సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫిల్మ్ సర్టిఫికేషన్‌ క్రమబద్ధీకరణ దిశగా ‘ఈ-సినీప్రమాణ్‌’ పోర్టల్‌లో బహుభాషా మాడ్యూల్‌ను ఏర్పాటు చేసిన ‘సీబీఎఫ్‌సీ’

Posted On: 14 NOV 2025 4:51PM by PIB Hyderabad

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ‘ఈ-సినీప్రమాణ్‌’ పోర్టల్‌లో బహుభాషా మాడ్యూల్‌ను ఏర్పాటు చేసింది. దీన్ని పూర్తిగా అమలు చేయడంతోపాటు ప్రజా వినియోగానికి అందుబాటులో ఉంచింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ కోసం చలనచిత్ర ధ్రువీకరణ ప్రక్రియ డిజిటలీకరణ, సరళీకరణ దిశగా ‘సీబీఎఫ్‌సీ’ చేపట్టిన దార్శనిక చర్యల్లో ఇదొక భాగం.

ప్రస్తుతం అమలులోగల ప్రక్రియకు అదనంగా ఈ ఐచ్ఛిక సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ‘సీబీఎఫ్‌సీ’ చైర్మన్ శ్రీ ప్రసూన్ జోషి తెలిపారు. వివిధ భారతీయ భాషలలో విడుదలకు ఉద్దేశించిన చిత్రాలకు ధ్రువీకరణ ప్రక్రియ క్రమబద్ధీకరణ, సరళీకరణ లక్ష్యంగా దీన్ని రూపొందించామని ఆయన చెప్పారు. ఈ సౌలభ్యంతో దరఖాస్తుదారులు ఇకపై ఏకీకృత దరఖాస్తుద్వారా వివిధ భాషలలో చిత్రాలను పరిశీలనార్థం సమర్పించే వీలుంటుంది. తద్వారా ప్రక్రియ పునరావృతమయ్యే పరిస్థితి ఉండదు.

ఈ మాడ్యూల్ కింద బహుళ భాషల్లో చిత్రాల విడుదల కోసం ధ్రువీకరణ పొందిన ప్రతి చిత్రానికీ బహుభాషా సర్టిఫికేట్ లభిస్తుంది. తదనుగుణంగా ఆమోదిత భాషల జాబితాను ఈ చిత్రం స్పష్టంగా తెలియజేస్తుంది. దేశవ్యాప్తంగా సినిమాల విడుదల ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో విభిన్న భాషల ప్రేక్షక అవసరాలను తీర్చడంలో చిత్ర నిర్మాతలకు అనువైన యంత్రాంగం సమకూర్చడం లక్ష్యంగా ఈ వినూత్న ప్రక్రియకు ‘సీబీఎఫ్‌సీ’ శ్రీకారం చుట్టింది.

బహుభాషా ధ్రువీకరణ ప్రక్రియ ముఖ్యాంశాలు:

ఒకే దరఖాస్తు: దరఖాస్తుదారులు ఈ-సినీప్రమాణ్‌ పోర్టల్ ద్వారా అన్ని భాషా వెర్షన్‌లను ఒకేసారి అప్‌లోడ్ చేయడం ద్వారా పరిశీలనార్థం సమర్పించవచ్చు.

ఏకీకృత ధ్రువీకరణ పత్రం: బహుభాషా అనుమతి మంజూరుతోపాటు ధ్రువీకృత భాషలన్నిటి జాబితాతో ఏకైక ధ్రువీకరణ పత్రం జారీ అవుతుంది.

ప్రక్రియ క్రమబద్ధీకరణ: దరఖాస్తు పరిశీలన మొత్తం ఒకే ప్రాంతీయ కార్యాలయం పరిధిలో పూర్తవుతుంది.. తద్వారా పరిశీలన సామర్థ్యం, ఏకరూపతకు భరోసా ఉంటుంది.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ అవసరాలు నానాటికీ విస్తృతమవుతున్న నేపథ్యంలో అందుకు తగినట్లు చలనచిత్ర ధ్రువీకరణ ప్రక్రియలో పారదర్శకత, సామర్థ్యం, అందుబాటు సౌలభ్యం పెంచడంపై ‘సీబీఎఫ్‌సీ' నిబద్ధతకు ఈ కొత్త విధానమే నిదర్శనం.

 

***


(Release ID: 2190448) Visitor Counter : 5