ప్రధాన మంత్రి కార్యాలయం
‘జ్ఞాన భారతం’ పోర్టల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
· ప్రాచీన రాతప్రతుల డిజిటలీకరణ.. పరిరక్షణ.. సార్వత్రిక లభ్యత లక్ష్యంగా ప్రత్యేక డిజిటల్ వేదిక ఏర్పాటు · న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ప్రధాని ప్రసంగం · “భారతీయ సంస్కృతి-సాహిత్య.. చైతన్య గళం జ్ఞాన భారతం మిషన్” · “ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో భారత్ వద్ద దాదాపు కోటి రాతప్రతులు” · “చరిత్రలో కోట్లాది రాతప్రతులు ధ్వంసమైనా ‘జ్ఞానం.. విజ్ఞానం.. అధ్యయనం’పై మన పూర్వికుల అంకితభావాన్ని మిగిలిన రాతప్రతులు వెల్లడిస్తున్నాయి” · “మన జ్ఞాన సంప్రదాయానికి ‘పరిరక్షణ.. ఆవిష్కరణ.. సంకలనం.. అనుసరణ’ నాలుగు మూలస్తంభాలు” · “భారత చరిత్ర కేవలం రాజవంశాల ఉత్థానపతనాలకు పరిమితం కాదు” · “భారత్ అంటేనే- ఆలోచనలు.. ఆదర్శాలు.. విలువలతో కూడిన నిరంతర సజీవ స్రవంతి” · “భారత రాతప్రతులు యావత్ మానవాళి ప్రగతి పయనానికి ప్రతిబింబాలు”
Posted On:
12 SEP 2025 8:11PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన ‘జ్ఞాన భారతం’ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత స్వర్ణయుగ పునరుజ్జీవనానికి విజ్ఞాన్ భవన్ సాక్ష్యంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల కిందటే జ్ఞాన భారతం కార్యక్రమం గురించి తాను ప్రకటించగా, స్వల్ప వ్యవధిలోనే ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుండటం విశేషమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంతో ముడిపడిన పోర్టల్‌ను కూడా ప్రారంభించామని శ్రీ మోదీ వెల్లడించారు. ఇది ప్రభుత్వం లేదా విద్యా వ్యవస్థ సంబంధిత కార్యక్రమం కాదని, భారతీయ సంస్కృతి-సాహిత్యం, చైతన్య గళంగా జ్ఞాన భారతం ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. వేల తరాల సాలోచనా వారసత్వాన్ని ప్రస్తావిస్తూ- మహనీయులైన రుషులు, ఆచార్యులు, పండితుల జ్ఞానం, పరిశోధనలను ఆయన గుర్తుచేశారు. భారతీయ జ్ఞానం, సంప్రదాయాలు, శాస్త్రీయ వారసత్వానికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. మనకు సంక్రమించిన ఈ సుసంపన్న వారసత్వాన్ని జ్ఞాన భారతం కార్యక్రమం ద్వారా డిజిటలీకరిస్తామని శ్రీ మోదీ వెల్లడించారు. దీనిపై ప్రజలకు అభినందించడంతోపాటు ఈ మిషన్ నిర్వహణ బృందం సభ్యులకు, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఒక ప్రాచీన రాతప్రతిని పరిశీలించడమంటే భూత కాలంలో ప్రయాణించడం వంటిదేనని శ్రీ మోదీ అన్నారు. గతం, వర్తమానంలోని పరిస్థితుల మధ్య వ్యత్యాసం అపారమని ఆయన గుర్తుచేశారు. నేడు కీబోర్డులో తొలగింపు-దిద్దుబాటు వంటి సౌలభ్యాల ద్వారా విస్తృతంగా రాయగలమని, ఒకే పేజీని ప్రింటర్లతో వేల నకళ్లు కూడా తీయగలమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శతాబ్దాల కిందటి ప్రపంచాన్ని ఒకసారి ఊహించుకోవాలని ప్రేక్షకులకు సూచించారు. ఆనాడు ఆధునిక భౌతిక సదుపాయాలు లేనందువల్ల మన పూర్వికులు మేధా వనరులపైనే ఆధారపడాల్సి వచ్చిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రతి అక్షరాన్నీ అత్యంత శ్రద్ధతో రాయాల్సి ఉంటుందని, ఆ లెక్కన ఒక గ్రంథం రూపొందాలంటే ఎంత కఠినంగా శ్రమించాలో అర్థం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రాచీన కాలంలోనూ భారతీయులు ప్రపంచ జ్ఞాన కేంద్రాలుగా వెలుగొందిన గొప్ప గ్రంథాలయాలను నిర్మించారని శ్రీ మోదీ గుర్తుచేశారు. ప్రపంచంలో ఇప్పటికీ అత్యధిక రాతప్రతులు గల దేశం భారత్ మాత్రమేనని, మన వద్ద నేడు దాదాపు కోటి రాతప్రతులు ఉన్నాయని వివరించారు.
