కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
కోట్లాది మంది చందాదారుల జీవన సౌలభ్యం కోసం చేపట్టిన ఈపీఎఫ్ఓ సంస్కరణల ప్రయోజనాలను తెలియజేసిన కార్మిక - ఉపాధి మంత్రిత్వ శాఖ
వేగవంతమైన, సరళమైన, మరింత పారదర్శక పీఎఫ్ ఉపసంహరణల కోసం పదమూడు సంక్లిష్ట నిబంధనలను మూడు వర్గాలుగా విభజించిన ఈపీఎఫ్ఓ సంస్కరణలు
ఉపసంహరణ అర్హత కోసం కావాల్సిన ఉద్యోగ వ్యవధి ఏడు నుంచి ఒక సంవత్సరానికి తగ్గింపు
అర్హత కలిగిన మొత్తంలో 75 శాతాన్ని ఇప్పుడు ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఉపసంహరించుకునే వీలు
ప్రత్యేక పరిస్థితుల్లో పూర్తి ఉపసంహరణకు అనుమతి
పీఎఫ్‌ను కొనసాగించేలా ప్రోత్సహించేందుకు, భవిష్యత్తులో పింఛను ప్రయోజనాలను పొందేందుకు ఈపీఎస్ ఉపసంహరణ నియమాల సవరణ
Posted On:
15 OCT 2025 10:10PM by PIB Hyderabad
ఇటీవల చేపట్టిన ఈపీఎఫ్‌ఓ(ఈపీఎఫ్ఓ) సంస్కరణలు, సవరించిన నిబంధనల గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ తప్పుదారి పట్టించే విషయాలను ప్రచారం చేస్తోంది. ఇది ఉపసంహరణ నియమాలు, అర్హత నిబంధనలు, సభ్యుల భవిష్య నిధి మొత్తాన్ని ఉపసంహరించుకోవటానికి సంబంధించిన వాస్తవాలను వక్రీకరిస్తోంది. ఈపీఎఫ్ చందాదారులలో గందరగోళాన్ని సృష్టించిన ఈ పోస్ట్‌లో చెప్పిన విషయాలు వాస్తవాలకు అతీతంగా ఉండటంతో పాటు పూర్తిగా తప్పుదారి పట్టించేవని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది.
వ్యవస్థీకృత రంగంలోని లక్షలాది మంది కార్మికులకు దీర్ఘకాలిక సామాజిక భద్రతనివ్వటంలో ఈపీఎఫ్ఓ కీలక పాత్ర పోషిస్తోంది. సీబీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్) ఇటీవల తీసుకున్న నిర్ణయం.. పదవీ విరమణ సమయంలో సముచిత మొత్తాన్ని ఇవ్వటంతో పాటు వివిధ అవసరాలకు ఉదార విధానంలో సరళీకృత ఉపసంహరణలు అందించటం అనే రెండింటి మధ్య సమతుల్యతను పాటించింది. ఇది సభ్యులకు జీవన సాలభ్యాన్ని కూడా అందించనుంది. యజమాన్య, ఉద్యోగి ప్రతినిధులతో కూడిన త్రైపాక్షిక కమిటీ అయిన ఈపీఎఫ్ఓ ఫైనాన్స్- ఆడిట్ కమిటీ ఈ మార్పులను సిఫార్సు చేసింది. ఈ మార్పులను ఉద్యోగి, యాజమాన్య, ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన సీబీటీ ఆమోదించింది. ఇలా భాగస్వాములందరితో విస్తృతమైన సంప్రదింపులు చేసిన తర్వాతనే ఈపీఎఫ్ఓ సవరణలు చేపట్టింది.
గతంలో కనీస ఉద్యోగ వ్యవధికి సంబంధించిన విషయంలో సంక్లిష్టత ఉండేది. దీనివల్ల క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవటం కానీ ఆలస్యమవటం కానీ అయ్యేది. పాక్షిక ఉపసంహరణలకు సంబంధించిన చాలా నిబంధనల వల్ల సభ్యులు గందరగోళానికి గురయ్యేవారు. వీటివల్ల ఉపసంహరణ క్లెయిమ్‌లు కూడా తరచుగా తిరస్కరణ అయ్యేవి. గతంలో ఉన్న 13 రకాల పాక్షిక ఉపసంహరణ నిబంధనలను ఇప్పుడు ఒకే ఏకీకృత సరళమైన నిబంధన కిందకు తీసుకొచ్చారు. నిబంధనల సరళీకరణకు ముందు పీఎఫ్ చందాదారుడు 50 నుంచి 100 శాతం వరకు ఉపసంహరించుకునే వీలు ఉండేది. అయితే దీనికి ఉద్యోగి వాటా, వడ్డీని మాత్రమే పరిగణినలోకి తీసుకునేవారు. ఇప్పుడు ఉపసంహరించుకోదగిన మొత్తంలో ఉద్యోగి వాటా, వడ్డీతో పాటు యజమాని వాటాను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇప్పుడు ఉపసంహరించుకునేందు అర్హత ఉన్న 75 శాతం నిధులను చూసుకుంటే గత నిబంధనల ప్రకారం వచ్చే మొత్తం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు ఉపసంహరణకు ఉండాల్సిన ఉద్యోగ వ్యవధి ఏడు సంవత్సరాల వరకు ఉండేది. ఇందులో కూడా వివిధ రకాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని రకాల ఉపసంహరణలకు ఏకరీతిలో 12 నెలలు ఉద్యోగ వ్యవధిని నిర్ణయించారు. ఇది ఈపీఎఫ్ఓ సభ్యులకు సులభతంగా అర్థమవటమే కాకుండా ముందస్తు ఉపసంహరణను సులభతరం చేస్తుంది.
దీనిప్రకారం ఇప్పుడు ఉద్యోగి కేవలం 12 నెలల వ్యవధి తర్వాత మునుపటి కంటే మరింత ఎక్కువగా ఉపసంహరించుకోవచ్చు.
పదే పదే ఉపసంహరణలు చేసుకోవటం వల్ల పదవీ విరమణ సమయంలో తగినంత పీఎఫ్ మొత్తం ఉండేది కాదు. పదవీ విరమణ సమయంలో 50 శాతం సభ్యుల బ్యాలెన్స్ రూ. 20,000 కంటే తక్కువ, 75 శాతం మంది బ్యాలెన్స్ రూ. 50,000 కంటే తక్కువ ఉండేది. తరచూ ఉపసంహరణలు చేసుకోవటం వల్ల తక్కువ వేతనాలు ఉన్న వాళ్లు 8.25 శాతం చక్రవడ్డీ ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. తద్వారా ఎక్కువ మంది వారి ఉద్యోగ జీవితం అనంతరం సముచిత సామాజిక భద్రతను కోల్పోతున్నారు. అందుకే పదవీ విరమణ సమయంలో సరిపడా స్థాయిలో నిధులు అందటంతో పాటు దీర్ఘకాలిక సామాజిక భద్రతను అందించేందుకు 25 శాతం పీఎఫ్ బ్యాలెన్స్‌ను కొనసాగించాలన్న నిర్ణయం సీబీటీ తీసుకుంది.
నిరుద్యోగిగా మారినట్లయితే 75 శాతం బ్యాలెన్స్‌ను (యజమాని, ఉద్యోగి వాటాతో పాటు వడ్డీ) వెంటనే ఉపసంహరించుకోవచ్చు. ఒక సంవత్సరం తర్వాత మిగిలిన 25 శాతం మొత్తాన్ని కూడా ఉపసంహరించుకోవచ్చు. 55 ఏళ్ల వయస్సు, శాశ్వత వైకల్యం, పని చేయటంలో అసమర్థత, తొలగింపు, స్వచ్ఛంద పదవీ విరమణ లేదా విదేశాలకు శాశ్వతంగా వెళ్లటం వంటి కారణాలతో పదవీ విరమణ పొందినట్లయితే కూడా మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌ను (కనీస బ్యాలెన్స్ 25 శాతంతో సహా) పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు.
58 సంవత్సరాల వయస్సు నుంచి పింఛను పొందేందుకు గల అర్హతల్లో ఎలాంటి మార్పులు లేవు. ఒక సభ్యుడు పది సంవత్సరాల ఉద్యోగ వ్యవధి పూర్తి చేయనట్లయితే పింఛను ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. అయితే పదవీ విరమణ అనంతరం పింఛను పొందేందుకు 10 సంవత్సరాల ఉద్యోగ వ్యవధి తప్పనిసరి. దాదాపు 75 శాతం ఈపీఎఫ్ఓ సభ్యులు పించను మొత్తాన్ని నాలుగు సంవత్సరాల సర్వీస్‌లోపే (అంటే 10 సంవత్సరాల కంటే తక్కువ సమయం) ఉపసంహరించుకుంటున్నారు. దీనివల్ల వారి సభ్యత్వం ముగియటంతో పాటు భవిష్యత్తులో పింఛను, సామాజిక భద్రతా ప్రయోజనాలకు అనర్హులు అవుతున్నారు. పింఛను నిధిని తీసుకోకుండా చందాదారుడు మరణించినట్లయితే.. నెలవారీ చందా ఆగిపోయిన అనంతరం మూడు సంవత్సరాల వరకు చందాదారుడి కుటుంబం పింఛను ప్రయోజనాలను పొందవచ్చు. ఉపసంహరించుకున్నట్లయితే ఈ ప్రయోజనం వర్తించదు.
నూతన ప్రతిపాదనలు ఈపీఎఫ్ఓ సభ్యులు పింఛను పొందేందుకు 10 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసేలా చూసుకోవటం, వారు మరణించిన సందర్భంలో సంబంధింత కుటుంబం ఆయా ప్రయోజనాలకు అర్హత పొందేలా చేసేందుకు.. పింఛను ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు 2 నెలల గడువును 36 నెలలకు పెంచాయి. ఇది ఈపీఎఫ్ఓ సభ్యులు, వారి కుటుంబాలకు పింఛను రూపంలో దీర్ఘకాలిక సామాజిక భద్రతను అందేలా చూసుకుంటుంది.
ఈపీఎఫ్ఓ సామాజిక భద్రత పరంగా దీర్ఘకాలిక రక్షణను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ మొత్తాన్ని బ్యాంకు ఖాతా మాదిరిగా ఉపయోగించకూడదు. ఈపీఎఫ్, ఎంపీ చట్టం- 1952 ప్రకారం నెలకు రూ. 15,000 వరకు జీతం పొందుతున్న 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను నియమించే సంస్థలకు ఈపీఎఫ్ తప్పనిసరి. అయితే రూ. 15,000 కంటే ఎక్కువ జీతం పొందుతున్న ఈపీఎఫ్ఓ సభ్యులలో కూడా దాదాపు 35 శాతం మంది, 15 శాతం సంస్థలు(సుమారు 1.06 లక్షలు) స్వచ్ఛందంగా ఈపీఎఫ్ఓలో చేరాయి. ఇది ఉద్యోగ భవిష్య నిధి సంస్థపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది.
సామాజిక మాధ్యమాల్లోని పోస్ట్‌లో నిరుద్యోగం పెరుగుతుందనే ప్రభుత్వ అంచనాను కొత్త నియమాలు ప్రతిబింబిస్తున్నాయన్న వాదన ఉంది. ఇది పూర్తి నిరాధారమైనది. అధికారిక గణాంకాల ప్రకారం 2024–25లో 1.29 కోట్లకు పైగా ఉద్యోగులు వేతన జాబితాలో కొత్తగా చేరారు. నిరుద్యోగిత రేటు 2023–24లో 3.2 శాతానికి పడిపోయింది. ఇది 2017–18లో 6 శాతంగా ఉంది.
ఈపీఎఫ్ఓ దాదాపు రూ.28 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. దృఢత్వం, భద్రత, అధిక రాబడి (చాలా సందర్భాలలో పన్ను ఉచితం) కారణంగా కోట్లాది మంది సభ్యుల విశ్వాసాన్ని ఈ సంస్థ సంపాదించుకుంది. సామర్థ్యాన్ని మెరుగపరచటం, మరింత పారదర్శకత కోసం విధానాలను సరళీకరించడం, డిజిటల్ సాధనాలను బలోపేతం చేయటాన్ని కొనసాగిస్తూనే.. 30 కోట్లకు పైగా సభ్యుల సామాజిక భద్రతా ప్రయోజనాలను కాపాడటానికి ఈపీఎఫ్ఓ కట్టుబడి ఉంది.
సభ్యులు, ప్రజలు ఖచ్చితమైన సమాచారం కోసం కార్మిక - ఉపాధి మంత్రిత్వ శాఖ, ఈపీఎఫ్ఓ జారీ చేసిన అధికారిక సమాచారం - ప్రకటనలపై మాత్రమే ఆధారపడాలి. ఆధారాలు లేని తప్పుదారి పట్టించే సామాజిక మాధ్యమ పోస్టులను నమ్మొద్దని సూచిస్తున్నాం.
***
(Release ID: 2179977)
Visitor Counter : 32