ప్రధాన మంత్రి కార్యాలయం
అమూల్ సంస్థ , జీసీఎంఎంఎఫ్ స్వర్ణోత్సవ వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
22 FEB 2024 1:26PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారు, గుజరాత్ ప్రియతమ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ గారు, కేంద్రమంత్రులు పర్షోత్తం రూపాలా గారు, సీఆర్ పాటిల్ గారు, అముల్ చైర్మన్ శ్రీ శ్యామల్‌భాయ్, ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన నా సోదరీసోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు!
50 సంవత్సరాల కిందట గుజరాత్ గ్రామాల ప్రజలు నాటిన మొక్క నేడు అద్భుతమైన మర్రి చెట్టుగా ఎదిగింది. ఇప్పుడు ఆ భారీ మర్రి చెట్టు కొమ్మలు దేశమంతటా, విదేశాల్లోనూ విస్తరించాయి. గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సంస్థ స్వర్ణోత్సవం సందర్భంగా మీ అందరికీ... ప్రతి మహిళకూ, పురుషుడికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గుజరాత్ పాల ఉత్పత్తి సంఘాలతో అనుసంధానమైన ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. ఈ ప్రయాణంలో మరో ముఖ్యమైన భాగస్వామిని కూడా మనం గుర్తించాయి. పాడి పరిశ్రమలో ప్రధాన భాగస్వాములు మన పశువులే.. ఈ విజయానికి అవి అందించిన గొప్ప సహకారాన్ని నేను గౌరవిస్తున్నాను. పశువులు లేకుండా పాడి పరిశ్రమ అసంపూర్ణం. అందుకే మన దేశంలోని పశువులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
సోదరీసోదరులారా!
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక బ్రాండ్లు పుట్టుకొచ్చాయి. కానీ అమూల్ వంటి బ్రాండ్ మరొకటి లేదు. నేడు అమూల్ దేశ పశువుల పెంపకందారుల ధైర్యానికీ, సామర్థ్యానికీ ప్రతీకగా నిలుస్తోంది. అమూల్ విశ్వాసం, పురోగతి, ప్రజా భాగస్వామ్యాన్ని, రైతుల సాధికారతను ప్రతిబింబిస్తోంది. ఇది సంప్రదాయంతో ఆధునికతను జోడించడం ద్వారా స్వావలంబన భారత్‌కు స్పూర్తిగా నిలుస్తోంది. ఇది ఉన్నత ఆశయాలు, సంకల్పాలు, అసాధారణ విజయాలను అందిస్తుంది. అమూల్ ఉత్పత్తులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 18 వేలకు పైగా పాల సహకార సంఘాలు, 36 లక్షలకు పైగా రైతులు, ప్రతిరోజూ సగటున 3.5 కోట్ల లీటర్ల పాల సేకరణ, పశువుల పెంపకందారులకు రోజూ రూ. 200 కోట్లకు పైగా ఆన్‌లైన్ చెల్లింపులతో అమూల్‌ను అద్భుతమైన సంస్థగా నిలుపుతోంది. చిన్న స్థాయి పశుపోషకులను కలిగిన ఈ సంస్థ.. సమాఖ్య, సహకార శక్తిని ఆధారంగా చేసుకొని అభివృద్ధి చెందుతోంది.
సోదరీసోదరులారా!
