ప్రధాన మంత్రి కార్యాలయం
అస్సాంలోని గోలాఘాట్‌లో బయోఇథనాల్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభోత్సవం, పాలీప్రొపిలీన్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రధాని
ఇంధన అవసరాలను తీర్చుకోవడంలో భారతదేశం
స్వావలంబన దిశగా అడుగులు... : ప్రధానమంత్రి
నేడు సౌరశక్తిలో ప్రపంచంలోని అయిదు అగ్ర దేశాల్లో భారత్ ఒకటి: ప్రధానమంత్రి
భారత్ స్వయం సమృద్ధిగా మారేందుకు ఇంధనం, సెమీకండక్టర్లు...
ఈ రెండు కీలక రంగాలు అవసరం: ప్రధానమంత్రి
ఈ ప్రయాణంలో అస్సాంది కీలక పాత్ర: ప్రధానమంత్రి
అస్సాం గుర్తింపును మేం నిరంతరం బలోపేతం చేస్తున్నాం: ప్రధానమంత్రి
Posted On:
14 SEP 2025 4:45PM by PIB Hyderabad
హరిత ఇంధనాన్ని ప్రోత్సహించటం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అస్సాం రాష్ట్రం గోలాఘాట్‌లోని నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌లో (ఎన్ఆర్ఎల్) బయోఇథనాల్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. దీనితో పాటు పాలీప్రొపిలీన్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. షరోదియ దుర్గా పూజను పురస్కరించుకొని అస్సాం ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక గురువు శ్రీమంత శంకరదేవ్ జయంతి చాలా గొప్పదన్న ఆయన.. పూజ్యులైన గురువులందరికీ నమస్కరిస్తున్నట్లు తెలియజేశారు.
గత రెండు రోజులుగా ఈశాన్య భారతంలో పర్యటిస్తున్నానని, ఈ ప్రాంతాన్ని సందర్శించిన ప్రతిసారీ అసాధారణమైన ఆప్యాయత, ఆశీర్వాదాలు లభిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. అస్సాంలోని ఈ ప్రాంతంలో పొందే ప్రత్యేకమైన ప్రేమ, ఆప్యాయతల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్ధి చెందిన అస్సాం... భారతదేశం, ఈ దిశగా చేస్తున్న ప్రయాణంలో ఈ రోజు ముఖ్యమైనదని మోదీ అన్నారు. సుమారు రూ. 18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను అస్సాంకు కేటాయించినట్లు ఆయన ప్రకటించారు. ఈ రోజు ఉదయం తాను దరంగ్‌లో ఉన్నానని.. అక్కడ అనుసంధానత, ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ ఇంధన భద్రత సంబంధిత ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్న ఆయన.. ఇవి అస్సాం అభివృద్ధిని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.
భారత ఇంధన సామర్థ్యాలను బలోపేతం చేసే ప్రాంతంగా అస్సాంను అభివర్ణించిన ఆయన.. ఈ రాష్ట్రం నుంచి వచ్చే పెట్రోలియం ఉత్పత్తులు దేశ అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నాయని అన్నారు. ఈ సామర్థ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమానికి వచ్చే ముందు సమీపంలో జరిగిన మరో కార్యక్రమానికి హాజరైన మోదీ.. వెదురు నుంచి బయో ఇథనాల్ ఉత్పత్తి చేసే ఆధునిక కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది అస్సాంకు గర్వకారణమని అన్నారు. దీనితో పాటు పాలీప్రొపిలీన్ కేంద్రానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు అస్సాంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తాయని, రాష్ట్రాభివృద్ధికి ఊతం ఇస్తాయని.. రైతులు, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలందరికీ అభినందనలు తెలియజేశారు.
"ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్ " అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ విద్యుత్, గ్యాస్, ఇంధనానికి డిమాండ్ కూడా పెరుగుతోందని తెలిపారు. చాలా కాలంగా ఈ ఇంధన అవసరాల కోసం భారత్ విదేశాలపై ఆధారపడుతోందని.. పెద్ద మొత్తంలో ముడి చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోందని ఆయన చెప్పారు. దీని ఫలితంగా విదేశాలకు భారత్ ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇది విదేశాలలో ఉపాధి, ఆదాయాన్ని పెంచుతోంది. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. భారత్ ఇప్పుడు తన ఇంధన అవసరాలను తీర్చుకునే విషయంలో స్వావలంబన సాధించే మార్గంలో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.
