రాష్ట్రపతి సచివాలయం
జాతీయ జియోసైన్స్ ఆవార్డులను అందించిన రాష్ట్రపతి
Posted On:
26 SEP 2025 12:48PM by PIB Hyderabad
ఈ రోజు (2025 సెప్టెంబర్ 26) రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము.. 2024కు సంబంధించిన జాతీయ జియో సైన్స్ అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. మానవ నాగరికత అభివృద్ధిలో ఖనిజాలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. భూమిలో లభించే ఖనిజాలు మానవ జీవనానికి పునాది వేశాయనీ, అవే మన వాణిజ్యాన్నీ, పరిశ్రమలన్నీ ఉనికిలోకి తెచ్చాయన్నారు.
మానవ నాగరికత పురోగతిలో ప్రధాన దశలైన రాతి యుగం, కాంస్య యుగం, ఇనుప యుగాలూ ఖనిజాల పేరుతోనే ఉన్నాయనీ, ఇనుం, బొగ్గు వంటి ఖనిజాలు లేకుండా పారిశ్రామికీకరణను ఊహించలేమన్నారు.
గనుల తవ్వకం ద్వారా ఆర్థికాభివృద్ధికి అవసరమైన వనరులు అందుబాటులోకి వస్తున్నాయనీ, తద్వారా భారీ ఉపాధి అవకాశాలూ అందిస్తున్నాయనీ ఆమె అన్నారు. నిర్వాసితులు తరలివెళ్లాల్సి రావడం, అడవుల నరికివేత, గాలి నీటి కాలుష్యం వంటి అనేక ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయన్నారు. ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు గనుల తవ్వే పద్ధతిలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. నిర్వాసితులకూ, వన్యప్రాణులకు హాని లేకుండా, గనుల మూసివేత సమయంలో సరైన విధానాలను పాటించాలన్నారు.
మన దేశానికి మూడు వైపులా మహాసముద్రం ఉందనీ, సముద్రగర్భంలో విలువైన ఖనిజ నిల్వలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ వనరులను దేశాభివృద్ధికి ఉపయోగించడంలో భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తారన్నారు. సముద్ర జీవ వైవిధ్యానికి జరిగే నష్టాన్ని పరిమితం చేస్తూనే, దేశ ప్రయోజనాల కోసం సముద్రం అడుగున ఉన్న వనరులను ఉపయోగించుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని ఆమె శాస్త్రవేత్తలను కోరారు.
భూవిజ్ఞాన శాస్త్రవేత్తల పాత్ర గనులకు మాత్రమే పరిమితం కాకూడదనీ, భూమి పర్యావరణ సుస్థిరతపై గనుల తవ్వకం చూపించే ప్రతికూల ప్రభావాలను కూడా వారు పరిష్కరించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. ఖనిజ ఉత్పత్తులకు విలువను జోడించేందుకు, వ్యర్థాలను తగ్గించడానికి సాంకేతికతను అభివృద్ధి చేయటంతో పాటు ఆయా సాంకేతికలను ఉపయోగించాలనీ, సుస్థిర ఖనిజాభివృద్ధికి ఇదే కీలకమనీ వ్యాఖ్యానించారు. సుస్థిరత, ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్న గనుల మంత్రిత్వ శాఖ.. మైనింగ్ పరిశ్రమలో కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, డ్రోన్ ఆధారిత సర్వేలను ప్రోత్సహించటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. గనుల్లో వెలువడే వ్యర్థాల నుంచి విలువైన మూలకాలను పొందేందుకు మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలను కూడా ఆమె ప్రశంసించారు.
ఆధునిక సాంకేతికతకు భూమిలోని అరుదైన మూలకాలు వెన్నెముక లాంటివని రాష్ట్రపతి అన్నారు. ఇవి స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల నుంచి రక్షణ వ్యవస్థలు, స్వచ్ఛ ఇంధన పరిష్కారాల వరకు ప్రతిదానికీ ఇంధనాన్ని అందిస్తాయి. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని.. తయారీ రంగంలో భారతదేశం స్వావలంబనను సాధించాలని అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని సాధించేందుకు, జాతీయ భద్రతను నిర్ధారించడానికి ఇది చాలా కీలకమని వ్యాఖ్యానించారు. కీలక ఖనిజాలు అరుదనీ.. వాటిని శుద్ధి చేసి ఉపయోగించుకునే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుందన్నారు. ఈ సంక్లిష్ట ప్రక్రియను పూర్తి చేసేందుకు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం దేశానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
***
(Release ID: 2171963)
Visitor Counter : 12