సహకార మంత్రిత్వ శాఖ
హర్యానాలోని రోహ్‌తక్‌లో సబర్ డెయిరీ ప్లాంట్‌ను ప్రారంభించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సహకార రంగానికి బలమైన పునాది
2029 నాటికి దేశంలోని ప్రతి పంచాయతీలో ఒక సహకార సంఘం
హర్యానాలో పాల ఉత్పత్తి రైతుల సంక్షేమం కోసం రూ. 350 కోట్ల వ్యయంతో పెరుగు, పాలు, మిఠాయిలను ఉత్పత్తి చేసేందుకు దేశంలోనే అతిపెద్ద ప్లాంట్ స్థాపించిన సబర్ డెయిరీ
రోజుకు 150 మెట్రిక్ టన్నుల పెరుగు, 10 మెట్రిక్ టన్నుల యోగర్ట్, 3 లక్షల లీటర్ల మజ్జిగ, 10,000 కిలోల మిఠాయిల ఉత్పత్తితో పాడి రైతుల శ్రేయస్సుకు చిహ్నంగా సబర్ డెయిరీ ప్లాంట్
ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో 70 శాతం రేటుతో అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా భారత పాడి పరిశ్రమ
మోదీ ప్రభుత్వ విధానాల కారణంగానే దేశంలో పాడి రంగంలో చేరిన 8 కోట్ల మంది రైతులు
దేశంలో పాల ప్రాసెసింగ్ సామర్థ్యం నేడు రోజుకు 66 మిలియన్ లీటర్లు
2028-29 నాటికి రోజుకు 100 మిలియన్ లీటర్లకు చేరుకోవాలని లక్ష్యం
డెయిరీ ప్లాంట్ నిర్మాణం, పరిశోధన-అభివృద్ధిని మూడు రెట్లు వేగవంతం చేయడం ద్వారా పాడి రంగంలో స్వయం-సమృద్ధి దిశగా పయనిస్తున్న మోదీ ప్రభుత్వం
Posted On:
03 OCT 2025 3:49PM by PIB Hyderabad
కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు హర్యానాలోని రోహ్‌తక్‌లో సబర్ డెయిరీ ప్లాంట్‌ను ప్రారంభించారు. హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీ, కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్, కేంద్ర మంత్రి శ్రీ రావు ఇంద్రజిత్ సింగ్ ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనే దేశంలోని రైతుల దశాబ్దాల డిమాండ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెరవేర్చారన్నారు. దీని కోసం యావత్ దేశం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతోందని తెలిపారు. గత నాలుగు సంవత్సరాల్లో సహకార మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సహకార సంఘాల పునాదిని బలోపేతం చేయడానికి కృషి చేసిందన్నారు. 2029 నాటికి దేశంలోని ప్రతి పంచాయతీలో సహకార సంఘం ఉంటుందని కేంద్ర సహకార మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం దాదాపు రూ. 350 కోట్ల వ్యయంతో సబర్ డెయిరీ నిర్మించిన దేశంలోని అతిపెద్ద పెరుగు, మజ్జిగ, యోగర్ట్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణం పూర్తయిందని శ్రీ అమిత్ షా తెలిపారు. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఢిల్లీ-ఎన్‌సీఆర్)లో పాల ఉత్పత్తులకు గల మొత్తం డిమాండ్ హర్యానా ద్వారానే తీరుతోందని ఆయన అన్నారు. గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాలో ప్రారంభమైన సబర్ డెయిరీ 9 రాష్ట్రాల్లో పాల ఉత్పత్తిదారులకు విస్తారమైన అవకాశాలను సృష్టించిందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్‌లో, త్రిభువన్ భాయ్, భూరా భాయ్, గల్బా భాయ్ డెయిరీలకు పునాది వేయగా.. ఈ సహకార డెయిరీల ద్వారా గుజరాత్‌లో 35 లక్షల మంది మహిళలు రూ. 85,000 కోట్ల విలువైన వార్షిక వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.