దేశీయ ముడి చమురు, వాయువుకు సంబంధించిన కొత్త నిల్వలను కనుగొనేందుకు భారత్ కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. దీనికి సమాంతరంగా హరిత ఇంధన సామర్థ్యాలను కూడా పెంచుకుంటోందని పునరుద్ఘాటించారు. ‘సముద్ర మంథన్' కార్యక్రమానికి సంబంధించి ఎర్రకోట నుంచి చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. భారతదేశానికి చెందిన సముద్రాలలో గణనీయమైన చమురు, వాయు నిల్వలు ఉండొచ్చన్న నిపుణుల అంచనాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ వనరులు జాతీయాభివృద్ధికి ఉపయోగపడేలా చూసుకునేందుకు జాతీయ డీప్ వాటర్ ఎక్స్ ప్లొరేషన్ మిషన్ ప్రారంభించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
హరిత ఇంధనం, పునరుత్పాదక విద్యుతుత్పత్తి రంగంలో భారత్ వేగంగా ముందుకు దూసుకెళ్తుందని ప్రధాని ప్రధానంగా పేర్కొన్నారు. దశాబ్దం కిందట సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ గణనీయంగా వెనుకబడి ఉండేదని.. నేడు ఈ విషయంలో ప్రపంచంలోని అయిదు అగ్ర దేశాల్లో భారత్ ఒకటిగా ఉందన్నారు.
"మారుతున్న కాలానికి అనుగుణంగా చమురు, వాయువుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారతదేశానికి ప్రత్యామ్నాయ ఇంధనాలు అవసరం" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆచరణీయ ప్రత్యామ్నాయాలలో ఇథనాల్ ఒకటని ఆయన అన్నారు. వెదురు నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేసే కొత్త కేంద్రాన్ని ఈ రోజు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం అస్సాంలోని రైతులకు, గిరిజన ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధానంగా చెప్పారు.
బయో ఇథనాల్ కేంద్రం పనిచేసేందుకు నిరంతరం వెదురు సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మోదీ తెలిపారు. ముఖ్యంగా స్థానిక రైతుల వెదురు సాగుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని, దానిని నేరుగా కొనుగోలు చేస్తుందని తెలియజేశారు. వెదురును చిన్న ముక్కలుగా కోసే చిన్న యూనిట్లను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ రంగంలో ఏటా సుమారు రూ. 200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ ఒక్క ఉత్పత్తి కేంద్రం ఈ ప్రాంతంలోని వేలాది మందికి ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధానంగా చెప్పారు.
భారత్ ఇప్పుడు వెదురు నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తోందన్న ప్రధాని.. ప్రతిపక్ష ప్రభుత్వంలో వెదురును నరికివేయడం వల్ల జైలు శిక్షలు పడ్డాయని గుర్తు చేశారు. గిరిజన ప్రజల రోజువారీ జీవితంలో అంతర్భాగమైన వెదురుపై ఆంక్షలు ఉండేవన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వెదురు నరికివేతపై నిషేధాన్ని ఎత్తివేసిందని, ఈ నిర్ణయం ఇప్పుడు ఈశాన్య భారత ప్రజలకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తోందని పునరుద్ఘాంటించారు.
ప్రజల దైనందిన జీవితంలో బకెట్లు, మగ్గులు, పెట్టెలు, కుర్చీలు, టేబుళ్లు, ప్యాకేజింగ్ సామాగ్రి తదితరాల్లో ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులనే ఉపయోగిస్తున్నారన్న ప్రధాని.. వీటన్నింటికి పాలీప్రొపిలీన్ అవసరమని, అది లేకుండా ఆధునిక జీవితాన్ని ఊహించడం కష్టమని వివరించారు. కార్పెట్లు, తాళ్లు, బ్యాగులు, ఫైబర్స్, మాస్క్‌లు, మెడికల్ కిట్లు, వస్త్రాలను తయారు చేసేందుకు పాలీప్రొపిలీన్‌ను ఉపయోగిస్తారని తెలిపారు. వాహన రంగంతో పాటు వైద్య, వ్యవసాయ పరికరాల ఉత్పత్తిలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానంగా ప్రస్తావించారు. అస్సాంకు ఆధునిక పాలీప్రొపిలీన్ ఉత్పత్తిని కేంద్రం బహుమతిగా అందిస్తోందని అన్నారు. ఈ కేంద్ర 'అస్సాంలో తయారీ', 'భారత్‌తో తయారీ' పునాదిని బలోపేతం చేస్తుందని.. ఈ ప్రాంతంలోని ఇతర తయారీ పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
అస్సాం సంప్రదాయ గామోసా.. ప్రఖ్యాత ఎరి, ముగా పట్టుకు ప్రసిద్ధి అని తెలిపిన ప్రధాని.. ఇదే తరహాలో ఇప్పుడు పాలీప్రొపిలీన్‌తో తయారు చేసిన వస్త్రాలు కూడా రాష్ట్రానికి గుర్తింపు తీసుకొస్తాయని అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం పట్ల దేశం అసాధారణమైన నిబద్ధతను ప్రదర్శిస్తోందని… దీనికి సంబంధించిన కీలక కేంద్రాల్లో అస్సాం ఒకటని ప్రధానంగా చెప్పారు. అస్సాం సామర్థ్యాలపై బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేసిన మోదీ.. సెమీకండక్టర్ మిషన్ అనే ప్రధాన జాతీయ కార్యక్రమానికి రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిరూపితమైన సామర్థ్యం ఆధారంగానే విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో అస్సాం టీని ఉదహరించారు. ఇప్పటితో పోల్చితే వలసరాజ్యాల కాలంలో అస్సాం టీని ప్రపంచ స్థాయి బ్రాండ్‌గా ఈ రాష్ట్రం, ప్రజలు మార్చిన తీరును ఆయన ప్రస్తావించారు. ఇప్పటికే నిరూపితమైన ఈ సామర్థ్యం ఆధారంగా చేసుకు నమ్మకం ఏర్పడిందని అన్నారు. ఈ నవీన యుగంలో భారత్ స్వావలంబన ఇంధనం, సెమీకండక్టర్లు అనే రెండు అంశాలపై ఆధారపడి ఉంటుందని ప్రధానమంత్రి ప్రధానంగా పేర్కొన్నారు. ఈ రెండింటిలోనూ అస్సాం కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బ్యాంకు కార్డులు, మొబైల్ ఫోన్ల నుంచి కార్లు, విమానాలు, అంతరిక్ష కార్యకలాపాల వరకు ప్రతీ ఎలక్ట్రానిక్ పరికరం ప్రధానంగా ఒక చిన్న ఎలక్ట్రానిక్ చిప్‌పై ఆధారపడి ఉంటుందనీ, వీటిని భారత్ దేశీయంగా తయారు చేయాలంటే సొంత చిప్‌లను కూడా ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీనిని సాధించేందుకు భారత్ సెమీకండక్టర్ మిషన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి అస్సాం ప్రధాన కేంద్రంగా ఉంటుంది. రూ. 27,000 కోట్ల పెట్టుబడితో మోరిగావ్‌లో వస్తోన్న సెమీకండక్టర్ కేంద్రం నిర్మాణం వేగంగా కొనసాగుతున్నట్లు ప్రధానంగా చెప్పారు. ఇది అస్సాంకు చాలా గర్వకారణమని అన్నారు.
ప్రతిపక్షాలు దేశాన్ని చాలా కాలం పాటు పరిపాలించాయన్న ప్రధాని.. అనేక దశాబ్దాలుగా అస్సాంలో కూడా అధికారంలో ఉన్నారన్నారు. వారి హయాంలో అభివృద్ధి నెమ్మదించిందనీ, అస్సాం సాంస్కృతిక వారసత్వం సవాళ్లను ఎదుర్కొందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అస్సాం సంప్రదాయ గుర్తింపును శక్తివంతం చేస్తున్నాయని.. అంతేకాకుండా దానిని ఆధునికతతో అనుసంధానిస్తున్నాయని ప్రధానంగా పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అస్సాం, ఈశాన్య ప్రాంతాలకు.. వేర్పాటువాదం, హింస, వివాదాలను తీసుకువచ్చాయని మోదీ విమర్శించారు. అయితే అధికార పార్టీ అస్సాంను అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వంతో సుసంపన్నమైనదిగా మారుస్తోందన్నారు. అస్సాం భాషకు శాస్త్రీయ భాషా హోదాను ఇచ్చింది కూడా ప్రస్తుత ప్రభుత్వమేనని పేర్కొన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని అస్సాం ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోందన్న ఆయన.. స్థానిక భాషలలో విద్యను ప్రోత్సహించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈశాన్య ప్రాంతాలు, అస్సాం రాష్ట్రానికి చెందిన బిడ్డలకు తగిన గుర్తింపు ఇవ్వడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని మోదీ అన్నారు. ఈ భూమి వీర్ లచిత్ బోర్ఫుకాన్ వంటి పరాక్రమవంతులైన యోధులను అందించిందని, అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆయనకు తగిన గుర్తింపును ఎప్పుడూ ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే లచిత్ బోర్ఫుకాన్‌కు సరైన గౌరవం ఇచ్చిందనీ, ఆయన 400వ జయంతిని జాతీయ స్థాయిలో నిర్వహించినట్లు తెలిపారు. ఆయన జీవిత చరిత్రను 23 భాషల్లో ప్రచురించినట్లు తెలియజేశారు. జోర్హాట్లో లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం లభించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రతిపక్షాలు నిర్లక్ష్యం చేసిన వారిని ప్రస్తుత ప్రభుత్వం తెరపైకి తీసుకువస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
శివసాగర్‌లోని చారిత్రాత్మక రంగ్ ఘర్ చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుత ప్రభుత్వమే దాని పునరుద్ధరణను చేపట్టిందని మోదీ అన్నారు. శ్రీమంత శంకర్‌దేవ్ జన్మస్థలమైన బటద్రవను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్, ఉజ్జయినిలోని మహాకల్ మహాలోక్‌తో సమానంగా అస్సాంలోని కామాఖ్య మాత కారిడార్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.
అస్సాం ఘన సంస్కృతి, చరిత్రతో ముడిపడి ఉన్న అనేక చిహ్నాలు, ప్రదేశాలను తమ ప్రభుత్వం భవిష్యత్ తరాల కోసం పరిరక్షిస్తోందని ప్రధాన మంత్రి మోదీ తెలియజేశారు. ఇవి అస్సాం వారసత్వానికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా రాష్ట్రంలో పర్యాటకాన్ని కూడా విస్తరిస్తాయని, అస్సాంలో పర్యాటకం అభివృద్ధి చెందుతున్న కొద్దీ యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వ్యాఖ్యానించారు.
అభివృద్ధి విషయంలో పనుల కొనసాగుతున్నాయని.. ‘అక్రమ చొరబాట్లు’ అనే సమస్యను రాష్ట్రం ఎదుర్కొంటుందని తెలిపారు. ప్రతిపక్ష ప్రభుత్వ హయాంలో చొరబాటుదారులకు భూమిని కేటాయించారని, అక్రమ ఆక్రమణలకు రక్షణ కల్పించారని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాలను అనుసరించిన ప్రతిపక్షాలు.. అస్సాం జనాభా సమతుల్యతను దెబ్బతీశాయని ఆరోపించారు. అస్సాం ప్రజలతో కలిసి తమ ప్రభుత్వం ఈ సమస్యను క్రియాశీలకంగా పరిష్కరిస్తోందని తెలియజేశారు. ప్రభుత్వం చొరబాటుదారుల నుంచి భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటోందని, అవసరమైన గిరిజన కుటుంబాలకు భూ పట్టాలను అందిస్తోందని తెలిపారు. మిషన్ బసుంధర విషయంలో అస్సాం ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. దీని కింద లక్షలాది కుటుంబాలు ఇప్పటికే భూమి పట్టాలను పొందాయి. కొన్ని గిరిజన ప్రాంతాలలో అహోం, కోచ్ రాజ్బోంగ్షి, గూర్ఖాల భూమి హక్కులను గుర్తించినట్లు తెలిపిన ఆయన.. వారిని రక్షిత తరగతుల జాబితాలో చేర్చిన విషయాన్ని ప్రస్తావించారు. గిరిజన వర్గాలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయాలను సరిదిద్దేందుకు తమ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి ప్రధానంగా చెప్పారు.
"మా ప్రభుత్వ అభివృద్ధి మంత్రం- ‘నాగరిక దేవో భవ’. అంటే ప్రజలు అసౌకర్యాన్ని ఎదుర్కోకూడదు, ప్రాథమిక అవసరాల కోసం తిరగాల్సిన అవసరం ఉండకూడదు" అని ప్రధానమంత్రి అన్నారు. ప్రతిపక్షాల సుదీర్ఘ పాలనలో రాజకీయ లబ్ధి పొందటం కోసం ఎంపిక చేసిన వర్గాలను బుజ్జగించే విధంగా పాలన సాగిందని.. పేదలు నిర్లక్ష్యానికి గురయ్యారని, వారి హక్కులు తిరస్కరణకు గురయ్యాయని విమర్శించారు. ఈ పద్ధతికి విరుద్ధంగా తమ పార్టీ బుజ్జగించటంపై కాకుండా సంతృప్తిపై దృష్టి సారిస్తోందని.. ఏ పేద వ్యక్తి, ప్రాంతం వెనుకబడి ఉండకుండా చూసుకుంటోందని మోదీ అన్నారు. రాష్ట్రంలో పేదల కోసం చేపట్టిన శాశ్వత గృహాల నిర్మాణం వేగంగా జరుగుతోందని, ఇప్పటికే 20 లక్షలకు పైగా ఇళ్లు లబ్ధిదారులకు అందించినట్లు ప్రధానంగా తెలిపారు. అస్సాంలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని సరఫరా చేసే పనులు కూడా వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు అస్సాంలోని తేయాకు తోటలలో పనిచేస్తోన్న సోదరీసోదరలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని ప్రధానంగా పేర్కొన్న మోదీ.. తేయాకు తోటలలో పనిచేసే వారి సంక్షేమం అనేది తమకు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశమమని అన్నారు. తేయాకు తోటలలో పనిచేసే మహిళలు, పిల్లలకు మద్దతు లభిస్తోందని.. మహిళల ఆరోగ్యం, పిల్లల విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో మాతా, శిశు మరణాల రేటును తగ్గించేందుకు వివిధ పథకాలను ప్రభుత్వం క్రియాశీలకంగా అమలు చేస్తోందని అన్నారు. ప్రతిపక్షాల హయాంలో తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులను టీ కంపెనీ యాజమాన్యాల దయకు విడిచిపెట్టారని విమర్మించారు. దీనికి పూర్తి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం వాళ్ల గృహావసరాలను తీరుస్తూ విద్యుత్, నీటి సరఫరా ఉండేలా చూసుకుంటూ.. వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సంక్షేమ కార్యక్రమాల విషయంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
"అస్సాం అభివృద్ధిలో కొత్త యుగం ప్రారంభమైంది. వాణిజ్యం, పర్యాటక రంగానికి ప్రధాన కేంద్రంగా మారేందుకు అస్సాం సిద్ధంగా ఉంది" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన అస్సాం, భారతదేశాన్ని నిర్మించాలనే సమష్టి సంకల్పాన్ని మరోసారి అభినందించిన ఆయన.. అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మ.. కేంద్ర మంత్రులు శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ హర్దీప్ సింగ్ పూరీ ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
నేపథ్యం
గోలాఘాట్‌లోని నుమాలిఘడ్ లో ప్రధానమంత్రి నుమాలిఘడ్ రిఫైనరీ లిమిటెడ్‌లో (ఎన్ఆర్ఎల్) అస్సాం బయోఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఇది హరిత ఇంధనాన్ని ప్రోత్సహించడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది.
అస్సాం పెట్రోకెమికల్ రంగ విలువను గణనీయంగా పెంచే పాలీప్రొపిలీన్ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఇది కూడా నుమాలిఘడ్ రిఫైనరీ లిమిటెడ్‌లోనే (ఎన్ఆర్ఎల్) ఉంది. ఇది ఉపాధి అవకాశాలను సృష్టించటంతో పాటు ఈ ప్రాంత సామాజిక ఆర్థికాభివృద్ధిని పెంచనుంది.
(Release ID: 2166981)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam