ఐఎఫ్ఎఫ్ఐ-2025 ఫెస్టివల్ ప్రపంచ స్థాయిని, సాంస్కృతిక ప్రభావాన్ని స్పష్టం చేసిన గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్
అయిదు రోజుల్లో ప్రారంభం కానున్న 56వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం గురించి ఈరోజు పనాజీలో గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్... కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్‌లు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ మీడియాతో మాట్లాడుతూ... ఈ ఉత్సవంలో భాగంగా ఐనాక్స్ పనాజీ, ఐనాక్స్ పోర్వోరిమ్, మాక్వినెజ్ ప్యాలెస్ పనాజీ, రవీంద్ర భవన్ మడ్గావ్, మ్యాజిక్ మూవీస్ పోండా, అశోకా, సామ్రాట్ స్క్రీన్స్ పనాజీలలో సినిమాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. “ఈ సంవత్సరం ఫెస్టివల్ ప్రారంభోత్సవ సందర్భంగా గ్రాండ్ పరేడ్ నిర్వహిస్తున్నాం. నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 03.30 గంటలకు గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ కార్యాలయం నుంచి కళా అకాడమీ వరకు కవాతు జరుగుతుంది. ప్రతినిధుల సౌలభ్యం కోసం అన్ని వేదికలకు ఉచిత రవాణానూ ఏర్పాటు చేశాం. మిరామార్ బీచ్, రవీంద్ర భవన్ మడ్గావ్‌లోని ఓపెన్ స్పేస్, వాగేటర్ బీచ్‌లలో ఓపెన్ ఎయిర్ సినిమా ప్రదర్శనలు ఉంటాయి” అని ఆయన తెలిపారు.
2025 నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న 56వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం... పెరుగుతున్న ఫెస్టివల్ ప్రపంచ స్థాయిని, పరివర్తనాత్మక కార్యక్రమాలను, భారతీయ సినిమాను ప్రోత్సహించడంలో... అంతర్జాతీయ సాంస్కృతిక వినిమయాన్ని పెంపొందించడంలో దాని కీలక పాత్రను వివరించేలా ముందెన్నడూ లేని ప్రదర్శనలు ఉంటాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ అన్నారు. ఈ ఫెస్టివల్‌కు ముందు ఈ రోజు పనాజీలో జరిగిన విలేకరుల సమావేశంలో గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
127 దేశాల నుంచి వచ్చిన అపూర్వమైన 3,400 చిత్రాల సమర్పణలతో ఐఎఫ్ఎఫ్ఐ-2025 ఆసియాలోని ప్రధాన చలనచిత్రోత్సవాల్లో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని డాక్టర్ మురుగన్ అన్నారు. "84 దేశాల నుంచి సుమారు 270 చిత్రాలను ప్రదర్శించనున్నారు. వీటిలో 26 ప్రపంచ ప్రీమియర్లు, 48 ఆసియా ప్రీమియర్లు, భారత్ నుంచి 99 ప్రీమియర్లు ఉన్నాయి. ఈ పెరుగుతున్న భాగస్వామ్యం ఫెస్టివల్ ప్రతిష్ఠను మాత్రమే కాకుండా ప్రపంచ సినీ రంగంలో మెరుగవుతున్న భారత్ స్థానాన్నీ ప్రతిబింబిస్తుంది" అని ఆయన తెలిపారు.
ఈ సంవత్సరం స్పెయిన్, ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేక ప్యాకేజీలతో పాటు ఐఎఫ్ఎఫ్ఐ కంట్రీ ఫోకస్‌గా జపాన్ నిలిచింది. గురు దత్, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్, పి. భానుమతి, భూపేన్ హజారికా, సలీల్ చౌదరి వంటి భారతీయ సినీ దిగ్గజాలకు శత జయంతి నివాళులను అర్పించే వేదికగా ఈ ఫెస్టివల్ నిలుస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. సినీ రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నటుడు రజనీకాంత్‌ను ఫెస్టివల్ ముగింపు వేడుకలో ఘనంగా సత్కరిస్తున్నట్లు డాక్టర్ మురుగన్ ప్రకటించారు. ఆయన నటించిన లాలా సలామ్ చిత్రాన్నీ ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు. గోవాకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీ కే. వైకుంఠ్ను ఫెస్టివల్‌లో సత్కరించనున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
రేపటి తరం సృజనకర్తల కార్యక్రమాన్ని గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ సంవత్సరం అత్యంత 799 ఎంట్రీల నుంచి 124 మంది యువ సృజనకర్తలను ఎంపిక చేసినట్లు చెప్పారు. వేవ్స్ ఫిల్మ్ బజార్ 19వ ఎడిషన్ దేశవిదేశాలకు చెందిన వందలాది ప్రాజెక్టులకు సహ-నిర్మాణ, మార్కెట్ అవకాశాలను అందుబాటులోకి తెస్తుందనీ... ఏఐ, వీఎఫ్ఎక్స్, సీజీఐ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అన్వేషించే ప్రత్యేక టెక్ పెవిలియన్‌నూ అందిస్తుందని డాక్టర్ మురుగన్ అన్నారు.
భారత అభివృద్ధి ప్రయాణానికి కేంద్రంగా ఉన్న... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత నారీ శక్తి గురించి మాట్లాడుతూ, ఐఎఫ్ఎఫ్ఐ-2025లో మహిళా దర్శకుల చిత్రాలు 50కి పైగా ప్రదర్శిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. "ఈ ఫెస్టివల్‌లో ఆస్కార్ ఎంట్రీలు పొందిన 21 చిత్రాలు, అరంగేట్ర చిత్రరూపకర్తలు రూపొందించిన 50కి పైగా చిత్రాలు ప్రదర్శించనున్నాం. ప్రపంచంలోని అగ్రశ్రేణి చలనచిత్రోత్సవాల నుంచి అవార్డులు గెలుచుకున్న అగ్ర చిత్రాలనూ 56వ ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శిస్తున్నాం" అన్నారు.
సినిమాల్లో సృజనాత్మకతను, ఆవిష్కరణలను పెంపొందించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ... “సినిమాఏఐ హ్యాకథాన్, థియేటర్లలో యాక్సెసిబిలిటీ ఫీచర్లు వంటి కార్యక్రమాలు సినిమాను మరింత సమ్మిళితంగా, సాంకేతికత ఆధారితంగా, ప్రపంచ సహకారంతో రూపొందించాలనే మా దార్శనికతను ప్రతిబింబిస్తాయి” అని కేంద్ర మంత్రి తెలిపారు.
ఈ సంవత్సరం పాత జీఎంసీ భవనం ఎదురు రహదారి మీదుగా ఉత్సాహంగా సాగే కవాతుతో ఐఎఫ్ఎఫ్ఐ ప్రారంభమవుతుంది. ఇక్కడ నిర్మాణ సంస్థలు, వివిధ రాష్ట్రాలు-సాంస్కృతిక బృందాల శకటాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయం, నైతికతను ప్రదర్శిస్తాయి. కవాతులో 34 శకటాలు ఉండగా వాటిలో 12 గోవా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
***
Release ID:
2190626
| Visitor Counter:
8