సును ఎఫ్‌టీటీఐ స్క్రీన్ స్టడీస్ - రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ ఇంద్రనీల్ భట్టాచార్య, ఫిల్మ్ డైరెక్షన్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీ వైభవ్ అభినవ్ అందించారు. ఉపన్యాసాలు, చలన చిత్ర ప్రదర్శనలు, చర్చలు, విశ్లేషణాత్మక అభ్యాసాల ద్వారా చలనచిత్ర ఫార్మట్, సినిమాటిక్ చరిత్ర, అంతర్జాతీయ సినిమా నిర్మాణ సంప్రదాయాలపై మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించారు.

ఈ సెషన్‌కు పీఐబీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి స్మితా వత్స్ శర్మ, సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్ కుమార్, ఎన్ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దూమ్ హాజరయ్యారు. చలనచిత్ర రూపకర్తలు, ప్రేక్షకుల మధ్య అంతరాన్ని తగ్గించడంలో వివేచనతో, వాస్తవ సమాచారాన్ని అందించే మీడియా పాత్రను వారు ప్రధానంగా తెలియజేశారు. చలన చిత్రాలకు సంబంధించిన కళపై లోతైన అవగాహన ఉండటం వల్ల మరింత గొప్ప, అర్థవంతమైన కథనాలను పాత్రికేయులు ఇవ్వగలరని వారు పేర్కొన్నారు.

ముగింపు సందర్భంగా శ్రీ ప్రభాత్ కుమార్, శ్రీ ప్రకాష్ మగ్దూమ్, శ్రీమతి స్మితా వత్స్ శర్మ మీడియా ప్రతినిధులకు ధ్రువపత్రాలను అందజేశారు. విమర్శనాత్మక దృక్కోణం బలోపేతం కావటంతో పాటు సినిమాపై పెరిగిన అవగాహనతో ఈ ప్రతినిధులు ఇప్పుడు 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోని విభిన్న సినిమాటిక్ అంశాలను మరింత మెరుగ్గా ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.

****
रिलीज़ आईडी:
2191871
| Visitor Counter:
26