రాబోయే తరాల భవిష్యత్తు కోసం ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు ఎలా పనిచేస్తాయో చెప్పడానికి అమూల్ ఒక. సర్దార్ వల్లభభాయ్ పటేల్ మార్గదర్శకత్వంలో ఖేడా పాలు ఉత్పత్తిదారుల సంఘంగా ప్రారంభమైన ఈ సంస్థ.. ఇదే గట్టి పునాదిపై నేడు అమూల్‌గా ఎదిగింది. తరువాతి కాలంలో గుజరాత్‌లో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు విస్తరించాయి. వీటి సమన్వయంతో గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీఎంఎంఎఫ్) ఏర్పడింది. నేటికి కూడా ఇది ప్రభుత్వం, సహకార సంస్థల సమన్వయంతో ఓ ఆదర్శప్రాయమైన నమూనాగా మారింది. ఈ సమిష్టి కృషి వల్లే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాలు ఉత్పత్తిదారుదేశంగా ఎదిగింది. సుమారు 8 కోట్లమంది ప్రజలు ప్రత్యక్షంగా పాడి పరిశ్రమలో భాగమై ఉన్నారు. గత దశాబ్దంలో దేశంలో పాల ఉత్పత్తి సుమారు 60 శాతం పెరిగింది. తలసరి పాల లభ్యత సుమారు 40 శాతం పెరిగింది. ప్రపంచ పాడి పరిశ్రమ సగటున 2 శాతం పెరుగుతోంటే.. భారత్‌లో ఇది 6 శాతం వేగంతో అభివృద్ధి చెందుతోంది. ఇది ఎంతో గొప్ప విషయం.
మిత్రులారా!
దేశ పాడి పరిశ్రమలో ఒక కీలకమైన అంశం తరచూ మన దృష్టికి రాదు. ఈ సందర్భంగా ఆ అంశాన్ని నేను లోతుగా చర్చించాలనుకుంటున్నాను. దేశంలో రూ.10 లక్షల కోట్ల టర్నోవర్ కలిగిన పాడి పరిశ్రమను నడిపిస్తున్న ప్రధాన శక్తి..మన దేశ మహిళలు. మన సమాజంలో ఉన్న తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు ఈ రంగానికి అపారమైన సేవలు అందిస్తున్నారు. వరి, గోధుమ, చెరుకు వంటి ప్రధాన పంట టర్నోవర్ కూడా పాడి పరిశ్రమ టర్నోవర్‌తో సరిపోలదు. విశేషమేంటంటే ఈ పాడి పరిశ్రమలోని 70 శాతం పని... మన తల్లులు, అక్కాచెల్లెళ్లే చేస్తున్నారు. వారు నిజంగా దేశ పాడి పరిశ్రమకు వెన్నుముకగా నిలిచారు. మహిళల శక్తిని ఇది స్పష్టంగా చూపిస్తోంది. నేడు అమూల్ సాధించిన అసాధారణ విజయానికి మహిళలే ప్రధాన కారణం. “మహిళా నేతృత్వంలోని అభివృద్ధి’’ మంత్రంతో భారత్ ముందుకు సాగుతున్న ఈ సమయంలో పాడి పరిశ్రమ విజయం ఒక గొప్ప స్పూర్తిగా నిలుస్తోంది. దేశ అభివృద్ధి కోసం ప్రతి మహిళా ఆర్థికంగా శక్తిమంతం కావాల్సిన అవసరం ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకే మా ప్రభుత్వం వివిధ రంగాల్లో మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది. ముద్ర యోజన ద్వారా ఇప్పటి వరకు రూ. 30 లక్షల కోట్లకుపైగా రుణాలు ఇవ్వగా.. అందులో సుమారు 70 శాతం లబ్ధిదారులు మహిళలే. గత దశాబ్దంలో స్వయం సహాయక బృందాల్లో చేరిన మహిళల సంఖ్య 10 కోట్లను దాటింది.. ఈ సంస్థలకు బీజేపీ ప్రభుత్వం రూ. 6 లక్షల కోట్లకుపైగా ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. వీటికితోడు ప్రధానమంత్రి అవాస్ యోజన ద్వారా నిర్మించిన 4 కోట్ల ఇళ్లలో అధిక భాగం మహిళల పేరుతో నమోదు కావడం సమాజంలో వారి పెరుగుతున్న ఆర్థిక భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. మీరు "నమో డ్రోన్‌దీదీ" అనే కార్యక్రమం గురించి వినే ఉంటారు. ఇది గ్రామీణ మహిళల సాధికారతను మరింత శక్తిమంతం చేయాలనే ఉద్దేశంతో రూపొందించాం. ఈ పథకం ద్వారా గ్రామీణ స్వయం సహాయక బృందాలకు 15 వేల ఆధునిక డ్రోన్లు అందిస్తున్నారు. వాటిని ఉపయోగించేందుకు మహిళలకు శిక్షనిస్తున్నారు. త్వరలోనే పంటలకు పురుగుమందుల పిచికారీ నుంచి ఎరువుల పంపిణీ వరకూ వివిధ గ్రామ కార్యకలాపాల్లో ‘నమో డ్రోన్‌దీదీలు’ కీలక పాత్ర పోషించేందుకుఎక్కువ సమయం పట్టదు.
మిత్రులారా!
గుజరాత్‌లోని మన పాడి సహకార సంఘాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. నేను గుజరాత్‌లో పని చేస్తున్న సమయంలో పాడి పరిశ్రమలో పొల్గొనే మహిళల కోసం ఒక ముఖ్యమైన పథకాన్ని ప్రారంభించాం. పాడి డబ్బులు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి జమ అయ్యేలా చేశాం. ఈ పద్దతిని నేటికీ అమూల్ కొనసాగిస్తున్నందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ప్రతి గ్రామంలో మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేయడం వల్ల పశు పోషకులకు నగదు ఉపసంహరణ మరింత సులభంగా అందుబాటులోకి వస్తోంది. అంతేకాక పశుపోషకులకు త్వరలో రుపే క్రెడిట్ కార్డులు జారీ చేయాలన్న యోజన కూడా ఉంది. పంచమహాల్, బనాస్కంత జిల్లాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టులుగా ఈ కార్యాచరణ ప్రారంభం కానుంది. ఈ చర్యలన్నీ మహిళల ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయడంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
సోదరీసోదరులారా!
‘‘దేశం ఆత్మ దాని గ్రామాల్లో ఉంది’ అని ఒకప్పుడు గాంధీ చెప్పినట్లు.. అభివృద్ధి చెందిన భారత్‌ను తీర్చిదిద్దడానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం చాలా అవసరం. గత కేంద్ర ప్రభుత్వాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అవసరాలను విచ్ఛిన్నం చేశాయి. కానీ మా ప్రభుత్వం గ్రామీణ జీవితంలోని అనే సమస్యలను పరిష్కరిస్తూ సమగ్ర విధానాన్ని తీసుకొచ్చింది. చిన్న రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం, పశుసంవర్ధక రంగాన్ని విస్తరించటం, పశువుల ఆరోగ్యం, సంక్షేమాన్ని పెంపొందించటం మా ప్రాథమిక లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో మత్స్యపెంపకం, తేనెటీగల పెంపకం వంటి ఇతర జీవనోపాధి మార్గాలకు కూడా ప్రోత్సాహం అందించాం. ఈ దిశగా పశుపోషకులు, మత్స్యకారులకు తొలిసారిగా కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. వాతావరణ మార్పులకు తట్టుకునే శక్తి గల ఆధునిక విత్తనాలను రైతులకు అందించాం. పాడి పశువుల జాతి మెరుగుదల కోసం రాష్ట్రీయ గోకుల్ మిషన్ వంటి పథకాలను రూపొందించాం. పాదం, నోటి వ్యాధి చాలా కాలంగా మన పశువులను పీడిస్తోంది. దీన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి, దేశవ్యాప్తంగా ఉచిత టీకాలు వేయిస్తుంది. ఇప్పటి వరకు 60 కోట్ల టీకాలు ఇచ్చింది. 2030 నాటికి ఈ వ్యాధిని దేశం నుంచి పూర్తిగా నిర్మూలించడమే మా లక్ష్యం.
మిత్రులారా,
నిన్న రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో మా ప్రభుత్వం పశుసంపదకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవి మన పశుపోషకుల భవిష్యత్తును మెరుగుపరచేందుకు ఎంతో ఉపయోగపడతాయి. బంజరు భూమిని పచ్చిక బయళ్లుగా మారుస్తూ ఆర్థిక సహాయ పథకాలతోపాటు దేశీయ జాతులను రక్షించడానికి జాతీయ పశుసంవర్ధక మిషన్‌కు సవరణలు ప్రవేశపెట్టాం. పశువుల బీమా ప్రీమియం మొత్తాన్ని తగ్గించాలన్న నిర్ణయం తీసుకున్నాం. ఇది పశువుల పెంపకందారులపై ఆర్థిక భారం తగ్గించి, పశువుల సంఖ్యను పెంచడంలో, వారి ఆదాయాన్ని మెరుగుపరచడంలో సహయపడుతుంది.
మిత్రులారా!
గుజరాత్ ప్రజలమైన మనకు నీటి కొరత గురించి బాగా తెలుసు. సౌరాష్ట్ర, కచ్, ఉత్తర గుజరాత్ వంటి ప్రాంతాల్లో ఎండలు, కరువు సమయంలో నీటి కోసం మైళ్ల కొద్దీ తిరిగే జంతువులను మనం చూశాం. నీరు లేక చనిపోయిన జంతువుల హృదయ విదారక దృశ్యాలు మన మనసులను కదిలించాయి. నర్మదా జలాలు వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల పరిస్థితి మారిపోయింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు మేము సంకల్పించాం. ఈ లక్ష్యంతోనే మా ప్రభుత్వం ఇప్పటివరకు 60 వేలకుపైగా అమృత్ సరోవర్ల నిర్మాణం చేపట్టింది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుంది. గ్రామాల్లోని చిన్న రైతులకు ఆధునిక సాంకేతికత అందించాలన్నదే మా ప్రయత్నం ధ్యేయం. గుజరాత్‌లో గత కొన్ని సంవత్సరాలుగా సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం పద్ధతుల వినియోగం గణనీయంగా పెరిగింది. బిందు సేద్యం కోసం రైతులకు ప్రభుత్వం నుంచి సహాయం అందుతోంది. రైతులకు శాస్త్రీయ పరిష్కారాలను చేరువ చేయాలనే ఉద్దేశంతో కిసాన్ సమృద్ధి కేంద్రాలను గ్రామాల సమీపాల్లో ఏర్పాటు చేశాం. సేంద్రీయ ఎరువుల తయారీలో రైతులు భాగస్వామ్యం అయ్యేందుకు అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తున్నాం.
మిత్రులారా!
మా ప్రభుత్వం అన్నదాతలైన రైతులనులను ఉర్జాదాతలుగా అంటే శక్తి, ఎరువులను అందించే వ్యక్తులుగా మార్చే దిశగా కృషి చేస్తోంది. ఈ లక్ష్యంతో రైతులకు సౌరశక్తితో పనిచేసే పంపులను పంపిణీ చేస్తున్నాం. వారి పొలాలలో చిన్న సౌర ప్లాంట్ల ఏర్పాటుకు కూడా ప్రోత్సాహం ఇస్తున్నాం. గోబర్‌ధన్ యోజన కింద పశువుల పెంపకందారుల నుంచి ఆవు పేడను కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన పాడి పరిశ్రమలలో ఆవు పేడ నుంచి విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది. ఈ ప్రక్రియలో తయారయ్యే సేంద్రీయ ఎరువులు రైతులకు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా రైతులు, పశుపోషకులు ఇద్దరూ ప్రయోజనం పొందడమే కాకుండా వ్యవసాయ క్షేత్రాలలో నేల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. బనస్కాంతలో అముల్ ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంట్ ఈ దిశగా ఒక గొప్ప ముందడుగు.
మిత్రులారా
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సహకార రంగ పాత్రను గణనీయంగా విస్తరిస్తున్నాం. కేంద్ర స్థాయిలో తొలిసారిగా ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 లక్షలకుపైగా గ్రామాల్లో సహకార సంఘాలు ఏర్పడుతున్నాయి. ‘మేడ్ ఇన్ ఇండియా’ కింద వ్యవసాయం, పశుపోషణ, మత్స్యవ్యవసాయం, తయారీ రంగాలలో కూడా ఈ కమిటీలు ఏర్పాటవుతున్నాయి.ఇలాంటి సహకార సంఘాలకు గణనీయమైన పన్ను రాయితీలను కూడా కల్పించాం. దీని వలన వాటి ఆర్థిక సామర్థ్యం మరింత పెరుగుతోంది. అంతేకాక చిన్న రైతుల కోసం రైతు ఉత్పాదక సంస్థలు ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే 10,000 ఎఫ్‌పీఓలలో సుమారు 8000 స్థాపించాం. ఈ సంస్థలు చిన్న రైతులకు ముఖ్యమైన వేదికలుగా పనిచేస్తాయి. వారిని ఉత్పత్తిదారులు, వ్యవసాయ వ్యవస్థాపకులు, ఎగుమతిదారులుగా మార్చడంలో దోహదపడతాయి. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు, ఎఫ్‌పీఓలు, ఇతర సహకార సంఘాలకు మా ప్రభుత్వం గణనీయ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 1 లక్ష కోట్ల నిధిని కేటాయించాం. దీనివల్ల రైతుల సహకార సంస్థలు కూడా లాభపడుతున్నాయి.
మిత్రులారా,
పశుపోషణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో మన ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతోంది. దీని కోసం రూ. 30 వేల కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశాం. అదనంగా పాడి సహకార సంస్థలకు వడ్డీ రాయితీలను పెంచడానికి కూడా ఏర్పాట్లు చేశాం. ఇది ఈ సంస్థల ఆర్థిక భారం తగ్గించడంలో ఎంతో దోహదపడుతోంది. పాడి పరిశ్రమల ఆధునీకరణ కోసం భారీగా నిధులు కేటాయించాం. ఈ క్రమంలో సబర్కంథ మిల్క్ యూనియన్ పరిధిలో రెండు ముఖ్యమైన ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన చేశాం. వీటిలో రోజుకు 800 టన్నుల పశుగ్రాసం ఉత్పత్తి చేయగల ఆధునిక ప్లాంట్ కూడా ఉంది.
సోదరీసోదరులారా!
అభివృద్ధి చెందిన భారత్ గురించి మాట్లాడే సందర్భంలో.. ప్రతి ఒక్కరి కలిసికట్టైన ప్రయత్నాలను నేను దృఢంగా నమ్ముతాను. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2017 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పించింది. అమూల్ కూడా తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా నేడు మీరు కొత్త సంకల్పాలతో బయలుదేరాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. మన దేశ జనాభా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వారికి పోషకాహారాన్ని అందించడంలో మీరు నిర్వహించే పాత్ర ఎంతో కీలకం. వచ్చే ఐదేళ్లలో మీ ప్లాంట్ల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలనే మీ లక్ష్యం గురించి నాకు తెలుసు. దీని గురించి నిశ్చింతగా ఉండండి. ఈ మార్గంలో మీరు వేస్తున్న ప్రతి అడుగులో ప్రభుత్వం అండగా ఉంటుంది. మా నుంచి పూర్తి మద్దతు అందుతుంది. ఇది మోదీ అందిస్తున్న హామీ. ప్రస్తుతం అమూల్ ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద డెయిరీ సంస్థగా ఉంది. ఇది ప్రపంచంలోనే నంబర్ 1 డెయిరీ సంస్థగా మారాలన్నదే మన సంకల్పం. అమూల్ సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకొని చారిత్రక ప్రస్థానాన్ని సాధించినందుకు మరోసారి అందరికీ అభినందనలు!
ధన్యవాదాలు!
***
(Release ID: 2169547)
Visitor Counter : 4
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam