ఆర్థిక మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్ఏక్యూలు)
Posted On:
03 SEP 2025 11:28PM by PIB Hyderabad
1. జీఎస్టీ రేట్లలో మార్పులు ఎప్పుటి నుంచి అమల్లోకి రానున్నాయి?
జీఎస్టీ కౌన్సిల్ తన 56వ సమావేశంలో చేసిన సిఫార్సుల ప్రకారం.. సిగరెట్లు, నమిలే పొగాకు ఉత్పత్తులైన జర్దా, ముడి పొగాకు, బీడీలు మినహా ఇతర వస్తువులు, సేవల జీఎస్టీ రేట్లలో మార్పులు ఈనెల 22 ( "2025 సెప్టెంబర్ 22" ) నుంచి అమలులోకి వస్తాయి. సిగరెట్లు, నమిలే పొగాకు ఉత్పత్తులైన జర్దా, ముడి పొగాకు, బీడీలకు ప్రస్తుతం అమలులో ఉన్న జీఎస్‌టీ, పరిహార పన్ను రేట్లు వర్తిస్తాయి. పరిహార పన్నుకు సంబంధించిన రుణం, వడ్డీ చెల్లింపులు పూర్తయిన తరువాత, ఈ ఉత్పత్తులపై కొత్త రేట్ల అమలు తేదీని ప్రకటిస్తారు.
2. సీజీఎస్టీ చట్టం-2017 ప్రకారం వస్తువులకు అవసరమైన రిజిస్ట్రేషన్ పరిమితిలో ఏదైనా మార్పు ఉందా?
లేదు, సీజీఎస్టీ చట్టం-2017 ప్రకారం వస్తువులకు అవసరమైన రిజిస్ట్రేషన్ పరిమితిలో ఎటువంటి మార్పు చేయలేదు.
3. సవరించిన రేట్ల వివరాలను ఏ నోటిఫికేషన్ అందిస్తుంది?
జీఎస్టీ రేట్లలో మార్పుల గురించి రేట్ నోటిఫికేషన్‌లో తెలియజేస్తారు. ఈ నోటిఫికేషన్ సీబీఐసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
4. జీఎస్టీ రేట్లలో మార్పులు అమల్లోకి రాకముందు నేను వస్తువులు గానీ, సేవలు గానీ, రెండింటినీ గానీ సరఫరా చేసి, అమలు తరువాతి తేదీతో ఇన్వాయిస్‌లు జారీ చేస్తే వర్తించే పన్ను రేటు విషయంలో ఏమి జరుగుతుంది?
సీజీఎస్టీ చట్టం-2017 లోని సెక్షన్ 14 (a)(i) ప్రకారం, పన్ను రేటు మార్పు అమలుకు ముందే వస్తువులు గానీ, సేవలు గానీ, రెండింటిని గానీ సరఫరా చేసి, పన్ను రేటు మార్పు అమలులోకి వచ్చిన తర్వాత దాని కోసం ఇన్వాయిస్ జారీ చేసిన సందర్భాల్లో సరఫరా సమయం అంటే అటువంటి సరఫరా కోసం పన్ను చెల్లించాల్సిన బాధ్యత తేదీ కింది విధంగా ఉంటుంది:
i. పన్ను రేటు మార్పు తర్వాత చెల్లింపు అందినట్లయితే, చెల్లింపు అందుకున్న తేదీ, ఇన్వాయిస్ జారీ చేసిన తేదీల్లో ఏది ముందు జరిగితే ఆ తేదీ సరఫరా సమయం అవుతుంది.
ii. పన్ను రేటు మార్పు అమలు తేదీకి ముందే చెల్లింపు అందుకుంటే, చెల్లింపు అందుకున్న తేదీ సరఫరా సమయం అవుతుంది.
5. నేను వస్తువులుగానీ, సేవలు గానీ లేదా రెండింటినీ సరఫరా చేయడం కోసం అడ్వాన్సులు అందుకున్నప్పటికీ సరఫరా పూర్తిచేయనప్పుడు లేదా ఇన్వాయిస్ జారీ చేయనప్పుడు వర్తించే జీఎస్టీ రేటు ఎంత?
సరఫరా నిబంధనల ప్రకారం జీఎస్టీ రేటును నిర్ణయిస్తారు. (సీజీఎస్టీ చట్టం-2017లోని సెక్షన్ 14 చూడండి).
6. జీఎస్టీ రేట్లలో మార్పులు అమలులోకి రాకముందు చేసిన కొనుగోళ్లకు సంబంధించిన ఐటీసీ విషయంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను తగ్గించిన రేటుతో ఐటీసీ పొందుతానా?
సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 16(1) ప్రకారం ఒక నమోదిత వ్యక్తి తన ఇన్‌వార్డ్ సరఫరాలపై విధించిన ఇన్‌పుట్ పన్నును క్రెడిట్ చేసుకునే హక్కును కలిగి ఉంటారు, ఇది సీజీఎస్టీ చట్టం-2017లోని సెక్షన్ 49 కింద నిర్దేశించిన షరతులు, పరిమితులకు లోబడి అతను తన వ్యాపార నిర్వహణలో లేదా విస్తరణలో ఉపయోగించుకునేది లేదా ఉపయోగించాలనుకునేది అవుతుంది. ఇది అతని ఇ-క్రెడిట్ లెడ్జర్‌కు జమ అవుతుంది.
దీని ప్రకారం ఒక నమోదిత వ్యక్తికి ఇన్‌వార్డ్ సరఫరా అందినప్పుడు.. ఆ సరఫరా సమయంలో అమలులో ఉన్న రేటుకు అనుగుణంగా దానిపై పన్ను సక్రమంగా వసూలు చేసి ఉంటే, ఆ నమోదిత వ్యక్తి సీజీఎస్టీ చట్టం-2017లోని సెక్షన్ 49లో పేర్కొన్న ఇతర షరతులు, పరిమితులు, విధానానికి లోబడి చెల్లించిన పన్ను క్రెడిట్ కోసం అర్హత కలిగి ఉంటారు.
7. వస్తువుల దిగుమతుల విషయంలో ఐజీఎస్టీ రేటుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ప్రత్యేకించి ఐజీఎస్టీ రేటును మినహాయించినప్పుడు మినహా.. దిగుమతి చేసుకున్న వస్తువులపై ఐజీఎస్టీ రేటు నోటిఫికేషన్‌లో సూచించిన జీఎస్టీ రేట్లుగానే ఉంటుంది.
8. 2025 సెప్టెంబర్ 22న లేదా ఆ తర్వాత చేసిన వస్తువులు, సేవల అవుట్‌వార్డ్ సరఫరాపై జీఎస్టీ రేటును తగ్గించారు, కానీ అప్పటికే అధిక రేటు కారణంగా జీఎస్టీ కోసం లెడ్జర్‌లో జమ చేసిన ఐటీసీ నా వద్ద ఉంది. నేను అలాంటి క్రెడిట్‌ను ఉపయోగించడం కొనసాగించవచ్చా?
ఇ-క్రెడిట్ లెడ్జర్‌లో ఒకసారి సక్రమంగా పొందిన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 49(4), దాని కింద పేర్కొన్న నిబంధనల ప్రకారం ఏదైనా అవుట్‌పుట్ పన్ను చెల్లింపుల కోసం ఉపయోగించవచ్చు.
9. కొత్త రేటు షెడ్యూల్ ప్రకారం నా అవుట్‌వార్డ్ సరఫరాకు మినహాయింపు ఉంది. కానీ నా లెడ్జర్‌లో ఇప్పటికే జీఎస్టీ కోసం ఐటీసీ చెల్లింపు జరిగింది. నేను ఐటీసీని వాపసు చేయవలసి ఉంటుందా?
2025 సెప్టెంబర్ 21 వరకు చేసిన వస్తువులు లేదా సేవల సరఫరా కోసం లేదా రెండింటి కోసం అవుట్‌వార్డ్ చెల్లింపులు చేయడానికి ఐటీసీని ఉపయోగించవచ్చు. అయితే, రేటు మార్పు అమలులోకి వచ్చిన 2025 సెప్టెంబర్ 22న లేదా ఆ తర్వాత చేసిన సరఫరాల కోసం సీజీఎస్టీ చట్టం-2017 నిబంధనల ప్రకారం ఐటీసీని వాపసు చేయాల్సి ఉంటుంది.
10. నోటిఫై చేసిన సవరించిన రేటు అమలులోకి వచ్చే తేదీ వరకు జరిగిన సరఫరాల కోసం అవుట్‌వార్డ్ సరఫరాల కంటే ఇన్‌పుట్ మెటీరియల్‌పై జీఎస్టీ అధికంగా ఉండడం కారణంగా సేకరించిన క్రెడిట్‌ను తిరిగి పొందడానికి నాకు అనుమతి ఉంటుందా?
ఈ విషయంపై 31.03.2020 (సవరించిన) సర్క్యులర్ నంబర్ 135/05/2020-GST ద్వారా స్పష్టత ఇచ్చారు. సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 54(3)లో పేర్కొన్న మొదటి నిబంధనలోని క్లాజ్ (ii) ప్రకారం.. ఇన్‌పుట్‌లపై పన్ను రేటు అవుట్‌పుట్ సరఫరాలపై పన్ను రేటు కంటే ఎక్కువగా ఉండటం వల్ల జమ అయిన క్రెడిట్ సందర్భంలో ఐటీసీ తిరిగి పొందడానికి వీలుంటుంది. అటువంటి సందర్భాల్లో ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఒకేలా ఉండటం వల్ల, వేర్వేరు సమయాల్లో వేర్వేరు పన్ను రేట్లను విధిస్తున్నప్పటికీ అవి సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 54లో గల సబ్-సెక్షన్ (3)లో పేర్కొన్న మొదటి నిబంధనలోని క్లాజ్ (ii)లో పేర్కొన్న నిబంధనల కిందకు రావు.
11. రేటు మార్పులు అమలులోకి వచ్చే తేదీన నా దగ్గర అప్పటికే స్టాక్ మిగిలి ఉంటే, నేను సవరించిన రేటును వర్తింపజేయాల్సి ఉంటుందా?
సరఫరాపై జీఎస్టీ విధించారు కాబట్టి.. సవరించిన జీఎస్టీ రేట్లు నోటిఫై చేసిన తేదీన లేదా ఆ తర్వాత సరఫరా చేసే వస్తువుల విషయంలో.. వస్తువుల లేదా సేవల లేదా రెండింటి అవుట్‌వార్డ్ సరఫరాలపై కొత్త జీఎస్టీ రేట్లు వర్తిస్తాయి.
12. కొత్త రేట్లు అమల్లోకి వచ్చినప్పుడు రవాణాలో ఉన్న వస్తువులపై ఇ-వే బిల్లులను రద్దు చేసి కొత్తగా జనరేట్ చేయాల్సి వస్తుందా?
సీజీఎస్టీ నిబంధనలు-2017 లోని 138వ నిబంధన ప్రకారం, వస్తువుల సరఫరా లేదా రవాణా ప్రారంభానికి ముందు ఇ-వే బిల్లును రూపొందించాలి. కొత్త రేట్లు అమల్లోకి వచ్చినప్పుడు రవాణాలో ఉన్న వస్తువుల కోసం ఇ-వే బిల్లులను రద్దు చేయడం, కొత్తగా రూపొందించడం తప్పనిసరి కాదు. ప్రస్తుతం రవాణాలో ఉన్న ఇ-వే బిల్లులు వాటి అసలు చెల్లుబాటు వ్యవధికి అనుగుణంగా చెల్లుబాటు అవుతాయి.
13. యూహెచ్‌టీ (అల్ట్రా హై టెంపరేచర్) పాలకు జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చారు. యూహెచ్‌టీ పాలకు ఇచ్చే మినహాయింపు మొక్కల-ఆధారిత పాల విషయంలో కూడా వర్తిస్తుందా?
యూహెచ్‌టీ పాలు తప్ప మిగతా అన్ని రకాల పాలు ఇప్పటికే జీఎస్టీ మినహాయింపు పొందాయి. సారూప్య వస్తువులన్నింటి కోసం ఒకే పన్ను విధానం ఉండేందుకు యూహెచ్‌టీ పాలను కూడా మినహాయించారు. సోయా పాల సంబంధిత పానీయాలు మినహా మొక్కల-ఆధారిత పాల పానీయాలన్నింటిపై 18 శాతం జీఎస్టీ, సోయా పాల సంబంధిత పానీయాలపై 12 శాతం జీఎస్టీ అమలులో ఉండేది. మొక్కల-ఆధారిత పాల పానీయాలతో పాటు, సోయా పాల సంబంధిత పానీయాలపైనా జీఎస్టీ రేటును ఇప్పుడు 5 శాతానికి తగ్గించారు.
14. 'ఇతర నాన్-ఆల్కహాల్ పానీయాల'పై 40 శాతం రేటుకు కారణం ఏమిటి?
