సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ దక్షిణ కొరియా పర్యటన విజయవంతం: మీడియా, వినోదం, గేమింగ్, డిజిటల్ ఆవిష్కరణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారం బలోపేతం
30వ బుసాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం, ఆసియా కంటెంట్ మార్కెట్‌లో బలమైన సృజనాత్మక ఉనికిని చాటిన భారత్
‘భారత్ పర్వ్’, వేవ్స్ బజార్ ద్వారా భారతీయ సంస్కృతి, సృజనాత్మక ఆర్థిక సామర్థ్య ప్రదర్శన మీడియా, ఏఐ, బ్లాక్ చెయిన్, కంటెంట్ రక్షణలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి
కొరియా పార్లమెంటేరియన్లు, పరిశ్రమ ప్రముఖులతో చర్చలు నిర్వహించిన డాక్టర్ ఎల్ మురుగన్
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో కీలక భాగస్వాములుగా కొరియా ప్రవాస భారతీయులను ప్రశంసించిన డాక్టర్ మురుగన్ గోవాలో జరిగే 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొనాలని కొరియా ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించిన మంత్రి
Posted On:
25 SEP 2025 9:22PM by PIB Hyderabad
మీడియా, వినోదం, సంస్కృతి, గేమింగ్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల రంగాల్లో భారత్, కొరియా దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ, కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ 2025 సెప్టెంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో నిర్వహించిన పర్యటన విజయవంతం అయింది. ఈ సందర్భంగా కొరియాలోని పలు నగరాలలో ఆయన పర్యటించారు.
30వ బుసాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (బీఐఎఫ్ఎఫ్), ఆసియా కంటెంట్స్ అండ్ ఫిల్మ్ మార్కెట్ (ఏసీఎఫ్ఎం)లో భారత్ క్రియాశీల భాగస్వామ్య నేపథ్యంలో నిర్వహించిన ఈ పర్యటనలో- ఉన్నత స్థాయి సమావేశాలు, పరిశ్రమ రౌండ్‌టేబుల్ సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవాస భారతీయులతో నిర్వహించిన చర్చలు భాగంగా ఉన్నాయి.
పర్యటన ముఖ్యాంశాలు
1. భారతదేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ, ఉమ్మడిగా చిత్ర నిర్మాణంలో సహకారంపై రౌండ్ టేబుల్ సమావేశం (22 సెప్టెంబర్, బుసాన్).
బీఐఎఫ్ఎఫ్ సందర్భంగా బుసాన్ ఫిల్మ్ కమిషన్ (బీఎఫ్పీ) భాగస్వామ్యంతో నిర్వహించిన ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశానికి డాక్టర్ మురుగన్ అధ్యక్షత వహించారు. విధాన ప్రణాళిక, సహ చిత్రనిర్మాణ ఒప్పందాలు, నిధుల మార్గాలు, పంపిణీ భాగస్వామ్యాలపై చర్చించడానికి ఈ సెషన్ ప్రభుత్వ ప్రతినిధులు, ప్రపంచ పరిశ్రమ నాయకులను ఒకచోట చేర్చింది. ఈ రౌండ్ టేబుల్ చర్చలు భారతదేశం సహ చిత్ర నిర్మాణ కేంద్రంగా ఎదుగుతున్న ప్రాధాన్యతను, కొరియాతోనూ, ప్రపంచ భాగస్వాములతోనూ సృజనాత్మక మార్పిడిని మరింతగా విస్తరించాలన్న లక్ష్యాన్ని స్పష్టం చేశాయి.
2. భారత్ నెట్వర్కింగ్, డిన్నర్: వేవ్స్ బజార్ ప్రదర్శన (సెప్టెంబర్ 22, బుసాన్)
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తన వేవ్స్ బజార్ వేదిక ద్వారా "భారతీయ సంస్కృతి, సృజనాత్మకత, అనుసంధానం ద్వారా ఒక ప్రయాణం" ఇతివృత్తంతో సాంస్కృతిక ప్రదర్శన, నెట్వర్కింగ్ సాయంత్రంతో కూడిన భారత్ పర్వ్ ను నిర్వహించింది. బీఐఎఫ్ఎఫ్ చైర్ పర్సన్ శ్రీ పార్క్ క్వాంగ్ సు, ఏసీఎఫ్ఎం డైరెక్టర్ శ్రీమతి ఎలెన్ వైడీ కిమ్, బీఎఫ్సీ డైరెక్టర్ శ్రీ కాంగ్ సంగ్ క్యూ లతో పాటు 250 మందికి పైగా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ... సాంస్కృతిక దౌత్యానికి భారతదేశం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, బీఐఎఫ్ఎఫ్ 2025లో 10 భారతీయ చిత్రాల ప్రదర్శన, ఏసీఎఫ్ఎంలో సహ చిత్ర నిర్మాణాల మార్కెట్ కోసం 5 ప్రాజెక్ట్‌ల ఎంపికతో భారత్ బలమైన ప్రాతినిధ్యాన్ని చాటిందని చెప్పారు.
3. పార్లమెంటరీ, ప్రభుత్వ కార్యక్రమాలు (24 సెప్టెంబర్, సియోల్)
నేషనల్ అసెంబ్లీ సాంస్కృతిక, క్రీడలు, పర్యాటక కమిటీ సభ్యులతో సమావేశం.
