హోం మంత్రిత్వ శాఖ
రాజస్థాన్ ప్రభుత్వం చేపట్టిన రూ. 4 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులను జైపూర్‌లో భూమి పూజ చేసి ప్రారంభించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
రాజస్థాన్ ప్రభుత్వ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన కేంద్ర హోంమంత్రి
మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై రాష్ట్ర స్థాయి ప్రదర్శన ప్రారంభం
జీవన సౌలభ్యం పెంచడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన మోదీ జీ
మూడు కొత్త క్రిమినల్ చట్టాల సంపూర్ణ అమలు తర్వాత న్యాయ సౌలభ్యంలోనూ అతిపెద్ద పరివర్తన
దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాల ప్రారంభం 21వ శతాబ్దంలో అతిపెద్ద సంస్కరణ
మూడు కొత్త చట్టాల అమలు తర్వాత రాజస్థాన్‌లో 42 నుంచి 60 శాతానికి పెరిగిన నేర నిర్ధారణ రేటు-సంపూర్ణ అమలుతో 90 శాతానికి చేరుతుందని అంచనా
మూడు కొత్త చట్టాల అమలుతో దేశంలో ఏడాది కాలంలో సకాలంలో దాఖలైన 50 శాతం ఛార్జిషీట్లు-వచ్చేఏడాదికి 90 శాతానికి చేరుతుందని అంచనా
రూ. 35 లక్షల కోట్ల ఎంవోయూల్లో రూ. 7 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలను స్వల్ప కాలంలోనే అమలు చేసిన రాజస్థాన్ ప్రభుత్వం
విద్యార్థుల యూనిఫాం దుస్తుల్లోనూ అవినీతికి పాల్పడిన గత ప్రభుత్వం
డీబీటీ ద్వారా నేరుగా 47,000 మంది విద్యార్థులకు
రూ. 260 కోట్లు పంపిణీ చేసిన భజన్ లాల్ ప్రభుత్వం
పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి పెంచడం ద్వారా
స్వయం-సమృద్ధి సాధనకు రైతులు కృషి చేయాలని పిలుపు
ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్‌సీసీఎఫ్‌లలో నమోదు చేసుకున్న రైతుల నుంచి పప్పు ధాన్యాలు, నూనెగింజలను పంటలను వంద శాతం ఎమ్ఎస్‌పీతో కొనుగోలు చేయాలని నిర్ణయించిన భారత ప్రభుత్వం
Posted On:
13 OCT 2025 4:28PM by PIB Hyderabad
కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు రాజస్థాన్‌లోని జైపూర్‌లో కొత్త క్రిమినల్ చట్టాలపై రాష్ట్ర స్థాయి ప్రదర్శనను ప్రారంభించారు. రూ. 4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. రాజస్థాన్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ ఈనాటి కార్యక్రమం అభివృద్ధిని, న్యాయాన్నీ సమన్వయం చేసే సందర్భమని అన్నారు. దేశ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో ప్రాథమిక మార్పులను తీసుకువచ్చే మూడు కొత్త క్రిమినల్ చట్టాలను ప్రవేశపెట్టడానికి, రాజ్యాంగం అందించిన హక్కులను ప్రజలకు సరళమైన రీతిలో అందుబాటులోకి తీసుకురావడానికి ఈ రోజు ఇక్కడ అత్యాధునిక ప్రదర్శనను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. రాజస్థాన్ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ.. రైజింగ్ రాజస్థాన్ కార్యక్రమంలో సంతకాలు చేసిన అవగాహన ఒప్పందాలకు సంబంధించిన రూ. 35 లక్షల కోట్ల విలువైన పనులకు గానూ రూ. 3 లక్షల కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయనీ, అదనంగా రూ. 4 లక్షల కోట్ల పనులు ఈ రోజు భూమి పూజతో ప్రారంభించినట్లు కేంద్ర హోంమంత్రి వివరించారు.
క్రిమినల్ జస్టిస్ వ్యవస్థతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను తప్పక సందర్శించాలని, రాబోయే రోజుల్లో మన క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో రానున్న ముఖ్యమైన మార్పులను ఇది ప్రదర్శిస్తుందని శ్రీ అమిత్ షా తెలిపారు. 160 ఏళ్ల నాటి చట్టాల స్థానంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన మూడు కొత్త చట్టాల సహాయంతో.. 2027 తర్వాత దాఖలయ్యే ఎఫ్‌ఐఆర్‌కు మూడేళ్లలోపు న్యాయం ఎలా అందుతుందో ఈ ప్రదర్శన ద్వారా ప్రజలు తెలుసుకుంటారని ఆయన అన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలు దేశ ప్రజలకు సకాలంలో, అందుబాటులో, సరళీకృత న్యాయాన్ని అందిస్తాయని శ్రీ అమిత్ షా ఉద్ఘాటించారు. జీవన సౌలభ్యం కోసం ప్రధానమంత్రి శ్రీ మోదీ దేశంలో అనేక మార్పులను ప్రవేశపెట్టారని, ఈ కొత్త చట్టాల అమలు ద్వారా న్యాయ సౌలభ్యంలోనూ గణనీయమైన పరివర్తన ఉంటుందని ఆయన తెలిపారు.
మూడు కొత్త చట్టాల ద్వారా మన క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ శిక్ష కంటే న్యాయంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తుందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఈ చట్టాలను దేశవ్యాప్తంగా కచ్చితంగా అమలు చేశామనీ.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్హెచ్ఏ) అన్ని రాష్ట్రాలకూ వాటి అమలు, అనుసరణలో మార్గదర్శనం చేస్తోందని ఆయన అన్నారు. బ్రిటీషు పాలనలో రూపొందించిన చట్టాలు.. అక్కడి పార్లమెంటులో ఆమోదించిన చట్టాలు.. బ్రిటీషు పాలనను రక్షించడానికి రూపొందించిన చట్టాల స్థానంలో మన భారతీయులు రూపొందించిన చట్టాలను ప్రవేశపెట్టామన్నారు. భారత పార్లమెంటు ఈ చట్టాలను ఆమోదించడం.. భారతీయులకు న్యాయం అందించాలనే లక్ష్యం.. ఒక చరిత్రాత్మక విజయమని ఆయన స్పష్టం చేశారు.
కొత్త క్రిమినల్ చట్టాల్లో మహిళలు, పిల్లలపై జరిగే నేరాల కోసం ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చామని శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ-ఎఫ్ఐఆర్, జీరో ఎఫ్ఐఆర్ కోసం నిబంధనలు రూపొందించడం.. అన్ని రకాల జప్తుల విషయంలో వీడియో చిత్రీకరణను తప్పనిసరి చేయడం.. ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించే నేరాలకు ఫోరెన్సిక్ దర్యాప్తు తప్పనిసరి చేయడం ఇందులోని ముఖ్యాంశాలుగా కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. రాజస్థాన్‌లో నేర నిర్ధారణ రేటు 42 శాతంగా ఉండేదని, ఈ చట్టాలను అమలు చేసిన ఒక సంవత్సరంలోనే ఇది 60 శాతానికి పెరిగిందని ఆయన అన్నారు. ఈ చట్టాలు పూర్తిగా అమలయిన తర్వాత ఈ రేటు 60 శాతం నుంచి 90 శాతానికి పెరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చట్టాలను సజావుగా అమలు చేయడం కోసం 2020లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం (ఎన్ఎఫ్ఎస్యూ) ఏర్పాటుతో పాటు.. శాస్త్రీయ దర్యాప్తులో శిక్షణ పొందిన యువతతో కూడిన కొత్త సిబ్బంది కోసం దేశవ్యాప్తంగా అనుబంధ కళాశాలలనూ ప్రారంభిస్తున్నామని శ్రీ అమిత్ షా అన్నారు.
