సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న ఇండియాజాయ్ బీ2బీ-2025


వేవ్స్ బజార్, ఆహా, ప్రొడ్యూసర్ బజార్‌ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఇండియాజాయ్


ఏవీజీసీ-ఎక్స్ఆర్, సినీ పరిశ్రమల ప్రధాన కేంద్రంగా

హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేసిన ఇండియాజాయ్ బీ2బీ-2025

నాడు పోస్టు చేయడమైనది: 11 NOV 2025 4:50PM by PIB Hyderabad

వేవ్స్ బజార్, ప్రొడ్యూసర్ బజార్, ఆహాల సహకారంతో భారతీయ సినీ మార్కెట్, వేవ్స్ యానిమేషన్ బజార్‌లను భాగం చేస్తూ ఇండియాజాయ్ బీ2బీ-2025 కార్యక్రమాన్ని ఇండియాజాయ్ ఈవెంట్‌లో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ), సినీ పరిశ్రమల ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది.

ఈ సంవత్సరం ఎడిషన్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 120 మంది విక్రేతలు, 35 మంది కొనుగోలుదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సహ-నిర్మాణాలు, కంటెంట్ లైసెన్సింగ్, వ్యూహాత్మక సహకారాలకు బలమైన వేదికను అందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వేవ్స్ యానిమేషన్ బజార్, భారతీయ సినీ మార్కెట్లతో అనుబంధంగా ఉన్న మేధో హక్కులకు (ఐపీ) ఊతమివ్వడానికి స్ప్రౌట్స్ స్టూడియో... ప్రొడ్యూసర్ బజార్ ద్వారా రూ. 6 కోట్ల నిధిని ప్రకటించింది.

వేవ్స్ యానిమేషన్ బజార్

వేవ్స్ యానిమేషన్ బజార్ 18 మంది వర్ధమాన సృష్టికర్తలు, ఐపీ హోల్డర్లను ప్రదర్శించింది. ఇది యానిమేషన్‌తో పాటు నూతన మీడియాలో విస్తరిస్తున్న భారత ప్రతిభావంతుల సమూహాన్ని, సృజనాత్మకతనూ ప్రతిబింబించింది. కథకులు, నిర్మాతలు, పంపిణీదారులను విజయవంతంగా అనుసంధానించిన మార్కెట్‌ప్లేస్... భారత వినోద రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడే అర్థవంతమైన చర్చలు, భాగస్వామ్యాల ప్రక్రియను వేగవంతం చేసింది.

ఈ సంవత్సరం ఎడిషన్‌లో పాల్గొన్న ప్రముఖ కొనుగోలుదారుల్లో ఆహా, జీ, స్పిరిట్ మీడియా, జియో హాట్‌స్టార్, సురేష్ ప్రొడక్షన్స్, ఈటీవీ విన్, వాచో, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆల్ఫా పిక్చర్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కంటెంట్ హక్కుల మోనిటైజేషన్‌లో రూ. 24 కోట్ల విలువైన ప్రతిపాదనలను గురించి సంభావ్య భాగస్వాములతో చర్చించారు.

ప్రారంభ సమావేశంలో భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ ఇలా అన్నారు:

"ఈ కార్యక్రమం వినోద రంగంలోని అన్ని విభాగాలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నాం. అమ్మకందారులను, కొనుగోలుదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత వినోద వాణిజ్యాన్ని మరింత శక్తిమంతం చేస్తుంది. ఐపీఎల్ భారత క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన విధంగానే... సృజనాత్మకత, సాంకేతికతను ఏకీకృతం చేసే వేవ్స్ కార్యక్రమం వినోద రంగంలో మంచి పరివర్తన తెస్తుంది."

ఇండియాజాయ్‌ కోసం వేవ్స్ బజార్‌తో సహకారం... ప్రారంభ దశలో ఉన్న స్టూడియోలను, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల కోసం “క్రియేట్ ఇన్ ఇండియా” కంటెంట్‌నూ ప్రోత్సహించడం ద్వారా ఈ కార్యక్రమానికి మరింత బలాన్ని చేకూర్చింది.

ఉత్సాహభరితమైన భాగస్వామ్యం, ప్రభావవంతమైన వ్యాపార ఫలితాలతో ఇండియాజాయ్ బీ2బీ-2025 వద్ద వేవ్స్ బజార్... భారత సృజనాత్మక రంగాల్లో సహకారం, ఆవిష్కరణలు, వృద్ధిని నడిపించే ప్రధాన వేదికగా తన పాత్రను మరోసారి బలోపేతం చేసుకుంది.

ఇండియాజాయ్ 2025లో క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ విజేతల ప్రదర్శన

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మద్దతుతో ఇండియాజాయ్-2025లో భాగంగా వేవ్స్ బజార్ పెవిలియన్ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ (సీఐసీ) విజేతల ప్రదర్శననూ నిర్వహించింది. ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగానికి చెందిన 20 మందికి పైగా విజేతలు యానిమేషన్ ఫిల్మ్ కాంపిటీషన్, ఇన్నోవేట్2 ఎడ్యుకేట్ హ్యాండ్‌హెల్డ్ డివైస్ ఛాలెంజ్, వేవ్స్ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎక్స్ఆర్ క్రియేటర్ హ్యాకథాన్, అన్‌రియల్ సినిమాటిక్ ఛాలెంజ్ వంటి సవాళ్ల ద్వారా రూపొందించిన వీఆర్ హెడ్‌సెట్‌లు, విద్యా సాంకేతిక పరికరాలు, గేమింగ్ ప్రోటోటైప్‌లు, యానిమేషన్ ఫిల్మ్‌లు, సినిమాటిక్ ఐపీలు సహా వారి అద్భుతమైన ప్రాజెక్టులను ప్రదర్శించారు.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజుతో సంభాషించిన యువ ఆవిష్కర్తలు... వేవ్స్ కార్యక్రమం కింద వారి సృజనాత్మక ప్రయాణాలను, ఇంక్యుబేషన్ అనుభవాలను పంచుకున్నారు. పలువురు పిచ్ టు డీల్ వద్ద తమ ఐపీలను ప్రదర్శించారు. ఇది సంభావ్య పెట్టుబడిదారులు, స్టూడియోలతో సృష్టికర్తలను అనుసంధానించే బీ2బీ మార్కెట్ ప్లేస్‌గా నిలిచింది.

క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ విజేతల భాగస్వామ్యం, ఇండియాజాయ్ బీ2బీ-2025 విజయం... యువ సృష్టికర్తలకు సాధికారత కల్పించడం, భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రపంచ మీడియా, వినోదం, సాంకేతిక రంగాల్లో ఆవిష్కరణల కేంద్రంగా దేశాన్ని నిలపడంలో మంత్రిత్వ శాఖ నిరంతర నిబద్ధతను స్పష్టం చేసింది.

 

***


(రిలీజ్ ఐడి: 2188973) సందర్శకుల సూచీ సంఖ్య : : 72
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil , Malayalam