కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దుబాయ్ లో సార్వజనీన తపాలా సదస్సులో చరిత్రాత్మాక యూపీఐ-యూపీయూ అనుసంధానాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
ప్రపంచ తపాలా రంగ బలోపేతానికి 10 మిలియన్ డాలర్లు ప్రకటించిన భారత్: జ్యోతిరాదిత్య సింధియా
ప్రపంచ తపాలా సదస్సులో రెండు కీలక యూపీయూ మండళ్లకు భారత్ పోటీ పడుతుందని ప్రకటించిన సింధియా
Posted On:
09 SEP 2025 11:29AM by PIB Hyderabad
దుబాయ్ లో 28వ సార్వజనీన తపాలా సదస్సులో యూపీఐ-యూపీయూ అనుసంధాన ప్రాజెక్టును కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి సరిహద్దులు దాటి డబ్బులు పంపే ప్రక్రియను సులభతరం చేసేందుకు కీలక ముందడుగు.

ఈ ప్రాజెక్టును తపాలా శాఖ (డీఓపీ), ఎన్ పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్), యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీయూ) కలిసి ప్రారంభించాయి. దీని ద్వారా భారతదేశ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ), యూపీయూ అనుసంధాన వేదికతో అనుసంధానించటం వల్ల యూపీఐ వేగం, అందుబాటు ధరతో పోస్టల్ వ్యవస్థ పరిధి విస్తృతమవుతుంది.
దీనిని "సాంకేతిక ప్రయోగం అనడం కన్నా, సామాజిక ఒప్పందం" అనడం సరైందన్నారు సింధియా. "పోస్టల్ నెట్ వర్క్ విశ్వసనీయత, యూపీఐ వేగం వల్ల విదేశాల్లో ఉన్న కుటుంబాలు వేగంగా, సురక్షితంగా, తక్కువ ఖర్చుతో డబ్బును బదిలీ చేసుకుంటాయి. ప్రజల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను సరిహద్దులు దాటి అనుసంధానించటం ద్వారా మానవాళికి మెరుగైన సేవలందించవచ్చని ఇది చెబుతుంది" అని పేర్కొన్నారు.
భారతదేశపు ఆధునిక, సమ్మిళిత పోస్టల్ రంగం దృష్టిని సింధియా నాలుగు విధాలుగా వివరించారు. డేటా ఆధారిత లాజిస్టిక్స్ ద్వారా నిరంతరాయంగా అనుసంధానం చేయటం, ప్రతి వలసదారుడు, డిజిటల్ సంస్థకు తక్కువ ఖర్చుతో డిజిటల్ ఆర్థిక సేవలు అందించి వారిని భాగస్వాములను చేయటం, ఏఐ, డిజిపిన్, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలతో పోస్టల్ రంగాన్ని ఆధునీకీకరించటం, యూపీయూ సాంకేతిక విభాగంతో దక్షిణాది దేశాల మధ్య భాగస్వామ్య సహకారం.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా దార్శనికత, వికసిత్ భారత్ దిశగా చేస్తున్న కృషికి ఇండియా పోస్ట్ విస్తృతి, సమ్మిళితత్వం శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తాయని సింధియా తెలిపారు. "ఆధార్ సేవలు, జన్ ధన్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా 560 మిలియన్ కు పైగా ఖాతాలను ప్రారంభించాం. అందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు. గతేడాది భారత తపాలా శాఖ 900 మిలియన్లకు పైగా ఉత్తరాలు, పార్శిళ్లను గమ్యస్థానాలకు చేర్చింది. మేం ప్రపంచవేదికపై ప్రదర్శిస్తున్న విస్తృతమైన, భాగస్వామ్య స్ఫూర్తి ఇదే" అని స్పష్టం చేశారు.
ఈ సాంకేతికతను ఆవిష్కరణ వైపు మళ్లించేందుకు, ఈ-కామర్స్, డిజిటల్ చెల్లింపులపై దృష్టి సారించటానికి 10 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని సింధియా ప్రకటించారు. 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ.. వనరులు, నైపుణ్యాలు, స్నేహభావంతో భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పునరుద్ఘాటించారు.
యూపీయూలో కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, పోస్టల్ వ్యవహారాల మండళ్లకు భారత అభ్యర్థులను సింధియా ప్రకటించటం ద్వారా గ్లోబల్ పోస్టల్ కమ్యూనిటీ కోసం అనుసంధానత, సమ్మిళిత, సుస్థిరమైన భవిష్యత్ నిర్మాణానికి భారతదేశ నిబద్ధత స్పష్టమవుతోంది.

"ప్రతిపాదనలతో కాదు.. భాగస్వామ్యంతో భారత్ మీ దగ్గరకు వస్తుంది. పరస్పర సహకారం ద్వారా లభించే పరిష్కారాలను మేము విశ్వసిస్తాం. అవి విభజన ఖర్చును తగ్గించి, లావాదేవీలు సజావుగా సాగటానికి చెల్లింపులు, గుర్తింపు, చిరునామా, రవాణాలను అనుసంధానిస్తాయి" అంటూ దుబాయ్ లో జరిగిన 28వ యూనివర్సల్ పోస్టల్ సదస్సులో సింధియా తన ప్రసంగాన్ని ముగించారు.
***
(Release ID: 2164919)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam