హోం మంత్రిత్వ శాఖ
గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని ఖాదీ ఇండియా షోరూమ్‌లో కేంద్ర హోం-సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా కొనుగోళ్లు.. ఆన్‌లైన్ చెల్లింపులు
· “భారత ఆత్మ చైతన్యాన్ని గుర్తించిన మహాత్మా గాంధీ.. బ్రిటిష్ పాలకులపై పోరాటం దిశగా సామాన్య ప్రజానీకంలో ఉత్తేజం నింపారు”
· “భారత భవిష్యత్ స్వరూపావిష్కరణలో భాగంగా గాంధీజీ స్వాతంత్ర్య ఉద్యమానికి జోడించిన అనేక అంశాల్లో ఖాదీ… స్వదేశీ అత్యంత కీలకమైనవిగా రూపొందాయి”
· “ఈ రెండింటినీ ప్రోత్సహించడం ద్వారా స్వాతంత్ర్య ఉద్యమ వేగం పెంచడమేగాక దేశంలోని లక్షలాది ప్రజల జీవితాల్లో మహాత్ముడు వెలుగులు నింపారు”
· “శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003లో ఖాదీకి పూర్వ వైభవం దిశగా ప్రారంభించిన ఓ ముఖ్యమైన కార్యక్రమం నేటి ఉద్యమానికి నాంది పలికింది”
· “ప్రధానిగా శ్రీ మోదీ 11 ఏళ్ల పదవీ కాలంలో ఖాదీ-గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తుల అమ్మకాలు 5 రెట్లు పెరిగి రూ.33,000 కోట్ల నుంచి రూ.1.7 లక్షల కోట్లు దాటాయి”
· “ప్రతి కుటుంబం ఏటా కనీసం రూ.5,000 విలువైన ఖాదీ ఉత్పత్తులు కొనాలి… తద్వారా లక్షలాది మందికి ఉపాధితో వారి జీవితాల్లో వెలుగులు పూస్తాయి”
Posted On:
02 OCT 2025 4:47PM by PIB Hyderabad
గాంధీ జయంతి నేపథ్యంలో ఇవాళ కేంద్ర హోం-సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోగల ఖాదీ ఇండియా షోరూమ్‌లో ఖాదీ ఉత్పత్తులు కొనుగోలు చేసి, ఆన్‌లైన్ చెల్లింపు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ- భారత ఆత్మ చైతన్యాన్ని గుర్తించిన మహాత్మా గాంధీ బ్రిటిష్ పాలకులపై పోరాటం దిశగా సామాన్య ప్రజానీకంలో ఉత్తేజం నింపారని ఆయన పేర్కొన్నారు. అలాగే, దేశ భవిష్యత్ స్వరూపావిష్కరణలో భాగంగా స్వాతంత్ర్య ఉద్యమానికి గాంధీజీ జోడించిన అనేక అంశాల్లో ఖాదీ, స్వదేశీ అత్యంత కీలకమైనవిగా రూపొందాయని చెప్పారు. అందువల్లనే స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఖాదీ-స్వదేశీల నుంచి వేరుగా చూడలేమని స్పష్టం చేశారు. ఈ రెండింటినీ ప్రోత్సహించడం ద్వారా స్వాతంత్ర్య ఉద్యమ వేగం పెంచడమేగాక దేశంలోని లక్షలాది ప్రజల జీవితాల్లో మహాత్ముడు వెలుగులు నింపారని గుర్తుచేశారు.
మన దేశం అనేక ఏళ్లపాటు ఖాదీ, స్వదేశీ భావనలను విస్మరించిందని శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు. కానీ, శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003లో ఖాదీకి పూర్వ వైభవం దిశగా ప్రారంభించిన ఓ కీలక కార్యక్రమం నేటి ఖాదీ ఉద్యమానికి నాంది పలికిందని వివరించారు. అటుపైన ఖాదీ మరోసారి ప్రజా జీవనంలో భాగంగా మారిందని హోంమంత్రి పేర్కొన్నారు. అంతేగాక దేశ ప్రధానిగా శ్రీ మోదీ 11 ఏళ్ల పదవీ కాలంలో ఖాదీ-గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తుల అమ్మకాలు 5 రెట్లు పెరిగి రూ.33,000 కోట్ల నుంచి రూ.1.7 లక్షల కోట్ల స్థాయిని అధిగమించాయని వెల్లడించారు.
ప్రధానమంత్రి మోదీ తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ద్వారా స్వదేశీ భావనను పునరుజ్జీవింపజేశారని గుర్తుచేశారు. దీనికి అనుగుణంగా దేశ ఆర్థికాభివృద్ధిని ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో అనుసంధానిస్తూ ప్రజలకు స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు విదేశీ వస్తు వినియోగానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు లక్షలాదిగా దుకాణదారులు కూడా విదేశీ ఉత్పత్తుల విక్రయం నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు.
ఖాదీ, స్వదేశీ ఉద్యమాల విజయం దిశగా దేశంలోని ప్రతి కుటుంబం ఏటా కనీసం రూ.5,000 విలువైన ఖాదీ ఉత్పత్తుల కొనుగోలుకు సంకల్పం పూనాలని శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారు. తద్వారా లక్షలాది మందికి ఉపాధి లభించడంతోపాటు వారి జీవితాల్లో వెలుగులు పూస్తాయని ఆయన చెప్పారు. దేశాన్ని 2047 నాటికి ‘వికసిత భారత్’గా తీర్చిదిద్ది, ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేర్చే ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి అనుగుణంగా స్వదేశీ వస్తు వినియోగంపై మనం ప్రతినబూనాలని సూచించారు. ఈ దిశగా ప్రధానమంత్రి మోదీ శ్రీకారం చుట్టిన ఖాదీ వాడకం, స్వదేశీ వినియోగం మనకు సాధికారతనిస్తాయని తెలిపారు. ఈ జంట కార్యక్రమాలను మన జీవనంలో అంతర్భాగం చేసుకోవడమేగాక భావితరాలకూ సంక్రమింపజేయాలని పిలుపునిచ్చారు.
***
(Release ID: 2174357)
Visitor Counter : 6