ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్-యూకే సంయుక్త ప్రకటన
Posted On:
09 OCT 2025 3:24PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని స్వీకరించిన యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ 2025 అక్టోబర్ 8,9 తేదీల్లో భారత్‌లో అధికార పర్యటన చేశారు. ఆయన వెంట ఆ దేశ వ్యాపార, వాణిజ్య మంత్రి, వాణిజ్య బోర్డు అధ్యక్షుడు పీటర్ కైల్, స్కాట్లాండ్ మంత్రి డోగ్లస్ అలెగ్జాండర్, పెట్టుబడుల మంత్రి జేసన్ స్టాక్‌వుడ్‌తో పాటు 125 మంది సీఈవోలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, సాంస్కృతిక నాయకులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది.
ఇది భారత్‌లో ప్రధాని స్టార్మర్ తొలి అధికారిక పర్యటన. ఇది 2025 జులై 23, 24 తేదీల్లో యునైటెడ్ కింగ్డమ్‌లో భారత్ ప్రధానమంత్రి పర్యటన అనంతరం జరుగుతోంది. ఆ సమయంలో చరిత్రాత్మక భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పదం (సీఈటీఏ)పై ఉభయ దేశాలు సంతకం చేశాయి. అలాగే ఇండియా-యూకే విజన్ 2035, రక్షణ పారిశ్రామిక ప్రణాళికను స్వీకరించాయి.
2025 అక్టోబర్ 9న ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్‌లో ప్రధానమంత్రి మోదీ, ప్రధాని స్టార్మర్ ప్రసంగించారు. అలాగే 2025 అక్టోబర్ 9న పరిమితమైన, ప్రతినిధి బృంద స్థాయి విధానాల్లో జరిగిన చర్చల్లో వారు పాల్గొన్నారు. భారత్-యూకే సమగ్ర భాగస్వామ్యంలో సాధించిన పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే అంతర్జాతీయ శాంతి, స్థిరత్వం, నియమ ఆధారిత ప్రపంచ విధానం పట్ల తమ ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారు. పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై కూడా చర్చించారు.
వృద్ధి
ఇండియా-యూకే సదస్సులో భాగంగా ముంబయిలో జరుగుతున్న సీఈవో ఫోరం సమావేశాన్ని ప్రధానులు స్వాగతించారు. భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ)ను వీలైనంత త్వరగా ఆమోదించి దాని ద్వారా లభించే ప్రయోజనాలను పొందడానికి ఇద్దరు నాయకులు ఎదురుచూస్తున్నారు.
సీఈటీఏ అమలు, ఉపయోగాలకు మద్దతిచ్చే, రెండు దేశాల మధ్య విస్తృతమైన వాణిజ్య, పెట్టుబడుల భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే ఉమ్మడి ఆర్థిక, వాణిజ్య కమిటీ (జెట్కో) పునర్నిర్మాణాన్ని ప్రధానమంత్రులు స్వాగతించారు.
నిర్మాణం, మౌలికవసతులు, స్వచ్ఛ ఇంధనం, అధునాతన తయారీ, రక్షణ, విద్య, క్రీడలు, సంస్కృతి, ఆర్థిక, నైపుణ్య వ్యాపార సేవలు, సైన్సు, సాంకేతికత-ఆవిష్కరణ, వినియోగ వస్తువులు, ఆహార రంగాల్లో రెండు దేశాల్లోనూ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను యూకే ప్రధాని వెంట ఉన్న వ్యాపార ప్రతినిధి బృందం వెల్లడించింది. నీతిఆయోగ్ - లండన్ నగర కార్పొరేషన్ మధ్య కొనసాగుతున్న యూకే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జి (యూకేఐఐఎఫ్‌బీ) సుస్థిరాభివృద్ధిలో మన ఉమ్మడి లక్ష్యాలకు ఉదాహరణగా నిలుస్తోంది.
రవాణా సదుపాయాలను మెరుగుపరచడానికి, విమానయాన రంగంలో సహకారాన్ని విస్తరించడానికి తమ నిబద్ధతను ప్రధానులిద్దరూ పునరుద్ఘాటించారు. అలాగే ఇతర విమానయాన సంబంధింత అంశాలతో సహా భారత్-యూకే విమాన సేవల ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు జరుగుతున్న చర్చలను ఇరు పక్షాలు స్వాగతించాయి. ఇది ఏరోస్పేస్ రంగంలో రెండు దేశాలు సహకరించుకొనేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది.
సాంకేతికత, ఆవిష్కరణ
సమ్మిళిత ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించేందుకు, జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయ ఆవిష్కరణల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు అధునాతన సాంకేతికతలను ఉపయోగించుకోవాలనే ఉమ్మడి నిబద్ధతను భారత్, యునైటెడ్ ప్రధానులు పునరుద్ఘాటించారు. విప్లవాత్మక టెక్నాలజీ సెక్యూరిటీ ఇనీషియేటివ్ (టీఎస్ఐ) ఆధారంగా.. టెలీకమ్యూనికేషన్లు, కీలకమైన ఖనిజాలు, ఏఐ, హెల్త్ టెక్ సహా కీలకమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో సాధించిన పురోగతిని నాయకులిద్దరూ స్వాగతించారు.
టీఎస్ఐ పరిధిలో ఈ దిగువన పేర్కొన్న వాటిని ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేసిన నాయకులు:
-
6జీ, నాన్-టెర్రెస్ట్రియల్ నెట్వర్క్ (ఎన్టీఎన్) కోసం ఏఐ ఆధారిత వ్యవస్థను, టెలికాంల సైబర్ భద్రతను అభివృద్ధి చేసే సంయుక్త కేంద్రంగా ఇండియా-యూకే కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు. ఈ ప్రాజెక్టు మొదటి దశ కోసం కనీసం 24 మిలియన్ల యూరోలతో సంయుక్త నిధి ఏర్పాటు చేస్తారు.
-
ఆరోగ్యం, వాతావరణం, ఫిన్టెక్, ఇంజనీరింగ్ బయాలజీలో బాధ్యతాయుతమైన, నమ్మకమైన ఏఐను అబివృద్ధి చేయడానికి ఇండియా-యూకే జాయింట్ సెంటర్ ఫర్ ఏఐ.
-
రెండు దేశాల్లోనూ కీలకమైన ఖనిజాల సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే, వైవిధ్యీకరించే పెట్టుబడులను, వృద్ధిని పెంపొందించే దృఢమైన భాగస్వామ్యాల నిమిత్తం యూకే-ఇండియా క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ అండ్ డౌన్ స్ట్రీమ్ కొలాబరేషన్ గిల్డ్ ఏర్పాటు. ఖనిజాల వెలికితీతను విస్తరించేందుకు, అధునాతన సాంకేతికతలను ఏకీకృతం చేసేందుకు, ద్వైపాక్షిక పెట్టుబడుల అవకాశాలను అన్వేషించడానికి, ఐఐటీ ధన్‌బాద్‌లో కొత్త శాటిలైట్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి యూకే-ఇండియా క్రిటికల్ మినరల్స్ సప్లయి చెయిన్ అబ్జర్వేటరీ రెండో దశను కూడాప్రకటించారు.
వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా బయోటెక్నాలజీని ముందుకు తీసుకెళ్లేందుకు యూకే భారత్ కలసి పనిచేస్తున్నాయి. బయోమాన్యుఫాక్చరింగ్, 3డీ బయో ప్రింటింగ్, జెనోమిక్స్‌లో పరివర్తనాత్మక ఫలితాలను సాధించేందుకు యూకేలో ఉన్న సెంటర్ ఫర్ ప్రాసెస్ ఇన్నవోషన్ (సీపీఐ), భారత్ లోని బయోటెక్నాలజీ రీసెర్చి అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (బీఆర్ఐసీ) మధ్య, హెన్రీ రాయ్స్ ఇన్సిటిట్యూట్ (హెచ్ఆర్ఐ) – ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ), ఆక్స్‌ఫర్డ్ నానోపోర్ టెక్నాలజీస్ (ఓఎన్‌టీ) - బ్రిక్ సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (బీఆర్ఐసీ - సీడీఎఫ్‌డీ) మధ్య వ్యూహాత్మక ఒప్పందాలు కుదిరాయి.
రక్షణ, భద్రత
సంయుక్త విన్యాసాలు, శిక్షణ, సామర్థ్య నిర్మాణం ద్వారా భారత్, యూకే రక్షణ బలగాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు నాయకులు అంగీకరించారు. భారతీయ నౌకాసేనతో కలసి యూకేకి చెందిన యుద్ధ వాహక నౌకలు, రాయల్ నేవీ కొంకణ్‌లో నిర్వహించిన సంయుక్త విన్యాసాలను ప్రధాన మంత్రి మోదీ స్వాగతించారు. ఇండో పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమం (ఐపీఓఐ) పరిధిలో రీజనల్ మ్యారీటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఆర్ఎంఎస్‌సీఈ)ను ఏర్పాటు చేయడం ద్వారా సముద్ర వాణిజ్య భద్రతా సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఉభయపక్షాలు కట్టుబడి ఉన్నాయి.
శిక్షణలో సహకారం విషయానికి వస్తే.. భారత వాయుసేనలో అర్హత కలిగిన ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్లు యూకే రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు శిక్షణ ఇచ్చే ఒప్పందంలో సాధించిన పురోగతితో పాటు.. బలమైన శిక్షణ, విద్యా సంబంధాలను మరింత సులభతరం చేసే ఒప్పందాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు.
భారతీయ నౌకాసేనకు చెందిన వివిధ ప్రాంతాల్లో సముద్ర విద్యుత్ ప్రొపల్షన్ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో సహకారానికై భారత్-యూకే అంతర ప్రభుత్వ ఒప్పందం (ఐజీఏ)ను ఖరారు చేయాలనే లక్ష్యం పట్ల ఇద్దరు ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు.
లైట్‌వెయిట్ మల్టీరోల్ మిస్సైల్ (ఎల్ఎంఎం) వ్యవస్థల సరఫరాను ప్రోత్సహించే దిశగా రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని నాయకులిద్దరూ ప్రకటించారు. ఇది భారత వాయు సేన సామర్థ్యాలను పెంపొందిస్తుంది. అలాగే.. ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తితో భారత రక్షణ మంత్రిత్వ శాఖకు ఉన్న ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను తీరుస్తుంది. అలాగే.. రెండు దేశాల మధ్య సంక్లిష్టమైన ఆయుధాల కోసం దీర్ఘకాలిక సహకారానికి మద్దతు ఇస్తుంది.
అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని, హింసాత్మక అతివాదాన్ని ప్రధానులిద్దరూ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదని, యూఎన్ చార్టర్, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా..సమగ్రమైన, స్థిరమైన పద్ధతిలో దానిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రయత్నాలను సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు. తీవ్రవాదాన్ని, హింసాత్మక అతివాదాన్ని ఎదుర్కోవడానికి, ఉగ్రవాదానికి అందుతున్న ఆర్థిక సహకారాన్ని, సరిహద్దుల వద్ద ఉగ్రవాదుల కదలికలను నిలువరించడానికి, ఉగ్రవాద ప్రయోజనాల కోసం నూతన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడానికి, ఉగ్రవాద నియామకాలను అరికట్టడానికి, సమాచారాన్ని పంచుకోవడానికి, న్యాయపరమైన సహకారానికి, సామర్థ్య నిర్మాణాలను విస్తరించడానికి గాను యూఎన్, ఎఫ్ఏటీఎఫ్ సహా ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయాలని కోరారు. 2025 ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ నిషేధం విధించిన ఉగ్రవాదులపై, ఉగ్రవాద సంస్థలపై, వారికి తోడ్పాటు అందించేవారిపై నిర్ణయాత్మక, సంఘటిత చర్యలను తీసుకోవడానికి సహకారాన్ని పెంపొందించేందుకు అంకితభావంతో ఉన్నారు.
పర్యావరణం, విద్యుత్
ఉద్గారాలను శూన్య స్థితికి తీసుకురావడంలో సహకారానికి ఉన్న ప్రాధాన్యాన్ని నాయకులు స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు నిధులు పెంచడానికి, రెండు దేశాల్లోనూ పర్యావరణ హిత వృద్ధిని, కొత్త ఆర్థిక అవకాశాలను కనుగొనేందుకు ఉద్దేశించిన ఇండియా-యూకే పర్యావరణ ఆర్థిక కార్యక్రమాన్ని ప్రధానులు స్వాగతించారు. పర్యావరణ సాంకేతిక అంకుర సంస్థలకు నిధులు అందించే నిమిత్తం ఉమ్మడి పెట్టుబడిని ప్రకటించారు. యూకే ప్రభుత్వం, భారతీయ స్టేట్ బ్యాంకు మధ్య కుదిరిన ఒప్పందం పరిధిలో ఏర్పాటు చేసిన ఈ వ్యూహాత్మక కార్యక్రమం పర్యారవణ సాంకేతికత, ఏఐ లాంటి ఆధునిక రంగాల్లో ఆవిష్కరణలు చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహకారాన్నిఅందిస్తుంది. అలాగే ఆవిష్కరణలను ప్రోత్సహించి, వృద్ధిని పెంపొందిస్తుంది.
తీరప్రాంత పవన విద్యుత్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటును నాయకులు స్వాగతించారు. అంతర్జాతీయ స్వచ్ఛ విద్యుత్ కూటమి (జీసీపీఏ) ద్వారా సంయుక్తంగా పనిచేసి అవకాశాలను అన్వేషించాలనే తమ ఆలోచనను పునరుద్ఘాటించారు.
విద్య, సంస్కృతి, ప్రజలు
ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్తును రూపొందించడంలో యువత, సాంస్కృతిక, విద్యా పరమైన సహకార ప్రాముఖ్యాన్ని నాయకులు స్పష్టం చేశారు. మొదటి వార్షిక మంత్రిత్వ స్థాయి వ్యూహాత్మక విద్యా చర్చల నిర్వహణ, రెండు దేశాల సాంస్కృతిక మంత్రులు 2025, మేలో సంతకం చేసిన సాంస్కృతిక సహకార కార్యక్రమ అమలు పట్ల తమ చిత్తశుద్దిని వ్యక్తం చేశారు.
విద్యను ద్వైపాక్షిక సహకారంలో కీలకమైన అంశంగా గుర్తిస్తూ.. యూకేలో ఉన్నతొమ్మిది అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లను భారత్‌లో ఏర్పాటు చేయడంలో సాధించిన పురోగతి పట్ల ఉభయపక్షాలు సంతోషం వ్యక్తం చేశాయి. గురుగ్రామ్‌లో ప్రారంభమైన సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో మొదటి బ్యాచ్ విద్యార్థులు చదువుకోవడం ప్రారంభించారు. భారత్‌లో లివర్‌పూల్, యోర్క్, అబెర్డీన్, బ్రిస్టల్ విశ్వవిద్యాలయాల ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఏ)ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జారీ చేసింది. అలాగే గిఫ్ట్ సిటీలో క్వీన్స్, బెల్ఫాస్ట్, కోవెంట్రీ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు పొందాయి. బెంగళూరులో లాంకాస్టర్ విశ్వవిద్యాలయ ప్రాంగణం తెరిచేందుకు ఎల్‌వోఐను భారతీయ అధికారులు అందించారు. అలాగే గిఫ్ట్ సిటీలో సర్రే విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను ప్రారంభించడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు.
మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్షిప్ (ఎంఎంపీ) అమలును కొనసాగించడంలో ప్రధానులు తమ చిత్తశుద్దిని వ్యక్తం చేశారు. అక్రమ వలసలను అరికట్టే సహకారంలో సాధించిన పురోగతిని గుర్తిస్తూ.. ఈ అంశంలో సహకారాన్ని కొనసాగించాలనే తమ నిబద్ధతను ఉభయపక్షాలు పునరుద్ఘాటించాయి.
