ఆర్థిక మంత్రిత్వ శాఖ
జీఎస్టీ పొదుపు పండగపై ఈ రోజు న్యూఢిల్లీలో సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర మంత్రులు
పాల్గొన్న కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్..
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్..
కేంద్ర రైల్వేలు, సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి శ్రీ అశ్వినీ అశ్వనీ వైష్ణవ్
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన 54 ఉత్పత్తుల పరిశీలన... వినియోగదారులకు చేరుతున్న
సవరించిన జీఎస్టీ రేట్ల ప్రయోజనాలు: కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
జీఎస్టీ సంస్కరణల ద్వారా ప్రతి ఇంటికీ ఉపశమనం, సంక్షేమం
డబుల్ ధమాకాను ప్రధానంగా ప్రస్తావించిన శ్రీ పీయూష్ గోయల్
చరిత్రాత్మక ఆటో అమ్మకాలకు నవరాత్రితో నాంది
మారుతి, మహీంద్రా, టాటా కొత్త రికార్డులు నెలకొల్పాయన్న శ్రీ గోయల్
ఆరోగ్యం, బీమా, నిత్యావసర వస్తువులపై పన్నులు తగ్గించడం పౌరులకు పెద్ద ఉపశమనం: శ్రీ గోయల్
జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో రికార్డు స్థాయి ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు
రెండంకెల తయారీరంగ వృద్ధి, సెమీ కండక్టర్ల రంగంలో విజయాలూ సాధించిన భారత్: శ్రీ అశ్వనీ అశ్వనీ వైష్ణవ్
జీఎస్టీ సంస్కరణల బలాన్ని ప్రతిబింబిస్తున్న వినియోగం.. పెట్టుబడుల్లో పెరుగుదల
ఎలక్ట్రానిక్స్ తయారీ పెరుగుదలకు డిమాండ్ తోడవడంతో
అందుబాటులోకి వచ్చిన 25 లక్షలకు పైగా ఉద్యోగాలు: శ్రీ అశ్వనీ అశ్వనీ వైష్ణవ్
Posted On:
18 OCT 2025 5:35PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్.. కేంద్ర రైల్వేలు, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి శ్రీ అశ్వినీ అశ్వనీ వైష్ణవ్ ఈ రోజు న్యూఢిల్లీలో జీఎస్టీ పొదుపు పండగపై సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి దీపావళికి ముందు తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమలవుతాయని ప్రకటించిన విషయాన్ని శ్రీమతి నిర్మలా సీతారామన్ తన ప్రారంభ ప్రసంగంలో గుర్తుచేశారు.
"ఆయన ప్రకటనకు అనుగుణంగా రేటు తగ్గింపు... ప్రక్రియను సరళీకృతం చేయడం... స్లాబ్‌ల సంఖ్యను నాలుగు నుంచి రెండుకి తగ్గించడం... వర్గీకరణ సంబంధిత సమస్యలను పరిష్కరించడం అన్నీ చాలా ముందుగానే పూర్తయ్యాయి. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు నవరాత్రి మొదటి రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. భారత ప్రజలూ ఈ నిర్ణయాన్ని బాగా స్వీకరించారని నేను భావిస్తున్నాను" అని శ్రీమతి సీతారామన్ అన్నారు.
"మేం జీఎస్టీ కోసం మార్గాన్ని నిర్దేశించాం... మేం దానిని అమలు చేశాం. ప్రతిపక్షం జీఎస్టీని తీసుకురాలేదు సరికదా కనీసం దానిని ప్రయత్నించే ధైర్యమూ చేయలేదు. ఈ రోజు మనం చేస్తున్నది దిద్దుబాటు చర్య కాదు... వివేచనాత్మక నిర్ణయం. ప్రజలకు సాధ్యమైనన్ని ప్రయోజనాలను అందించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం, జీఎస్టీ కౌన్సిల్ మధ్య సహకారానికి ఇది నిదర్శనం" అని కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు.
"వినియోగదారుల ప్రయోజనం కోసమే పన్ను రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకున్నాం. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాకు సరిగ్గా అదే చేయాలని మార్గనిర్దేశం చేశారు. 2017 నుంచి ఈ రోజు వరకు మేం దీన్ని నిరంతరం చేస్తూనే ఉన్నాం" అని శ్రీమతి సీతారామన్ అన్నారు.
"సెప్టెంబర్ 22 నుంచి మేం అన్ని వస్తువులపై జోనల్ స్థాయిల ద్వారా సమాచారాన్ని అందుకుంటున్నాం. సవరించిన పన్ను నిర్మాణ ప్రయోజనాలు తుది వినియోగదారులకు చేరుతున్నాయని నిర్ధారించుకోవడానికి మేం 54 ఉత్పత్తుల ధరలను నిశితంగా పరిశీలిస్తున్నాం. తదుపరి తరం జీఎస్టీ ప్రయోజనాలను అన్ని 54 వస్తువులకు పూర్తిగా బదిలీ చేశాం" అని కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు.
