ప్రధాన మంత్రి కార్యాలయం
నవంబరు 19న ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన
దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయం అంశంపై కోయంబత్తూరులో శిఖరాగ్ర సదస్సును ప్రారంభించనున్న ప్రధానమంత్రి
తొమ్మిది కోట్ల మంది రైతులకు రూ.18,000 కోట్ల విలువైన 21వ పీఎం-కిసాన్ వాయిదాను విడుదల చేయనున్న ప్రధానమంత్రి
పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రధానమంత్రి
భగవాన్ శ్రీ సత్య సాయిబాబా జీవనం, ప్రబోధాలు, చిరకాల వారసత్వానికి గుర్తుగా స్టాంపుతో పాటు ఒక స్మారక నాణేన్ని ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
18 NOV 2025 11:38AM by PIB Hyderabad
నవంబరు 19న ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.
ఉదయం 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా మహాసమాధి వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పిస్తారు. ఆనంతరం 10:30 గంటలకు, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జీవనం, ప్రబోధాలు, చిరకాల వారసత్వానికి గుర్తింపుగా స్టాంపులనూ, ఒక నాణేన్ని విడుదల చేస్తారు. జనసమూహాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
ఆ తరువాత, ప్రధానమంత్రి తమిళనాడులోని కోయంబత్తూరుకు పయనమవుతారు. అక్కడ మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర గంటలకు దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన సదస్సును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా, దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు సహాయాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘పీఎం-కిసాన్’ 21వ వాయిదా కింద రూ.18,000 కోట్లకు పైగా నిధుల్ని కూడా ప్రధానమంత్రి విడుదల చేస్తారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సును తమిళనాడు నేచురల్ ఫార్మింగ్ స్టేక్‌హోల్డర్స్ ఫోరమ్ 2025 నవంబరు 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తుంది. పర్యవరణానుకూల సాగు పద్ధతుల్నీ, ప్రధానంగా రసాయనిక ఎరువులకు చోటులేని వ్యవసాయ పద్ధతుల్నీ దీర్ఘకాల ప్రాతిపదికన ప్రోత్సహించడం ఈ సదస్సు ధ్యేయం. అలాగే, భారతదేశ వ్యవసాయ రంగానికి ఉజ్వల భవిష్యత్తును అందించడానికి ఆచరణీయ, రుతువుల ప్రభావాన్ని తట్టుకొనే, లాభసాటిగా ఉండే ప్రకృతి అనుకూల, పునరుత్పాదన ప్రధాన వ్యవసాయం దిశగా ముందుకు సాగడాన్ని వేగవంతం చేయాలనేది కూడా ఈ సదస్సు లక్ష్యం.
సేంద్రియ ఉత్పాదకాలు, అగ్రో-ప్రాసెసింగ్, పర్యావరణానుకూల ప్యాకేజి విధానాలు, దేశవాళీ సాంకేతికతలతో కూడిన నవకల్పనలను ప్రదర్శించడంపైనా, గ్రామీణ ఔత్సాహిక పారిశ్రామికులకూ, ఫార్మర్-ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లకు మార్కెట్ లభ్యతపైనా ఈ శిఖరాగ్ర సదస్సు ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఈ శిఖరాగ్ర సదస్సులో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్లకు చెందిన రైతులు, ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్న వారు, శాస్త్రవేత్తలు, సేంద్రియ ఉత్పాదకాలను సరఫరా చేసే సంస్థల ప్రతినిధులు, అమ్మకందారులతో పాటు 50,000 మందికి పైగా ఆసక్తిదారులు పాలుపంచుకుంటారు.
***
(रिलीज़ आईडी: 2191210)
आगंतुक पटल : 131
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam