ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సీపీఆర్ అవగాహన వారోత్సవం – ప్రజా ప్రతిస్పందన సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు
దేశవ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ, అవగాహన పెంచే జాతీయ స్థాయి సమన్వయ కార్యక్రమం
సీపీఆర్ అవగాహన వారోత్సవం 2025 సందర్భంగా విస్తృత శిక్షణ ప్రచార కార్యక్రమాల నిర్వహణ
సీపీఆర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న 14,700 మందికి పైగా వ్యక్తులు; మై గవర్నమెంట్ ద్వారా 79,870 మంది డిజిటల్ ప్రమాణం
సీపీఆర్ అవగాహన వారంలో విస్తృతంగా డిజిటల్, యువత మమేకం: సీపీఆర్ ప్రశ్నోత్తర పోటీలో పాల్గొన్న 36,040 మంది పౌరులు, అవగాహన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న 368 మంది యువత
బహుళ మాధ్యమాల్లో నిర్వహించిన సీపీఆర్ అవగాహన కార్యకలాపాల ద్వారా నిమగ్నమైన 7.47 లక్షల పౌరులు
దేశవ్యాప్తంగా 6.06 లక్షల మందికి పైగా వ్యక్తులకు సీపీఆర్ శిక్షణ
Posted On:
22 OCT 2025 2:58PM by PIB Hyderabad
ప్రజల్లో సీపీఆర్ (కంప్రెషన్-ఒన్లీ కార్డియోపల్మనరీ రీససిటేషన్)పై అవగాహన పెంచడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాథమిక స్పందన సామర్థ్యాన్నిపెంపొందించే లక్ష్యంతో అక్టోబర్ 13 నుంచి 17 వరకు దేశవ్యాప్తంగా సీపీఆర్ అవగాహన వారోత్సవాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. గుండెపోటు, ఇతర వైద్య అత్యవసర పరిస్థితుల్లో తొందరగా చుట్టుపక్కనవాళ్లు స్పందించడంపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
సీపీఆర్ కు ప్రాణాలను రక్షించే సామర్థ్యం ఉందని ఎన్నో పరిశోధనల్లో నిరూపితమైనప్పటికీ, అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే భారత్ లో బాధితుల పక్కనే ఉండి తక్షణం స్పందించి సీపీఆర్ అందించే వారి సంఖ్య తక్కువగానే ఉంది. వారం రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమం ద్వారా ఈ అంతరాన్ని తగ్గించేందుకు విస్తృత స్థాయిలో సీపీఆర్ శిక్షణ, అవగాహన, ప్రవర్తన పరమైన సంసిద్ధతను ప్రజల్లో ప్రోత్సహించడాన్ని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
సీపీఆర్ అవగాహన వారోత్సవం లక్ష్యాలు: ప్రాణాలను కాపాడే సీపీఆర్ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, వివిధ భాగస్వాముల సహకారంతో ఆచరణాత్మక శిక్షణలు, ప్రదర్శనలు అందించడం, యువతలో సేవాభావం పెంపొందించడం, సమాజ హిత కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేలా ప్రోత్సహించడం, డిజిటల్ వేదికలను వినియోగించి విస్తృతంగా ప్రజలకు ఈ సమాచారాన్ని చేరవేయడం.
ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా బహుళ భాగస్వాముల సమన్వయంతో అమలు చేశారు. గ్రామీణ స్థాయిలో శిక్షణలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య, వైద్య విద్యా శాఖలు కీలకపాత్ర పోషించాయి. హోం మంత్రిత్వశాఖ, రక్షణ, కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడలు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత, ఉన్నత విద్య, పాఠశాల విద్య, అక్షరాస్యత, రైల్వేలు, ఆరోగ్య పరిశోధన శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వంటి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సంస్థలు.. సమాజంలోని వివిధ వర్గాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ఏయిమ్స్, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు.. శిక్షణలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాయి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తన రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లా ఉపకేంద్రాల్లో సామాజిక సీపీఆర్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. వృత్తిపరమైన సంస్థలు తమ రాష్ట్ర శాఖల ద్వారా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. డిజిటల్ అవగాహన, యువత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలు నిర్వహించాయి.
కార్యకలాపాల నిర్వహణ
సీపీఆర్ అవగాహన వారోత్సవం సందర్భంగా విస్తృత స్థాయిలో ప్రజలు పాల్గొనడం, అవగాహన పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈసీహెచ్ఓ వేదిక, యూట్యూబ్ లైవ్ ద్వారా నిర్వహించిన సీపీఆర్ ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో మొత్తం 14,701 మంది పాల్గొన్నారు. సీపీఆర్ అవగాహనకు కట్టుబడి ఉంటామని 79,870 మంది పౌరులు మై గవర్నమెంట్ వేదిక ద్వారా ప్రతిజ్ఞ చేశారు.
‘‘సీపీఆర్ పద్దతులు, పక్కవాళ్ల పాత్ర” అనే అంశంపై నిపుణులతో చర్చాకార్యక్రమాలు నిర్వహించారు. విపత్తు నిర్వహణ సెల్‌కు చెందిన ఉప డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చల్లో ఏయిమ్స్ న్యూఢిల్లీ, డాక్టర్ ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రి, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి, ఎస్ జీటీ మెడికల్ కళాశాలకు చెందిన ఆరుగురు నిపుణులు పాల్గొన్నారు. ఈసీహెచ్ఓ, యూట్యూబ్ లైవ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో 10,129 మంది పాల్గొనగా.. వీరికి సీపీఆర్, ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్స్ (ఏఈడీ) ఉపయోగించడంపై ప్రత్యక్ష్య ప్రదర్శనలు ఇచ్చారు.

సీపీఆర్ అవగాహన వారోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో సీపీఆర్ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వీటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్య శాఖలు, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ఏయిమ్స్, జాతీయ ప్రాధాన్యత గల సంస్థలు, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ, వృత్తి పరమైన సంస్థలు నిర్వహించగా మొత్తం 6,06,374 మంది ఈ శిక్షణలో పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, హౌస్‌కీపింగ్ సిబ్బంది, వివిధ మంత్రిత్వ శాఖల అధికారులకు నిర్మాణ్ భవన్ లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిచారు. దీనిద్వారా మొత్తం 264 మంది లబ్ధి పొందారు. అలాగే ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన 70 మంది అధికారులకు అక్టోబర్ 16న ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు మై గవర్నమెంట్, మై భారత్ వేదికల ద్వారా సీపీఆర్ పై ప్రశ్నోత్తరాల పోటీని నిర్వహించారు. ఇందులో 36,040 మంది పాల్గొన్నారు. వీటికితోడు ‘వాలంటీర్ ఫర్ భారత్’ కార్యక్రమం ద్వారా 368 మంది యువకులు సీపీఆర్ అవగాహనను ప్రోత్సహించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియా సెల్ సహకారంతో సీపీఆర్ అవగాహనను పెంచేందుకు అనేక డిజిటల్, సామాజిక మాధ్యమాల ద్వారా కార్యకలాపాలను చేపట్టింది.మంత్రిత్వ శాఖకు చెందిన యూట్యూబ్ ఛానెల్‌లో సీపీఆర్ పై ఒక విద్యా వీడియోను అభివృద్ధి చేసి ప్రచురించారు. ఈ వీడియోను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రామాణిక విద్యా వనరుగా అందుబాటులో ఉంచారు.
నిపుణుల ఇంటర్వ్యూలను ఆంగ్లం, హిందీలో మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురించారు. ఇవి సీపీఆర్ సాంకేతిక అంశాలు, ప్రజలకు దాని ప్రాధాన్యతను తెలియజేస్తాయి. ఇతర ఐఈసీ (సమాచారం, విద్య, కమ్యూనికేషన్) మెటీరియల్స్, కార్యక్రమ ప్రచారాలు అన్నీ కూడా డిజిటల్ వేదికలపై విస్తృత స్థాయిలో వీక్షణ పొందాయి. వీటికి ప్రజల మంచి స్పందన లభించింది.
ఆరోగ్యశాఖ కార్యదర్శి సమక్షంలో నిపుణుల ద్వారా అక్టోబర్ 13న నిర్వహించిన సీపీఆర్ ప్రత్యక్ష ప్రదర్శనను దూరదర్శన్ సహా పలు వార్తా సంస్థలు ప్రచురించాయి. అక్టోబర్ 19న దూరదర్శన్ ఛానల్ లో ‘‘టోటల్ హెల్త్ - మెడికల్ ఎమర్జెన్సీ’’ అనే శీర్షికతో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేశారు. ఇది సీపీఆర్ ప్రత్యక్ష ప్రదర్శనలను ప్రదర్శించిన ఈ కార్యక్రమంలో ఏయిమ్స్, న్యూఢిల్లీ నుంచి నిపుణులు ప్యానెల్ సభ్యులుగా పాల్గొన్నారు.
బహుముఖ కార్యకలాపాల ద్వారా నిర్వహించిన సీపీఆర్ అవగాహన వారోత్సవంలో 7,47,000 మందికి పైగా పౌరులు నిమగ్నమయ్యారు. దేశవ్యాప్తంగా 6,06,374 పైగా మందికి శారీరక శిక్షణ ఇచ్చారు.
***
(Release ID: 2181638)
Visitor Counter : 9