తప్పుడు వర్గీకరణలు, వివాదాల నివారణ కోసం ఇటీవలి రేటు హేతుబద్ధీకరణ ప్రక్రియలో సారూప్య వస్తువులన్నీ ఒకే రేటు వద్ద ఉంచడంపై దృష్టి సారించారు. 'ఇతర నాన్-ఆల్కహాలిక్ పానీయాల' విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటించారు.
15. షెడ్యూళ్లలో ఎక్కడా ప్రస్తావించని ఆహార తయారీలపై జీఎస్టీ రేటు ఎంత?
ఎక్కడా ప్రస్తావించని ఆహార తయారీలపై 5 శాతం జీఎస్టీ రేటు వర్తిస్తుంది.
16. భారతీయ బ్రెడ్‌లోని నిర్దిష్ట రకాల కోసం మాత్రమే జీఎస్టీ రేటును సవరించడానికి కారణం ఏమిటి?
బ్రెడ్ కోసం ఇప్పటికే మినహాయింపు అమలులో ఉండగా.. పిజ్జా బ్రెడ్, రోటీ, పరోట్టా, పరాఠా మొదలైన వాటికి వేర్వేరు రేట్లు అమలులో ఉన్నాయి. ఉదాహరణగా కొన్ని రకాలను మాత్రమే ప్రస్తావించినప్పటికీ, తాజా నిర్ణయం ప్రకారం ఏ పేరుతో పిలిచేవి అయినా అన్ని భారతీయ బ్రెడ్‌లకు జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చారు.
17. పండ్ల సంబంధిత కార్బోనేటేడ్ పానీయాలు లేదా పండ్ల రసంతో కూడిన కార్బోనేటేడ్ పానీయాల రేటు ఎందుకు పెంచారు?
ఈ వస్తువులపై గతంలో జీఎస్టీతో పాటు పరిహార పన్ను కూడా విధించారు. పరిహార పన్ను విధింపును రద్దు చేయాలని నిర్ణయించినందున, రేటు హేతుబద్ధీకరణకు ముందు ఉన్న రేటు స్థాయిని కొనసాగించడం కోసం పన్నును పెంచారు.
18. పనీర్, ఇతర రకాల జున్ను మధ్య పన్ను విధానం ఎందుకు భిన్నంగా ఉంది?
రేటు హేతుబద్ధీకరణకు ముందు.. ప్రీ-ప్యాకేజ్డ్, లేబుల్ చేసిన రూపంలో కాకుండా ఇతర రూపంలో విక్రయించే పనీర్ కోసం ఇప్పటికే ఎలాంటి పన్ను లేదు. అందువల్ల ప్రీ-ప్యాకేజ్డ్, లేబుల్ చేసిన రూపంలో సరఫరా చేసే పనీర్ విషయంలో మాత్రమే మార్పులు చేశారు. పనీర్ ఒక భారతీయ కాటేజ్ చీజ్. ఇది ఎక్కువగా చిన్న తరహా కుటీరపరిశ్రమల్లో ఉత్పత్తి అవుతుంది. భారతీయ కాటేజ్ చీజ్‌ను ప్రోత్సహించడం ఈ చర్య ఉద్దేశం.
19. సహజసిద్ధమైన తేనెకు, కృత్రిమ తేనెకు వేర్వేరు పన్ను విధానం ఎందుకు అమలులో ఉంది?
ఇది సహజసిద్ధమైన తేనెను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించినది.
20. అన్ని వ్యవసాయ యంత్రాలు, పరికరాలపై జీఎస్టీని తగ్గించారా?
స్ప్రింక్లర్లు, బిందు సేద్య వ్యవస్థలు వంటి వ్యవసాయ యంత్రాలు, పరికరాలు.. నేల సన్నద్ధం చేయుట కోసం, సాగు కోసం ఉపయోగించే వ్యవసాయ, ఉద్యానవన, అటవీ సంబంధిత యంత్రాలు.. పచ్చిక లేదా క్రీడామైదానాల రోలర్లు, కోత లేదా నూర్పిడి యంత్రాలు, గడ్డి లేదా దాణా బేలర్లు, గడ్డి లేదా ఎండుగడ్డి మూవర్లు, ఇతర వ్యవసాయ, ఉద్యానవన, అటవీ, కోళ్ల పెంపకం లేదా తేనెటీగల పెంపకం సంబంధిత యంత్రాలు, కంపోస్టింగ్ యంత్రాలు మొదలైన వాటిపై గతంలో 12 శాతం జీఎస్టీ విధించగా ప్రస్తుతం దానిని 5 శాతానికి తగ్గించారు.
21. వ్యవసాయ యంత్రాలకు పూర్తి మినహాయింపు ఎందుకు ఇవ్వలేదు?
వినియోగదారులు, ఉత్పత్తిదారుల మధ్య సమతుల్యతను కాపాడటమే రేటు హేతుబద్ధీకరణ లక్ష్యం. రైతులకు ఉపశమనం కల్పిస్తూనే, దేశీయ తయారీపై ప్రతికూల ప్రభావం లేకుండా చూడటం కీలకం. వ్యవసాయ యంత్రాలను పూర్తిగా మినహాయించినట్లయితే, ఈ వస్తువుల తయారీదారులు, డీలర్లు ముడి పదార్థాలపై చెల్లించే జీఎస్టీపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకోలేరు. ఇప్పటికే పొందిన ఐటీసీని వాపసు చేయాల్సి వస్తుంది, ఫలితంగా తయారీదారులపై పన్ను భారం, ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఇది అధిక ధరల రూపంలో రైతులకు భారంగా మారవచ్చు, అందువల్ల, పూర్తి మినహాయింపు ఈ చర్యను ప్రతికూలంగా మారుస్తుంది.
22. ఔషధాలపై జీఎస్టీ రేటు ఎంత ఉంది?
జీఎస్టీ మినహాయింపు పొందినవాటిని తప్పించి, అన్ని మందులు/ ఔషధాలపై 5% రాయితీ జీఎస్టీ రేటు వర్తిస్తుంది.
23. అన్ని ఔషధాలను జీఎస్టీ నుంచి ఎందుకు మినహాయించలేదు?
మందులు, ఔషధాలకు పూర్తిగా జీఎస్టీ మినహాయింపు ఇవ్వబడితే, తయారీదారులు, డీలర్లు ముడి పదార్థాలపై చెల్లించిన జీఎస్టీపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేసుకోలేరు . ఇప్పటికే పొందిన ఐటీసీ ని వాపసు చేయాల్సి వస్తుంది. దీనివల్ల తయారీదారులపై పన్ను భారమూ, ఉత్పత్తి వ్యయమూ పెరుగుతాయి, ఫలితంగా వినియోగదారులు, రోగులకు అధిక ధరల రూపంలో భారం ఏర్పడుతుంది. అందువల్ల, పూర్తి మినహాయింపు ఈ చర్యను ప్రతికూలంగా మారుస్తుంది.
24. అన్ని వైద్య పరికరాలపై 5 శాతం జీఎస్టీ రేటు వర్తిస్తుందా?
ప్రత్యేకంగా మినహాయింపు పొందినవాటిని తప్పించి, వైద్య, శస్త్రచికిత్స, దంతవైద్యం, పశువైద్య ఉపయోగాల కోసం ఉపయోగించే అన్ని వైద్య పరికరాలు, సాధనాలు, ఉపకరణాలపై 5% జీఎస్టీ రేటు వర్తిస్తుంది.
25. వైద్య పరికరాలపై జీఎస్టీని రేటు ఎందుకు తగ్గించారు? ఇది ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌కు దారితీయదా?
ఈ చర్య ఆరోగ్య సంరక్షణ ఖర్చును తగ్గించడానికి ఉద్దేశించబడింది, తద్వారా రోగులకు, ముఖ్యంగా పేదలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుత నిర్మాణంలో ఇప్పటికే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఉన్నందున ఈ చర్య కొత్త ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌ను సృష్టించదు. అయితే ఈ చర్య ఇన్వర్షన్‌ను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. . జీఎస్టీ కింద ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కారణంగా ఉత్పన్నమయ్యే సంచిత ఇన్‌పుట్ పన్ను క్రెడిట్ కోసం తయారీదారులకు రిఫండ్ అందుబాటులో ఉంటుంది. వేగవంతమైన రీఫండ్ల కు వీలుగా ప్రక్రియ సంస్కరణలను కూడా జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసింది.
26. పెట్రోల్, ఎల్‌పీజీ, సీఎన్‌జీ లేదా డీజిల్‌తో నడిచే చిన్న కార్లపై సవరించిన జీఎస్టీ రేటు ఎంత? చిన్న కార్ల కింద కవర్ అయ్యేవి ఏమిటి?
అన్ని చిన్న కార్లపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం పొందే చిన్న కార్లు అంటే 1200 cc వరకు ఇంజిన్ సామర్థ్యం, 4000 mm వరకు పొడవు కలిగిన పెట్రోల్, ఎల్‌పీజీ, సీఎన్‌జీ కార్లు అలాగే 1500 cc వరకు ఇంజిన్ సామర్థ్యం, 4000 mm వరకు పొడవు కలిగిన డీజిల్ కార్లు.
27. 1500 cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, 4000 mm కంటే ఎక్కువ పొడవు ఉన్న వాహనాలపై కొత్త జీఎస్టీ రేటు ఎంత? యుటిలిటీ వాహనాలపై జీఎస్టీ రేటు ఎంత?
1500 cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, 4000 mm కంటే ఎక్కువ పొడవు ఉన్న అన్ని మధ్య తరహా, పెద్ద కార్లపై జీఎస్టీ రేటు 40 శాతంగా నిర్ణయించారు. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు (ఎస్‌యూవీ), మల్టీ యుటిలిటీ వాహనాలు (ఎమ్‌యూవీ), బహుళ ప్రయోజన వాహనాలు (ఎమ్‌పీవీ) లేదా క్రాస్-ఓవర్ యుటిలిటీ వాహనాలు (ఎక్స్‌యూవీ) వంటి ఏ పేరుతో పిలిచే వాహనాలకైనా.. 1500 cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, 4000 mm కంటే ఎక్కువ పొడవు, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ లేదా అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన యుటిలిటీ వాహనాలపై పన్నుల మినహాయింపులు లేకుండా 40 శాతం జీఎస్టీ విధించబడుతుంది.
28. త్రిచక్ర వాహనాల మీద జీఎస్టీ ఎంత?
హెచ్ఎస్ఎన్ 8703 కింద ఉన్న త్రిచక్ర వాహనాలపై జీఎస్టీ రేటు 18%. గతంలో ఇది 28 శాతంగా ఉండేది.
29. డ్రైవర్‌తో సహా 10 లేదా అంతకంటే ఎక్కువ మందిని తీసుకెళ్లే బస్సులు, ఇతర వాహనాలపై జీఎస్టీ ఎంత?
డ్రైవర్‌తో సహా పది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణించేందుకు రూపొందించి.. హెచ్ఎస్‌ఎన్ 8702 కింద అన్ని మోటారు వాహనాలు 18 శాతం జీఎస్టీని కలిగి ఉంటాయి. ఇంతకుముందు వీటిపై 28 శాతం జీఎస్టీ ఉండేది.
30. అంబులెన్స్‌లుగా ఉన్న వాహనాలపై జీఎస్టీ ఎంత?
అంబులెన్స్‌లుగా అన్ని అనుమతులు పొందిన మోటారు వాహనాలు.. తయారీ కేంద్రం నుంచి బయటకి వచ్చేటప్పుడు క్లియరెన్స్ సమయంలో అవసరమైన అన్ని ఫిట్‌మెంట్‌లు, ఫర్నిచర్, యాక్సెసరీలను సక్రమంగా అమర్చిన అంబులెన్స్‌లకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఇంతుకుముందు వీటిపై 28 శాతం పన్ను ఉండేది.
31. లారీలు, ట్రక్కులు వంటి వస్తు రవాణా చేసే వాహనాలపై జీఎస్టీ ఎంత?
హెచ్ఎస్ఎన్ 8704 కింద ఉన్న లారీలు, ట్రక్కుల వంటి వస్తు రవాణాకు సంబంధించిన మోటారు వాహనాలకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. గతంలో పన్ను 28 శాతంగా ఉండేది.
32. ట్రాక్టర్ ట్రయిలర్లు, సెమీ ట్రయిలర్లపై జీఎస్టీ ఎంత?
1800సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం గల సెమీ-ట్రయిలర్ల కోసం రూపొందించిన రోడ్ ట్రాక్టర్‌లు కానటువంటి ట్రాక్టర్లకు 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అయితే 1800సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన సెమీ-ట్రయిలర్ల కోసం రూపొందించిన రోడ్ ట్రాక్టర్లకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. గతంలో వీటిపై 28% జీఎస్టీ అమలులో ఉండేది.
33. మోటారు సైకిళ్లపై జీఎస్టీ ఎంత?
350సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లకు 18 శాతం జీఎస్టీ రేటు వర్తిస్తుంది. అయితే 350సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం గల మోటార్‌సైకిళ్లు 40 శాతం జీఎస్టీ స్లాబులో ఉన్నాయి.
34. 350సీసీ వరకు మోటార్ సైకిళ్లపై జీఎస్టీ రేటు 18 శాతం. ఇందులోకి 350సీసీ మోటార్ సైకిళ్లు వస్తాయా?
40 శాతం జీఎస్టీ 350సీసీ కంటే ఎక్కువ మోటార్‌సైకిళ్లకు మాత్రమే వర్తిస్తుంది. 350సీసీ లేదా అంతకంటే తక్కువ మోటార్ సైకిళ్లకు 18 శాతం జీఎస్టీ ఉంటుంది.
35. ప్రస్తుతం మధ్యతరహా, పెద్ద కార్లపై 28 శాతం జీఎస్టీ ఉంది. పరిహార సెస్ (కాంపెన్‌సేషన్ సెస్) 17 నుంచి 22 శాతం వరకు ఉంది. దీంతో మొత్తం పన్ను 45 నుంచి 50 శాతం వరకు ఉంది. వీటిపై కొత్త జీఎస్టీ ఎంత ఉంటుంది?
మధ్యతరహా, పెద్ద కార్లపై జీఎస్టీ 40 శాతం ఉంటుంది. ఎటువంటి పరిహార సెస్ ఉండదు.
36. సైకిళ్లు, విడిభాగాలపై జీఎస్టీ తగ్గిందా?
సైకిళ్లు, వాటి విడిభాగాలపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది.
37. చిన్న వ్యవసాయ ట్రాక్టర్లను జీఎస్టీ నుంచి పూర్తిగా ఎందుకు మినహాయించలేదు?
దేశీయ తయారీదారులను నిర్వీర్యం చేయకుండా రైతులకు ఉపశమనం కలిగించాలన్నదే లక్ష్యం. చిన్న ట్రాక్టర్లను పూర్తిగా మినహాయిస్తే పరిస్థితి ప్రతికూలంగా మారుతుంది. ఏవైనా వస్తువులపై పన్ను రేటు సున్నాగా ఉన్నప్పుడు.. వాటి తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలు, సరుకులపై తయారీదారులు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను (ఐటీసి) పొందలేరు. అంతేకాకుండా ఇప్పటికే క్లెయిమ్ చేసుకున్న ఐటీసీని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల తయారీదారులు ఈ ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఇది అంతిమంగా కొనుగోలుదారులపై భారం మోపుతుంది.
38. 40శాతాన్ని 'ప్రత్యేక రేటు'గా ఎందుకు పరిగణించారు? ఈ ప్రత్యేక పన్ను పరిధిలో వచ్చే వస్తువుల ఎంపికకు ఏవిధంగా చేపట్టారు?
ఎంపిక చేసిన కొన్ని వస్తువులకు మాత్రమే ప్రత్యేక రేటు వర్తిస్తుంది. ప్రధానంగా హాని కలిగించే (సిన్ గూడ్స్), కొన్ని లగ్జరీ వస్తువులకు మాత్రమే ఈ రేటు ఉంటుంది. ఈ వస్తువులలో చాలా వరకు జీఎస్టీతో పాటు పరిహార సెస్ చెల్లించేవి ఉన్నాయి. పరిహర సెస్ అనే దానికి ముగింపు పలకాలని నిర్ణయించినందున… దీని పరిధిలోకి వచ్చే చాలా వస్తువులపై మొత్తం పన్నును అలానే కొనసాగించేందుకు పరిహార సెస్ రేటు జీఎస్టీకి కలిసింది. ఇతర వస్తు సేవల విషయంలో ఇప్పటికే అత్యధిక జీఎస్టీ అయిన 28 శాతం ఉన్న వాటికి ఈ ప్రత్యేక రేటు వర్తిస్తుంది.
39. కలప గుజ్జుపై పన్ను శాతం వివిధ స్థాయిలలో ఉండటానికి గల కారణం?
కలప గుజ్జును కాగితం, వస్త్రాల తయారీకి ఉపయోగిస్తారు. కాగితం, వస్త్ర పరిశ్రమలు విడివిడిగా పనిచేస్తాయి. వస్త్రాలకు సంబంధించిన ఇతర వస్తువులతో సమానంగా పన్ను ఉండాలన్న వస్త్రాల విషయంలో ఈ విధానాన్ని అవలంబించాం.
40. ముడి పత్తిపై జీఎస్టీని ఎందుకు తొలగించలేదు?
ప్రస్తుతం పత్తి మీద రివర్స్ ఛార్జ్ ప్రతిపదికన జీఎస్టీ వసూలు అవుతోంది. అంటే ముడి పత్తిని సరఫరా చేసేటప్పుడు వ్యవసాయదారులు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇన్‌పుట్ క్రెడిట్ వ్యవస్థలో విచ్ఛిన్నతను నివారించడానికి, పత్తిపై చెల్లించే జీఎస్టీని వస్త్ర పరిశ్రమకు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ రూపంలో అందుబాటులో ఉంచాలన్న కారణంతో పత్తిపై జీఎస్టీ ఉంది. ఇది అంతిమంగా వినియోగదారులకు మేలు చేస్తుంది.
41. వస్త్ర రంగంలో రసాయన రంగులు, ప్లాస్టిక్‌లు, లోహాలు.. మెటలైజ్డ్ నూలు, జిప్పర్లు, ఎలాస్టిక్‌లు, రబ్బరైజ్డ్ నూలు, సాగే నూలు, అలంకారాల్లో ఉపయోగించే రబ్బరు తదితరాలపై ఎందుకు జీఎస్టీ తగ్గించలేదు?
వస్త్ర పరిశ్రమ విలువ గొలుసులో మానవ ఆధారిత విలువ జోడింపు తర్వాత పన్ను తక్కువ ఉంది. ఈ విలోమాన్ని సరిచేయాలనేది పన్ను హేతుబద్ధీకరణ లక్ష్యం. ఇది ఫైబర్ తటస్థ పాలసీకి అనుగుణంగా ఉంది. అయితే జాబితాలో ఉన్న వస్తువులు బహుళ అవసరాలకు వినియోగించుకోవచ్చు.
ఈ వస్తువులపై జీఎస్టీ తగ్గించాలంటే తుది వినియోగంపై ఆధారపడే విధానం అవసరం ఉంటుంది. ఇది ఇది తుది వినియోగంపై ఆధారపడే మినహాయింపుల వ్యవస్థ ఉండకూడదు అనే ప్రస్తుత విధానానికి వ్యతిరేకంగా ఉంటుంది.
42. నిర్మాణ రంగ, వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక వస్త్రాలు ప్రధానంగా పాలిథిలిన్, పాలీప్రొఫైలిన్ వంటి ప్లాస్టిక్‌లను ఉపయోగిస్తున్నందున విలోమం ఎక్కువగా ఉంటుందా?
నిర్మాణ రంగ, వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక వస్త్రాలు (జియో, ఆగ్రో టైక్స్‌టైల్స్) భారతదేశం ఆమోదించిన ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నోమెన్‌క్లేచర్ కింద ప్లాస్టిక్‌లు కాకుండా వస్త్రాలుగా ఉన్నాయి. విలోమం అనేది ఎక్కువగానే ఉండొచ్చు. జీఎస్టీ కింద విలోమ సుంకం కింద వసూలైన క్రెడిట్ రీఫండ్ పొందేందుకు అందుబాటులో ఉంటుంది. అందువల్ల వసూలైన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్ ద్వారా తటస్థీకరణ అవుతుంది. ప్రక్రియ పరంగా చేపట్టిన ఈ సంస్కరణ వల్ల రీఫండ్‌ల చెల్లింపు వేగవంతం అవుతుంది.
43. ప్లాస్టిక్ లేదా రబ్బరుతో తయారు చేసిన ఇతర వస్త్ర ఉత్పత్తుల రీఫండ్‌లపై ఎలాంటి ఇతర పరిమితి లేనప్పుడు.. మెటలైజ్డ్ ప్లాస్టిక్ ఫిల్మ్‌తో చేసిన అనుకరణ జరీపై విలోమ సుంకానికి సంబంధించి వ్యవస్థలో ఎందుకు పరిమితులు ఉన్నాయి?
అనుకరణ జరీలో ప్లాస్టిక్ లేదా పాలిస్టర్ ఫిల్మ్‌పై ఐటీసీని పరిమితం చేయాలనే నిర్ణయం 52వ కౌన్సిల్ సమావేశం తీసుకుంది. ఈ జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణను జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించాలన్న లక్ష్యంతో చేపట్టారు.
44. టాయిలెట్ సబ్బులపై కొత్త జీఎస్టీ ఎంత? ఈ సబ్బుల్లో ద్రవరూపంలోని సబ్బు, సబ్బు మధ్య వ్యత్యాసం ఎందుకు ఉంది?
టాయిలెట్ సబ్బులపై కొత్త జీఎస్టీ 5 శాతం. సమాజంలోని దిగువ మధ్యతరగతి, పేద వర్గాలకు నెలవారీ ఖర్చులను తగ్గించడానికి ఉద్దేశంతో దీన్ని విధించారు.
45. ముఖంపై పూసుకునే పౌడర్, షాంపూలపై జీఎస్టీని తగ్గించటానికి గల కారణం ఏమిటి? ఇది ఎంఎన్‌సీలు, లగ్జరీ బ్రాండ్‌లకు ప్రయోజనం చేకూర్చదా?
దేశంలోని దాదాపు అన్ని వర్గాలు రోజువారీగా వీటిని వినియోగిస్తారు. ఎంఎన్‌సీలు లేదా లగ్జరీ బ్రాండ్‌లు విక్రయించే ఖరీదైన ముఖంపై పూసుపుకే పౌడర్, షాంపూలు కూడా ప్రయోజనం పొందనున్నప్పటికీ.. పన్ను వ్యవస్థను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ పన్ను హేతుబద్ధీకరణ కసరత్తు జరిగింది. బ్రాండ్ లేదా సౌందర్య సాధనాల విలువ ఆధారంగా పన్నును విధించటం వల్ల నిర్వహణలో అధికార యంత్రాంగానికి సవాళ్లు ఎదురవటంతో పాటు పన్నుల వ్యవస్థలో సంక్లిష్టత ఏర్పడుతోంది.
46. ముఖంపై పూసుకునే పౌడర్, షేవింగ్ క్రీమ్ వంటి ఎంపిక చేసిన వస్తువులపై మాత్రమే జీఎస్టీ ఎందుకు తగ్గింది?
దేశంలో ఎక్కువ భాగం ప్రజలు రోజువారీగా వినియోగించే కొన్ని వస్తువులపై మాత్రమే జీఎస్టీ 5 శాతానికి తగ్గింది.
47. డెంటల్ ఫ్లాస్‌తో పాటు గృహాలలో సాధారణంగా ఉపయోగించే మౌత్ వాష్‌లపై జీఎస్టీ ఎందుకు తగ్గించలేదు?
దంత పరిశుభ్రతకు సంబంధించిన ప్రాథమిక వస్తువులైన టూత్ పేస్ట్, టూత్ బ్రష్, డెంటల్ ఫ్లాస్‌లపై జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది.
48. బొగ్గుపై జీఎస్టీ రేటును ఎందుకు పెంచారు? విద్యుత్‌పై వ్యయం విషయంలో ఇది ప్రభావం చూపించదా?
హేతుబద్ధీకరణకు ముందు 5 శాతం జీఎస్టీతో పాటు పరిహార సెస్ టన్నుకు రూ. 400 ఉండేది. పరిహార సెస్ వ్యవస్థకు శుభం పలకాలని జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. అందుకే దానికి సమానమైన పన్ను రేటు జీఎస్టీలో విలీనమైంది. అందువల్ల అదనపు భారం ఉండదు.
49. టెండు ఆకులపై జీఎస్టీ తగ్గిందా? ఎందుకు తగ్గించారు?
పొగాకు ఆకులపై ఇప్పటికే 5 శాతం జీఎస్టీ ఉన్నందుకు టెండు ఆకులపై కూడా పన్నును 5 శాతానికి తగ్గించారు. టెండు ఆకులు అనేవి చిన్న తరహా అటవీ ఉత్పత్తి.
50. పునరుత్పాదక ఇంధన పరికరాలు జీఎస్టీ ఎంత?
పునరుత్పాదక ఇంధన పరికరాలపై 12 శాతం ఉండే జీఎస్టీ 5 శాతానికి తగ్గింది.
51. పునరుత్పాదక ఇంధన పరికరాలపై జీఎస్టీ రేటును ఎందుకు తగ్గించారు? ఇది విలోమ సుంకాలకు దారితీయదా?
ఈ వస్తువులు ఇప్పటికే విలోమ సుంకాల సమస్యను ఎదుర్కొన్నాయి. జీఎస్టీని 5 శాతానికి తగ్గించటం వల్ల విలోమం మరింత పెరుగుతుంది. విలోమ సుంకాల నుంచి వచ్చే రీఫండ్‌లను చెల్లించేందుకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉంది. ప్రక్రియాత్మక సంస్కరణలు రీఫండ్‌లు వేగంగా అందేలా చూసుకుంటాయి. పునరుత్పాదక ఇంధన వస్తువులను ప్రోత్సహించడమే దీని లక్ష్యం.
52. మార్బుల్, ట్రావెర్‌టైన్ బ్లాక్స్, గ్రానైట్ బ్లాకులపై జీఎస్టీ రేటు ఎందుకు తగ్గించారు?
ఇంతకుముందు మార్బుల్, ట్రావెర్‌టైన్ బ్లాక్స్, గ్రానైట్ బ్లాక్స్‌పై 12 శాతం జీఎస్టీ ఉండేది. ఇవి ఇంటర్మీడియట్ వస్తువుల స్వభావాన్ని కలిగి ఉన్నాయి. వీటిపై జీఎస్టీ రేటు 5 శాతానికి తగ్గింది.
53. కళ్లద్దాలు, గాగుల్స్‌పై జీఎస్టీ రేటు ఎంత (శీర్షిక 9004)?
దృష్టిని సరిదిద్దడానికి ఉపయోగించే కళ్లజోడు, గాగుల్స్‌పై ఇప్పుడు 5జీఎస్టీ ఉంటుంది. కళ్లజోడ్లపై 12 శాతం, గాగుల్స్‌పై 18 శాతం జీఎస్టీ ఉండేది. అయితే దృష్టిని సరిదిద్దడానికి కాకుండా వేరే అవసరాల కోసం ఉపయోగించే కళ్లజోడు, ఇతర గాగుల్స్ జీఎస్టీ 18 శాతంగా ఉంటుంది.
54. బ్యాటరీలపై జీఎస్టీ ఎంత (శీర్షిక 8507)?
ఇంతకుముందు లిథియం-అయాన్ బ్యాటరీలపై 18 శాతం జీఎస్టీ, ఇతర బ్యాటరీలు 28 శాతం జీఎస్టీ ఉండేది. ఇప్పుడు 8507 శీర్షిక కింద ఉన్న అన్ని బ్యాటరీలకు ఏకరీతిగా 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
55. ఎయిర్ కండీషనర్లు, టీవీలు, మానిటర్లు, డిష్‌వాషర్‌లపై జీఎస్టీ రేటు ఎంత?
ఎయిర్ కండీషనర్లు, డిష్‌వాషర్లపై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. ఇంతకుముందు 32 అంగుళాల వరకు ఉన్న టీవీలు, మానిటర్‌లపై 18 శాతం జీఎస్టీ ఉండగా.. పెద్ద టీవీలు, మానిటర్‌లపై 28 శాతం జీఎస్టీ 28% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు అన్ని టీవీలు, మానిటర్లపై ఏకరీతిలో 18 శాతం పన్ను ఉంటుంది.
56. జీవిత బీమాపై జీఎస్టీ మినహాయింపు పరిధిలోకి ఏఏ పాలసీలు వస్తాయి?
టర్మ్, యూలిప్, ఎండోమెంట్ బీమాలు.. వాటి రీఇన్స్యూరెన్స్ సేవలతో సహా అన్ని వ్యక్తిగత జీవిత బీమా పాలసీలు జీవిత బీమాపై జీఎస్టీ మినహాయింపు పరిధిలోకి వస్తాయి.
57. ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయింపు పరిధిలోకి ఏఏ పాలసీలు వస్తాయి?
ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లు, వృద్ధాప్య పాలసీలు, వాటి రీఇన్స్యూరెన్స్ సేవలతో సహా అన్ని వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలు ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయింపు కిందకు వస్తాయి.
58. ప్రయాణికుల రవాణా సేవలకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందా?
అలా కాదు.. ప్రయాణికుల రవాణా సేవలకు ఐటీసీ లేకుండా 5 శాతం పన్ను వర్తిస్తుంది. అయితే సేవలందించే సంస్థలు 18 శాతం ప్రామాణిక రేటును వసూలు చేసే అవకాశాన్ని కలిగి ఉంటారు. ఇది పూర్తి ఐటీసీని క్లెయిమ్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది.
59. విమానంలో ఒకే తరగతిలో ప్రయాణించే వారికి రెండు రకాల జీఎస్టీ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందా?
విమాన ప్రయాణాల విషయంలో అటువంటి అవకాశం లేదు. ఎకానమీలో ప్రయాణించే వారికి 5 శాతం జీఎస్టీ, మిగతా వారికి 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
60. జీటీఏ ద్వారా చేసే వస్తు రవాణాకు 18 శాతం జీఎస్టీ రేటు వర్తిస్తుందా?
జీటీఏ ద్వారా జరిగే వస్తు రవాణాపై ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్టీ ఉంటుంది. అయితే పూర్తి ఐటీసీతో 18 శాతం జీఎస్టీని వసూలు చేసుకునే వీలు జీటీఏకు ఉంది.
61. కంటైనర్ ట్రైన్ ఆపరేటర్ (సీటీఓ) ద్వారా కంటైనర్‌లలో జరిగే వస్తు రవాణాపై 12 శాతం పన్ను ఉంటుందా?
లేదు. సీటీఓ ద్వారా కంటైనర్‌లలో జరిగే వస్తు రవాణా సేవకు ఐటీసీ లేకుండా 5 శాతం పన్ను లేదా పూర్తి ఐటీసీతో 18 శాతం పన్ను పసూలు చేసుకోవచ్చు. ఈ రెండింటిలో ఒక దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
62. బహుళ నమూనా రవాణా ద్వారా వస్తు రవాణాకు జీఎస్టీ రేటు ఎంత?
బహుళ నమూనా రవాణాకు వాయు రవాణా లేకుండా ఉండాలన్న నిబంధనతో ఉన్న ఐటీసీతో కూడిన 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. విమానాల ద్వారా వస్తు రవాణా ఎక్కడ ఉంటే అక్కడ పూర్తి ఐటీసీతో కూడిన 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
63. జీటీఏకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా జీఎస్టీ నుంచి దీనికి సంబంధించిన సేవలను ఎందుకు మినహాయించలేదు?
ఏదైనా సేవను జీఎస్టీ మినహాయింపు ఇచ్చినప్పుడు ఆయా సేవలను అందించే వారు ఐటీసీ పొందలేరు. ఇది వాళ్లకు ఖర్చును పెంచుతుంది. అంతేకాకుండా ఆ సేవ ఖరీదైనదిగా మారుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు, పాలు మొదలైన అవసరమైన వస్తువుల రవాణా (బీటూసీ) వంటి నిర్దిష్ట మినహాయింపులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
64. ఔషధ ఉత్పత్తులకు సంబంధించి జాబ్ వర్క్ సేవలపై జీఎస్టీ ఎంత?
ఈ సేవలపై ఇప్పుడు ఐటీసీతో కూడిన 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఇంతకుముందు ఇది 12 శాతం పన్ను పరిధిలో ఉండేది.
65. అధ్యాయం 41 కిందకు వచ్చే తొక్కలు, తోళ్లకు సంబంధించిన జాబ్ వర్క్ సేవలపై జీఎస్టీ రేటు ఎంత?
ఈ సేవలకు ఇప్పుడు ఐటీసీతో కూడిన 5 శాతం పన్ను వర్తిస్తుంది. వీటిపై ఇంతకుముందు 12% పన్ను ఉండేది.
66. తోళ్లు, తొక్కలకు సంబంధించిన జాబ్ వర్క్ విషయంలో ఉన్న 5 శాతం పన్ను రేటు.. తోలు వస్తువుల, పాదరక్షల తయారీకి సంబంధించిన జాబ్ వర్క్‌కు కూడా వర్తిస్తుందా? లేకుంటే అధ్యాయం 42 లేదా 64 కిందకు వస్తుందా?
అలా కాదు.. ఈ పన్ను తోలు వస్తువుల తయారీకి సంబంధించిన జాబ్ వర్క్.. చాప్టర్ 42 లేదా 64 కింద వచ్చే పాదరక్షలకు వర్తించదు.
67. మానవ ఉపయోగానికి సంబంధించిన ఆల్కహాల్ ద్రావణాల తయారీ జాబ్ వర్క్స్ సేవలకు 5 శాతం జీఎస్టీ రేటు వర్తిస్తుందా?
లేదు. ఈ సేవలకు ఐటీసీతో కూడిన 18 జీఎస్టీ కొనసాగుతుంది.
68. ఇతర (రెసిడ్యూరీ) జాబ్ వర్క్ సేవల జీఎస్టీ ఎంత?
ఇతర జాబ్ వర్క్ సేవలు ఉంటే నిర్దిష్ట జీఎస్టీ రేటు పేర్కొనని జాబ్ వర్క్ సేవలు. వీటికి ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీ 18 శాతానికి పెరిగింది.
69. కేవలం రేటును తగ్గించే బదులు జాబ్ వర్క్‌ను పూర్తిగా పన్ను రహితంగా ఎందుకు చేయలేదు?
జాబ్ వర్క్ సేవలకు మినహాయింపు ఇవ్వడం వల్ల ఐటీసీ ప్రవాహం దెబ్బతిని ఖర్చులు పెరుగుతాయి. బహుళ స్థాయిలలో ఉద్యోగులు, కార్మికులతో ఉన్న రంగాల్లో ఇది ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. ఐటీసీతో కూడిన 5 శాతం జీఎస్టీ అనేది వ్యాపారాలకు పూర్తి ఐటీసీ ప్రయోజనాన్ని అందిస్తుంది. తద్వారా పన్నుపై పన్నును నివారించొచ్చు.
70. తీరప్రాంతేతర ప్రదేశాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణ, ఉత్పత్తికి (ఈఅండ్‌పీ) సంబంధించిన పనుల కాంట్రాక్ట్ సేవలపై 18 శాతం జీఎస్టీ ఉంటుందా?
అవును.. తీరప్రాంతేతర ప్రదేశాల్లో చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తికి (ఈఅండ్‌పీ) సంబంధించిన తీరప్రాంతేతర పనులకు సంబంధించిన ఒప్పందం, అనుబంధ సేవలకు 18 శాతం పన్ను వర్తిస్తుంది.
71. హోటల్ వసతి సేవలకు సంబంధించి ఒక రోజుకు రూ. 7500 వరకు లేదా దానికి సమానమైన విలువ గల సేవలకు 18 శాతం పన్ను వర్తిస్తుందా?
లేదు.. ఈ సేవలకు ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
72. సౌందర్య, శారీరక శ్రేయస్సు సేవలపై ఉండే జీఎస్టీ ఎంత? ఈ విభాగంలో దీని పరిధిలోకి వచ్చేవి ఏంటి?
ఆరోగ్య క్లబ్‌లు, సెలూన్లు, మంగలి, ఫిట్‌నెస్ కేంద్రాలు, యోగా మొదలైన వాటితో సహా సౌందర్య, శారీరక శ్రేయస్సు సేవలకు ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఈ సేవలకు ముందు 18 శాతం జీఎస్టీ ఉండేది.
73. లాటరీ టిక్కెట్లు, బెట్టింగ్, జూదం, గుర్రపు పందాలు, కాసినోలకు 40 శాతం జీఎస్టీ వర్తిస్తుందా?
అవును.. బెట్టింగ్, క్యాసినోలు, జూదం, గుర్రపు పందాలు, లాటరీ, డబ్బుతో కూడిన ఆన్‌లైన్ గేమింగ్‌తో సహా పేర్కొన్న అన్నింటికి 40 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
74. ఐపీఎల్ వంటి క్రీడా కార్యక్రమాల ప్రవేశానికి సంబంధించిన సేవలపై జీఎస్టీ రేటు ఎంత?
ఐపీఎల్ వంటి క్రీడా కార్యక్రమాల ప్రవేశానికి 40 శాతం జీఎస్టీ ఉంటుంది. అయితే గుర్తింపు పొందిన క్రీడా కార్యక్రమాల ప్రవేశానికి ఈ 40 శాతం జీఎస్టీ వర్తించదు.
75. ఐపీఎల్ వంటి క్రీడా కార్యక్రమాలకు కాకుండా ఇతర క్రీడా కార్యక్రమాల్లో ప్రవేశానికి సంబంధించిన సేవలపై జీఎస్టీ ఎంత ఉంటుంది?
గుర్తింపు పొందిన క్రీడా కార్యక్రమాలతో సహా ఇతర క్రీడా కార్యక్రమాలకు టికెట్ ధర రూ. 500 మించనట్లయితే వాటి ప్రవేశానికి మినహాయింపు కొనసాగుతుంది. టికెట్ ధర రూ. 500 కంటే ఎక్కువగా ఉంటే వాటిపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
***
(Release ID: 2163636)
Visitor Counter : 38