ప్రధాన మంత్రి కార్యాలయం
అక్టోబర్ 30,31 తేదీల్లో గుజరాత్‌లో ప్రధాని పర్యటన
సర్దార్ వల్లభభాయ్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించే రాష్ట్రీయ ఏకతా దివస్ ఉత్సవాల్లో పాల్గొననున్న పీఎం
ఏక్తా దివస్ పరేడ్‌లో ‘భిన్నత్వంలో ఏకత్వం’ అంశాన్ని ప్రతిబింబించేలా శకట ప్రదర్శన
పరేడ్‌లో ముఖ్య ఆకర్షణలు: దేశీయ జాతి శునకాలైన రామ్‌పూర్ హోండ్స్, ముధోల్ హోండ్స్‌తో కూడిన బీఎస్ఎఫ్ పదాతి దళ కవాతు
ఏక్తా నగర్‌లో రూ.1,140 కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు పీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవం
ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యాలు: పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడం, అనుసంధానాన్ని పెంపొందించడం, సుస్థిరాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడటం
ఆరంభ్ 7.0 ముగింపు కార్యక్రమంలో100వ ఫౌండేషన్ కోర్సు ట్రైనీ అధికారులతో ప్రధాని సంభాషిస్తారు
Posted On:
29 OCT 2025 10:58AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 30, 31 తేదీల్లో గుజరాత్‌లో పర్యటిస్తారు. అక్టోబర్ 30 సాయంత్రం 5:15 సమయంలో కేవడియాలోని ఏక్తానగర్లో ఈ-బస్సులను ప్రారంభిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు ఏక్తానగర్‌లో రూ.1,140 కోట్లకు పైగా విలువైన వివిధ మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు.
అక్టోబర్ 31 ఉదయం 8 గంటలకు ఐక్యతా విగ్రహం వద్ద ప్రధానమంత్రి పుష్పాంజలి ఘటించి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం.. ఉదయం 10:45కు ఆరంభ్ 7.0లో 100వ కామన్ ఫౌండేషన్ కోర్సు ట్రైనీ అధికారులతో సంభాషిస్తారు.
మొదటి రోజు - అక్టోబర్ 30
ఏక్తానగర్లో వివిధ మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాంతంలో పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడం, అనుసంధానాన్ని పెంపొందించడం, సుస్థిరాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడటమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఉన్న ఈ ప్రాంతంలో ఎకో టూరిజం, పర్యావరణహిత రవాణా, స్మార్ట్ మౌలికవసతులు, గిరిజనాభివృద్ధిని ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని రూ.1,140 కోట్లకు పైగా పెట్టుబడితో చేపడుతున్న ఈ ప్రాజెక్టులు తెలియజేస్తాయి.
రాజ్‌పిప్లాలో బిర్సా ముండా గిరిజన విశ్వవిద్యాలయం, గరుడేశ్వర్లో హాస్పిటాలిటీ డిస్ట్రిక్ (ఫేజ్ -1), వామన్ వృక్ష వాటిక, సాత్పూరా రక్షణ గోడ, ఈ-బస్ ఛార్జింగ్ డిపో, 25 ఎలక్ట్రిక్ బస్సులు, నర్మదా ఘాట్ పొడిగింపు, కౌశల్యా మార్గం, ఏక్తా ద్వార్ నుంచి శ్రేష్ట భారత్ భవన్ వరకు నడకదారి (ఫేజ్-2), స్మార్ట్ బస్ స్టాపులు (రెండో దశ), డ్యామ్ నమూనా ఫౌంటెయిన్, జీఎస్ఈసీ క్వార్టర్లు తదితరమైనవి ప్రారంభిస్తారు.
భారతీయ రాజవంశాల మ్యూజియం, వీర్ బాలక్ ఉద్యాన్, క్రీడా సముదాయం, వర్షాధార అటవీ ప్రాజెక్టు, శూల్పనేశ్వర్ ఘాట్ సమీపంలో జెట్టీ అభివృద్ధి, ఐక్యతా విగ్రహం వద్ద ట్రావెలేటర్లు.. తదితరమైన వాటికి శంకుస్థాపన చేస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగా.. సర్ధార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రూ. 150 స్మారక నాణేన్ని ప్రధానమంత్రి విడుదల చేస్తారు.
రెండో రోజు - అక్టోబర్ 31
రాష్ట్రీయ ఏకతా దివస్ ఉత్సవాల్లో ప్రధాని పాల్గొని సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు పుష్పాంజలి ఘటిస్తారు. ఏకతా దివస్ ప్రతిజ్ఞ చేసి, ఏకతా దివస్ కవాతును వీక్షిస్తారు.
బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీతో సహా వివిధ రాష్ట్ర పోలీసు భద్రతా దళాలు ఈ కవాతులో పాల్గొంటాయి. దేశీయ జాతి శునకాలైన రాంపూర్ హౌండ్స్, ముధోల్ హౌండ్స్, గుజరాత్ పోలీసు అశ్వదళం, అస్సాం పోలీస్ మోటార్ సైకిల్ డేర్ డెవిల్ షో, బీఎస్ఎఫ్ ఒంటె దళం, క్యామెల్ మౌంటెడ్ బ్యాండ్ ఈ ఏడాది కవాతులో ప్రధాన ఆకర్షణలు.
జార్ఖండ్‌లో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు, జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి శౌర్య చక్ర పురస్కారాలు స్వీకరించిన ఐదుగురు సీఆర్పీఎఫ్ సిబ్బందిని, శౌర్య పతకాలు అందుకున్న 16 మంది బీఎస్ఎఫ్ సిబ్బందిని ఈ కవాతులో సత్కరిస్తారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ధైర్యం కనబరిచిన బీఎస్ఎఫ్ సిబ్బందిని సైతం సత్కరిస్తారు.
ఈ ఏడాది రాష్ట్రీయ ఏకతా దివస్ కవాతులో ఎన్ఎస్‌జీ, ఎన్‌డీఆర్ఎఫ్, గుజరాత్, జమ్మూ కశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, మణిపూర్, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి రాష్ట్రాలు ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే ఇతివృత్తంతో శకటాలను ప్రదర్శిస్తాయి. దేశ సంస్కృతి గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ.. 900 మంది కళాకారులు భారతీయ శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శిస్తారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈ ఏడాది నిర్వహించే రాష్ట్రీయ ఏకతా దివస్ ఉత్సవాలు ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
ఆరంభ్ 7.0 ముగింపు కార్యక్రమంలో 100వ ఫౌండేషన్ కోర్సు ట్రైనీ అధికారులతో ప్రధానమంత్రి ముచ్చటిస్తారు. ‘రీఇమేజింగ్ గవర్నెన్స్’’ అంశంతో ఆరంభ్ 7వ సంచికను నిర్వహిస్తున్నారు. 16 భారతీయ సివిల్ సర్వీసులు, 3 భూటాన్ సివిల్ సర్వీసులకు చెందిన 660 మంది అధికారులు ఈ 100 వ ఫౌండేషన్ కోర్సులో శిక్షణ పొందారు.
***
(Release ID: 2183989)
Visitor Counter : 6
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam