యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
సీఓపీ 10 బ్యూరో ఉపాధ్యక్ష పదవికి మరోసారి ఎన్నికైన భారత్.. నిజాయితీతో కూడిన క్రీడలపై దేశ నిబద్ధతకు నిదర్శనం
Posted On:
23 OCT 2025 12:26PM by PIB Hyderabad
అంతర్జాతీయ క్రీడల్లో... డోపింగ్ నిరోధక ఒప్పందానికి సంబంధించి పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ)10వ సమావేశంలో భారత్ చురుగ్గా పాల్గొంది. అక్టోబర్ 20 నుంచి 22 వరకు జరిగిన ఈ సమావేశం కన్వెన్షన్ 20వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసింది. క్రీడల్లో నైతికతను ప్రోత్సహించడం, డోపింగ్‌ను నిర్మూలించడంలో నిబద్ధత కలిగిన ప్రపంచవ్యాప్త చట్టబద్ధమైన అంతర్జాతీయ ఒప్పందం ఇదే.
భారత ప్రతినిధి బృందంలో క్రీడల కార్యదర్శి శ్రీ హరి రంజన్ రావు, డీజీ శ్రీ అనంత్ కుమార్, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ పాల్గొంది. వీరు 190కి పైగా సభ్యదేశాల ప్రతినిధులతో పాటు ఆఫ్రికన్ యూనియన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ , ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ, ఇతర అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు.
సమావేశం సందర్భంగా 2025–27 కాలానికి ఆసియా పసిఫిక్ (గ్రూప్4) బ్యూరో ఉపాధ్యక్ష పదవికి భారత్ మళ్లీ ఎన్నికైంది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్10 బ్యూరో అధ్యక్ష పదవికి అజర్‌బైజాన్ ఎన్నికైంది. బ్రెజిల్, జాంబియా, సౌదీ అరేబియా తమ ప్రాంతీయ సమూహాలకు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యాయి.
డోపింగ్ నిరోధక సమావేశం ప్రయాణాన్ని ప్రదర్శించే ఇంటరాక్టివ్ బోర్డులను అందించడం ద్వారా భారత్ సీఓపీ 10 సమావేశం నిర్వహణకు తనవంతు సాయాన్ని అందించింది.
500 మందికి పైగా వివిధ దేశ ప్రభుత్వాల ప్రతినిధులు, డోపింగ్ నిరోధక సంస్థలు, యునెస్కో శాశ్వత ప్రతినిధుల బృందాలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. కన్వెన్షన్ ప్రకారం పాలన, సమ్మతిని బలోపేతం చేయడం, క్రీడల్లో డోపింగ్ నిర్మూలన నిధికి ఆర్థిక సహాయం అందించడం, జన్యుపరమైన మోసాలు, సంప్రదాయ ఔషధ విధానాలు, క్రీడల్లో నైతిక అంశాల వంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవడంపై చర్చలు కొనసాగాయి.
సీఓపీ10 బ్యూరో, ఆమోద కమిటీ నివేదికలో సంస్థాగత సమన్వయం, వ్యూహాత్మక సమాచారం, విభాగాల మధ్య సమగ్రతపై ప్రధానంగా దృష్టి సారించారు.. విద్యా సంబంధిత ప్రాజెక్టులలో సమన్వయం, ప్రాచుర్యాన్ని పెంపొందించేందుకు భారత్ కొన్ని సవరణలను ప్రతిపాదించింది. ముఖ్యంగా, క్రీడల ద్వారా విలువలు అంశాలపై కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా యువత, క్రీడా సంస్థలు, సమాజంలో క్రీడా విలువలు, నైతికత, నిజాయితీని పాదుకొల్పడం వంటి లక్ష్యాలను కలిగి ఉన్నాయి.
సీఓపీ10 ఫలితాలు కన్వెన్షన్ పాలన, ప్రభావాన్ని మెరుగుపరచేందుకు కొనసాగుతున్న సంస్కరణ ప్రక్రియకు తోడ్పడతాయి. ఈ సమావేశం క్రీడల్లో నిజాయితీ, న్యాయాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర పార్టీల సమష్టి నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ముగిసింది.
***
(Release ID: 2181851)
Visitor Counter : 7