క్రూరమైన చారిత్రక ఆటుపోట్ల ఫలితంగా లక్షలాది రాతప్రతులు నాశనం కావడంతోపాటు అదృశ్యమయ్యాయని శ్రీ మోదీ గుర్తుచేశారు. అయినప్పటికీ జ్ఞానం.. విజ్ఞానం.. అధ్యయనంపై మన పూర్వికుల అంకితభావానికి మనవద్ద మిగిలిన రాతప్రతులు తార్కాణాలని పేర్కొన్నారు. గ్రంథ రచనలో వాడిన భూర్జ పత్రాలు, తాటి ఆకుల దుర్బలత్వంతోపాటు రాగి రేకులపై రాసినా లోహ క్షయం ముప్పు వంటివి పెనుసవాళ్లుగా ఉండేవని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయినప్పటికీ మన పూర్వికులు అక్షరాన్ని దైవంగా పరిగణించి, గౌరవించారని పేర్కొన్నారు. ఆ మేరకు ‘అక్షర బ్రహ్మ భవ’ స్ఫూర్తితో ఆ సరస్వతీ మాతను ఆరాధారించారని వ్యాఖ్యానించారు. ఆ గ్రంథాల విలువను గుర్తించిన కుటుంబాలు తరం వెంబడి తరం నాటి రాతప్రతులను జాగ్రత్తగా సంరక్షిస్తూ వచ్చాయని చెప్పారు. మనకు వారసత్వంగా సంక్రమించిన జ్ఞానంపై అపార గౌరవానికి ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో మన సామాజిక బాధ్యతను గుర్తించడంతోపాటు భావితరాలపై శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకతను శ్రీ మోదీ ప్రస్ఫుటం చేశారు. దేశంపై అంకిత భావంలో నిబద్ధతకు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ మరేదీ ఉండదని వ్యాఖ్యానించారు.
“భారతదేశ జ్ఞాన సంప్రదాయానికి ‘పరిరక్షణ, ఆవిష్కరణ, సంకలనం, అనుసరణ’ నాలుగు మూలస్తంభాలు కాబట్టే, ఇది నేటికీ సుసంపన్నంగా విలసిల్లుతోంది” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ నాలుగు స్తంభాల్లో మొదటిదైన పరిరక్షణ గురించి వివరిస్తూ- అత్యంత ప్రాచీన గ్రంథాలైన మన వేదాలు భారతీయ సంస్కృతికి పునాదిగా పరిగణనలో ఉన్నాయని శ్రీ మోదీ చెప్పారు. వేదాలు అత్యున్నతమైనవని స్పష్టం చేస్తూ... ఆ కాలంలో వేదాలను మౌఖిక సంప్రదాయం- ‘శ్రుతి’ ద్వారా తదుపరి తరానికి అందించారని ఆయన గుర్తుచేశారు. ఆ విధంగా వేల ఏళ్ల నుంచీ సంపూర్ణ ప్రామాణికతతో దోషరహితంగా వేదాలను పరిరక్షించారని వివరించారు. ఇక రెండో స్తంభమైన ఆవిష్కరణ విషయానికొస్తే- ఆయుర్వేద, వాస్తు, జ్యోతిష, లోహ శాస్త్రాల్లో భారత్ నిరంతర ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నదని పేర్కొన్నారు. ప్రతి తరం ఇలా మునుపటి తరంకన్నా ముందుకు సాగుతూ, ప్రాచీన జ్ఞానాన్ని మరింత శాస్త్రీయంగా రూపుదిద్దిందని ఆయన వ్యాఖ్యానించారు. ‘సూర్య సిద్ధాంతం’, ‘వరాహమిహిర సంహిత’ వంటి గ్రంథాలను నిరంతర పండిత కృషికి, సరికొత్త జ్ఞానం జోడించడానికి ఉదాహరణలుగా చూపారు. మూడో స్తంభమైన సంకలనం గురించి వివరిస్తూ- ప్రతి తరం పురాతన విజ్ఞాన పరిరక్షణ సహా కొత్త ఆలోచనా దృక్పథాన్ని జోడిస్తూ వచ్చిందని శ్రీ మోదీ చెప్పారు. వాల్మీకి రామాయణ రచనానంతరం అనేక మంది రామాయణ రచన చేయడాన్ని ఆయన ఉదాహరించారు. ఈ సంప్రదాయం నుంచి ‘రామచరితమానస్’ వంటి గ్రంథాల సృష్టిని ప్రస్తావించారు. అలాగే వేదాలు, ఉపనిషత్తులపై వ్యాఖ్యానాలు వెలువడ్డాయని పేర్కొన్నారు. మరోవైపు భారత ఆధ్యాత్మిక ఆచార్యులు ద్వైతం, అద్వైతం వంటి వ్యాఖ్యానాలను మనకు అందించారని ప్రధాని వివరించారు.
నాలుగో జ్ఞాన సంప్రదాయం అనుసరణ గురించి చెబుతూ- కాలక్రమంలో భారత్ ఆత్మపరిశీలన చేసుకుంటూ తన జ్ఞానానికి అవసరమైన మార్పుచేర్పులు చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. చర్చలకుగల ప్రాధాన్యాన్ని, శాస్త్రార్థ సంప్రదాయం కొనసాగింపును కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సమాజం కాలం చెల్లిన ఆలోచన దృక్పథానికి స్వస్తి చెప్పి కొత్త దృక్కోణాలను స్వీకరించిందని చెప్పారు. మధ్యయుగాల్లో వివిధ సామాజిక దురాచారాలు తలెత్తినపుడు సంఘసంస్కర్తలు ఉద్భవించి, సమాజంలో చైతన్యం రగిల్చారని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఆ విధంగా భారత మేధా వారసత్వాన్ని వారు పరిరక్షించారని వివరించారు.
“జాతీయతపై ఆధునిక భావనలకు భిన్నంగా భారతదేశానికి తనదైన విశిష్ట సాంస్కృతిక గుర్తింపు, చైతన్యం, జవజీవాలున్నాయి” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మన దేశ చరిత్ర కేవలం రాజవంశాల గెలుపోటముల జాబితాకు పరిమితం ఆయన వ్యాఖ్యానించారు. కాలక్రమంలో రాజ్యాలు, రాచరికాల భౌగోళిక భౌగోళిక స్వరూపం మారినా భారతదేశం మాత్రం హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం దాకా చెక్కుచెదరకుండా నిలిచిందని గుర్తుచేశారు. భారత్ అంటేనే- ఆలోచనలు, ఆదర్శాలు, విలువలతో కూడిన నిరంతర సజీవ స్రవంతి అని ఆయన స్పష్టం చేశారు. “ఈ నాగరకత నిరంతర పయనాన్ని భారత ప్రాచీన రాతప్రతులు ప్రతిబింబిస్తాయి” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. అంతేగాక భిన్నత్వంలో ఏకత్వాన్ని కూడా ఇవి స్పష్టం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 80 భాషలలో రాతప్రతులు ఉన్నాయని ఆయన తెలిపారు. భారత విస్తృత జ్ఞాన సంద్రంలోని సంస్కృత, ప్రాకృత, అస్సామీ, బెంగాలీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మరాఠీ వంటి పలు భాషల్లో అనేక పరిరక్షిత గ్రంథాలున్నాయని చెప్పారు. గిల్గిట్ రాతప్రతులు కాశ్మీర్‌పై ప్రామాణిక రీతిలో చారిత్రక అవగాహన కల్పిస్తాయన్నారు. కౌటిల్యుడి అర్థశాస్త్రం రాతప్రతి భారత రాజకీయ-ఆర్థిక శాస్త్రాలపై లోతైన అవలోకనానికి వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆచార్య భద్రబాహు రచించిన ‘కల్పసూత్ర’ రాతప్రతి జైనమత ప్రాచీన జ్ఞాన పరిరక్షణకు తోడ్పడిందని, సారనాథ్ రాతప్రతులు బుద్ధుని ప్రబోధాలను వివరిస్తాయని ఆయన చెప్పారు. అలాగే ‘రసమంజరి, గీతా గోవిందం’ వంటి రాతప్రతులు భక్తి, సౌందర్యం, సాహిత్యం వంటి విభిన్న వన్నెల పరిరక్షణకు చిహ్నాలని ఆయన అభివర్ణించారు.
