కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘సామాజిక భద్రతలో విశిష్ట కృషి’కి గాను ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎస్ఏ పురస్కారం-2025 భారత్‌కు ప్రదానం.. సామాజిక పరిరక్షణలో ముందంజకు మోదీ ప్రభుత్వం ప్రయత్నాలకు గుర్తింపు


మలేసియాలో ఐఎస్ఎస్ఏ వరల్డ్ సోషల్ సెక్యూరిటీ ఫోరమ్‌లో పురస్కారాన్ని అందుకున్న కేంద్ర కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

ప్రధానమంత్రి శ్రీ మోదీ ‘అంత్యోదయ’ దార్శనికత్వంలో సమాజంలో అందరికీ భద్రతను అందించే గమ్యం వైపు దూసుకుపోతున్న భారత్: డాక్టర్ మాండవీయ

సరికొత్త ఆదాయార్జన అవకాశాలతో పాటు సామాజిక భద్రతను అందించే దిశగా
సాంకేతికతను వినియోగించుకుంటున్న ఇండియా: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

భారత్‌లో సామాజిక భద్రత పరిధి 2015లో 19 శాతం నుంచి 2025లో 64.5 శాతం మందికి విస్తరించి, 94 కోట్ల మంది పౌరులకు చేరుకోవడం ఓ మైలు రాయిగా గుర్తించిన ఐఎల్ఓ...

ప్రభుత్వ ‘ఈ-శ్రమ్’ పోర్టల్‌ లో మార్పుల కారణంగా నాలుగేళ్లలోనే 30 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు చేరువైందని కొనియాడిన ఐఎస్ఎస్ఏ...

ఐఎస్ఎస్ఏ సాధారణ సభలో 30 స్థానాలతో అత్యధిక ఓట్ షేర్ భారత్ సొంతం..

Posted On: 03 OCT 2025 10:50AM by PIB Hyderabad

సామాజిక భద్రత కల్పనలో విశిష్ట కృషికి గాను ప్రతిష్ఠాత్మక ‘అంతర్జాతీయ సామాజిక భద్రత సంఘం (ఐఎస్ఎస్ఏ) పురస్కారం-2025’ను భారత్‌కు ప్రకటించారు. ఈ అవార్డును మలేసియాలోని కౌలాలంపూర్‌లో ఈ రోజు నిర్వహించిన వరల్డ్ సోషల్ సెక్యూరిటీ ఫోరమ్ (డబ్ల్యూఎస్ఎస్ఎఫ్)లో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2015లో సామాజిక భద్రత పరిధిలో 19 శాతం మంది ఉంటే, ఈ సంవత్సరం (2025)లో 64.3 శాతం మంది సామాజిక భద్రత పరిధిలోకి వచ్చారనీ, ప్రస్తుతం 94 కోట్ల మంది పౌరులకు సామాజిక భద్రత ప్రయోజనాలు అందుతున్నాయనీ తెలిపారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) గుర్తించిందని కూడా ఆయన అన్నారు.  


 




సామాజిక భద్రత పరిధిని విస్తరించిన తరువాత, ఐఎస్ఎస్ఏ సాధారణ సభలో భారత్ వాటా 30కి చేరింది. ఐఎస్ఎస్ఏ సాధారణ సభలో ఏ దేశానికైనా అత్యధికంగా లభించే ఓట్ షేరు ఇది.

భారత ప్రభుత్వం పక్షాన పురస్కారాన్ని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అందుకున్నారు. ‘‘ఈ పురస్కారం సమాజంలో ఆఖరి వరుసలో ఉన్న వ్యక్తికి సైతం సాధికారతను కల్పించాలని ప్రబోధిస్తూ మాకు మార్గదర్శకంగా నిలుస్తున్న అంత్యోదయ సిద్ధాంతంతో పాటు మా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనం. అందరికీ సామాజిక భద్రతను సమకూర్చే దిశగా పయనించాలని మాకు అంత్యోదయ సూచిస్తోంద’’ని మంత్రి అన్నారు.  


 



ప్రపంచమంతటా సామాజిక భద్రత కల్పన వ్యవస్థలో భారత్ సాధించిన అసాధారణ ప్రగతికి దక్కిన గుర్తింపే ఈ పురస్కారం. ఈ పురస్కారాన్ని ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి ప్రకటిస్తున్నారు. 163 దేశాలకు చెందిన 1,200 కన్నా ఎక్కువ సామాజిక భద్రత విధాన రూపకర్తలు, వృత్తినిపుణులు పాల్గొన్న డబ్ల్యూఎస్ఎస్ఎఫ్ కార్యక్రమంలో ఈ పురస్కార ప్రదానం ముఖ్య ఆకర్షణగా నిలిచింది. ఈ  పురస్కారాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి దీనిని అందుకొన్న అయిదో దేశం భారత్. ఈ  పురస్కారం సామాజిక పరిరక్షణ రంగంలో గొప్పగా కృషి చేస్తూ మార్గదర్శిగా నిలుస్తున్న దేశాల సరసన భారత్‌నూ నిలబెట్టింది.
 


