ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవ రాయపూర్ లో బ్రహ్మకుమారీల ధ్యాన కేంద్రం - శాంతి శిఖర్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 01 NOV 2025 1:23PM by PIB Hyderabad

ఓం శాంతి!

ఛత్తీస్ గఢ్ గవర్నర్ శ్రీ రామన్ డేకా, ప్రజాదరణ పొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి, రాజయోగిని సిస్టర్ జయంతి, రాజయోగి మృతుంజయ్, సోదరి బ్రహ్మకుమారీలు, ఇతర విశిష్ట అతిథులు, మహిళలు, ప్రముఖులారా! 

ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఛత్తీస్‌గఢ్ ఏర్పడి నేటికి 25 సంవత్సరాలు పూర్తయింది. ఛత్తీస్‌గఢ్‌తో పాటు, జార్ఖండ్, ఉత్తరాఖండ్ కూడా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి.ఈ రోజు, దేశవ్యాప్తంగా అనేక ఇతర రాష్ట్రాలు కూడా తమ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఈ ప్రత్యేక సందర్భంలో ఆ రాష్ట్రాల ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. "రాష్ట్రాల అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి" అనే మంత్రాన్ని అనుసరించి, మనం వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారత్) సాధన లక్ష్యంలో సమష్టిగా నిమగ్నమై ఉన్నాం.

మిత్రులారా, 

వికసిత భారత్ దిశగా ముఖ్యమైన ప్రయాణంలో, బ్రహ్మకుమారీల వంటి సంస్థ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దశాబ్దాలుగా నేను మీ అందరితో అనుబంధం కలిగి ఉండటం నా అదృష్టం. నేను ఇక్కడ అతిథిని కాను. నేను మీ వాడిని. ఈ ఆధ్యాత్మిక ఉద్యమం ఒక మహావృక్షం  లాగా పెరగడం, విస్తరించడం నేను చూశాను. 2011లో అహ్మదాబాద్‌లో జరిగిన ‘ఫ్యూచర్ ఆఫ్ పవర్’ కార్యక్రమం, 2012లో సంస్థ 75వ వార్షికోత్సవం, 2013లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కార్యక్రమం - మౌంట్ అబూకి ప్రయాణం కావచ్చు లేదా గుజరాత్‌లో జరిగే సమావేశాలు కావచ్చు, అలాంటి సందర్భాలు నాకు దాదాపు నిత్యకృత్యాల్లా మారిపోయాయి. ఢిల్లీకి వచ్చిన తర్వాత కూడా, అది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, స్వచ్ఛ భారత్ మిషన్ లేదా జల్ జన్ అభియాన్ వంటి ప్రచారాలలో పాల్గొనడం అయినా, నేను మీ మధ్యకు వచ్చినప్పుడల్లా, గొప్ప నిజాయితీతో కూడిన మీ కృషిని గమనించాను. ఇక్కడ మాటలు తక్కువ, సేవ ఎక్కువ అనే భావన నాకు ఎప్పుడూ కలిగింది.

మిత్రులారా, 

ఈ సంస్థతో నా అనుబంధం చాలా వ్యక్తిగతమైనది. జానకీ దాది చూపిన వాత్సల్యం, రాజయోగినీ దాది హృదయ మోహిని అందించిన మార్గదర్శకత్వం నా జీవితంలో ఎంతో ఇష్టమైన జ్ఞాపకాలలో ఉన్నాయి. నేను నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ 'శాంతి శిఖర్' అనే భావనలో, వారి ఆలోచనలు రూపం దాల్చి, సజీవంగా మూర్తీభవించడం నేను చూస్తున్నా.  శాంతి శిఖర్  - శాంతియుత ప్రపంచం కోసం ఒక అకాడమీ. ఈ సంస్థ రాబోయే కాలంలో ప్రపంచ శాంతి కోసం అర్థవంతమైన కృషికి ఒక ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని నేను విశ్వాసంతో చెప్పగలను. ఈ ప్రశంసనీయమైన కృషికి మీ అందరికీ, ఇంకా భారతదేశంతో పాటు విదేశాలలో ఉన్న బ్రహ్మకుమారీల కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు.  