యునైటెెడ్ కింగ్డమ్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులను రెండు దేశాల మధ్య ‘జీవవారధి’గా నాయకులిద్దరూ వర్ణించారు. సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమలు, కళలు, పర్యాటకం, క్రీడా రంగాల్లో రెండు దేశాల ప్రతిభను ఒక్కచోట చేర్చే యూకే-ఇండియా సాంస్కృతిక సహకార కార్యక్రమ సామర్థ్యాన్ని గుర్తించారు.
ప్రాంతీయ, బహుపాక్షిక సహకారం
ప్రపంచ శాంతి, సంక్షేమం, నియమ ఆధారిత ప్రపంచ విధానం పట్ల తమ ఉమ్మడి నిబద్ధతను ప్రధానులు పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ)లో సంస్కరణలు సహా మెరుగుపరిచిన బహుపాక్షిక విధానాన్ని ప్రోత్సహించే దిశగా కృషి చేయడానికి అంగీకరించారు. యూఎన్ఎస్సీలో శాశ్వత సభ్యత్వం సాధించాలన్న న్యాయమైన భారత్ ఆకాంక్షలకు తాను దీర్ఘకాలికంగా అందిస్తున్న మద్దతును యూకే మరోసారి తెలియజేసింది.
వైవిధ్యభరితమైన భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 2.5 బిలియన్ల మంది ప్రజల ఉమ్మడి విలువలే కామన్వెల్త్ బలమని నాయకులు స్పష్టం చేశారు. పర్యావరణ మార్పులు, సుస్థిరాభివృద్ధి రంగాలతో సహా కామన్వెల్త్ సంస్థ నూతన నాయకత్వంలో యువత భాగస్వామ్యంపై కలసి పని చేయడానికి అంగీకరించారు.
యూఎన్ చార్టర్‌తో సహా అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా.. ఉక్రెయిన్లో న్యాయం, శాంతి స్థాపనకు ఇరువురు ప్రధానులు మద్దతు తెలియజేశారు. దీన్ని సాధించే దిశగా వివిధ దేశాలు చేపడుతున్న దౌత్య ప్రయత్నాలను వారు స్వాగతించారు.
మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వం పట్ల తమ నిబద్దతను తెలియజేస్తూ.. సంయమనంతో వ్యవహరించాలని, పౌరుల భద్రత, అంతర్జాతీయ చట్టాలను పాటించాలని పిలుపునిచ్చారు. పరిస్థితిని మరింత తీవ్రం చేసే.. ప్రాంతీయ స్థిరత్వాన్ని ముప్పు కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని కోరారు. గాజా కోసం యూఎస్ శాంతి ప్రణాళికకు మద్దతు తెలియజేస్తూ.. తక్షణమే శాశ్వత కాల్పుల విరమణను పాటించేందుకు, బందీలను విడుదల చేసేందుకు, మానవతా సాయాన్నిఅందించే దిశగా ప్రాంతీయ భాగస్వాములతో కలసి పని చేయడంలో తమ చిత్తశుద్ధిని తెలియజేశారు. అలాగే రెండు దేశాల పరిష్కారం దిశగా సురక్షితమైన ఇజ్రాయెల్‌తో పాటు స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుతో శాశ్వతమైన, న్యాయబద్ధమైన శాంతి పట్ల తమ అంకితభావాన్నిసంయుక్తంగా తెలియజేశారు.
తనకు, తన ప్రతినిధి బృందంలోని సభ్యులకు ఆత్మీయ ఆతిథ్యమిచ్చిన ప్రధానమంత్రి మోదీకి ప్రధాని స్టార్మర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, రెండు దేశాల మధ్య ఉన్న బలమైన, శాశ్వతమైన స్నేహ సంబంధాలపై నిర్మితమైన భారత్-యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన వృద్ధిని, సానుకూల ధోరణిని ఈ పర్యటన తెలియజేస్తుంది.
(Release ID: 2177511)
Visitor Counter : 27
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam