మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
పీఎం ధన ధాన్య కృషి యోజన ద్వారా క్షేత్ర స్థాయిలో పశువుల ఆరోగ్యానికి వివిధ కార్యక్రమాలను ప్రారంభించాం : పీఎం శ్రీ నరేంద్ర మోదీ
ఈశాన్య ప్రాంతంలో తొలి పశువుల ఐవీఎఫ్ ల్యాబ్ ప్రారంభం, ఆంధ్రప్రదేశ్‌లో సమీకృత డెయిరీ, పశుగ్రాస కేంద్రానికి శంకుస్థాపన
Posted On:
12 OCT 2025 12:26PM by PIB Hyderabad
దేశంలో పశు సంవర్థక, డెయిరీ రంగాలకు అధిక ప్రోత్సాహాన్ని అందిస్తూ... రూ.947 కోట్ల విలువైన ప్రాజెక్టులను 2025, అక్టోబర్ 11న న్యూఢిల్లీలో ప్రారంభించారు. అదనంగా మరో రూ.219 కోట్ల విలువైన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి విస్తృత పెట్టబడుల ప్యాకేజీలో భాగమైన ఈ కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.
రెండు ప్రధాన వ్యవసాయ పథకాలైన ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన (పీఎం-డీడీకేవై), పప్పుధాన్యాల్లో ఆత్మనిర్భరత మిషన్ కార్యక్రమాలతో పాటు.. ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఇవి గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడంలో, వ్యవసాయ ఆధారిత రంగాల్లో స్వావలంబన సాధించాలనే దేశ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి.
జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన (పీఎం-డీడీకేవై) పరిధిలో గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడంలో పశుసంపద, మత్స్య రంగం, ఇతర అనుబంధ కార్యకలాపాలు పోషించే కీలకమైన పాత్రను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ‘‘మన పశుసంపదపై కూడా పీఎం ధన ధాన్య కృషి యోజన దృష్టి సారిస్తుంది. గాలి కుంటు తరహా వ్యాధుల నుంచి పశువులను రక్షించడానికి 125 కోట్లకు పైగా వ్యాక్సీన్లను అందించామని మీకు తెలుసు. దీనివల్ల.. పశువులు ఆరోగ్యం మెరుగుపడింది. రైతుల ఆందోళన తగ్గింది. పశువుల ఆరోగ్యానికై పీఎం ధనధాన్య యోజన పరిధిలో చేపట్టే కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రారంభమవుతాయి’’ అని ఆయన అన్నారు. గ్రామీణ సంక్షేమం కోసం వైవిధ్యీకరణ చేపట్టాల్సిన అవసరాన్ని వివరిస్తూ.. ‘‘వ్యవసాయం సాధ్యం కాని చోట పశువులు, చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి. ఆదాయాన్ని పెంపొందించేందుకు.. సంప్రదాయ సాగును మించిన అవకాశాలను మా ప్రభుత్వం రైతులకు అందిస్తోంది. కాబట్టి, అదనపు ఆదాయం కోసం పశువుల పెంపకం, చేపల సాగు, తేనెటీగల పెంపకంపై దృష్టి సారించాం. ఇది చిన్నకారు రైతులు, భూమిలేని కుటుంబాలకు సాధికారత కల్పిస్తుంది’’ అని వెల్లడించారు.
రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్జీఎం) ద్వారా రూ.28.93 కోట్ల పెట్టుబడితో అస్సాంలోని గువాహటిలో ఏర్పాటు చేసిన ఐవీఎఫ్ ల్యాబరేటరీని ప్రారంభించారు. ఇది ఈశాన్య ప్రాంతంలోనే మొదటి ఐవీఎఫ్ ల్యాబరేటరీ. అత్యాధునిక సౌకర్యాలతో నిండిన ఈ కేంద్రం ఈశాన్య రాష్ట్రాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధి, జంతు జాతుల వృద్ధికి ప్రోత్సాహమిస్తుంది.
పాడి పరిశ్రమ అభివృద్ధికి జాతీయ కార్యక్రమం (ఎన్‌పీడీడీ) పరిధిలో.. డెయిరీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు భారీ స్థాయి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. వీటిలో రూ.460 కోట్ల వ్యయంతో రోజుకి 120 మెట్రిక్ టన్నుల పాల పొడిని ఉత్పత్తి చేసే మెహ్సానా మిల్క్ యూనియన్ ప్రాజెక్టు, రోజుకి 3.5 లక్షల లీటర్ల పాలను శుద్ధి చేసే సామర్థ్యమున్న యూహెచ్‌టీ ప్లాంట్ ఉన్నాయి. వీటితో పాటుగా.. రూ. 76.50 కోట్ల వ్యయంతో ఇండోర్ మిల్క్ యూనియన్ ఆద్వర్యంలో రోజుకి 30 టన్నుల పాలపొడిని ఉత్పత్తి చేసే ప్లాంటు, రూ. 46.82 కోట్లతో భిల్వారా మిల్క్ యూనియన్ ఆద్వర్యంలో రోజుకి 25,000 లీటర్ల సామర్థ్యమున్న యూహెచ్‌టీ ప్లాంట్, రూ. 25.45 కోట్లతో తెలంగాణలోని కరీంనగర్లో నుస్తులాపూర్ వద్ద అభివృద్ధి చేసిన గ్రీన్‌ఫీల్డ్ డెయిరీ ఉన్నాయి. పాడి పరిశ్రమ వ్యవస్థను మరింత విస్తరించడానికి ఎన్‌పీడీడీ ద్వారా మొత్తం రూ.219 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో సమీకృత డెయిరీ ప్లాంట్, 200 టీపీడీ పశువుల దాణా కేంద్రానికి శంకుస్థాపన చేశారు.
పశుగ్రాసం, పాలు, పశు ఉత్పత్తుల శుద్ధిలో దేశ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా పశు సంవర్థక మౌలిక వసతుల అభివృద్ధి నిధి (ఏహెచ్ఐడీఎఫ్) పరిధిలో రూ. 303.81 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులను వివిధ రాష్ట్రాల్లో ప్రారంభించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ పరిధిలో మారుమూల ప్రాంతాలకు సైతం బ్రీడింగ్ సేవలను అందించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో నూతనంగా శిక్షణ పొందిన 2,000 మంది మైత్రీ (మల్టీపర్పస్ ఆర్టీఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నీషియన్స్ ఇన్ రూరల్ ఇండియా)లకు ప్రధానమంత్రి ధ్రువపత్రాలను అందించారు. ఇది దేశవ్యాప్తంగా 38,000 మందికి పైగా మైత్రీలు విధుల్లో చేరడాన్ని సూచిస్తుంది. పశువుల్లో కృత్రిమ గర్భధారణను పెంపొందించడం, జన్యువులను మెరుగుపరచడంలో ప్రధాన విజయాన్ని సూచిస్తుంది.
అందరికీ ఆర్థిక భద్రత, పోషకాహార హామీని అందిస్తూ.. వ్యవసాయ అనుబంధ రంగాల సమగ్ర, సుస్థిరాభివృద్ధి ద్వారా రైతులకు అవకాశాలను విస్తరించడంలో ప్రభుత్వ అంకితభావాన్ని ఈ కార్యక్రమాలు తెలియజేస్తాయి.
***
(Release ID: 2178498)
Visitor Counter : 12