రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదా అధికార చిహ్నాన్ని జావెలిన్ క్రీడాకారుడు శ్రీ నీరజ్ చోప్రాకు లాంఛనంగా ప్రదానం చేసిన రక్షణ మంత్రి
లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ హోదా) నీరజ్ చోప్రా నిరంతర శ్రమకూ, దేశభక్తికీ,
భారత్ అత్యుత్తమ సామర్ధ్యానికీ నిదర్శనం: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
22 OCT 2025 1:22PM by PIB Hyderabad
ఒలింపిక్స్‌లో రెండు సార్లు పతకాలను సాధించిన జావెలిన్ క్రీడాకారుడు శ్రీ నీరజ్ చోప్రాకు ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను సూచించే అధికార చిహ్నాన్ని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు న్యూఢిల్లీలోని సౌత్ బ్లాకులో నిర్వహించిన కార్యక్రమంలో... స్వయంగా అలంకరించారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవనీయ హోదా) నీరజ్ చోప్రాతో, ఆయన కుటుంబ సభ్యులతో రక్షణ మంత్రి మాట్లాడుతూ నిరంతర శ్రమకూ, దేశభక్తికీ, అత్యుత్తమ సాధన కోసం పోరాడే భారతీయతకూ శ్రీ చోప్రా నిదర్శనమని ప్రశంసించారు.
image.png
క్రమశిక్షణ, అంకితభావం, దేశాభిమానం కలబోసుకున్న లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ హోదా) నీరజ్ చోప్రా.. క్రీడాకారులతో పాటు సాయుధ దళాలకు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తారని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేదితో పాటు భారతీయ సైన్యంలోని, ప్రాదేశిక సైన్యంలోని ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
image.png
లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ హోదా) నీరజ్ చోప్రా 2016లో భారతీయ సైన్యంలో చేరారు. రాజ్పుఠాణా రైఫిల్స్‌కు తన సేవలను అందించారు. 1997 డిసెంబరు 24న హర్యానా పానిపట్ జిల్లాలోని ఖండ్రా గ్రామంలో పుట్టిన శ్రీ నీరజ్ చోప్రా, అంతర్జాతీయ క్రీడాపోటీల్లో ప్రశంసనీయ విజయాలను సాధించి... దేశానికీ, సాయుధ దళాలకూ అమిత గౌరవాన్ని తెచ్చిపెట్టారు.
జావెలిన్‌ను విసరడంలో పేరు తెచ్చుకున్న శ్రీ నీరజ్ చోప్రా 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని గెలిచిన మొదటి భారతీయ క్రీడాకారునిగా నిలిచి చరిత్ర సృష్టించారు. 2024లో ప్యారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెల్చుకోవడంతో పాటు 2023 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించి తనదైన ప్రతిభను చాటారు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, డైమండ్ లీగ్ ఈవెంట్లలోనూ అనేక స్వర్ణ పతకాలను ఆయన సొంతం చేసుకున్నారు. ఈ ఏడాదిలో 90.23 మీటర్ల దూరం జావెలిన్‌ను విసరడం ఆయన అత్యుత్తమ ఆటతీరుకు అద్దం పట్టడమే కాక భారతీయ క్రీడాచరిత్రలోనే ఒక మహత్తర ఘట్టంగా కూడా నమోదైంది.
దేశానికి ఆయన చేసిన సేవతో పాటు ఆయన అద్భుత విజయాలకు గుర్తింపుగా ఈ సంవత్సరం ఏప్రిల్ 16న ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను (గౌరవ) నీరజ్ చోప్రాకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము అందించారు. అంతకు ముందే, పద్మ శ్రీ, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారం, అర్జున పురస్కారం, పరమ విశిష్ట సేవా పతకంతో పాటు విశిష్ట సేవా పతకంతో కూడా కేంద్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది.
***
(Release ID: 2181618)
Visitor Counter : 10