అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) అసెంబ్లీ ఎనిమిదో సదస్సు ప్రారంభ ప్లీనరీని భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (2025 అక్టోబరు 28) న్యూ ఢిల్లీలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. సమ్మిళితత్వం, గౌరవం, అందరి శ్రేయస్సుకు మూలాధారంగా సౌర శక్తిని వినియోగించుకోవాలన్న మానవాళి ఉమ్మడి ఆకాంక్షకు ఐఎస్ఏ నిదర్శనంగా నిలుస్తుందన్నారు.
వాతావరణ మార్పు ప్రపంచమంతటినీ ప్రభావితం చేస్తోందని రాష్ట్రపతి అన్నారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి అత్యవసర, పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి భారత్ కట్టుబడి ఉందని, నిశ్చయాత్మక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. సౌరశక్తిని అందిపుచ్చుకోవడంతోపాటు వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ అంతర్జాతీయ సవాలును పరిష్కరించే దిశగా ఐఎస్ఏ ఓ కీలక ముందడుగు అని ఆమె వ్యాఖ్యానించారు.
సమ్మిళితత్వ భావనే భారత అభివృద్ధి ప్రస్థానాన్ని నిర్దేశిస్తోందని రాష్ట్రపతి అన్నారు. ఇంధన సమానత్వం సామాజిక సమతకు పునాది అన్న మన విశ్వాసాన్ని.. మారుమూల ప్రాంతాల్లోని ఇళ్లలో వెలుగులు నిండిన మన అనుభవం బలోపేతం చేస్తోంది. అందుబాటు ధరల్లో, పర్యావరణ హిత ఇంధనం అందుబాటులోకి రావడం వల్ల సామాజిక సాధికారత సాధ్యమవుతుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా నిలిచి, విద్యుత్ సదుపాయాలతోపాటు అనేక అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది. సౌరశక్తి విద్యుదుత్పత్తికి మాత్రమే పరిమితం కాదని, సాధికారతకూ సమ్మిళిత అభివృద్ధికీ కూడా ఉపయోగపడుతుందని ఆమె అన్నారు.
మౌలిక సదుపాయాల దృష్టికోణంలోనే కాకుండా, ప్రజా జీవనాలపై దృష్టి సారించాలని సభ్య దేశాలను రాష్ట్రపతి కోరారు. ఉద్యోగ కల్పన, మహిళా నాయకత్వం, గ్రామీణ జీవనోపాధి, డిజిటల్ సమ్మిళితత్వాలతో సౌరశక్తిని అనుసంధానించే దిశగా సమష్టి కార్యాచరణ ప్రణాళికను ఈ అసెంబ్లీ రూపొందించాలని ఆమె కోరారు. కేవలం మెగావాట్లే కాదు... వెలుగులు నిండిన జీవితాలు, బలోపేతమైన కుటుంబాలు, పరివర్తన చెందిన సమాజాల సంఖ్య మన పురోగతికి కొలమానమన్నారు. సాంకేతిక అభివృద్ధితోపాటు తాజా, అధునాతన సాంకేతికతలను అందరితో పంచుకోవడం ద్వారా గరిష్ట ప్రయోజనాన్ని పొందడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. సౌర శక్తి వ్యవస్థాపనలను భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంత పర్యావరణ సమతౌల్యాన్ని కూడా పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. హరిత ఇంధనం దిశగా మళ్లేందుకు పర్యావరణ పరిరక్షణే ముఖ్య కారణమైనందున ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.
మన దేశాల కోసం మాత్రమే కాదు, ప్రపంచమంతటి కోసం.. నేటి తరం కోసమే కాదు, భావి తరాల కోసమూ.. మరింత అంకితభావంతో మనం కృషి చేయాలని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. సౌరశక్తి ఉత్పత్తిలో ఈ అసెంబ్లీ చర్చలు, నిర్ణయాలు ఓ మైలురాయిగా నిలుస్తాయనీ, సమ్మిళిత, సమానత్వంతో కూడిన ప్రపంచాన్ని నిర్మించడంలో అది దోహదం చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి-
***