సబర్ ప్లాంట్‌లో రోజుకు 150 మెట్రిక్ టన్నుల పెరుగు, 10 మెట్రిక్ టన్నుల యోగర్ట్, 3 లక్షల లీటర్ల మజ్జిగ, 10,000 కిలోగ్రాముల మిఠాయిలు ఉత్పత్తి అవుతున్నాయని కేంద్ర సహకార మంత్రి తెలిపారు. ఇది రైతుల శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు. నేడు సబర్ డెయిరీ రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో రైతులకు సేవలందిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. అమూల్ నాయకత్వంలో గుజరాత్‌లో పిండ బదిలీ, లింగ నిర్ధారణ వంటి ఆధునిక బ్రీడింగ్ సాంకేతికతలపై శాస్త్రీయ కృషి విస్తృతంగా జరుగుతోందన్నారు. ఈ సాంకేతికతలను హర్యానాలోని పాడి రైతులకు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. దీనితో పాటు రాష్ట్రంలో తేనెటీగల పెంపకం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లో బయోగ్యాస్‌పై అనేక విజయవంతమైన ప్రయోగాలు జరిగాయనీ, హర్యానాలోనూ ఇటువంటి కార్యక్రమాలు అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత పాడి పరిశ్రమ గత 11 సంవత్సరాల్లో 70 శాతం వృద్ధి సాధించిందని శ్రీ అమిత్ షా తెలిపారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారత పాడి పరిశ్రమ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమగా అవతరించిందన్నారు. 2014–15లో దేశంలో పాలిచ్చే జంతువుల సంఖ్య 86 మిలియన్లు ఉండగా, అది ఇప్పుడు 112 మిలియన్లకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పాల ఉత్పత్తి 146 మిలియన్ టన్నుల నుంచి 239 మిలియన్ టన్నులకు పెరిగిందని తెలిపారు. దేశీయ ఆవుల ద్వారా పాల ఉత్పత్తి 29 మిలియన్ టన్నుల నుంచి 50 మిలియన్ టన్నులకు పెరిగిందన్నారు. దేశంలో దాదాపు 8 కోట్ల మంది రైతులు నేడు పాడి పరిశ్రమతో అనుసంధానమయ్యారని శ్రీ అమిత్ షా అన్నారు. మన దేశంలోని రైతులు తలసరి పాల లభ్యతను 124 గ్రాముల నుంచి 471 గ్రాములకు పెంచారని ఆయన పేర్కొన్నారు. గత 11 సంవత్సరాల్లో దేశ పాడి పరిశ్రమలో అనేక మార్పులు జరిగాయనీ, ఇవి మన రైతులకు శ్రేయస్సును తెచ్చిపెట్టాయని కేంద్ర సహకార మంత్రి వ్యాఖ్యానించారు.
తలసరి పాల లభ్యత పరంగా హర్యానా ప్రతి సంవత్సరం మొదటి మూడు స్థానాల్లో స్థిరంగా కొనసాగుతోందని కేంద్ర హోం, సహకార మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి మోదీ హయాంలో సుస్థిరమైన విధానాల కారణంగా నేడు భారత్ అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ప్రపంచం ముందు గర్వంగా నిలబడిందని ఆయన అన్నారు. శ్వేత విప్లవం 2.0 కింద రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా 75,000 కంటే ఎక్కువ పాల సంఘాల ఏర్పాటుతో పాటు.. ప్రభుత్వం 46,000 పాల సహకార సంఘాలనూ బలోపేతం చేస్తోందని శ్రీ అమిత్ షా తెలిపారు. మన ప్రస్తుత పాల ప్రాసెసింగ్ సామర్థ్యం రోజుకు 660 లక్షల లీటర్లు ఉండగా 2028–29 నాటికి దీనిని 100 మిలియన్ లీటర్లకు పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్యం సాధించిన తర్వాత అన్ని లాభాలు పాల ఉత్పత్తిలో నిమగ్నమైన మన తల్లులు, ఆడపడుచులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తాయని తెలిపారు.
ఇటీవల మోదీ ప్రభుత్వం పశుగ్రాస ఉత్పత్తి, ఎరువుల నిర్వహణ, సర్క్యులర్ ఎకానమీలో మృతి చెందిన జంతువుల అవశేషాల ఉపయోగం కోసం మూడు జాతీయ సహకార సంఘాలను స్థాపించిందని శ్రీ అమిత్ షా తెలిపారు. మోదీ ప్రభుత్వం జాతీయ గోకుల్ మిషన్, జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం, పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి, జాతీయ జంతు వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్నీ ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో భారత్ పాడి పరిశ్రమల రంగంలో స్వయం-సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. ఈ ప్రయోజనం కోసం మోదీ ప్రభుత్వం డెయిరీ ప్లాంట్ నిర్మాణం, సంబంధిత రంగంలో పరిశోధనలు-అభివృద్ధిని మూడు రెట్లు వేగవంతం చేయడం ద్వారా పాడి పరిశ్రమలో స్వయం-సమృద్ధి దిశగా పయనిస్తోందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
(Release ID: 2175034)
Visitor Counter : 6