ఆయుష్
azadi ka amrit mahotsav

జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం-2025


పరిశోధన, నైపుణ్య కేంద్రాలు, ప్రజలకు చేరువవడం ద్వారా
క్యాన్సర్ నుంచి సంరక్షణను అందించే సేవల్ని విస్తరిస్తున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ

క్యాన్సర్ పట్ల అవగాహన పెంచడానికీ, సమగ్ర చికిత్స అందించడానికీ
ఆచరణాత్మకమైన, ప్రజా ప్రయోజనాత్మక దృష్టికోణం ముఖ్యమన్న కేంద్ర మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్

శాస్త్రీయ వైద్యానికి సాంప్రదాయక చికిత్సా పద్ధతులను జత చేసి
సంపూర్ణ చికిత్సా పద్ధతులను అందించడానికి
ఆయుష్ శాఖ కట్టుబడి ఉందని స్పష్టం చేసిన కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కొటేచా

Posted On: 07 NOV 2025 12:14PM by PIB Hyderabad

జాతీయ క్యాన్సర్ అవగాహనా దినోత్సవం సందర్భంగా, క్యాన్సర్ విషయంలో ప్రజల్లో జాగృతిని పెంపొందించడంతో పాటు, ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించే కృషిని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయుష్ శాఖ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచమంతటా మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో రెండో అతి ప్రధాన వ్యాధి క్యాన్సరే. అనేక దేశాల్లో నోటి క్యాన్సర్, గర్భాశయ సంబంధిత క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ సవాలును మరింత ప్రభావవంతంగా అధిగమించడానికి క్యాన్సర్‌పై అవగాహనను పెంచడానికీ, పరీక్షలపై దృష్టి కేంద్రీకరించడానికీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణ పద్ధతుల్ని వ్యాప్తి చేయడానికీ భారత్ ప్రాధాన్యాన్నిస్తోంది.

పొగాకు వాడకం, అనారోగ్యకర ఆహారం, స్థూలకాయం, శరీరాన్ని చురుకుగా ఉంచుకోకపోవడం, మద్యపానం, పర్యావరణ కాలుష్యం, హెచ్‌పీవీ సంక్రమణలు వంటి నివారించదగ్గ అంశాలే క్యాన్సర్ ప్రబలడానికి దారి తీస్తున్నాయి. ఈ అంశాలపై ప్రజా చైతన్యాన్ని పెంపొందించడం, సకాలంలో తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యమని ఈ పరిణామం సూచిస్తోంది. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం వల్ల ఈ వ్యాధి బాధితులను కాపాడే అవకాశాలు చాలా వరకూ మెరుగు పడతాయి. మరీముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ద్వార క్యాన్సర్, నోటి క్యాన్సర్లలో అనేక కేసులు క్రమబద్ధ పరీక్షల వల్ల  చికిత్సకు అనువైన దశలోనే గుర్తించడం, వ్యాధి ముదరకుండా నయం చేయడం సాధ్యపడుతుంది. ప్రాథమిక దశలో గుర్తిస్తే అనేక రకాల క్యాన్సర్లను అరికట్టేందుకు వీలు ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం కూడా ముఖ్యం. పొగాకు వాడే అలవాటును మానేయడం, ఆకుకూరలు తినడం, బరువును నియంత్రించుకోవడం, చురుగ్గా   ఉంటూ, పొగాకు కాలుష్యాలకు దూరంగా ఉండడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చు. ఇవి  దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణకు దోహదం చేస్తాయి.

 క్యాన్సర్‌పై అవగాహనను పెంచడంతో పాటు  నివారణ దిశగా ఆచరణాత్మక విధానాల్ని అవలంబించాల్సిన అవసరం ఉందని ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ స్పష్టం చేశారు. దేశంలో అందరికీ తక్కువ ఖర్చులో, సహాయక  సేవల్ని అందుబాటులోకి తేవడానికి మంత్రిత్వ శాఖ మరిన్ని కార్యక్రమాలను చేపడుతోందని ఆయన తెలిపారు. ఈ  కార్యక్రమాల్లో ఇంటిగ్రేటివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లు, సహకార ప్రధాన పరిశోధనలు భాగంగా ఉన్నాయని వివరించారు. ఆధునిక క్యాన్సర్ విజ్ఞాన శాస్త్రానికి ఆయుష్ పద్ధతులను కూడా జతపరిచే  కార్యక్రమాలు  జీవన నాణ్యతను పెంచుతాయన్నారు. ప్రత్యేకించి బలహీన వర్గాల వారి విషయంలో చెప్పుకోదగిన మార్పు కలుగుతుందని ఆయన అన్నారు.

భారత్‌లో సమ్మిళిత క్యాన్సర్ చికిత్స ప్రధాన కార్యక్రమాల నెట్‌వర్క్ విస్తరణ తీరు.. శాస్త్రీయ వైద్యానికి సాంప్రదాయక చికిత్సా పద్ధతులను జత చేసే పద్ధతులను అందించడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని ఆయుష్ కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కొటేచా అన్నారు. నైపుణ్య కేంద్రాలు,  పరిశోధన వేదికలు, టీఎంసీ-ఏసీటీఆర్ఈసీ, ఆర్య వైద్య శాల, ఎయిమ్స్ తదితర ప్రఖ్యాత సంస్థలతో భాగస్వామ్యం వంటివి కొత్త చికిత్సా పద్ధతుల పట్ల అవగాహనను పెంచడంలో, వ్యాధి నివారణలో,  రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో తోడ్పడుతున్నాయని ఆయన అన్నారు. ఈ  కార్యక్రమాలు.. వ్యవస్థీకృత పరిశోధన, సుశిక్షిత సిబ్బంది, ఆధునిక క్యాన్సర్ విజ్ఞానానికి సాయపడేందుకు ఆయుష్‌కున్న సామర్థ్యాన్ని నిరూపిస్తున్నాయని ఆయన అన్నారు.

సమ్మిళిత సంరక్షణ సేవలు, ఆయుష్ ఔషధ రూపకల్పన దిశగా కృషిచేస్తున్న ముంబయిలోని టీఎంసీ-ఏసీటీఆర్ఈసీ సహా కీలక  కేంద్రాలను (సీఓఈలను) ఏర్పాటు చేయడం ద్వారా ఆయుష్ మంత్రిత్వ శాఖ సమగ్ర క్యాన్సర్ చికిత్సా సేవల్ని విస్తరింపచేస్తోంది. ఈ కేంద్రాలు ఇన్-సిలికో, ప్రీక్లినికల్, క్లినికల్ అధ్యయనాల్లోనూ, ప్రత్యేక ఓపీడీతో పాటు సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాల్లోనూ దన్నుగా నిలుస్తున్నాయి. కొట్టక్కల్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఆర్య వైద్య శాలలోని ఓ విశిష్ట సీఓఈ జీవన నాణ్యతతో పాటు సహాయక చికిత్సను అందించడంపైనా దృష్టిని కేంద్రీకరిస్తోంది. ఇది గత రెండేళ్లలో 338 ఊపిరితిత్తి క్యాన్సర్ రోగులు సహా 26,356 మంది క్యాన్సర్ పేషెంట్లకు చికిత్సను అందించి, సమ్మిళిత పద్ధతి ఎంత ప్రభావవంతమైనదో నిరూపించింది.

 క్యాన్సర్ వ్యాధి వ్యాప్తిని ఎదుర్కోవడంలో నివారణ, ప్రాథమిక దశలోనే గుర్తించడం, సంపూర్ణ సహాయక చికిత్సను అందించే దిశగా భారత్ ముందుకు పోవడంలో కీలక పాత్రను పోషిస్తాయని ఆయుష్ శాఖ పునరుద్ఘాటిస్తోంది. అవగాహనను పెంచడం, మరిన్ని ఎక్కువ పరీక్షాకేంద్రాల్ని ఏర్పాటు చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించేలా ప్రోత్సహించడం అత్యవసరమని తెలియజేస్తోంది. ఆయుష్ పద్ధతులు అందించే నివారక, సహాయక సేవలకు తోడు ఆధునిక చికిత్స పద్ధతులను జతకలపడం అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. 

క్యాన్సర్‌పై అవగాహనను పెంచడానికి సీసీఆర్ఏఎస్ ఐఈసీ తెచ్చిన ప్రచురణను ఈ కింది లింకులో చూడవచ్చు:https://ccras.nic.in/wp-content/uploads/2023/06/Cancer.pdf


(Release ID: 2187675) Visitor Counter : 12