క్లిష్టమైన కార్డియాక్ కేసుల సమయంలో ప్రాణాలను రక్షించే.. జీవించే అవకాశాలను పెంపొందించే అత్యవసర ప్రక్రియే కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్). దీనిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు సీపీఆర్ అవగాహన వారోత్సవాలను (2025 అక్టోబర్13-17) ప్రారంభించింది. కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)లో శిక్షణను, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ వారోత్సవాలను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ ప్రారంభించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ఆరోగ్య నిపుణులు, వైద్య సంస్థలకు చెందిన ప్రతినిధులు, పౌరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ మాట్లాడుతూ.. సీపీఆర్ చేసే సామర్థ్యాలను ప్రజల్లో పెంపొందించాల్సిన తక్షణ అవసరాన్ని తెలియజేశారు. ‘‘ఆరోగ్య నిపుణుల సాయం లభించే వరకు హ్యాండ్స్-ఓన్లీ సీపీఆర్ చేయడం ద్వారా ముఖ్యమైన అవయవాలకు రక్త సరఫరా కొనసాగేలా, ఆక్సిజన్ అందేలా చేయవచ్చు. ఇది ప్రాణాలు నిలిచే అవకాశాలను ఎన్నో రెట్లు పెంచుతుంది’’ అని అన్నారు.
ప్రతి ఇల్లు, పాఠశాల, కార్యాలయం, బహిరంగ ప్రదేశాల్లో కనీసం ఒక్కరైనా.. ప్రాణాలను రక్షించే ఈ విధానంలో శిక్షణ పొందాలనే ఉద్దేశంతో సీపీఆర్ అవగాహనా వారోత్సవాలను మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని ఆమె తెలియజేశారు. ‘భారత్‌లో ఆకస్మిక మరణాల వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో కార్డియాక్ అరెస్ట్ ఒకటి కావడంతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఆసుపత్రి వెలుపల సంభవిస్తున్న మరణాల్లో దాదాపు 70 శాతం.. తక్షణ వైద్య సాయం అందుబాటులో లేని చోట జరుగుతున్నాయి. పక్కనే ఉన్న వ్యక్తి సకాలంలో సీపీఆర్ చేయగలిగితే.. ప్రాణాలు నిలిచే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి’ అని ఆమె తెలియజేశారు.
సీపీఆర్‌పై అవగాహన పెంచుతామని, ప్రాణాలు రక్షించే ఈ విధానాన్ని నేర్చుకొనేలా ఇతరులను ప్రోత్సహిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రతిజ్ఞ చేశారు. అలాగే కార్డియాక్ ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలను రక్షించేందుకు సులభమైన, ఎవరైనా చేయగలిగే హ్యాండ్స్-ఓన్లీ సీపీఆర్‌పై వైద్య నిపుణులు ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
దేశంలో సీపీఆర్ చేసే వారి సంఖ్య తక్కువగా ఉండటాన్ని గుర్తించిన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాజ కేంద్రీకృత ప్రయత్నాలను పెంపొందించేందుకు 2025 అక్టోబర్ 13-17 వరకు దేశవ్యాప్తంగా సీపీఆర్ అవగాహన వారోత్సవం నిర్వహిస్తోంది. జాతీయ స్థాయి ప్రతిజ్ఞ, సీపీఆర్ చేయడంపై భౌతిక - వర్చువల్ విధానాల్లో ప్రదర్శన, నిపుణులతో ముఖాముఖి, ప్యానెల్ చర్చలు, ఇతర ఐఈసీ కార్యకలాపాలను ఈ వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తారు. సీపీఆర్ అవగాహన వారోత్సవ ప్రారంభ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగానికి చెందిన వారితో పాటుగా.. వైద్య సంస్థలకు చెందిన ప్రతినిధులు, పౌర సమాజం నుంచి 15,000 మంది హాజరయ్యారు.
మైగవ్, మైభారత్ వేదికల సహకారంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ ప్రతిజ్ఞను, సీపీఆర్ క్విజ్‌ను ప్రచురించింది. ఈ ప్రతిజ్ఞ, క్విజ్ కోసం దిగువ పేర్కొన్న లింకులను సందర్శించవచ్చు.
https://quiz.mygov.in/quiz/quiz-cpr-awareness-week-2025/
https://pledge.mygov.in/save-a-life-cpr/and https://mybharat.gov.in/quiz/quiz_dashboard/bUZNV2VOMUhDSTZXSzg3c1JJVzNuZz09
***