తదుపరి తరం జీఎస్టీ పరివర్తన కాలంలో ఎంపిక చేసిన 54 ఉత్పత్తులను ఆర్థిక, రెవెన్యూ శాఖలు చురుగ్గా పర్యవేక్షిస్తున్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు.
ఈ సంవత్సరం నవరాత్రిని ప్రత్యేకంగా మార్చుతూ సెప్టెంబర్ 22 నుంచి తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమలు చేసిన ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రికి శ్రీ పీయూష్ గోయల్ తన ప్రారంభ ప్రసంగంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంస్కరణ దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల్లో, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో, గృహాల్లో నూతన ఉత్సాహాన్ని, శక్తిని తీసుకువచ్చాయన్నారు. స్వాతంత్య్రానంతరం చేపట్టిన అతిపెద్ద సంస్కరణగా దీనిని అభివర్ణిస్తూ... పరోక్ష పన్ను వ్యవస్థ 140 కోట్ల మంది భారతీయులను ప్రభావితం చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రత్యక్ష-పరోక్ష పన్నులకు సంబంధించిన చర్యల ద్వారా రూ. 2.5 లక్షల కోట్ల ఉపశమనం కల్పించాలనే నిర్ణయం అపూర్వమైనది.. ఊహకు అందనిది అని శ్రీ గోయల్ వ్యాఖ్యానించారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరి 1న ఆదాయపు పన్నులో ప్రకటించిన ప్రధాన ఉపశమనం ప్రజల పొదుపును ప్రోత్సహించడానికి, ఖర్చు చేయదగిన ఆదాయాన్ని పెంచడంలో ఒక ప్రధాన ముందడుగుగా శ్రీ గోయల్ అభివర్ణించారు. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో గత ఏడాదిన్నర కాలంగా ఆర్థిక మంత్రి సమగ్ర పన్ను సంస్కరణలపై కృషి చేస్తున్నారనీ, ఇది 2025 సెప్టెంబర్ 3న వెలువడిన ప్రకటనతో ముగిసిందని ఆయన అన్నారు.
ఈ సంస్కరణల మల్టిప్లైయర్ ప్రభావం ఇప్పటికే పెట్టుబడి, వ్యాపారం, పరిశ్రమల్లో కనిపిస్తోందని శ్రీ గోయల్ పేర్కొన్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో పెరుగుదలను సృష్టించిందనీ, వినియోగ వ్యయాన్నీ పెంచిందని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిత్యావసరాలు మరింత సరసమైనవిగా మారినప్పుడు సరఫరా-డిమాండ్ రెండింటి నుంచి లభించిన ప్రోత్సాహం ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడానికి సహాయపడుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ పురోగమిస్తోందని శ్రీ గోయల్ తెలిపారు.
శ్రీ అశ్వినీ అశ్వనీ వైష్ణవ్ తన ప్రారంభ వ్యాఖ్యల్లో భారత ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలో గణనీయమైన వృద్ధిని... వినియోగం, పెట్టుబడి, తయారీపై జీఎస్టీ సంస్కరణల సానుకూల బహుళ ప్రభావాలను ప్రముఖంగా ప్రస్తావించారు. రికార్డు స్థాయిలో వినియోగదారుల డిమాండ్, విధాన స్థిరత్వం... వేగంగా విస్తరిస్తున్న తయారీ రంగం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదులను ప్రదర్శిస్తూనే ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.
ఈ సంవత్సరం నవరాత్రి సీజన్‌లో ఎలక్ట్రానిక్స్ రంగంలో రికార్డు స్థాయి అమ్మకాలు జరిగాయనీ, గత సంవత్సరంతో పోలిస్తే 20 నుంచి 25 శాతం పెరుగుదల నమోదైందని శ్రీ అశ్వనీ అశ్వనీ వైష్ణవ్ తెలియజేశారు. టెలివిజన్లు, వాషింగ్ మెషీన్ల నుంచి స్మార్ట్ఫోన్లు, ఎయిర్ కండీషనర్ల వరకు అనేక రకాల ఉత్పత్తులకు అన్ని ప్రధాన రిటైల్ చైన్‌లలో అపూర్వమైన డిమాండ్ నమోదైందని తెలిపారు. ముఖ్యంగా 85-అంగుళాల టెలివిజన్లు పూర్తిగా అమ్ముడయ్యానీ... అనేక కుటుంబాలు తమ ఉపకరణాలను కొత్త మోడళ్లకు అప్‌గ్రేడ్ చేసుకున్నాయని ఆయన వివరించారు. ఇది పెరుగుతున్న వినియోగదారుల విశ్వాసం, కొనుగోలు శక్తినీ ప్రతిబింబిస్తుందని శ్రీ అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.
జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు నిర్మాణాత్మక స్థిరత్వాన్ని తీసుకువచ్చాయని, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాయని శ్రీ అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు. గత నాలుగు నెలలుగా ఆహార ధరలు ద్రవ్యోల్బణంలో దాదాపు 2 శాతం తగ్గుదల ధోరణిని చూపించాయన్నారు. ఇది ఇంటి కొనుగోలు స్తోమతను నిర్వహించడానికి, స్థిరమైన వినియోగదారుల డిమాండ్‌కు మద్దతునివ్వడానికి సహాయపడిందని శ్రీ అశ్వనీ వైష్ణవ్ వివరించారు.
