వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ విత్తన సంస్థ(ఎన్ఎస్ సీ)కు చెందిన అత్యాధునిక విత్తన శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్


బరేలీ, ధార్వాడ్, హాసన్, సూరత్‌గఢ్, రాయచూర్ లో ఐదు ఎన్ఎస్ సీ విత్తన శుద్ధి ప్లాంట్లను వర్చువల్ గా ప్రారంభించిన శ్రీ శివరాజ్ సింగ్

రైతుల కోసం 'విత్తన నిర్వహణ 2.0' వ్యవస్థ, ఆన్ లైన్ విత్తన బుకింగ్ వేదిక ప్రారంభం: శ్రీ చౌహన్

రైతులకు అత్యంత నాణ్యమైన విత్తనాలు, విత్తన ఉత్పత్తి ప్రమాణాల మెరుగుదలకు ఆధునిక సాంకేతికతతో ప్లాంట్ ఏర్పాటు: శ్రీ శివరాజ్ సింగ్

వ్యవసాయానికి విత్తనమే ప్రధాన ఆధారం.. అధిక దిగుబడికి నాణ్యమైన విత్తనాలు తప్పనిసరి: శ్రీ చౌహన్
జాతీయ విత్తన సంస్థ పాత్ర కేవలం జీవనోపాధి కల్పించటమే కాదు.. దేశంలో ధాన్యపు నిల్వలను పెంచటం: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

చిన్న రైతులకు నాణ్యమైన విత్తనాలు చేరేలా స్పష్టమైన ప్రణాళికతో ఎన్ఎస్ సీ పనిచేయాలని దిశానిర్దేశం: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్

Posted On: 27 OCT 2025 4:06PM by PIB Hyderabad

జాతీయ విత్తన సంస్థ (ఎన్ఎస్ సీ) నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక కూరగాయలు, పూల విత్తన శుద్ధి, ప్యాకేజింగ్ యూనిట్‌ను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలోని పూసా కాంప్లెక్స్‌లో ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా బరేలీ, ధార్వాడ్, హాసన్, సూరత్‌గఢ్, రాయచూర్ లో ఐదు ఎన్ఎస్ సీ విత్తన శుద్ధి ప్లాంట్లను వర్చువల్ గా ప్రారంభించారు. 

న్యూఢిల్లీలోని పూసా, బీజ్ భవన్‌లోని కూరగాయల విత్తన శుద్ధి ప్లాంటుకు గంటకు 1 టన్ను విత్తనాలను శుద్ధి చేసే సామర్థ్యం ఉండగా, మిగిలిన ఐదు ఎన్‌ఎస్‌సీ ప్లాంట్లకు ఒక్కొక్క దానికి గంటకు 4 టన్నుల విత్తనాలను శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. దేశవ్యాప్తంగా రైతులకు అత్యంత నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు, విత్తన ఉత్పత్తి ప్రమాణాల నాణ్యతను పెంచటానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ సౌకర్యాలు ఉపయోగపడతాయి.

ఈ కార్యక్రమం సందర్భంగా 'సీడ్ మేనేజ్ మెంట్ 2.0' వ్యవస్థ, రైతులకు ఆన్ లైన్ విత్తన బుకింగ్ వేదికను శ్రీ చౌహన్ ప్రారంభించారు. దీని ద్వారా రైతులు తమకు కావాల్సిన విత్తనాలను ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవటంతో పారదర్శకత, లభ్యత పెరుగుతుందన్నారు. చిన్న, సన్నకారు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించటం కీలకమని ఆయన స్పష్టం చేశారు.

ఈ నూతన సదుపాయాల ద్వారా అత్యంత నాణ్యమైన విత్తనాలు సులభంగా అందుబాటులో ఉండటంతో వ్యవసాయ ఉత్పదకత గణనీయంగా పెరుగుతుందని శ్రీ చౌహన్ అన్నారు. "ఈ కొత్త ప్లాంట్లు ముఖ్యంగా రైతుల అవసరాలను తీరుస్తాయి. ఇటీవల నిర్వహించిన 'వికసిత కృషి సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో నకిలీ, నాసిరకం విత్తనాలపై అత్యధిక ఫిర్యాదులు అందాయి. నాణ్యమైన విత్తన సరఫరా అత్యవసరం. ఇందులో ఎన్ఎస్ సీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది" అని కేంద్రమంత్రి తెలిపారు. 

ఎన్ఎస్ సీ బృందాన్ని అభినందించిన కేంద్రమంత్రి ఈ కార్యక్రమాన్ని స్వయం సమృద్ధ వ్యవసాయ వ్యవస్థ దిశగా కీలక ముందడుగు అని అభివర్ణించారు. ఎన్ఎస్ సీ పాత్ర కేవలం జీవనోపాధి కల్పించటమే కాక, దేశపు ధాన్యాగారాలను నింపటమని స్పష్టం చేశారు. 

రైతులకు సేవలు మరింత అందుబాటులో ఉండేలా, ప్రైవేట్ కంపెనీల ఇష్టానుసార పద్ధతులను అరికట్టడానికి ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరణలు చేపట్టాలని ఎన్ఎస్ సీని శ్రీ చౌహన్ కోరారు. "ప్రైవేట్ సంస్థలు తమదైన పాత్రను కలిగి ఉన్నప్పటికీ, ప్రభుత్వ సంస్థలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థల పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ఎన్‌ఎస్ సీ స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలి" అని ఆయన అన్నారు.

వ్యవసాయ కార్యదర్శి శ్రీ దేవేశ్ చతుర్వేది, ఎన్‌ఎస్‌ సీ సీఎండీ, వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి మణిందర్ కౌర్ ద్వివేది, సంయుక్త కార్యదర్శి శ్రీ అజిత్ కుమార్ సాహు, ఎన్‌ఎస్‌సీ, వ్యవసాయ మంత్రిత్వ శాఖల ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జాతీయ విత్తన సంస్థ, భారత ప్రభుత్వానికి చెందిన షెడ్యూల్ 'బి' - మినీ రత్న కేటగిరీ-I కంపెనీ. 1963లో ఇది ఏర్పాటైనప్పటి నుంచి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి, దేశవ్యాప్తంగా రైతులకు సరఫరా చేయటంలో కీలక పాత్ర పోషిస్తోంది.

 

***


(Release ID: 2183451) Visitor Counter : 3