హోం మంత్రిత్వ శాఖ
బీహార్‌లోని పట్నాలో జరిగిన జాతీయ గీతం ‘వందేమాతరం’ 150 ఏళ్ల వేడుకలో ప్రసంగించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి
సామూహికంగా స్వదేశీ ప్రతిజ్ఞను చేయించిన కేంద్ర మంత్రి
బ్రిటిష్ పాలనలోని కష్టకాలంలో సాంస్కృతిక జాతీయ వాదానికి మొదటి ప్రకటనగా నిలిచిన బంకించంద్ర ఛటర్జీ గేయం ‘వందేమాతరం’ : శ్రీ అమిత్ షా
స్వాతంత్య్ర ఉద్యమ యోధులు కలలుగన్న గొప్ప భారత దేశాన్ని సాకారం చేస్తున్న మోదీ ప్రభుత్వం: శ్రీ అమిత్ షా
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రతి భాషలో సోషల్ మీడియాలో #VandeMataram150 క్యాంపెయిన్ నిర్వహించాలి: శ్రీ అమిత్ షా
భారత దేశం కేవలం ఒక భూభాగమే కాదు ఒక ఆలోచన అని స్పష్టం చేసిన ‘వందేమాతరం’: శ్రీ అమిత్ షా
త్యాగం, అంకితభావంతో స్వాతంత్రోద్యమ వీరులకు స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతర’ ఉద్యమం: శ్రీ అమిత్ షా
‘వందేమాతరం’ స్ఫూర్తితో 2047 నాటికి గొప్ప భారత దేశాన్ని తయారుచేయాల్సిన సమయం ఆసన్నమైంది: శ్రీ అమిత్ షా
‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలంతా స్వదేశీని స్వీకరించే ప్రతిజ్ఞ తీసుకోవాలి: శ్రీ అమిత్ షా
प्रविष्टि तिथि:
07 NOV 2025 3:17PM by PIB Hyderabad
బీహార్‌లోని పట్నాలో జాతీయ గేయం ‘వందేమాతరానికి’ 150 ఏళ్లు పూర్తైన సందర్భంలో నిర్వహించిన వేడుకను ఉద్దేశించి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారు. ఆయన స్వదేశీ ప్రతిజ్ఞను సామూహికంగా చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు అనేక మంది ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. భారతీయ చైతన్యాన్ని మేల్కొల్పే రోజు ఇదని అన్నారు. 150 సంవత్సరాల క్రితం ఇదే రోజున గొప్ప స్వాతంత్య్ర సమర యోధుడు, ప్రముఖ సాహిత్యవేత్త బంకిం చంద్ర ఛటోపాధ్యాయ వందేమాతరాన్ని రచించినట్లు తెలిపారు. ఈ గేయం ద్వారా బంకించంద్ర చటర్జీ దేశానికి జాతీయ చైతన్యానికి సంబంధించిన గొప్ప మంత్రాన్ని ఇచ్చారని కేంద్ర మంత్రి అన్నారు. ఇది తర్వాత జాతీయ భావన ప్రకటనగా, స్వాతంత్య్రోద్యమ మార్గదర్శక సూత్రంగా మారిందని తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత దేశాన్ని ఏకం చేయడానికి ఈ గేయం ఒక కారణంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం.. గత 11 సంవత్సరాలుగా సామూహిక కృషి, మన స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న గొప్ప భారతదేశం అనే ఆశయాన్ని సాధించే దిశగా అనేక పనులను పూర్తి చేసిందని అమిత్ షా అన్నారు.
నేడు ‘వందేమాతరాన్ని’ సామూహికంగా ఆలపించడం ద్వారా రానున్న సంవత్సర కాలం పాటు భారతదేశ చైతన్యాన్ని పునరుజ్జీవింపజేసే దశలవారీ ప్రయత్నం ప్రారంభమైందని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ‘వందేమాతర’ మంత్రం, స్ఫూర్తికి అనుగుణంగా మన జీవితాలు ఉండేలా ఒక దేశవ్యాప్త కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ప్రధానంగా చెప్పారు. దీనిని భౌతిక, డిజిటల్ రూపాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ‘#VandeMataram150’ అనే క్యాంపెయిన్ అన్ని భాషల్లో చేపట్టనున్నట్లు ప్రకటించారు. జాతీయ ఐక్యతను బలోపేతం చేసేందుకు ప్రజలందరూ ప్రాంతీయ భాషలన్నింటిలో ‘వందేమాతరాన్ని’ రాయడాన్ని ఇది ప్రోత్సహిస్తుందన్నారు.
‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహించిందని కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. జాతి చైతన్యాన్ని పునరుజ్జీవింపజేసే ఈ ఉత్సవంలో పాలుపంచుకుంటున్న వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కూడా స్వతంత్రంగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారని ఆయన తెలిపారు. ఒక రకంగా ‘వందేమాతరం’ ఆనందమఠ్ నవలలో ఒక భాగమన్న ఆయన.. తర్వాత ఇది స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రకటనగా మారిందని చెప్పారు. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో హాకీ ఫైనల్‌కు ముందు భారత హాకీ జట్టు సామూహికంగా ‘వందేమాతరం’ ఆలపించిందన్న ఆయన.. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఈ పాట కేవలం ఒక రాజకీయ నినాదంగా మిగిలిపోకుండా దేశాన్ని ఏకీకృతం చేయడానికి, శాశ్వతంగా దేశభక్తిని రగిలించేందుకు ఒక స్ఫూర్తిగా ఉపయోగపడుతుందన్న విషయం నిశ్చయమైందని అన్నారు.
