ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

భారతరత్న లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా బీహార్‌లోని సితాబ్ దియారాలో నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ.రాధాకృష్ణన్


సరన్ జిల్లాలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ పూర్వీకుల ఇంటిని, జాతీయ స్మారక చిహ్నాన్నీ సందర్శించిన ఉపరాష్ట్రపతి

లోక్ నాయక్ నిజమైన ప్రజానాయకులు.. భారత ప్రజాస్వామ్య విలువల పరిరక్షకులు..

‘రాజకీయాల కంటే ప్రజలే ముఖ్యం’... ‘వ్యక్తుల కంటే దేశం ముఖ్యం’ అనేది లోక్ నాయక్ దార్శనికత

రాజ్య శక్తి కంటే లోక్ శక్తి గొప్పదని లోక్ నాయక్ భావన

లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జీవిత భాగస్వామి దివంగత ప్రభావతి దేవి త్యాగాలనూ గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి

‘సంపూర్ణ క్రాంతి’ ఆయుధాల విప్లవం కాదు... ఆలోచనల విప్లవమని పునరుద్ఘాటించిన శ్రీ రాధాకృష్ణన్

కోయంబత్తూరులో యువనేతగా టోటల్ రివల్యూషన్ ఉద్యమంతో తన వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఉపరాష్ట్రపతి

2047 నాటికి వికసిత్ భారత్‌ సాకారం కోసం లోక్ నాయక్ ఆచరించిన సత్యం, న్యాయం, అహింస, ప్రజా శక్తి ఆదర్శాల పట్ల బలమైన నిబద్ధత అవసరం

Posted On: 11 OCT 2025 3:39PM by PIB Hyderabad

భారతరత్న లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ఈ రోజు బీహార్‌లోని సరన్ జిల్లాలో గల ఆయన పూర్వీకుల గ్రామం సితాబ్ దియారాలో ఆయనకు భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ నివాళులర్పించారు.

లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ 123వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించే కార్యక్రమం కోసం ఉపరాష్ట్రపతి బీహార్‌లో ఒకరోజు పర్యటనకు వెళ్లారు. పాట్నాలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న శ్రీ రాధాకృష్ణన్‌ను బీహార్ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, బీహార్ ప్రభుత్వ సీనియర్ అధికారులు ఆత్మీయంగా స్వాగతించారు.

అనంతరం ఉపరాష్ట్రపతి సితాబ్‌ దియారాలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ పూర్వీకుల ఇంటిని సందర్శించి, లోక్‌నాయక్‌ జాతీయ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. గ్రామంలోని లోక్‌నాయక్‌ స్మృతి భవన్‌, పుస్తకాలయాన్నీ ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ.. దేశంలోని అత్యున్నత నాయకుల్లో ఒకరు.. నిజమైన ప్రజానాయకులు.. న్యాయం, ప్రజాస్వామ్యం కోసం అవిశ్రాంత పోరాటం చేసిన యోధులు.. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జన్మస్థలం సితాబ్ దియారా పవిత్ర భూమిపై నిలబడటం తనకు దక్కిన భాగ్యం, గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.

లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ 123వ జయంతి కేవలం ఒక గొప్ప నాయకుడికి నివాళులర్పించే సందర్భం మాత్రమే కాదనీ.. వ్యక్తుల కంటే దేశం, అధికారం కంటే విలువలు, రాజకీయాల కంటే ప్రజలు గొప్పవారనే ఆదర్శాన్ని మనమంతా గుర్తుచేసుకునే అవకాశమని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు.

జేపీగా అందరికీ సుపరిచితులైన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్  గొప్ప స్వాతంత్య్ర సమరయోధులు మాత్రమే కాదు.. భారత ప్రజాస్వామ్య విలువల పరిరక్షకులు అని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి 1970లలో ఆయన ఇచ్చిన 'టోటల్ రెవల్యూషన్' పిలుపు వరకు జయప్రకాష్ నారాయణ్ జీవితం నైతిక ధైర్యం, నిరాడంబరత, త్యాగాలకు గొప్ప ఉదాహరణగా నిలిచిందని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

లోక్ నాయక్ అధికారంపై కోరిక లేనివారని, తనకు ఇచ్చిన అత్యున్నత పదవులనూ తిరస్కరించారని శ్రీ రాధాకృష్ణన్ తెలిపారు. జయప్రకాష్ నారాయణ్ రాజకీయ ఆశయం కంటే నైతిక అధికారం నుంచే తన బలాన్ని పొందారని అన్నారు.

