ప్రధాన మంత్రి కార్యాలయం
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
प्रविष्टि तिथि:
16 OCT 2025 7:16PM by PIB Hyderabad
సోదరీ సోదరులు అందరికీ శుభాకాంక్షలు!
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, ప్రజాదరణ పొందిన, కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులు శ్రీ కె.రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని గారు, శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, ఇతర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్ఏలు అందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదరీసోదరులకు...
ముందుగా అహోబిలం నరసింహ స్వామికి, మహానంది మహానందీశ్వర స్వామికి ప్రణామాలు అర్పిస్తున్నాను. మనందరిపై మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.
స్నేహితులారా,
సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం అని ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో పఠిస్తాం. అంటే.. పన్నెండు జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథుడు. రెండోది మల్లికార్జునుడు. సోమనాథుని క్షేత్రమైన గుజరాత్‌లో జన్మించడం నా అదృష్టం. బాబా విశ్వనాథుని భూమి కాశీకి సేవలు చేసే అవకాశం నాకు దక్కింది. ఇప్పుడు నేను శ్రీశైలం ఆశీర్వాదాలను పొందుతున్నాను.
స్నేహితులారా,
శ్రీశైల దర్శనానంతరం, శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి నివాళులు అర్పించే అవకాశం నాకు దక్కింది. ఈ వేదిక నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు నేను ప్రణమిల్లుతున్నాను. అల్లమ ప్రభు, అక్కమహాదేవి లాంటి శివ భక్తులకు వందనమర్పిస్తున్నాను. శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, హరి సర్వోత్తమ రావు లాంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధులకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను.
స్నేహితులారా,
స్వాభిమానానికి, సంస్కృతికి నిలయం ఆంధ్రప్రదేశ్. అదే సమయంలో విజ్ఞానానికి, సాంకేతికతకు సైతం కేంద్రంగా ఉంది. అనంతమైన సామర్థ్యం, అపారమైన యువశక్తి ఉన్న భూమి ఇది. ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సిందల్లా.. సరైన దార్శనికత, సరైన నాయకత్వం. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కల్యాణ్ గారి రూపంలో శక్తిమంతమైన నాయకత్వం ఉంది. కేంద్రం నుంచి పూర్తి సహకారం కూడా ఉంది.
స్నేహితులారా,
గడచిన 16 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో వేగవంతమైన అభివృద్ధి జరుగుతోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం హయాంలో అపూర్వమైన ప్రగతి సాధిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ, అమరావతి కలసి ప్రగతి దిశగా వేగంగా సాగుతున్నాయి. చంద్రబాబు చెప్పినట్లు.. ఈ వేగాన్ని చూస్తుంటే.. వందేళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలను చేసుకొనే 2047 నాటికి ‘‘వికసిత్ భారత్’’ (అభివృద్ధి చెందిన భారత్) సాకారమవుతుందని నేను నమ్మకంగా చెప్పగలను. ఇప్పుడే చంద్రబాబు భావోద్వేగంతో చెప్పారు. నేను కూడా 21వ శతాబ్దం భారతీయులదేనని కచ్చితంగా చెబుతున్నాను. ఈ శతాబ్దం 140 కోట్ల మంది భారతీయులదే.
స్నేహితులారా,
రోడ్లు, విద్యుత్, రైల్వేలు, జాతీయ రహదారులు, వాణిజ్యానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకు ఈ రోజు మనం ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసుకున్నాం. ఇవి రాష్ట్రంలో రవాణా సదుపాయాలను బలోపేతం చేస్తాయి. పరిశ్రమలను ప్రోత్సహిస్తాయి. ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా కర్నూలు, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టులకు గాను రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
స్నేహితులారా,
ఏ దేశం, రాష్ట్రం అభివృద్ధికైనా.. విద్యుత్ భద్రత చాలా కీలకం. విద్యుత్ రంగంలో సుమారుగా రూ. 3,000 కోట్ల విలువైన ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులను ఈ రోజు ప్రారంభించాం. ఇవి దేశ విద్యుత్ సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తాయి.
స్నేహితులారా,
మనం వేగంగా అభివృద్ధి సాధిస్తున్ననప్పటికీ గతాన్ని మరచిపోకూడదు. పదకొండేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేశంలో తలసరి విద్యుత్ వినియోగం సరాసరి 1,000 యూనిట్ల కంటే తక్కువే ఉండేది. దేశంలో తరచూ విద్యుత్ కోతలు ఉండేవి. అనేక గ్రామాలకు విద్యుత్ స్తంభాలు ఉండేవి కాదు. ఇప్పుడు స్వచ్ఛ ఇంధనం నుంచి విద్యుత్తు ఉత్పత్తి వరకు అన్ని రంగాల్లోనూ భారత్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామానికి ఇప్పుడు విద్యుత్ సదుపాయం ఏర్పడింది. తలసరి విద్యుత్ వినియోగం 1,400 యూనిట్లకు చేరుకుంది. అలాగే, పరిశ్రమలకు, గృహాలకు తగినంత విద్యుత్ అందుబాటులో ఉంది.
స్నేహితులారా,
దేశంలో ఈ ఇంధన విప్లవంలో ప్రధాన కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. చంద్రబాబు నాయకత్వంలో శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయు పైప్‌లైన్ ప్రాజెక్టు ఈ రోజు ప్రారంభమైంది. దీనికి దాదాపు 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా చేసే సామర్థ్యం ఉంది. రోజుకి 20,000 సిలిండర్లను నింపే సామర్థ్యం ఉన్న ఎల్పీజీ బాట్లింగ్ యూనిట్ చిత్తూరులో ఈ రోజు ప్రారంభమైంది. ఇది స్థానిక రవాణా, నిల్వ రంగాల్లో ఉద్యోగాలను సృష్టిస్తుంది. యువతకు నూతన అవకాశాలను అందిస్తుంది.
స్నేహితులారా,
‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని వేగంగా సాధించే దిశగా బహుళార్థక మౌలికవసతులను అభివృద్ధి చేస్తున్నాం. గ్రామాల నుంచి నగరాలకు, నగరాల నుంచి ఓడరేవులకు రవాణా సదుపాయాలను కల్పించడంపై మేం దృష్టి సారించాం. సబ్బవరం నుంచి షీలానగర్ వరకు నిర్మించబోతున్న కొత్త జాతీయ రహదారి రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది. రైల్వే రంగంలోనూ సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. కొత్త రైల్వే లైన్ల ప్రారంభం, రైల్వే ఫ్లైఓవర్ల నిర్మాణంతో ప్రయాణం మరింత సులభతరమవుతుంది. ఇవి ఈ ప్రాంతంలోని పరిశ్రమలకు ఊతమిస్తాయి.
స్నేహతులారా,
2047 నాటికి ‘వికసిత్ భారత్’ నిర్మించాలనే సంకల్పంతో మేం ఉన్నాం. ఈ జాతీయ కార్యక్రమం.. ‘‘స్వర్ణాంధ్ర’’ లక్ష్యంతో మరింత శక్తిమంతమవుతోంది. సాంకేతిక విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్ర యువత ఎప్పుడూ ముందంజలోనే ఉన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం నేతృత్వంలో ఆంధ్రా అపార శక్తిని మరింత విస్తరిస్తాం.
స్నేహితులారా,
ప్రస్తుతం.. భారత్, ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న అభివృద్ధి వేగాన్ని, స్థాయిని మొత్తం ప్రపంచం గుర్తిస్తోంది. రెండు రోజుల క్రితమే, ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులను గూగుల్ ప్రకటించింది. భారత దేశంలోనే మొదటి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్ ఏర్పాటు చేయబోతోంది. నిన్న గూగుల్ సీఈవోతో నేను మాట్లాడినప్పుడు ‘‘అమెరికా వెలుపల అనేక దేశాల్లో తమకు అనేక పెట్టుబడులున్నాయి. కానీ వాటిని మించి ఆంధ్రప్రదేశ్‌లోనే భారీ మొత్తంలో పెట్టుబడి పెడుతున్నాం’’ అని చెప్పారు. ఈ ఏఐ కేంద్రంలో.. శక్తిమంతమైన ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్, పెద్ద స్థాయిలో ఇంధన వనరులు, విస్తారమైన ఫైబర్ ఆప్టిక్ వ్యవస్థ ఉన్నాయి.
స్నేహితులారా,
గూగుల్ ఏఐ హబ్ పెట్టుబడుల్లో భాగంగా.. అంతర్జాతీయ సబ్‌సీ గేట్ వే నిర్మిస్తారు. దీనిలో తూర్పు తీరంలోని విశాఖపట్నానికి చేరుకునే బహుళ అంతర్జాతీయ సబ్ సీ కేబుళ్లు ఉంటాయి.
స్నేహితులారా,
ఈ ప్రాజెక్టు ఏఐ, అనుసంధానతలో విశాఖపట్నాన్ని అంతర్జాతీయ కేంద్రంగా నిలబెడుతుంది. ఇది భారత్‌కు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి సేవలందిస్తుంది. ఈ విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను అభినందిస్తున్నాను. అలాగే చంద్రబాబు దార్శనిక నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నాను.
స్నేహితులారా,
భారత అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ పురోగతి ఆవశ్యకం. ఆంధ్ర ప్రగతిలో రాయలసీమ అభివృద్ధికి కూడా అంతే ప్రాధాన్యముందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. కర్నూలులో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులు.. రాయలసీమలోని ప్రతి జిల్లాకు ఉద్యోగావకాశాలను, సంక్షేమాన్ని అందిస్తాయి. ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతిని ఈ ప్రాజెక్టులు వేగవంతం చేస్తాయి.
స్నేహితులారా,
ఆంధ్రప్రదేశ్‌ను వేగంగా అభివృద్ధి చేయడానికి కొత్త పారిశ్రామిక కారిడార్లను, కేంద్రాలను తయారుచేయాలి. ఈ లక్ష్యంతోనే.. ఆంధ్రప్రదేశ్‌కు నూతన పారిశ్రామిక గుర్తింపునిచ్చేలా ఓర్వకల్లు, కొప్పర్తిలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఓర్వకల్లు, కొప్పర్తిల్లో పెట్టుబడులు పెరుగుతుంటే.. యువతకు ఉద్యోగ అవకాశాలు నిరంతరం విస్తరిస్తూనే ఉంటాయి.
స్నేహితులారా,
21వ శతాబ్దపు సరికొత్త తయారీ కేంద్రంగా భారత్‌ను ప్రస్తుత ప్రపంచం పరిగణిస్తోంది. ఈ విజయానికి ‘ఆత్మనిర్భర భారత్’ అనే దార్శనికతే అతి పెద్ద పునాది. ఆత్మ నిర్భర భారత్‌లో కీలక కేంద్రాల్లో ఒకటిగా మన ఆంధ్రప్రదేశ్ మారనుంది.
స్నేహితులారా,
ఆంధ్రప్రదేశ్ అసలైన సామర్థ్యాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి మాత్రమే కాకుండా.. మొత్తం దేశానికి కూడా హాని కలిగించాయి. దేశాభివృద్ధిని నడిపించగలిగిన రాష్ట్రమే.. సొంత అభివృద్ధి కోసం పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారుతోంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆత్మనిర్భర భారత్‌కు నూతన శక్తి కేంద్రంగా ఆవిర్భవిస్తోంది. ఆంధ్రావ్యాప్తంగా తయారీ రంగం వేగంగా విస్తరిస్తోంది. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా వేసిన మరో ముందడుగే నిమ్మలూరులో ఏర్పాటు చేసే అధునాతన నైట్ విజన్ కర్మాగారం. నైట్ విజన్ పరికరాలు, మిస్సైల్ సెన్సర్లు, డ్రోన్ గార్డు వ్యవస్థలను ఉత్ప్తతి చేయడం ద్వారా భారత సామర్థ్యాలను ఈ కర్మాగారం బలోపేతం చేస్తుంది. ఇక్కడ తయారయ్యే పరికరాలు భారత రక్షణ ఎగుమతులను పెంచుతాయి. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌లో తయారైన సాంకేతికతల సామర్థ్యాలను మనం చూశాం.
స్నేహితులారా,
దేశానికే తలమానికమైన డ్రోన్ హబ్‌గా కర్నూలును మార్చాలని ఆంధ్ర ప్రభుత్వం సంకల్పించుకోవడం సంతోషకరం. డ్రోన్ పరిశ్రమ ద్వారా కర్నూలుతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక నూతన భవిష్యత్ సాంకేతికత రంగాలు పుట్టుకొస్తాయి. నేను ముందే చెప్పినట్టుగానే.. ఆపరేషన్ సిందూర్ సమయంలో డ్రోన్లు చేసిన అద్భుతం ప్రపంచాన్ని అబ్బురపరిచింది. భవిష్యత్తులో డ్రోన్ల రంగంలో దేశంలోనే ప్రధాన శక్తిగా కర్నూలు మారుతుంది.
స్నేహితులారా,
పౌర కేంద్రక అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం! దీని కోసమే.. ప్రజల జీవితాలను సులభతరం చేసేలా మేం నిరంతరం సంస్కరణలు తీసుకొస్తున్నాం. ఇప్పుడు మన దేశంలో రూ.12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అందుబాటు ధరల్లో ఔషధాలు, తక్కువ ఖర్చులో ఆరోగ్య సేవలు, వయోధికులకు ఆయుష్మాన్ కార్డులు జీవన సౌలభ్యాన్ని అందిస్తున్నాయి.
స్నేహితులారా,
నవరాత్రుల మొదటి రోజు నుంచే జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గాయి. నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇక్కడి ప్రజలు జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మీరు ‘‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’’ ప్రచారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రూ. 8,000 కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని నాకు చెప్పారు. ఈ పొదుపు, పండగ సమయంలో ఉత్సాహాన్ని పెంచుతోంది. అయితే, నాది కూడా ఓ విన్నపం ఉంది. ఓకల్ ఫర్ లోకల్! నినాదంతో జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని మనం నిర్వహించుకుందాం.
స్నేహితులారా,
‘వికసిత ఆంధ్ర’ (అభివృద్ధి చెందిన ఆంధ్ర) ద్వారా మాత్రమే ‘వికసిత భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) అనే లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం. మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరూ నాతో కలసి చెప్పండి భారత్ మాతాకీ జై! అక్కడ ఉన్న ఇద్దరు చిన్నారులు వారు గీసిన పెయింటింగులను చాలా సేపటి నుంచి పట్టుకొని ఉన్నారు. ఎస్పీజీ బృందం దయచేసి వారి దగ్గర నుంచి వాటిని తీసుకోండి. ఇప్పుడు నాతో కలసి చెప్పండి: భారత్ మాతాకీ జై! భారత్ మాతాకీ జై! భారత్ మాతాకీ జై!
ధన్యవాదాలు!
***
(रिलीज़ आईडी: 2180395)
आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam