ఉప రాష్ట్రపతి సచివాలయం
కార్మిక సంస్కరణలు.. యువతరం సాధికారత.. క్రీడా రంగానికి ప్రోత్సాహం దిశగా కృషిపై ఉపరాష్ట్రపతి శ్రీ.సి.పి.రాధాకృష్ణన్ ప్రశంసలు
· ఒకే భారత్-శ్రేష్ఠ భారత్’ బలోపేతంలో యువజన ఆదానప్రదాన కార్యక్రమాల పాత్ర కీలకమని స్పష్టీకరణ · కార్మికుల కోసం సార్వత్రిక సామాజిక భద్రత కార్యక్రమాలకు ప్రశంస · ఒలింపిక్స్ వంటి భారీ అంతర్జాతీయ క్రీడోత్సవాల నిర్వహణ భారత క్రీడారంగానికి మేలిమలుపు కాగలదని వ్యాఖ్య
Posted On:
14 OCT 2025 4:52PM by PIB Hyderabad
పార్లమెంటు భవనంలో ఇవాళ ఉప-రాష్ట్రపతి శ్రీ కె.పి.రాధాకృష్ణన్‌తో ఇద్దరు కేంద్ర మంత్రులతోపాటు ఇద్దరు సహాయ మంత్రులు సమావేశమయ్యారు. ఈ మేరకు కార్మిక-ఉపాధి, యువజన వ్యవహారాలు-క్రీడా శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, ఈ రెండు శాఖల సహాయ మంత్రులు శ్రీమతి శోభా కరంద్లాజే, శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే సహా సీనియర్ అధికారులు కూడా వీరిలో ఉన్నారు. ఈ సందర్భంగా తమ శాఖల పరిధిలో చేపట్టిన కీలక కార్యక్రమాలు, విధాన సంస్కరణల గురించి వారు ఉప-రాష్ట్రపతికి వివరించారు.
కార్మికుల కోసం పని పరిస్థితులతో పాటు జీవన నాణ్యత మెరుగుదల, ఉపాధి పెంపు, సామాజిక-వృత్తిపరమైన భద్రత బలోపేతం, ఆరోగ్యానికి భరోసా, సామరస్యపూర్వక పారిశ్రామిక సంబంధాల పటిష్ఠీకరణ లక్ష్యంగా కార్మిక-ఉపాధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న సమగ్ర కార్యక్రమాలను ఉప-రాష్ట్రపతికి వివరించారు. వీటితోపాటు ఈ-శ్రమ్, శ్రమ్ సువిధ పోర్టళ్లు, ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన, నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ తదితర ప్రధాన సంస్కరణలను ప్రముఖంగా ప్రస్తావించారు.
కార్మిక చట్టాల సరళీకరణకు మంత్రిత్వశాఖ చేస్తున్న కృషితో పాటు వివిధ రంగాల్లో సామాజిక భద్రత పెంపు సహా కొత్త ఉపాధి అవకాశాల సృష్టికి చేపట్టిన చర్యలపై ఉప-రాష్ట్రపతి హర్షం ప్రకటించారు. కార్మిక సంక్షేమం మెరుగుదల, సమ్మిళిత ఆర్థిక వృద్ధి దిశగా భారత్ పయనం కొనసాగింపు తదితరాలపై కార్మిక-ఉపాధి మంత్రిత్వశాఖ నిబద్ధతను ఆయన ప్రశంసించారు.
అనంతరం యువజన వ్యవహారాలు-క్రీడా మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యక్రమాల గురించి కూడా ఉప-రాష్ట్రపతికి మంత్రులతోపాటు అధికారులు వివరించారు. యువతరంలో సామర్థ్యం, నాయకత్వ లక్షణాల వికాసం, దేశ ప్రగతిలో పాత్ర దిశగా “జన భాగస్వామ్య నుంచి ప్రజా ఉద్యమం వైపు” అనే దృక్పథంతో భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా సమాజ సేవా స్ఫూర్తిని ప్రోత్సహించడంపై మంత్రిత్వశాఖ కృషిని వారు సమగ్రంగా తెలిపారు.
ఈ మేరకు జాతీయ యువజన విధానం, మేరా యువ భారత్ (మై భారత్), జాతీయ సేవా పథకం, యూత్ హాస్టళ్లు, జాతీయ యువజన అవార్డులు వంటి కీలక యువతరం ఆధారిత కార్యక్రమాల గురించి ఉప-రాష్ట్రపతికి సమాచారం ఇచ్చారు. డిజిటల్, క్షేత్ర స్థాయి చర్చా కార్యకలాపాల ద్వారా దేశవ్యాప్త యువత అనుసంధానంలో ‘మై భారత్ పోర్టల్’ కీలక ముందడుగని వారు వివరించారు. దేశ పురోగమనంలో యువతను భాగస్వాములను చేయడానికి చేపట్టిన ‘మేరా యువ భారత్’ కార్యక్రమాన్ని శ్రీ సి.పి.రాధాకృష్ణన్ ప్రశంసించారు. అలాగే సాంస్కృతిక అవగాహనకు ప్రోత్సాహం, ‘ఒకే భారత్-శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి బలోపేతంలో యువత ఆదానప్రదాన కార్యక్రమాల ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టీకరించారు.
అదేవిధంగా “యూత్ 20 (వై20) సమ్మిట్, మేరీ మాటీ-మేరా దేశ్, వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2025 (వీబీవైఎల్‌డీ-2025), దీపావళి విత్ మై భారత్, వికసిత భారత్ దిశగా మాదకద్రవ్య విముక్త యువతరం” వంటి అనేక వినూత్న యువతరం లక్షిత కార్యక్రమాల గురించి కూడా ఉప-రాష్ట్రపతికి మంత్రులు, అధికారులు వివరించారు.
క్రీడారంగం ప్రగతి, క్రీడాకారులకు ప్రోత్సాహం కోసం చేపట్టిన కార్యక్రమాలను కూడా అధికారులు ఆయనకు తెలిపారు. ఈ మేరకు “ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం, జాతీయ క్రీడా సమాఖ్యలకు సహాయం, ఖేలో భారత్ నీతి, ఒన్ కార్పొరేట్ ఒన్ స్పోర్ట్ సీఎస్‌ఆర్ మోడల్” వంటి క్రీడాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్, పారాలింపిక్స్ సహా అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులు... ముఖ్యంగా మహిళలు ప్రదర్శించిన అద్భుత ప్రతిభాపాటవాలను ఉప-రాష్ట్రపతి ప్రశంసించారు. దేశవ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించడంలో కార్పొరేట్ రంగం పాత్ర పెరుగుతుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
భారత్‌లో ఒలింపిక్స్ సహా కీలక అంతర్జాతీయ క్రీడోత్సవాల నిర్వహణకు మంత్రిత్వశాఖ చేస్తున్న కృషిని ఉప-రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు క్రీడాభివృద్ధికి గణనీయంగా తోడ్పడతాయన్నారు. ప్రపంచ వర్ధమాన క్రీడా దేశంగా భారత్ స్థానాన్ని ఇవన్నీ బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు.
***
(Release ID: 2179127)
|