మొదటిసారిగా భారత న్యాయ వ్యవస్థలోని కొత్త క్రిమినల్ చట్టాల్లో ఉగ్రవాదం, అరాచక వ్యక్తుల సమూహం, వ్యవస్థీకృత నేరాలు, డిజిటల్ నేరాల నిర్వచనాలనూ పొందుపరిచామన్నారు. ఈ చట్టాలు 29కి పైగా నిబంధనల్లో కాల పరిమితులను నిర్దేశిస్తాయని ఆయన అన్నారు. దేశం విడిచి పారిపోయిన నేరస్థులకు శిక్ష పడేలా వారి గైర్హాజరు సందర్భంలో విచారణకు ఒక నిబంధనను ప్రవేశపెట్టామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. దేశంలో ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాల ప్రారంభాన్ని 21వ శతాబ్దంలోనే అతిపెద్ద సంస్కరణగా శ్రీ అమిత్ షా అభివర్ణించారు. ఈ చట్టాలను పూర్తిగా అమలు చేసిన తర్వాత భారత క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యాధునిక వ్యవస్థగా మారుతుందన్నారు. ఈ చట్టాల అమలుతో దాదాపు 50 శాతం చార్జిషీట్లు ఇప్పుడు సకాలంలో దాఖలవుతున్నాయనీ.. ఈ రేటు వచ్చే ఏడాది 90 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు. లక్షలాది మంది పోలీసు అధికారులు, వేలాది మంది న్యాయాధికారులు, ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ) అధికారులు, జైలు సిబ్బందికీ శిక్షణ పూర్తయిందని ఆయన అన్నారు.
ఈరోజు రూ. 4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు భూమి పూజ కార్యక్రమం జరిగిందని శ్రీ అమిత్ షా తెలిపారు. రాజస్థాన్‌లో భజన్ లాల్ శర్మ ప్రభుత్వం సంతకం చేసిన రూ. 35 లక్షల కోట్ల విలువైన ఎమ్‌వోయూలలో ఇప్పటికే రూ. 7 లక్షల కోట్ల విలువైన పనులను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ఈ విజయం ద్వారా పలు అభివృద్ధి ప్రాజెక్టులు రాజస్థాన్ యువతకు అనేక ఉపాధి అవకాశాలను అందిస్తాయని ఆయన తెలిపారు. నేడు రూ. 9,315 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యాని ఆయన పేర్కొన్నారు. మునుపటి ప్రభుత్వం విద్యార్థుల యూనిఫామ్‌లలో అవినీతికి పాల్పడిందనీ.. అయితే ప్రస్తుత భజన్ లాల్ ప్రభుత్వం 47,000 మంది విద్యార్థులకు డీబీటీ ద్వారా నేరుగా రూ. 260 కోట్లు పంపిణీ చేసిందని శ్రీ అమిత్ షా తెలిపారు. పాల ఉత్పత్తిని పెంచడానికి రాజస్థాన్‌లోని 5 లక్షలకు పైగా పాల ఉత్పత్తిదారులకు రూ. 364 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. 150 ఉచిత విద్యుత్ యూనిట్ల పథకానికి రిజిస్ట్రేషన్ కూడా ఈ రోజు ప్రారంభమైందని తెలిపారు. వీటితో పాటు 56 ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ) వాహనాలు, అనేక పోలీసు వాహనాలనూ ప్రారంభింనట్లు శ్రీ అమిత్ షా వివరించారు.
నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏఎఫ్ఈడీ), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్) లలో నమోదు చేసుకున్న రైతులు పండించే కంది, మసూర్, మినుముల వంటి పప్పు ధాన్యాలను 100 శాతం కనీస మద్దతు ధరకి కొనుగోలు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. రాజస్థాన్‌లో ఇప్పటికే మినుములు పండిస్తున్నారని, అక్కడ కంది పంటనూ పండించవచ్చన్నారు. రాష్ట్ర రైతులు ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్‌సీసీఎఫ్‌లలో నమోదు చేసుకోవాలనీ, ఆ తర్వాత వారు పండించిన పప్పు దినుసులను భారత ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించి సేకరిస్తుందని ఆయన తెలిపారు. పప్పు ధాన్యాలు, నూనె గింజల రంగంలో దేశం స్వయం-సమృద్ధి సాధించడం కోసం రైతులు తమ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని శ్రీ అమిత్ షా అన్నారు.
***
(Release ID: 2178757)
Visitor Counter : 7