“భారత రాతప్రతులు యావత్ మానవాళి ప్రగతి పయనానికి ప్రతిబింబాలు” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఇవి భారతీయ తత్త్వ, విజ్ఞానశాస్త్ర భాండాగారాలని ఆయన పేర్కొన్నారు. వైద్యం, అధిభౌతిక శాస్త్రం సహా కళా, ఖగోళ, వాస్తు శిల్ప జ్ఞానాన్ని కూడా అవి పరిరక్షించాయని వివరించారు. గణితం నుంచి బైనరీ ఆధారిత కంప్యూటర్ సైన్స్ వరకూ ఆధునిక శాస్త్ర పునాది సున్నా భావనపై ఆధారపడిందని, ఇందుకు అనేకానేక ఉదాహరణలున్నాయని గుర్తుచేశారు. సున్నా భారత ఆవిష్కరణేనని చెబుతూ- సున్నాతోపాటు ప్రాచీన గణిత సూత్ర వినియోగానికి బక్షాలి రాతప్రతులలో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇక యశోమిత్ర బోవర్ రాతప్రతులు శతాబ్దాల నాటి వైద్యశాస్త్రంపై అవగాహనిస్తాయని చెప్పారు. ‘చరక సంహిత, శుశ్రుత సంహిత’ వంటి గ్రంథాల రాతప్రతులు ఆయుర్వేద విజ్ఞానాన్ని నేటికీ పరిరక్షిస్తున్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. శుల్వ లేదా శుల్బ సూత్రం పురాతన రేఖాగణిత జ్ఞానాన్ని అందించగా, సంప్రదాయ వ్యవసాయ జ్ఞానం ‘కృషి పరాశరం’ నుంచి మనకు సంక్రమించిందని వివరించారు. మరోవైపు మానవ భావోద్వేగ పురోగమనాన్ని అర్థం చేసుకోవడంలో నాట్య శాస్త్ర రాతప్రతులు ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు.
ప్రతి దేశం తమ చారిత్రక సంపదను నాగరికత గొప్పదనానికి సంకేతంగా ప్రపంచానికి ప్రదర్శిస్తుందని చెబుతూ- కనీసం ఒక రాతప్రతిని లేదా కళాఖండాన్ని జాతీయ సంపదగా పరిగణించి భద్రపరుస్తాయని వివరించారు. అయితే, మన దేశ రాతప్రతుల సంపద అపారమని ఇవి జాతీయ ప్రతిష్టకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
కువైట్ పర్యటనలో భాగంగా తానొక వ్యక్తిని కలిశానని, భారత ప్రాచీన సముద్ర వాణిజ్య మార్గాలను వివరించే చారిత్రక పత్రాలను ఆయన పెద్ద సంఖ్యలో సేకరించి భద్రపరచారని ప్రధానమంత్రి తన అనుభవాన్ని పంచుకున్నారు. శతాబ్దాల కిందటే భారతదేశం సముద్ర వాణిజ్యం నిర్వహించిన తీరును వివరించే సరంజామాతో ఆయన తనను సగర్వంగా కలిశారని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో భారత్ ప్రగాఢ స్నేహ సంబంధాలను, సరిహద్దుల వెంబడి మన దేశానికిగల గౌరవాన్ని ఇలాంటి రాతప్రతులు ప్రతిబింబిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు. చెల్లాచెదరుగాగల ఈ సంపదను విస్తృత జాతీయ కృషితో పరిరక్షించి, సమగ్రం చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. ఇటువంటి రికార్డులు ఎప్పుడు... ఎక్కడ దొరికినా- భారత నాగరికత వారసత్వంలో భాగంగా వాటిని పరిరక్షించి, డిజిటలీకరణ ద్వారా పదిలం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
“భారత్ ప్రపంచ విశ్వాసాన్ని చూరగొన్న నేపథ్యంలో మన దేశాన్ని స్వీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, గౌరవాన్ని పదిలం చేసుకోగల సముచిత ప్రదేశంగా అనేక దేశాలు పరిగణిస్తున్నాయి” అని శ్రీ మోదీ చెప్పారు. లోగడ అపహరణకు గురై తమ దేశాలకు చేరిన కొన్ని భారతీయ విగ్రహాలను మాత్రమే అవి తిరిగి ఇచ్చాయని గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు వందలాది ప్రాచీన విగ్రహాలను తిరిగి ఇస్తున్నాయని తెలిపారు. ఇదంతా ఏదో భావోద్వేగం లేదా సానుభూతితో కాకుండా విశ్వసనీయత ప్రాతిపదికన సాగుతున్నదని చెప్పారు. ఆ మేరకు భారత్ తన సాంస్కృతిక విలువల సగౌరవ పరిరక్షణ, విస్తృతికి కృషి చేస్తుందని అన్ని దేశాలూ నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచం దృష్టిలో భారత్ విశ్వసనీయ వారసత్వ పరిరక్షకురాలుగా నిలిచిందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా తన మంగోలియా పర్యటనను ప్రస్తావిస్తూ- అక్కడి బౌద్ధ సన్యాసులతో సంభాషించినపుడు వారు సేకరించిన గొప్ప రాతప్రతులను పరిశీలించానని గుర్తుచేసుకున్నారు. ఆ రాతప్రతులపై అధ్యయనం కోసం వారిని అనుమతి కోరానని కూడా తెలిపారు. అనంతరం వాటిని భారత్‌కు తెచ్చి, డిజిటలీకరణ ప్రతులను సగౌరవంగా వాపసు చేశామని వెల్లడించారు. ఇప్పుడవి మంగోలియాకు విలువైన వారసత్వ సంపదగా మారాయని చెప్పారు.
ఈ వారసత్వాన్ని ప్రపంచానికి సగర్వంగా అందించడం కోసం భారత్ నేడు సిద్ధమవుతున్నదని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ బృహత్యార్యంలో జ్ఞాన భారతం మిషన్ కీలక భాగమని, దేశంలోని అనేక సంస్థలతోపాటు ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వం ఈ దిశగా కృషి చేస్తుందని వివరించారు. ఈ మేరకు కాశీ నగరి ప్రచారిణి సభ, కోల్‌కతా ఆసియాటిక్ సొసైటీ, ఉదయపూర్ ‘ధరోహర్’, గుజరాత్ రాష్ట్రం కోబాలోని ఆచార్య శ్రీ కైలాససూరి జ్ఞానమందిర్, హరిద్వార్‌లోని పతంజలి, పుణేలోని భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, తంజావూరులోని సరస్వతీ మహల్ లైబ్రరీ వంటి సంస్థలను ఆయన ఉటంకించారు. ఇలాంటి వందలాది సంస్థల తోడ్పాటుతో ఇప్పటిదాకా 10 లక్షలకుపైగా రాతప్రతుల డిజిటలీకరణ పూర్తయినట్లు వెల్లడించారు. మరోవైపు తమ కుటుంబ వారసత్వంగా సంక్రమించిన ప్రాచీన రాతప్రతులను దేశానికి అందుబాటులో ఉంచేందుకు అనేకమంది పౌరులు ముందుకొచ్చారని శ్రీ మోదీ తెలిపారు. ఈ కృషిలో సహకరిస్తున్న సంస్థలకు, పౌరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
భారత్ తన జ్ఞాన సంపదకు ఎన్నడూ ధనరూపంలో వెలకట్టలేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా “అన్ని దానాలలోనూ జ్ఞానదానమే గొప్పది” అనే భారతీయ రుషిపుంగవుల స్ఫూర్తిని ఉదాహరించారు. పురాతన కాలంలో భారతీయులు దాతృత్వ స్ఫూర్తితో రాతప్రతులను దానం చేసేవారని ఆయన గుర్తుచేశారు. చైనా యాత్రికుడు హుయెన్ త్సాంగ్ భారత్‌ను సందర్శించిన సమంలో 600కుపైగా రాతప్రతులను తీసుకెళ్లారని శ్రీ మోదీ చెప్పారు. భారతీయ రాతప్రతులు అనేకం చైనా నుంచి జపాన్ చేరాయని తెలిపారు. వీటిని 7వ శతాబ్దంలో జపాన్ జాతీయ సంపద కింద హోర్యు-జి ఆశ్రమంలో భద్రపరచారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారత పురాతన రాతప్రతులు ఉన్నాయని ప్రధానమంత్రి వెల్లడించారు. జ్ఞాన భారతం మిషన్ కింద మానవాళి ఉమ్మడి వారసత్వ సంపద ఏకీకరణకు కృషి చేస్తామని ఆయన చెప్పారు.
జి-20 సాంస్కృతిక వేదికపై చర్చల సందర్భంగా భారత్ ఈ కృషికి శ్రీకారం చుట్టిందని ప్రధానమంత్రి వెల్లడించారు. భారత్‌తో శతాబ్దాల నుంచీ సాంస్కృతిక సంబంధాలుగల దేశాలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకుంటున్నాయని చెప్పారు. మంగోలియా ‘కంజుర్’ పునర్ముద్రిత సంపుటాలను ఆ దేశ రాయబారికి బహూకరించామని ఆయన తెలిపారు. అలాగే 2022లో మంగోలియాతోపాటు రష్యాలోని బౌద్ధ మఠాలకు 108 సంపుటాలను అందజేశామని వెల్లడించారు. మరోవైపు థాయ్‌లాండ్, వియత్నాం దేశాల్లోని విశ్వవిద్యాలయాలతో భారత్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నదని శ్రీ మోదీ పేర్కొన్నారు. దీనికింద ప్రాచీన రాతప్రతుల డిజిటలీకరణపై ఆ దేశాల పండితులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కృషి ఫలితంగా ‘పాళీ, లన్నా, చామ్’ భాషలలోని అనేక రాతప్రతులను డిజిటలీకరించామని చెప్పారు. ఇప్పుడిక జ్ఞాన భారతం మిషన్ ద్వారా ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని శ్రీ మోదీ ప్రకటించారు.
జ్ఞాన భారతం మిషన్ ఎదుట ఒక పెద్ద సవాలు కూడా ఉందని చెబుతూ- శతాబ్దాలుగా వినియోగంలోగల భారత సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలోని అనేక అంశాలను ఇతరులు కాపీ కొట్టి, పేటెంట్ పొందుతున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ రకమైన మేధా చౌర్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కృషికి డిజిటల్ రాతప్రతులు ఎంతగానో తోడ్పడతాయని చెప్పారు. తద్వారా వివిధ అంశాలపై ప్రామాణిక, వాస్తవ వనరులు ప్రపంచానికి అందుబాటులో ఉంటాయని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
జ్ఞాన భారతం మిషన్‌లో మరో కీలక కోణం గురించి ప్రధాని వివరించారు. ఈ మేరకు పరిశోధన- ఆవిష్కరణల కొత్త రంగాల సామర్థ్యాన్ని వెలికితీయడంలో ఇది తనవంతు పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచ సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమ విలువ ప్రస్తుతం 2.5 ట్రిలియన్ డాలర్లుగా ఉందని శ్రీ మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. డిజిటలీకృత రాతప్రతులు ఈ పరిశ్రమ విలువ శ్రేణికి ఊతమిస్తాయని పేర్కొన్నారు. ఈ దిశగా కోట్లాది రాతప్రతులు, వాటిలోని ప్రాచీన జ్ఞానం విస్తృత సమాచార నిధిగా ఉపయోగపడగలదని చెప్పారు. సమాచార ఆధారిత ఆవిష్కరణలకు దీనివల్ల కొత్త ప్రోత్సాహం లభిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. సాంకేతిక రంగంలో యువతకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయని, రాతప్రతుల డిజిటలీకరణ పురోగమించే కొద్దీ విద్యారంగ పరిశోధనలకూ కొత్త బాటలు పడతాయని శ్రీ మోదీ అన్నారు.
ఈ డిజిటలీకృత రాతప్రతుల సమర్థ అధ్యయనం కోసం కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెంచాలని ప్రధానమంత్రి సూచించారు. ఏఐ సహాయంతో వాటిని మరింత లోతుగా అర్థం చేసుకోవడంతోపాటు విశ్లేషించవచ్చునని చెప్పారు. ఈ రాతప్రతుల్లోని జ్ఞానాన్ని ప్రామాణిక, ప్రభావశీల రీతిలో ప్రదర్శించేందుకు కూడా ఏఐ తోడ్పడుతుందని తెలిపారు.
జ్ఞాన భారతం కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకోవాల్సిందిగా యువతరానికి ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికత సాయంతో గతాన్ని అన్వేషించడంలోని ప్రాధాన్యాన్ని గ్రహించాలని శ్రీ మోదీ స్పష్టం చేశారు. నిదర్శానాధారిత పారామితులలో ఈ జ్ఞానాన్ని మానవాళికి అందుబాటులోకి తేవడంపై కృషి కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఈ దిశగా కొత్త కార్యకలాపాలు చేపట్టాలని కోరారు. యావద్దేశం స్వదేశీ స్ఫూర్తితో, స్వయంసమృద్ధ భారత్ సంకల్పంతో ముందడుగు వేస్తున్నదని గుర్తుచేశారు. ఆ జాతీయ స్ఫూర్తికి ప్రస్తుత జ్ఞాన భారతం మిషన్ కొనసాగింపుగా ఉంటుందని శ్రీ మోదీ ప్రకటించారు. భారత్ తన వారసత్వాన్ని స్వీయ శక్తిసామర్థ్యాలకు చిహ్నంగా మలచుకోవాలని స్పష్టం చేశారు. తదనుగుణంగా సరికొత్త భవిష్యత్ అధ్యాయానికి ఈ మిషన్ నాంది పలుకుతుందని విశ్వాసం ప్రకటిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, శ్రీ రావ్ ఇందర్‌జిత్ సింగ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
జ్ఞాన భారతంపై “రాతప్రతుల ప్రాచీన సంపద ద్వారా భారత జ్ఞాన వారసత్వ పునరుజ్జీవం” ఇతివృత్తంగా ఈ నెల 11న ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు 13వ తేదీదాకా కొనసాగుతుంది. భారతీయ అపార రాతప్రతుల సంపదకు పునరుజ్జీవం, ప్రపంచవ్యాప్త జ్ఞాన చర్చలకు కేంద్రంగా ఈ సదస్సును నిర్వహిస్తుండగా- ప్రముఖ పండితులు, పరిరక్షకులు, సాంకేతిక-విధాన నిపుణులను ఈ వేదిక ఒకచోటకు చేర్చింది. ఇందులో భాగంగా అరుదైన పురాతన రాతప్రతుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ప్రాచీన రాతప్రతుల పరిరక్షణ, డిజిటలీకరణ సాంకేతికతలు, సమాచర మూలాల ప్రమాణాలు, చట్టబద్ధ చట్రాలు, సాంస్కృతిక దౌత్యం, ప్రాచీన లిపుల అర్థవివరణ వంటి కీలకాంశాలపై పండితుల వివరణలు కూడా ఉంటాయి.
(Release ID: 2166236)
|