 

 




కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, సామాజిక భద్రత ప్రయోజనాలను వరుసలోని ఆఖరి వ్యక్తి కి సైతం అందించగల సామర్థ్యం ఉన్న విస్తృత స్థాయి డిజిటల్ వేదికలను భారత్‌లో అందరి అందుబాటులోకీ తీసుకు వచ్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఈ-శ్రమ్ పోర్టల్‌ను గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘ఈ-శ్రమ్ పోర్టల్‌ జాతీయ డిజిటల్ సమాచార నిధి. ఇది 31 కోట్ల కన్నా ఎక్కువ మంది అసంఘటిత రంగ శ్రామికులకు సామాజిక సంక్షేమ పథకాల వివరాలను వివిధ భాషల్లో, నిరంతరాయంగా అందించే ఒకే వేదికగా పనిచేస్తోంద’’ని డాక్టర్ మాండవీయ అన్నారు.  
 



ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారినీ, ఉద్యోగాలను ఇచ్చే సంస్థలనూ ఒకే వేదిక మీదకు తీసుకు రావడానికి పటిష్ఠ డిజిటల్ పరికరాలు అందుబాటులో ఉండే నేషనల్ కెరియర్ సర్వీస్ (ఎన్‌సీఎస్) పోర్టల్‌ రూపొందించినట్లు కూడా డాక్టర్ మాండవీయ తెలిపారు. ‘‘చేయి తిరిగిన కార్మికులకు సంబంధించిన ప్రామాణిక సమాచారాన్ని ఎన్‌సీఎస్‌లో పొందుపరిచారు. ఈ సమాచారాన్ని ప్రపంచం నలు మూలల యాజమాన్య సంస్థలు సులభంగా తెలుసుకోవచ్చు. ఈ  సమాచారాన్నంతటినీ ఈ-శ్రమ్‌ పోర్టల్‌కు కూడా అందిస్తారు. దీంతో మా నిపుణులైన యువ కార్మికులు వారి సామాజిక భద్రత ప్రయోజనాలను నష్టపోకుండానే వివిధ దేశాల్లో ఏయే మెరుగైన అవకాశాలు వారికి లభించనుందీ తెలుసుకోగలుగుతార’’ని మంత్రి వివరించారు.    

 



అంత క్రితం, డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రపంచ సామాజిక  భద్రత శిఖరాగ్ర  సమావేశం సర్వసభ్య సదస్సులో మాట్లాడారు. ఆరోగ్య సంరక్షణకూ, బీమాకూ సంబంధించిన అనేక పథకాల సేవలను భారత శ్రామికులకు అందించడంలో దేశంలోని రెండు ప్రధాన సామాజిక భద్రత కల్పన సంస్థలైన ఉద్యోగుల భవిష్య  నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ), ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ)ల పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
 



 


సాంకేతిక రంగంలోనూ, కార్మిక రంగంలోనూ చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా సామాజిక భద్రత కల్పనకు ప్రాధాన్యం పెరుగుతోందని మంత్రి అన్నారు. ‘‘సమగ్ర విధానం, ప్రక్రియలతో పాటు డిజిటల్ వేదికలతో మా సామాజిక భద్రత వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. కొత్త కొత్త ఆదాయార్జన అవకాశాల కల్పనతో పాటు సామాజిక భద్రత వలయం పరిధిని విస్తరించడానికి భారత్ సాంకేతికత సాయాన్ని తీసుకొంటోంది. ఆర్థిక వ్యవస్థ సేవలను అందుబాటులోకి తీసుకు రావడం, కార్మికులను నిపుణులుగా తీర్చిదిద్దడం, స్వయంఉపాధి అవకాశాలను అందించడంతో పాటు డిజిటల్ నవకల్పన.. ఇవన్నీ జతకలిసే ఒక సంపూర్ణ విధానాన్ని అమలుచేస్తున్నాం’’ అని ఆయన వివరించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా యువజనులకు స్ఫూర్తినివ్వడానికీ, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా మార్గదర్శకత్వాన్ని అందించడానికీ భారత్ ముందువరుసలో నిలిచింద’’ని డాక్టర్ మాండవీయ స్పష్టం చేశారు.

 

***


(Release ID: 2174468) Visitor Counter : 14