మిత్రులారా, 

మన సంప్రదాయంలో ఇలా చెప్పారు. ‘‘ఆచారః పరమో ధర్మః, ఆచారః పరమం తపః। ఆచారః పరమం జ్ఞానమ్, ఆచారాత్ కిం న సాధ్యతే’’ అంటే, ఆచరణే పరమ ధర్మం, ఆచరణే గొప్ప తపస్సు, ఆచరణే ఉన్నతమైన జ్ఞానం. సత్కార్యాచరణతో సాధించలేనిది ఏముంటుంది? ఇలా చెప్పాలంటే -  మాటలు ఆచరణలోకి వచ్చినప్పుడు మాత్రమే నిజమైన మార్పు సంభవిస్తుంది.  సరిగ్గా ఇదే బ్రహ్మకుమారీల సంస్థ ఆధ్యాత్మిక శక్తికి మూలం. ఇక్కడ, ప్రతి సోదరి మొదట తనను తాను కఠినమైన తపస్సుకు, క్రమశిక్షణకు లోను చేసుకుంటుంది. మీ గుర్తింపే విశ్వ శాంతి కోసం చేసే కృషితో ముడిపడి ఉంది. మీ మొదటి పలకరింపు కూడా ఓం శాంతి! ఇందులో ఓం అంటే పరబ్రహ్మాన్ని,, సమస్త విశ్వాన్ని సూచిస్తుంది. శాంతి  అంటే హృదయపూర్వకంగా శాంతిని కోరుకోవడాన్ని సూచిస్తుంది.

మిత్రులారా, 

ప్రపంచ శాంతి అనే భావన భారతదేశ మౌలిక సిద్ధాంతంలో అంతర్భాగం. ఇది భారతదేశ ఆధ్యాత్మిక చైతన్యానికి ఒక వ్యక్తీకరణ. ఎందుకంటే, మనం ప్రతి జీవిలో దైవాన్ని చూస్తాం. మనం విశ్వాన్ని కూడా కలుపుకుని ఆత్మను విస్తరించగలం.  మన సంప్రదాయంలో ప్రతి ఆధ్యాత్మిక కర్మ (పూజ/ఆరాధన) కూడా “లోకమంతా శుభప్రదమగు గాక! సర్వ జీవుల మధ్య సద్భావన ఉండు గాక!” అనే ప్రార్థనతో ముగుస్తుంది. ఇంతటి విశాలమైన, ఉదారమైన దృక్పథం, ఇంతటి ఉన్నతమైన ఆలోచన, విశ్వ సంక్షేమ స్ఫూర్తితో కూడిన విశ్వాసాలు, ఇంతటి సహజ సంగమం మన నాగరికత, సంప్రదాయంలో అంతర్లీనంగా ఉంది. మన ఆధ్యాత్మికత మనకు శాంతి పాఠాన్ని నేర్పించడమే కాకుండా, దాన్ని సాధించే మార్గాన్ని కూడా నిర్దేశిస్తుంది. స్వీయ-నియంత్రణ నుంచి ఆత్మజ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం నుంచి ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం నుంచి ఆంతరంగిక శాంతి లభిస్తుంది. ఈ మార్గంలో నడుస్తూ, శాంతి శిఖర్ అకాడమీలోని అన్వేషకులు ప్రపంచ శాంతికి సాధనాలుగా మారాలి. 

మిత్రులారా, 

ప్రపంచ శాంతి లక్ష్యంలో, ఆలోచనలు ఎంత ముఖ్యమో ఆచరణాత్మక విధానాలు, చర్యలు కూడా అంతే ముఖ్యం. ఈ దిశగా భారత్ నేడు అత్యంత నిజాయితీతో తన పాత్రను నిర్వర్తించడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభం లేదా విపత్తు సంభవించినప్పుడు, భారత్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా తక్షణ సహాయం అందించడానికి ముందుకు వస్తోంది. భారత్ ప్రపంచానికి మొదటి ప్రతిస్పందన దేశంగా  మారింది.

మిత్రులారా, 

పర్యావరణానికి సంబంధించిన సవాళ్ల మధ్య, భారత్ ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి పరిరక్షణకు ఒక ప్రముఖ స్వరంగా ఉద్భవించింది. ప్రకృతి మనకు ప్రసాదించిన వాటిని మనం పరిరక్షించుకోవడం, పోషించడం చాలా ముఖ్యం. మనం ప్రకృతితో సామరస్యంగా జీవించడం నేర్చుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మన శాస్త్రాలు, మన సృష్టికర్త ప్రజాపిత మనకు ఇదే బోధించారు. మనం నదులను తల్లులుగా భావిస్తాం. నీటిని దేవతగా పూజిస్తాం. మొక్కలలో దైవాన్ని చూస్తాం. ఈ భావనతో స్ఫూర్తి పొందిన మన జీవన విధానం ప్రకృతి సంపదలను కేవలం పొందడానికే కాదు, తిరిగి ఇచ్చేందుకు కూడా ఉపయోగిస్తుంది. ఈ విధమైన జీవన దృక్కోణమే ప్రపంచానికి సురక్షితమైన భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తుంది.

మిత్రులారా, 

భారతదేశం ఇప్పటికి కూడా భవిష్యత్తు పట్ల తన బాధ్యతలను అర్థం చేసుకుని, వాటిని నిర్వర్తిస్తోంది. ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్ వంటి భారత్ కార్యక్రమాలు, వసుధైక కుటుంబం ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే దార్శనికత ప్రపంచాన్ని  ఏకతాటిపైకి తీసుకువస్తున్నాయి.మిషన్ లైఫ్ ను కూడా భారత్ ప్రారంభించింది, ఇది భౌగోళిక, రాజకీయ సరిహద్దులను దాటి మొత్తం మానవాళి సంక్షేమాన్ని ఇది  లక్ష్యంగా పెట్టుకుంది. 

మిత్రులారా, 

బ్రహ్మకుమారీల వంటి సంస్థలు సమాజానికి నిరంతరం సాధికారత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. శాంతి శిఖర్ వంటి సంస్థలు భారతదేశ ప్రయత్నాలకు కొత్త శక్తిని ఇస్తాయి.  ఈ సంస్థ నుంచి వెలువడే శక్తి దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ప్రపంచ శాంతి ఆలోచనతో కలుపుతుందని నేను విశ్వసిస్తున్నాను. నేను ప్రధానమంత్రిని అయినప్పటి నుంచి ప్రపంచంలో  అనేక ప్రాంతాలకు ప్రయాణించాను, ఏ ఒక్క దేశంలో, అది విమానాశ్రయం అయినా లేదా కార్యక్రమ వేదిక అయినా, బ్రహ్మకుమారీల సభ్యులను కలవకుండా లేదా వారి శుభాకాంక్షలు నాకు తోడు లేకుండా ఉన్న సందర్భం నాకు గుర్తులేదు. అలాంటి సందర్భం ఒక్కటి కూడా ఉండకపోవచ్చు. ఇది నాకు ఒక అనుబంధ భావాన్ని నింపుతుంది, కానీ ఇది మీ శక్తిని గురించి కూడా నాలో ఒక ముద్ర వేసింది. నేను నిజంగా శక్తిని ఆరాధించే వాడిని. 

ఈ పవిత్రమైన, శుభప్రదమైన సందర్భంలో మీ మధ్య నేను ఉండటానికి నాకు అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు పెంచే కలలు కేవలం కలలు కావు.  వాటిని నేను ఎప్పుడూ దృఢమైన సంకల్పాలుగానే భావించాను. మీ ప్రతిజ్ఞలు కచ్చితంగా నెరవేరతాయని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఈ స్ఫూర్తితో, శాంతి శిఖర్ - శాంతియుత ప్రపంచం కోసం అకాడమీ -  ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

చాలా ధన్యవాదాలు! 

ఓం శాంతి!

 

***


(Release ID: 2185509) Visitor Counter : 5