డిమాండ్ పెరుగుదల భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో రెండంకెల వృద్ధికి ప్రత్యక్షంగా దారితీసిందనీ, దేశవ్యాప్తంగా 25 లక్షలకు పైగా ప్రజలకు ఉపాధి కల్పించిందని శ్రీ అశ్వనీ వైష్ణవ్ అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద వినియోగదారు మార్కెట్లలో ఒకటైన అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో భారత్ తన పొరుగు దేశాన్నీ అధిగమించిందన్నారు. ఒక ప్రధాన ప్రపంచస్థాయి సంస్థ ఇప్పుడు తన మొత్తం ఉత్పత్తిలో 20 శాతం భారత్‌లోనే ఉత్పత్తి చేస్తోందనీ... ఇది ప్రాధాన్యత గల ప్రపంచ తయారీ గమ్యస్థానంగా భారత్ ఆవిర్భావాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. డిమాండ్ పెరిగేకొద్దీ పెట్టుబడి పెరుగుతుంది...దీంతో డిమాండ్ కూడా మరింత పెరుగుతుంది... తద్వారా ఆర్థిక వృద్ధిలో పునరావృత చక్రాన్ని ఇది సృష్టిస్తుందని కేంద్ర మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ వివరించారు.
భారత సాంకేతిక వ్యవస్థలో ఒక కీలకమైన విజయాన్ని ప్రస్తావిస్తూ.. సెమీ కండక్టర్ల రంగంలో స్వయం-సమృద్ధి దిశగా భారత్ ప్రయాణంలో కీలక ముందడుగు పడిందని శ్రీ అశ్వనీ అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. సీజీ సెమీ, కేన్స్ అనే రెండు సెమీ కండక్టర్ల తయారీ కేంద్రాల్లో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైందని శ్రీ అశ్వనీ అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ ప్లాంట్లు కార్యకలాపాలను కొనసాగిస్తున్న క్రమంలో భారత సెమీ కండక్టర్ల వ్యవస్థలో కొత్త దశ ప్రారంభమైందన్నారు. భారత్ సాంకేతిక సాధికారతను, స్వయం-సమృద్ధినీ సాధించాలనే ప్రధానమంత్రి దార్శనికతకు ఇది అనుగుణంగా ఉందని కేంద్ర మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ వ్యాఖ్యానించారు.
స్థూల ఆర్థిక డేటాను ప్రస్తావిస్తూ... గత సంవత్సరం దేశపు రూ. 335 లక్షల కోట్ల జీడీపీలో రూ. 202 లక్షల కోట్లు వినియోగం ద్వారా, రూ. 98 లక్షల కోట్లు పెట్టుబడుల ద్వారా వచ్చాయని కేంద్ర మంత్రి వివరించారు. జీఎస్టీ సంస్కరణల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్న శ్రీ అశ్వనీ వైష్ణవ్ ... ఈ సంవత్సరం వినియోగం దాదాపు 10 శాతం పెరిగిందనీ, వినియోగదారుల వ్యయం అదనంగా రూ. 20 లక్షల కోట్లు పెరగడం దీనిని ప్రతిబింబిస్తున్నదని వివరించారు. ఈ పెరుగుదల పెట్టుబడుల్లో తదనుగుణమైన పెరుగుదలకు దారితీస్తుందని, వృద్ధి వేగాన్నీ బలోపేతం చేస్తుందని ఆయన తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక వ్యవస్థలో వినియోగం, పెట్టుబడి మధ్య సంబంధాన్ని ఎలా బలోపేతం చేశాయో ఇది నిరూపిస్తుందని శ్రీ అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు.
జీఎస్టీ పొదుపు పండగ పత్రికా సమావేశాన్ని ఇక్కడ చూడండి:
https://www.youtube.com/watch?v=a610oNnYsak
సోషల్ మీడియాపై ఇతర పోస్టులు:
https://x.com/nsitharamanoffc/status/1979477378783952935
https://x.com/nsitharamanoffc/status/1979483460428275964
https://x.com/nsitharamanoffc/status/1979490241590288400
https://x.com/nsitharamanoffc/status/1979490887940874583
https://x.com/nsitharamanoffc/status/1979492109221597574
https://x.com/AshwiniVaishnaw/status/1979493163481079993
https://x.com/PiyushGoyal/status/1979448718798786664
https://x.com/PiyushGoyal/status/1979476359177982128
https://x.com/PiyushGoyal/status/1979479118283489330
https://x.com/PiyushGoyal/status/1979493568189288510
https://x.com/PiyushGoyal/status/1979500837585174862
https://x.com/mib_india/status/1979477488905380206
https://x.com/mib_india/status/1979474778185400593
https://x.com/mib_india/status/1979491958130393454
https://x.com/mib_india/status/1979487257817227633
***
(Release ID: 2180891)
Visitor Counter : 8
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam