ప్రధాన మంత్రి కార్యాలయం
మిజోరాంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
Posted On:
13 SEP 2025 12:26PM by PIB Hyderabad
మిజోరాం గవర్నర్ వి. కె. సింగ్ గారు, ముఖ్యమంత్రి శ్రీ లాల్ దుహోమా గారు, కేంద్ర మంత్రివర్గ సహచరుడు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు, మిజోరాం ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, మిజోరాం అశేష ప్రజానీకానికి శుభాకాంక్షలు.
అందమైన ఈ నీలి పర్వత క్షేత్రాన్ని కాపాడుతున్న సర్వోన్నతుడైన దేవుడు పతియన్‌కు నమస్కరిస్తున్నాను. నేనిక్కడ మిజోరాంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో ఉన్నాను. దురదృష్టవశాత్తు వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఐజ్వాల్‌లో మీ మధ్య లేనందుకు చింతిస్తున్నాను. కానీ ఈ మాధ్యమం నుంచి కూడా మీ ప్రేమాదరాలను నేను ఆస్వాదిస్తున్నాను.
మిత్రులారా,
స్వతంత్రోద్యమమయినా, దేశ నిర్మాణమయినా.. మిజోరాం ప్రజలు ఎల్లప్పుడూ ముందు వరుసలో నిలిచారు. లాల్‌ను రోపులియాని, పసల్తా ఖువాంగ్‌చేరా వంటి వ్యక్తుల ఆదర్శాలు దేశానికి ఉత్తేజాన్నిస్తూనే ఉన్నాయి. త్యాగం - సేవ, ధైర్యం - కరుణ.. ఈ విలువలే మిజో సమాజానికి కేంద్రబిందువుగా ఉన్నాయి. నేడు భారత అభివృద్ధి ప్రస్థానంలో మిజోరాం ముఖ్య పాత్ర పోషిస్తోంది.
మిత్రులారా,
ఇది దేశానికి, ముఖ్యంగా మిజోరాం ప్రజలకు చరిత్రాత్మకమైన రోజు. దేశ రైల్వే పటంలో నేటి నుంచి ఐజ్వాల్ కూడా ఉంటుంది. కొన్ని సంవత్సరాల కిందట ఐజ్వాల్ రైల్వే మార్గానికి శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది. నేడు దానిని సగర్వంగా దేశ ప్రజలకు అంకితం చేస్తున్నాం. కఠినమైన భూభాగం వంటి అనేక సవాళ్లను అధిగమించి.. ఈ బైరాబి సైరంగ్ రైల్వే లైన్ సాకారమైంది. మన ఇంజినీర్ల నైపుణ్యాలు, మన కార్మికుల స్ఫూర్తి వల్లే ఇది సాధ్యమైంది.
మిత్రులారా,
మన హృదయాలు ఎల్లప్పుడూ అనుసంధానమయ్యే ఉన్నాయి. ఇప్పుడు రాజధాని ఎక్స్‌ప్రెస్ తొలిసారిగా మిజోరాంలోని సైరంగ్‌ను ఢిల్లీతో నేరుగా అనుసంధానిస్తోంది. ఇది కేవలం రైల్వే అనుసంధానమే కాదు.. పరివర్తనకు జీవనాడి. ఇది మిజోరాం ప్రజల జీవితాల్లో, జీవనోపాధిలో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. మిజోరాం రైతులు, వ్యాపారులు దేశవ్యాప్తంగా మరిన్ని మార్కెట్లను చేరుకోగలరు. విద్య, ఆరోగ్య సంరక్షణపరంగా ప్రజలకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
మిత్రులారా,
మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు చాలా కాలంగా ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తున్నాయి. వాటి దృష్టి ఎప్పుడూ ఎక్కువ ఓట్లు, సీట్లు ఉన్న ప్రాంతాలపైనే ఉంటుంది. ఈ వైఖరి వల్ల మిజోరాం వంటి రాష్ట్రాలు సహా ఈశాన్య ప్రాంతం మొత్తం తీవ్రంగా నష్టపోయింది. కానీ మా విధానం అందుకు చాలా భిన్నమైనది. గతంలో నిర్లక్ష్యానికి గురైనవారు ఇప్పుడు ముందంజలో నిలిచారు. ఒకప్పుడు అణచివేతను ఎదుర్కొన్న వారు ఇప్పుడు ప్రధాన స్రవంతిలో ఉన్నారు! గత 11 సంవత్సరాలుగా ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి కోసం మేం కృషి చేస్తున్నాం. ఈ ప్రాంతం దేశ అభివృద్ధి చోదకంగా మారుతోంది.
మిత్రులారా,
గత కొన్ని సంవత్సరాలుగా పలు ఈశాన్య రాష్ట్రాలు తొలిసారిగా దేశ రైల్వే వ్యవస్థలో చోటు దక్కించుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, హైవేలు, మొబైల్ సదుపాయాలు, ఇంటర్నెట్ కనెక్షన్లు, విద్యుత్తు, కుళాయి నీరు, ఎల్పీజీ కనెక్షన్లను పొందాయి. అన్ని రకాలుగా అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం అమితంగా కృషి చేసింది. విమాన ప్రయాణానికి ఉద్దేశించిన ఉడాన్ పథకం ద్వారా కూడా మిజోరాం రాష్ట్రానికి ప్రయోజనం కలగనుంది. త్వరలోనే ఇక్కడ హెలికాప్టర్ సేవలు ప్రారంభమవుతాయి. ఇది మిజోరాంలోని మారుమూల ప్రాంతాలకు రాకపోకలను మెరుగుపరుస్తుంది.
మిత్రులారా,
మన ‘యాక్ట్ ఈస్ట్’ విధానం, ప్రస్తుత నార్త్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ రెండింటిలోనూ మిజోరాం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కళాదాన్ బహువిధ ఎగుమతి రవాణా ప్రాజెక్టు, సైరంగ్హ్మాంగ్ బుచువా రైల్వే లైన్‌లతో.. ఆగ్నేయాసియా ద్వారా బంగాళాఖాతంతో కూడా మిజోరాం అనుసంధానమవుతుంది. దీనివల్ల ఈశాన్య భారతం, ఆగ్నేయాసియా ప్రాంతంలో వాణిజ్యం, పర్యాటకం అభివృద్ధి చెందుతాయి.
మిత్రులారా,
మిజోరాం ప్రతిభావంతులైన యువత పుష్కలంగా ఉన్నారు. వారిని సాధికారులను చేయడమే మా లక్ష్యం. మా ప్రభుత్వం ఇప్పటికే ఇక్కడ 11 ఏకలవ్య ఆవాస పాఠశాలలను ప్రారంభించింది. మరో 6 పాఠశాలలను ప్రారంభించేందుకు కృషి చేస్తున్నాం. అంకుర సంస్థల ప్రధాన కేంద్రంగా కూడా మన ఈశాన్య ప్రాంతం ఎదుగుతోంది. దాదాపు 4,500 అంకుర సంస్థలు, 25 ఇంక్యుబేటర్లు ఈ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తుండడం సంతోషాన్నిస్తోంది. మిజోరాం యువత ఈ ఉద్యమంలో క్రియాశీలంగా భాగస్వాములవుతూ.. తమతోపాటు ఇతరులకూ కొత్త అవకాశాలను అందిస్తున్నారు.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన క్రీడా కేంద్రంగా భారత్ శరవేగంగా ఎదుగుతోంది. ఇది దేశంలో క్రీడా సంబంధిత ఆర్థిక వ్యవస్థను కూడా సృష్టిస్తోంది. అద్భుతమైన క్రీడా సంప్రదాయం మిజోరాం సొంతం. ఫుట్‌బాల్, ఇతర క్రీడల్లో చాలా మంది ఛాంపియన్‌లను అందిస్తోంది. మా క్రీడా విధానాలు మిజోరాంకు కూడా ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఖేలో ఇండియా పథకం కింద ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు మేం చేయూతనిస్తున్నాం. ఇటీవల మా ప్రభుత్వం ఖేలో ఇండియా ఖేల్ నీతి అనే జాతీయ క్రీడా విధానాన్ని కూడా రూపొందించింది. ఇది మిజోరాం యువతకు కొత్త అవకాశాలను అందిస్తుంది.
మిత్రులారా,
మన దేశంలో అయినా, విదేశాల్లో అయినా.. అందమైన ఈశాన్య ప్రాంత సంస్కృతికి ప్రతినిధిగా ఉండడం నాకు చాలా ఆనందాన్నిస్తుంది. ఈశాన్య ప్రాంత సమర్థతను చాటే వేదికలను ప్రోత్సహించడం చాలా ముఖ్యం. కొన్ని నెలల కిందట ఢిల్లీలో జరిగిన అష్టలక్ష్మి ఉత్సవంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఇది ఈశాన్య ప్రాంత వస్త్రాలు, చేతిపనులు, జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు, పర్యాటక సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈశాన్య ప్రాంత సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలని రైజింగ్ నార్త్ ఈస్ట్ సదస్సులో నేను పెట్టుబడిదారులకు పిలుపునిచ్చాను. ఈ సదస్సు భారీగా పెట్టుబడులు, ప్రాజెక్టులకు మార్గం సుగమం చేస్తోంది. స్థానిక ఉత్పత్తులను ఆదరిద్దామని నేను చెప్తూ వస్తున్నాను. ఇది ఈశాన్య ప్రాంత కళాకారులు, రైతులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. మిజోరాం వెదురు ఉత్పత్తులు, సేంద్రియ అల్లం, పసుపు, అరటి అత్యంత ప్రసిద్ధి చెందాయి.