శ్రీమతి కిమ్ జే వోన్, శ్రీ జిన్ జాంగ్ ఓహ్‌లతో నిర్వహించిన చర్చలు... భారత్, కొరియా సహ చిత్ర నిర్మాణ ఒప్పందాన్ని బలోపేతం చేయడంపైనా, పైరసీ, కంటెంట్ రక్షణ సమస్యలను పరిష్కరించడంపైనా, ఏఐ, బ్లాక్‌చెయిన్, కంటెంట్ నిర్వహణలో సహకారం కోసం అవకాశాలను అన్వేషించడంపైనా కేంద్రీకృతమయ్యాయి. మీడియా, వినోద రంగాల సహకారంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు సంయుక్త అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
కొరియా - భారత్ పార్లమెంటరీ మైత్రీ బృంద సభ్యులతో సమావేశం
వైస్ చైర్‌పర్సన్లు శ్రీమతి మూన్ జియోంగ్-బోగ్, శ్రీ యూన్ యంగ్-సియోక్‌లతో పాటు ఇతర సభ్యులతో డాక్టర్ మురుగన్ విస్తృతంగా చర్చించారు. ఈ చర్చలు రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాన్ని పునరుద్ఘాటించాయి. పార్లమెంటరీ, సాంస్కృతిక, ప్రజల మధ్య మార్పిడిని మరింత విస్తరించే అవకాశాలపై దృష్టి పెట్టాయి.
4. పరిశ్రమ సంబంధ కార్యకలాపాలు: క్రాఫ్టన్ సీఈఓతో సమావేశం (24 సెప్టెంబర్, సియోల్)
ప్రపంచంలోని ప్రముఖ గేమింగ్ కంపెనీలలో ఒకటైన క్రాఫ్టన్ ఇంక్ గ్లోబల్ సీఈఓ శ్రీ చాంగ్‌హాన్ కిమ్ తో డాక్టర్ మురుగన్ సమావేశమయ్యారు. భారత్ ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్‌పై తెచ్చిన చట్టం, ఇ - స్పోర్ట్స్ కు ప్రోత్సాహం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ వంటి సంస్థల ద్వారా ప్రతిభావంతులను తీర్చిదిద్దడంపై వారు చర్చించారు. భారత యువ జనాభా సామర్ధ్యం, శక్తిమంతమయిన డిజిటల్ వ్యవస్థను గుర్తించిన క్రాఫ్టన్, భారతదేశంలో పెట్టుబడులను విస్తరించడంలోనూ, గేమ్ డెవలప్మెంట్, పరిశోధన, నైపుణ్య శిక్షణలోనూ భాగస్వామ్యం కావడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది.
5. మీడియా భాగస్వామ్యాలు: కొరియా హెరాల్డ్‌తో సమావేశం (24 సెప్టెంబర్, సియోల్)
మెరుగైన మీడియా భాగస్వామ్యాలు, సాంస్కృతిక అవగాహన, కంటెంట్ సహ సృష్టిపై దృష్టి సారించి, హెరాల్డ్ మీడియా గ్రూప్ (కొరియా హెరాల్డ్/హెరాల్డ్ బిజినెస్) ప్రెసిడెంట్, ప్రచురణకర్త శ్రీ జిన్-యంగ్ చోయ్‌తో మంత్రి శ్రీ మురుగన్ చర్చలు జరిపారు.
6. ప్రవాస భారతీయులతో సమావేశం (24 సెప్టెంబర్, సియోల్)
భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో కొరియాలోని భారతీయ సమాజం చేసిన కృషిని డాక్టర్ మురుగన్ ప్రశంసించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దార్శనికత 'సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్'ను, వికసిత భారత్ దిశగా భారత్ పురోగతిని ఆయన వివరించారు.
యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపుల వంటి ఆవిష్కరణల ద్వారా భారతదేశ ప్రపంచ డిజిటల్ నాయకత్వాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశ వృద్ధి గాథలో ప్రవాస భారతీయుల భాగస్వామ్యం ప్రాముఖ్యతను స్పష్టం చేశారు.
భారత్ - కొరియా సృజనాత్మక సమన్వయం
ఈ పర్యటన భారత ప్రభుత్వ సానుకూల సాంస్కృతిక దౌత్యాన్ని, భారతదేశాన్ని గ్లోబల్ కంటెంట్ హబ్‌గా నిలపాలన్న దృష్టిని ప్రదర్శించింది. వేవ్స్, వేవ్స్ బజార్ వంటి కార్యక్రమాలు భారత్ పర్వ్ వంటి ప్రధాన కార్యక్రమాలతో కలిసి భారతదేశ సృజనాత్మక పరిధిని విస్తరించటం, సరిహద్దు దాటి సహకారాలను ప్రోత్సహించడం, సహ చిత్ర నిర్మాణం, గేమింగ్, డిజిటల్ ఆవిష్కరణల కోసం కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దోహదపడుతున్నాయి.
భారత్ - కొరియా ప్రజల మధ్య, పరిశ్రమల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు 2025 నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరిగే 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఎఫ్ఎఫ్ఐ) లో పాల్గొనవలసిందిగా కొరియా పార్లమెంటేరియన్లు, మీడియా నాయకులు, పరిశ్రమల ప్రతినిధులను డాక్టర్ మురుగన్ ఆహ్వానించారు.
***
(Release ID: 2171961)
Visitor Counter : 4