1947 ఆగస్టు 15న సర్దార్ పటేల్ సూచన మేరకు పండిట్ ఓంకార్‌నాథ్ ఠాకూర్ పూర్తి వందేమాతరాన్ని ఆలపించినట్లు తెలిపిన కేంద్ర హోం మంత్రి.. స్వతంత్ర భారతదేశ మొదటి గుండె చప్పుడులో అది ప్రతిధ్వనించిందని పేర్కొన్నారు. 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్ తుది సమావేశంలో డా. రాజేంద్ర ప్రసాద్ ‘వందేమాతరాన్ని’ జాతీయ గేయంగా ఆమోదించారని, తద్వారా ఈ పాటను స్వీకరించే మార్గం సుగమం అయిందని ఆయన చెప్పారు. ఆ క్షణం నుంచి ‘వందేమాతరం’ మనందరికీ జాతీయ చైతన్యాన్ని ఇచ్చే గేయంగా మారిందని.. నేడు ఈ గొప్ప గేయానికి సంబంధించిన 150వ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నామని అన్నారు.
‘వందేమాతరం’ రాసిన కాలాన్ని కూడా మనం తప్పకుండా అర్థం చేసుకోవాలని శ్రీ అమిత్ షా అన్నారు. 1875లో మొఘలుల పాలన సుదీర్ఘ అణచివేత తర్వాత బ్రిటిష్ పరిపాలన ప్రారంభమైందని పేర్కొన్నారు. ఆ కాలంలో మొదటి స్వాతంత్య్ర సంగ్రామం కూడా విఫలమైందని వ్యాఖ్యానించిన ఆయన.. మన జాతీయ చైతన్యం తిరిగి మేల్కొంటుందా అనే భయం దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉండేదన్నారు. ఆ సమయంలో బంకిం చంద్ర ఛటర్జీ జాతీయ చైతన్యానికి సంబంధించిన ఈ గొప్ప గేయాన్ని రచించారని, ఇది మన సాంస్కృతిక జాతీయవాదానికి మొదటి ప్రకటనగా నిలిచిందని శ్రీ అమిత్ షా అన్నారు. భారత్ అనేది కేవలం ఒక భూభాగం కాదు.. భారతీయులందరినీ కలిపి ఉంచే ఒక సంస్కృతి, ఒక ఆలోచన అన్న విషయాన్ని వందేమాతరం స్పష్టం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
తమ పార్టీ ఎప్పుడూ సాంస్కృతిక జాతీయవాదాన్ని గట్టిగా తెలియజేస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. సాంస్కృతిక జాతీయవాదం అనే ఆలోచన, చైతన్యం.. ‘వందేమాతరం’ గేయం నుంచే స్ఫూర్తిని పొంది ఉంటుందని ఆయన అన్నారు. మన స్వాతంత్య్ర విప్లవకారుల్లో చాలా మంది వందేమాతరం అనే నినాదం చేస్తూ చిరునవ్వుతో ఉరికొయ్యను ఎక్కారని ఆయన అన్నారు. ఈ గొప్ప యోధులు కలలుగన్న భారతదేశాన్ని నిర్మించాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందని పేర్కొన్నారు. నేటి నుంచి 2047 వరకు ఉన్న కాలం ‘వందేమాతరం’తో స్ఫూర్తిని పొందుతూ గొప్ప భారతదేశాన్ని తయారుచేయాల్సిన సమయం అని శ్రీ అమిత్ షా అన్నారు.
నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా ఢిల్లీలో వందేమాతరం సామూహిక ఆలాపనలో పాల్గొన్నారని కేంద్ర హోం, సహకార మంత్రి తెలిపారు. ఇటువంటి శుభ సమయంలో వందేమాతరం గేయ 150వ వార్షికోత్సవాన్ని స్వదేశీకి కూడా అంకితం చేయాలన్న సంకల్పం మనమందరం తీసుకుందామని ఆయన కోరారు. స్వదేశీ లేకుండా స్వయం సమృద్ధ భారత్‌ను తయారు చేయటం సాధ్యం కాదని ఆయన అన్నారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా స్వదేశీని స్వీకరించడానికి ప్రతిజ్ఞ చేయాలని ఆయన దేశ ప్రజలను కోరారు. 2047 నాటికి భారత్‌ను ఒక గొప్ప దేశంగా మార్చే ప్రక్రియలో పాలుపంచుకోవాలన్న సంకల్పం మనమందరం తీసుకుందామని, భారతమాతకు జీవితాలను మరోసారి అంకితం చేసే ప్రతిజ్ఞ ఈ రోజు చేయాలని ఆయన విన్నవించారు.
***
(रिलीज़ आईडी: 2187674)
आगंतुक पटल : 21