మిత్రులారా,
జీవన సౌలభ్యాన్ని, వాణిజ్య సౌలభ్యాన్ని పెంచడం కోసం మేం నిరంతరం చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవలే సమగ్ర జీఎస్టీ సంస్కరణలను ప్రకటించాం. దీని ద్వారా అనేక ఉత్పత్తులపై పన్నులు తగ్గుతాయి. ఇది కుటుంబాలకు జీవనాన్ని సులభతరం చేస్తుంది. 2014కు ముందు టూత్‌పేస్టు, సబ్బు, నూనె వంటి నిత్యావసర వస్తువులపై కూడా 27 శాతం పన్ను విధించేవారు. నేడు వాటికి కేవలం 5 శాతం జీఎస్టీ మాత్రమే వర్తిస్తుంది. కాంగ్రెస్ పాలనలో ఔషధాలు, పరీక్ష కిట్లు, బీమా పాలసీలపై భారీగా పన్ను విధించేవారు. అందుకే ఆరోగ్య సంరక్షణ ఖరీదైనదిగా మారింది. సాధారణ కుటుంబాలకు బీమా అందుబాటులో లేదు. ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. కొత్త జీఎస్టీ రేట్లతో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు ఔషధాలు మరింత చవకగా మారతాయి. సెప్టెంబర్ 22 తర్వాత సిమెంటు, నిర్మాణ సామగ్రి కూడా చవకగా మారతాయి. చాలా స్కూటర్లు, కార్ల తయారీ కంపెనీలు ఇప్పటికే ధరలను తగ్గించాయి. ఈ సారి పండుగ సీజన్ దేశవ్యాప్తంగా మరింత ఉత్సాహంగా జరుగుతుందని నేను భావిస్తున్నాను.
మిత్రులారా,
సంస్కరణల్లో భాగంగా చాలా హోటళ్లపై జీఎస్టీని కేవలం 5 శాతానికే తగ్గించారు. వివిధ ప్రదేశాలకు ప్రయాణం, హోటళ్లలో బస, బయట తినడం చవకగా మారతాయి. ఇది ఎక్కువ మంది మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణించడానికి, ఆస్వాదించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల వంటి పర్యాటక కేంద్రాలకు దీని ద్వారా విశేష ప్రయోజనం కలుగుతుంది.
మిత్రులారా,
2025-26 మొదటి త్రైమాసికంలో మన ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధిని సాధించింది. అంటే భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. మేకిన్ ఇండియాలో, ఎగుమతుల్లో అభివృద్ధిని కూడా చూస్తున్నాం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి మన సైనికులు ఎలా గుణపాఠం నేర్పారో ఆపరేషన్ సిందూర్ సమయంలో మీరంతా చూశారు. మన సాయుధ దళాల పట్ల యావద్దేశమూ గర్వంతో నిండిపోయింది. ఈ ఆపరేషన్‌లో భారత్‌లో తయారైన ఆయుధాలు మన దేశ రక్షణలో గణనీయమైన పాత్ర పోషించాయి. మన ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగం అభివృద్ధి దేశ భద్రతకు అత్యంత కీలకమైనది.
మిత్రులారా,
ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం, ప్రతి ప్రాంతం సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజల సాధికారత ద్వారానే అభివృద్ధి చెందిన భారత్ సాకారమవుతుంది. ఈ ప్రయాణంలో మిజోరాం ప్రజలు అత్యంత కీలక పాత్ర పోషిస్తారన్న నమ్మకం నాకుంది. మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భారత రైల్వే వ్యవస్థలోకి ఐజ్వాల్‌కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు వాతావరణం సరిగా లేకపోవడం వల్ల నేను ఐజ్వాల్‌కు రాలేకపోయాను. కానీ త్వరలోనే మనం కలుస్తామని భావిస్తున్నాను.
ధన్యవాదాలు!
***
(Release ID: 2166442)
Visitor Counter : 5
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam