పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఘనంగా ‘ఉడాన్’ పథకం 9వ వార్షికోత్సవం
· 3.23 లక్షల విమానయానాల ద్వారా 1.56 కోట్ల మందికిపైగా ప్రయాణికులకు ‘ఉడాన్’ సేవలు
· వినియోగంలో లేని.. స్వల్ప వినియోగంలో గల 93 విమానాశ్రయాలను జోడిస్తూ 649 మార్గాల్లో సేవలు
Posted On:
21 OCT 2025 6:22PM by PIB Hyderabad
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇవాళ ప్రాంతీయ అనుసంధాన పథకం ‘ఉడాన్’ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) 9వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా అధ్యక్షతన సాగిన ప్రధాన వేడుకలలో విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) చైర్మన్, సభ్యులు, సిబ్బంది సహా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ సిన్హా మాట్లాడుతూ- జాతీయ పౌర విమానయాన విధానం కింద 2016 అక్టోబరు 21న ఉడాన్ పథకం ప్రారంభమైందని గుర్తుచేశారు. దేశంలోని సాధారణ పౌరులకు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవడం లక్ష్యంగా ఈ ప్రగతిశీల పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని వివరించారు. ఈ మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2017 ఏప్రిల్ 27న సిమ్లా-ఢిల్లీ మధ్య తొలి ‘ఉడాన్’ విమానాన్ని ప్రారంభించడం ప్రాంతీయ విమానయాన సంధానంలో నవశకానికి నాంది పలికిందని ఆయన పేర్కొన్నారు.
ఈ పథకం కింద 15 హెలిపోర్టులు, 2 వాటర్ ఏరోడ్రోమ్‌లు సహా సహా వినియోగంలో లేని, స్వల్ప వినియోగంలోగల 93 విమానాశ్రయాలను జోడిస్తూ 649 మార్గాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో 3.23 లక్షల విమానయానాల ద్వారా 1.56 కోట్ల మందికి పైగా ప్రయాణికులకు ‘ఉడాన్’ సేవలు లభించాయి. ప్రాంతీయ మౌలిక సదుపాయాల కల్పనతోపాటు విమానయాన సంస్థలకు మద్దతుగా ప్రభుత్వం ‘నష్టనివారణ నిధి’ (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్-వీజీఎఫ్) కింద రూ.4,300 కోట్లకు పైగా సహాయం అందించింది. దీంతోపాటు ‘ఉడాన్’ కింద విమానాశ్రయాల అభివృద్ధికి రూ.4,638 కోట్లదాకా పెట్టుబడులు పెట్టింది.
మరోవైపు ఈ దిశగా చేపట్టిన కీలక చర్యల్లో భాగంగా ‘సీప్లేన్’ కార్యకలాపాల నిర్వహణకు 2024 ఆగస్టులో సమగ్ర మార్గదర్శకాలను జారీచేసింది. అలాగే ‘సీప్లేన్లు, హెలికాప్టర్ల కోసం ప్రత్యేక బిడ్డింగ్ రౌండ్ కింద ‘ఉడాన్ 5.5’ పేరిట మరో ముఖ్యమైన కార్యక్రమం కూడా చేపట్టింది. దీనికి అనుగుణంగా వివిధ తీర-ద్వీప ప్రాంతాల్లోని 30 జల విమానాశ్రయాలను అనుసంధానించే 150 మార్గాలపై ప్రాథమిక ఒప్పందాల దిశగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రం (ఎల్‌ఓఐ) కూడా జారీచేసింది.
ఈ పథకాన్ని 2027 ఏప్రిల్ తర్వాత కూడా కొనసాగించడానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని శ్రీ సమీర్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఇందుకోసం పర్వత ప్రాంతాలు, ఈశాన్య భారతం సహా ఆకాంక్షాత్మక ప్రాంతాలతో అనుసంధానం లక్ష్యంగా దాదాపు 120 కొత్త గమ్యాల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ‘ఉడాన్’ చట్రాన్ని విస్తరింపజేస్తామని ఆయన ప్రకటించారు.
‘ఉడాన్’ కేవలం ఒక పథకానికి పరిమితం కాదని, ప్రగతిశీల మార్పులకు తోడ్పడే కార్యక్రమమని శ్రీ సిన్హా వ్యాఖ్యానించారు. దేశ ప్రగతి పయనంలో అంతర్భాగంగా విమానయానాన్ని సార్వజనీనం, సుస్థిరం చేయడంపై భారత్ నిబద్ధతకు నిదర్శనమని ఆయన అభివర్ణించారు.
***
(Release ID: 2181391)
Visitor Counter : 5