అధికారాన్ని చేజిక్కించుకోవడంలో కాదు.. ప్రజల ద్వారా అధికారాన్ని నియంత్రించడంలో తనకు ఆసక్తి ఉందని లోక్ నాయక్ చెప్పిన మాటలను ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకుంటూ.. విలువల ఆధారితమైన నైతికత గల రాజకీయాల పట్ల జయప్రకాష్ నారాయణ్ విశ్వాసానికి ఈ వాఖ్యలు నిదర్శనమన్నారు.

భూదాన్ ఉద్యమంలో లోక్ నాయక్ కీలక పాత్రను శ్రీ రాధాకృష్ణన్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయన భాగస్వామ్యం వల్ల ఉద్యమానికి జాతీయ ప్రాముఖ్యం, నైతిక విశ్వసనీయత లభించిందని పేర్కొన్నారు. లోక్ నాయక్ బీహార్‌తో పాటు దేశవ్యాప్తంగా గల కమ్యూనిటీలన్నీ స్వార్థానికి అతీతంగా ఉంటూ, అందరి మంచి కోసం పనిచేసేలా స్ఫూర్తినిచ్చారని ఉపరాష్ట్రపతి తెలిపారు.

అవినీతి విస్తృతంగా వ్యాపించిన సమయంలోనూ ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించే, పునర్నిర్మించే శక్తి యువతకు ఉందని లోక్ నాయక్ దృఢంగా విశ్వసించేవారని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. సామాజిక పరివర్తనను సాధించడానికి అహింసా విప్లవాన్ని జయప్రకాష్ నారాయణ్ బలంగా సమర్ధించారని ఆయన తెలిపారు.

లోక్ నాయక్ సంపూర్ణ క్రాంతి పిలుపు సాయుధ తిరుగుబాటు కాదనీ.. ఆలోచనల విప్లవమన్నారు. స్వచ్ఛమైన పాలన, పేదలకు సాధికారత కల్పించడం, దేశ భవిష్యత్తును రూపొందించడంలో యువత చురుకైన భాగస్వామ్యం గల దేశాన్ని ఆ ఉద్యమం ఊహించిందని తెలిపారు.

టోటల్ రివల్యూషన్ ఉద్యమంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. పందొమ్మిదేళ్ల వయసులో కోయంబత్తూరులో టోటల్ రివల్యూషన్ ఉద్యమానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు.. లోక్ నాయక్ పిలుపుతో ప్రేరణ పొంది తానూ అందులో భాగం కావడం తనకు లభించిన వ్యక్తిగత గౌరవమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

భారత స్వాతంత్య్రోద్యమంలో నిస్వార్థ పోరాటం కోసం బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసిన లోక్ నాయక్ భార్య శ్రీమతి ప్రభావతి దేవి ఆయనకు అందించిన తిరుగులేని మద్దతునూ ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.

లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్‌ను ప్రజా సాధికారతలో గొప్ప ఛాంపియన్‌గా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి.. ఆయన ఎల్లప్పుడూ లోక్ శక్తిని రాజ్య శక్తి కంటే ముఖ్యమైనదిగా భావించారని తెలిపారు.

నేటికీ భారత ప్రజాస్వామ్య సంస్థల బలం లోక్ నాయక్ బలంగా సమర్థించిన పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాసేవ, నైతిక ధైర్యమనే విలువలపైనే ఆధారపడి ఉందన్నారు.

భారత్ 2047 నాటికి వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న ఈ సమయంలో శక్తిమంతమైన, సమ్మిళితమైన దేశాన్ని నిర్మించడం కోసం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆదర్శాలు, విలువలను స్వీకరించడం చాలా అవసరమని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు.

భరతమాత గొప్ప పుత్రుల్లో ఒకరైన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్‌ను అందించిన బీహార్ భూమి పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని పేర్కొంటూ తన ప్రసంగాన్ని ముగించిన ఉపరాష్ట్రపతి.. లోక్ నాయక్ ఆచరించిన విలువలైన సత్యం, న్యాయం, అహింస, ప్రజా శక్తి పట్ల దేశం సమష్టి నిబద్ధతను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ఎల్లప్పుడూ ముందుంటారని ఆయన జీవితం, ఆదర్శాలు ఎల్లప్పుడూ మనందరికీ గుర్తు చేస్తాయని అన్నారు.

 

***


(Release ID: 2177969) Visitor Counter : 6