సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
జాతీయ పురస్కారం పొందిన 'చలో జీతే హై' చిత్రం దేశవ్యాప్త విడుదలకు సిద్ధం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుట్టినరోజున.. 'చలో జీతే హై' ప్రదర్శన
లక్షలాది 'సైలెంట్ హీరోల'కు సత్కారం
యువత మేలుకొలుపు దిశగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జీవితానికీ,
స్వామి వివేకానందుని తాత్వికతకూ అందించిన గౌరవమే ఈ చిత్రం
Posted On:
16 SEP 2025 5:09PM by PIB Hyderabad
స్వామి వివేకానందుని తత్వం.. "బస్ వహీ జీతే హై, జో దూస్రో కే లియే జీతే హై" స్ఫూర్తిగా రూపొందించిన, జాతీయ పురస్కారం గెలుచుకున్న "చలో జీతే హై" చిత్రం దేశవ్యాప్తంగా రీరిలీజ్ కోసం సిద్ధమైంది. ఈ చిత్రం 2018లో అత్యధికంగా వీక్షించిన లఘు చిత్రాల్లో ఒకటిగా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్, రాజన్స్, మిరాజ్ సహా దాదాపు 500 సినిమా హాళ్లలో, లక్షలాది పాఠశాలల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తారు.
యువ హృదయాలకు స్ఫూర్తిదాయకం
ఈ చిత్రం రీరిలీజ్ సందర్భంగా 'చలో జీతే హై: సేవా కా సన్మాన్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలు, సమాజంలోని 'సైలెంట్ హీరోస్' అంటే వాచ్‌మెన్, క్లీనింగ్ సిబ్బంది, డ్రైవర్లు, కర్మచారులు, మన దైనందిన జీవితం సజావుగా సాగడానికి నిశ్శబ్దంగా దోహదపడే వారిని సగౌరవంగా సత్కరిస్తారు. 'సైలెంట్ హీరోస్'తో కలిసి విద్యార్థులు ఈ సినిమా చూసిన తర్వాత సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. యువత తమ కోసం తాము జీవించడం కాకుండా ఇతరుల సేవ కోసం జీవించేలా ఈ కార్యక్రమం స్ఫూర్తిని అందిస్తుంది.
స్వామి వివేకానందుని తాత్వికతకు గౌరవం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీవితంలోని ఒక చిన్ననాటి సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. స్వామి వివేకానందుని తత్వంతో బాగా ప్రభావితమై.. దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ.. తన చిన్న ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి కృషి చేసే నరు అనే యువకుని కథ ఇది. ఈ కార్యక్రమం ద్వారా నిస్వార్థం, సేవాభావం గొప్పతనం గురించిన అద్భుతమైన సందేశం నేటి తరానికి ప్రభావవంతంగా చేరుతుంది.
దేశవ్యాప్త ప్రభావం
"ఈ ఉద్యమం చాలా శక్తిమంతమైన సందేశాన్ని కలిగి ఉంది. ప్రతి పనికీ, ప్రతి వ్యక్తికీ గౌరవం, విలువనివ్వాలనే సందేశంతో లక్షలాది యువతకు ఇది స్ఫూర్తినిస్తుంది. నిస్వార్థం, సహానుభూతి, దేశం పట్ల కర్తవ్యం వంటి అద్భుతమైన విలువల విశిష్టతను సూచిస్తూ.. ఆ విలువల ప్రతిరూపమైన మన ప్రధానమంత్రి జీవితాన్ని గౌరవిస్తుంది" అని నిర్మాత మహావీర్ జైన్ అన్నారు. “సాటి మనుషుల ప్రయోజనం కోసం జీవించడం ద్వారా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడేలా యువతను ప్రోత్సహిస్తూ వారిలో సేవా స్ఫూర్తిని రగిలించాలని మేం ఆశిస్తున్నాం" అని ఆయన తెలిపారు.
ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ పురస్కారం గెలుచుకున్న “చలో జీతే హై” చిత్రం కుటుంబ విలువలను తెలియజేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఆనంద్ ఎల్. రాయ్, మహావీర్ జైన్ సమర్పణలో మంగేష్ హడవాలే దీనికి దర్శకత్వం వహించారు. ‘ఇతరుల కోసం జీవించడం’ అన్న చిత్ర సందేశం నేటికీ సందర్భోచితంగా ఉంది. ఈ చిత్రం ప్రత్యేక రీరిలీజ్ ప్రధానమంత్రి స్ఫూర్తిదాయక జీవితాన్నీ, వివేకానందుని తాత్వికతనీ గౌరవిస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈ చిత్రాన్ని పాఠశాలల్లో ప్రదర్శిస్తూ.. ఈ చిత్ర సందేశాన్ని విద్యార్థులందరికీ అందించడంతో పాటు, వారు విలువలతో కూడిన జీవితాన్ని స్వీకరించేలా ప్రోత్సహిస్తారు.
***
(Release ID: 2167403)
Visitor Counter : 2