ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పండిట్ ఛన్నులాల్ మిశ్రా మృతికి ప్రధానమంత్రి సంతాపం
Posted On:
02 OCT 2025 8:55AM by PIB Hyderabad
ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు శ్రీ పండిట్ ఛన్నులాల్ మిశ్రా మరణంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వెలిబుచ్చారు. భారతీయ కళాసంస్కృతులకు ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారని ఈ సందర్భంగా కొనియాడారు.
కాశీ సంప్రదాయాల్లో అంతర్భాగమైన హిందూస్థానీ శాస్త్రీయ సంగీత పాఠశాల ‘బనారస్ ఘరానా’ వ్యవస్థాపకులలో పండిట్ జీ ఒకరు. ఆయన ఆలపించిన గీతాలు ఈ నగర సంగీత వారసత్వాన్ని శ్రోతలకు విశదం చేస్తాయి. తన సంగీత వారసత్వాన్ని అసంఖ్యాక సంగీత విద్యార్థులకు సంక్రమింపజేయడం ద్వారా కాశీ నగర సంగీత సంప్రదాయాల పరిరక్షణ, వ్యాప్తికి ఆయన తన వంతు కృషి చేశారు. వారణాసిలోని తన నివాసాన్ని సంగీతాభ్యాస, భక్తి, కళా నైపుణ్య కూడలిగా తీర్చిదిద్దారు.
ఈ నేపథ్యంలో పండిట్ జీతో తన అనుబంధాన్ని ప్రధానమంత్రి స్మరించుకున్నారు. ముఖ్యంగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి తాను పోటీచేసినపుడు తన ప్రతిపాదకుడుగా సంతకం చేయడం ద్వారా ఆయన ఆశీస్సులు, మద్దతు లభించడం తన అదృష్టమని అభివర్ణించారు. నగరం మీద, పురోగమిస్తున్న దాని వారసత్వంపైనా ఆయనకుగల ప్రగాఢ నిబద్ధతకు ఇది ప్రతీక అని పేర్కొన్నారు.
పండిట్ జీ తనపై చూసిన ఆదరాభిమానాలు, కురిపించిన ఆశీస్సుల గురించి తరచూ ప్రస్తావిస్తూ- అదంతా తనకు దక్కిన అదృష్టంగా భావిస్తానని శ్రీ మోదీ వ్యాఖ్యానిస్తారు. భారత ప్రాచీన సంప్రదాయాలు, ఆధ్యాత్మిక ఔన్నత్యం, సంస్కృతుల పరిణామాత్మక శక్తిపై గౌరవాన్ని వారిద్దరి అనుబంధం ప్రతిబింబిస్తుంది.
భారత శాస్త్రీయ సంగీత రంగంలో విశిష్ట కృషికిగాను ప్రస్తుత ప్రభుత్వం 2020లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’తో పండిట్ ఛన్నులాల్ మిశ్రాను సత్కరించింది.
పండిట్ జీ వారసత్వం సంగీత, కళాసాంస్కృతిక ఔత్సాహికులకు తరతరాల పాటు సదా స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు శ్రీ పండిట్ చన్నులాల్ మిశ్రా కన్నుమూశారన్న సమాచారం నన్ను తీవ్రంగా కలచివేసింది. భారతీయ కళాసంస్కృతులను సుసంపన్నం చేయడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. అంతర్జాతీయ వేదికలపై భారత శాస్త్రీయ సంగీత సంప్రదాయాలను చాటడానికి విశేషంగా కృషి చేశారు. అంతేకాకుండా తన సంగీత వారసత్వాన్ని ప్రజలకు సంక్రమింపజేశారు. ఆయన ప్రేమాభిమానాలను, ఆశీర్వాదాలను పొందే అదృష్టం నాకు దక్కింది. వారణాసి నియోజకవర్గం నుంచి నేను 2014లో పోటీ చేసినపుడు ఆయన నా ప్రతిపాదకుడుగా వ్యవహరించడం నాకొక చిరస్మరణీయ జ్ఞాపకం. ఈ విషాద సమయాన పండిట్ జీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 2174124)
Visitor Counter : 2