ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ రోజు గాంధీనగర్‌లో "మీ డబ్బు, మీ హక్కు" అనే దేశవ్యాప్త ఆర్థిక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి


హక్కు కోరని డిపాజిట్లు కేవలం కాగితాలపై నమోదులు కావు. సాధారణ కుటుంబాలు కష్టపడి సంపాదించిన పొదుపు ఇది : కేంద్ర ఆర్థిక మంత్రి

‘అవగాహన, అందుబాటు, కార్యాచరణ’ అనే 3ఏ వ్యూహం ఈ కార్యక్రమానికి మార్గదర్శకం: శ్రీమతి నిర్మలా సీతారామన్

ప్రజల విశ్వాసం, గౌరవం, సాధికారతను బలోపేతం చేస్తోన్న సమష్టి ప్రయత్నమే ఈ కార్యక్రమం అన్న హోం శాఖ మంత్రి

ఈ కార్యక్రమాన్ని ప్రశంసించిన కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా

లబ్ధిదారుల విద్య, సాధికారత, ఇతర ఆర్థిక అవసరాలకు హక్కు కోరని డిపాజిట్లు ఉపయోగపడతాయి: కనుభాయ్ దేశాయ్, ఆర్థిక శాఖ మంత్రి, గుజరాత్

క్లెయిమ్‌ ప్రక్రియను త్వరితగతిన న్యాయబద్ధంగా చేపట్టాలి… తద్వారా లబ్ధిదారులు స్పష్టత, నమ్మకంతో తిరిగి వెళ్తారు- కార్యదర్శి, డీఎఫ్ఎస్

2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రతి జిల్లాలో కొనసాగనున్న కార్యక్రమం

క్లెయిమ్ చేసుకోని ఆర్థిక ఆస్తులను గుర్తించడం, క్లెయిమ్ చేయడంలో ప్రజలకు సహాయపడేందుకు డిజిటల్ ప్రదర్శనలు, హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు

Posted On: 04 OCT 2025 5:13PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా నిర్వహించనున్న అవగాహన కార్యక్రమం "మీ డబ్బు, మీ హక్కు(ఆప్‌‍కీ పూన్జీ, ఆప్‌కా అధికార్)"ను కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ కనుభాయ్ దేశాయ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డీఎఫ్ఎస్ కార్యదర్శి శ్రీ ఎం. నాగరాజు, రిజర్వ్ బ్యాంకు కార్యనిర్వహక డైరెక్టర్.. ఐఆర్‌డీఏఐ, సెబీ, పీఎఫ్ఆర్‌డీఏ‌ల శాశ్వత సభ్యులు.. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారుల, ప్రముఖ ఆర్థిక సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రజలు ఆదా చేసిన ప్రతి రూపాయి వారికి లేదా వారి కుటుంబాలకు వెళ్లాలనే సరళమైన, శక్తివంతమైన సందేశాన్ని ఈ కార్యక్రమం కలిగి ఉందన్నారు.

"క్లెయిమ్ చేసుకోని డిపాజిట్లు, బీమా, డివిడెండ్, మ్యూచువల్ ఫండ్స్, పింఛన్లు దస్త్రాలకు సంబంధించిన నమోదులు మాత్రమే కావు.. ఇవి సాధారణ కుటుంబాలు కష్టపడి సంపాదించిన పొదుపుకు ప్రతీకలు. ఈ పొదుపు మొత్తం విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక భద్రతకు మద్దతునివ్వగలవు" అని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు.

‘అవగాహన, అందుబాటు, కార్యాచరణ’ అనే 3ఏ భావనలను ఈ ప్రచార కార్యక్రమానికి మార్గదర్శక సూత్రాలుగా కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. క్లెయిమ్ చేసుకోని ఆస్తులను గుర్తించే విధానం ప్రతి ఒక్కరికి, ప్రతి సమూహానికి తెలియజేయటమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. సరళీకృత డిజిటల్ సాధనాలు, జిల్లా స్థాయి అవగాహన ద్వారా ఈ కార్యక్రమం అందుబాటులో ఉండటంతో పాటు కార్యాచరణ ద్వారా సమయానుకూల పారదర్శక క్లెయిమ్‌ను అందించనుంది.

"ఈ మూడు ప్రధాన అంశాలు కలిసి ప్రజలు, ఆర్థిక సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.. సమాజ అవగాహనకు దోహదపడతాయి.. ప్రతి ఒక్కరు చట్టబద్ధంగా రావాల్సిన పొదుపులను గౌరవంతో సులభంగా తిరిగి పొందేలా చూసుకుంటాయి" అని శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు.

ఇటీవలి కేవైసీ, రీ-కేవైసీ కార్యక్రమాల్లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ముఖ్యంగా గుజరాత్ గ్రామీణ బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలు చురుకైన పాత్ర పోషించాయని ఆర్థిక మంత్రి అన్నారు. ఈ కార్యాచరణ ప్రజలు, వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థకు మధ్యనున్న సంబంధాన్ని బలోపేతం చేశాయని పేర్కొన్నారు. "గ్రామాలు, పట్టణాల్లో చేపట్టిన ఈ కార్యక్రమాలు లబ్ధిదారులు.. పొదుపు, హక్కులతో అనుసంధానమై ఉండేలా చూసుకున్నాయి. ఇవి ప్రస్తుత కార్యక్రమ విజయానికి బలమైన పునాది వేశాయి" అని కేంద్ర మంత్రి అన్నారు.

క్లెయిమ్ చేసుకోని ఆస్తులకు సంబంధించి దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ప్రస్తుత కార్యక్రమంలో అన్ని సంస్థలు ఇదే అంకితభావం, శ్రద్ధతో ముందుకుసాగాలని శ్రీమతి నిర్మలా సీతారామన్ కోరారు. తద్వారా హక్కుగా పొందాల్సిన ఆర్థిక ఆస్తులను కోల్పోకుండా చూసుకోవాలని అన్నారు.

క్లెయిమ్ చేసుకోని డిపాజిట్లను విజయవంతంగా తిరిగి పొందిన లబ్ధిదారులకు శ్రీమతి నిర్మలా సీతారామన్ ధ్రువపత్రాలను కూడా అందజేశారు.

ఈ సందర్భంగా గుజరాత్ రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ కనుభాయ్ దేశాయ్ మాట్లాడుతూ… ఈ దేశవ్యాప్త కార్యక్రమాన్ని రాష్ట్రం నుంచి ప్రారంభించడం అనేది గుజరాత్‌కు గర్వకారణమని అన్నారు. క్రీయాశీల భాగస్వామ్యం, అవగాహన కార్యక్రమాల ద్వారా దీనిని విజయవంతంగా అమలు చేసేందుకు పూర్తి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు. "క్లెయిమ్ చేసుకోని డిపాజిట్లు లబ్ధిదారుల అవగాహన, సాధికారత, ఇతర ఆర్థిక అవసరాలకు చాలా ఉపయోగపడుతాయి" అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి, గాంధీనగర్ ‌నుంచి లోక్‌సభ సభ్యులు శ్రీ అమిత్ షా ఒక  సందేశాన్ని పంపించారు. ఈ కార్యక్రమం విషయంలో శుభాకాంక్షలు తెలియజేసిన కేంద్ర హోం మంత్రి.. అందరూ చురుకుగా పాల్గొనాలని కోరారు. క్లెయిమ్ చేసుకోని ఆర్థిక ఆస్తులను తిరిగి ఇవ్వటానికే ఈ కార్యక్రమం పరిమితం కాదన్న ఆయన.. ఇది ప్రజల విశ్వాసం, గౌరవం, సాధికారతను బలోపేతం చేసేందుకు చేస్తోన్న సమష్టి కృషిని తెలియజేస్తోందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా డీఎఫ్ఎస్ (ఆర్థిక సేవల విభాగం) కార్యదర్శి శ్రీ ఎం. నాగరాజు మాట్లాడుతూ.. 2025 ఆగస్టు నాటికి రూ. 75,000 కోట్లకు పైగా క్లెయిమ్ చేసుకోని డిపాజిట్లు ఆర్‌బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌ వద్ధ ఉన్నట్లు తెలిపారు. క్లెయిమ్ చేసుకోని మొత్తం..  బీమా‌ల విషయంలో రూ. 13,800 కోట్లకు పైగా, మ్యూచువల్ ఫండ్లలో దాదాపు రూ. 3,000 కోట్లు, డివిడెంట్‌ల విషయంలో రూ. 9,000 కోట్లకు పైగా ఉందని ఆయన తెలిపారు.

"క్లెయిమ్‌ ప్రక్రియను త్వరతిగతిన న్యాయబద్ధంగా, అనవసరమైన అడ్డంకులు లేకుండా పూర్తి చేయాలి. తద్వారా లబ్ధిదారులు స్పష్టత, నమ్మకంతో తిరిగి వెళ్తారు" అని డీఎఫ్ఎస్ కార్యదర్శి తెలిపారు. ప్రతి ఒక్కరు ఆర్థిక సాధికారత సాధించాలనే ఆర్థిక సేవల విభాగ దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటివరకు దాదాపు 172 కోట్ల షేర్లు పెట్టుబడిదారుల అవగాహన- రక్షణ నిధికి (ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్‌) బదిలీ అయ్యాయి. జన్‌ధన్ యోజన, యూపీఐ నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ వరకు ఆర్థిక సమ్మిళితత్వంలో భారత్ సాధించిన విస్తృత విజయాలను పునాదిగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆర్థిక సేవలను ప్రతి ఒక్కరు ఉపయోగించేలా చూసుకోవటమే కాకుండా హక్కుగా అందాల్సిన మొత్తానికి వారికి చేరేలా ఇది చూసుకోనుంది.

గుజరాత్‌లో ప్రారంభించిన ‘మీ డబ్బు, మీ హక్కు’ కార్యక్రమంతో ఆర్థిక చేరికను అర్థవంతంగా, పారదర్శకంగా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకెళ్లాలనే నిబద్ధతను ప్రభుత్వం పునరుద్ఘాటించింది.

ఈ కార్యక్రమంలో విస్తృత భాగస్వామ్యం ఉండేలా చూసుకోనున్నారు. దీన్ని అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించనున్నారు. ప్రజలు క్లెయిమ్ చేసుకోని ఆర్థిక ఆస్తులను సులభంగా గుర్తించడంలో, క్లెయిమ్ చేసుకోవటంలో డిజిటల్ ప్రదర్శనలు, హెల్ప్‌డెస్క్‌లు సహాయపడనున్నాయి. ఇది పౌర కేంద్రీకృత పాలన పట్ల ప్రభుత్వ నిబద్ధతను, జీవన సౌలభ్యాన్ని పెంచే విస్తృత దృక్పథాన్ని తెలియజేస్తోంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సమన్వయంతో కొనసాగే ఈ కార్యక్రమం.. బ్యాంకులు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్‌లు, పింఛను సంస్థలతో పాటు, భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ), సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా), బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ- ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా), పీఎఫ్ఆర్‌డీఏ (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ), ఐఈపీఎఫ్ఏలను (ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ) ఒకే వేదికపైకి తీసుకొస్తుంది.

 

****


(Release ID: 2175012) Visitor Counter : 6